Siddhartha Medical College
-
సిద్ధార్థ కళాశాల సీట్లన్నీ ఏపీవారికే కేటాయించాలి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే కేటాయించాలని కోరుతూ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీకి ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కోశాధికారి నరసింహారావు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకూ తెలంగాణ విద్యార్థులకు 36 శాతం సీట్లు కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ 36 శాతం సీట్లు కూడా మన విద్యార్థులకే కేటాయించాలని కోరారు. అదే విధంగా కొత్త వైద్య కళా శాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరా రు. తాము అధికారంలోకి వస్తే సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల వాగ్ధానం చేసిందని పేర్కొన్నారు. -
వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతన వైద్య విధానాలపై పరిశోధనలు చేసేలా వైద్యులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పరిష్కారాలపై ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందుకు కళాశాలలో మల్టిడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(ఎంఆర్‌యూ)ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా వివిధ విభాగాల్లోని వైద్యులు, పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. అందుకయ్యే ఖర్చును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేయనుంది. అయితే ముందుగా పరిశోధనలకు కళాశాల ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన పరిశోధనలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏం పరిశోధనలు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తారు? ఏ అంశంపై చేస్తారు? అనే వివరాలను పేపర్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంది. వీటిని వైద్య కళాశాలలోని ఎథికల్ కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక పరిశోధనలు ప్రారంభించవచ్చు. పలు విభాగాల్లో పరిశోధనలు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అలాగే పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలకు ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. క్లినికల్ రీసెర్చ్ సైతం.. ఔషధ రంగంలో కొత్తగా కనిపెట్టిన మందుల పనితీరుపై కూడా సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయా వ్యాధులకు మందులు ఎలా పనిచేస్తున్నాయి? వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటికి సైతం ముందుగా ఎథికల్ కమిటీ నుంచి అనుమతులు తప్పనిసరి. అలాగే రోగి అంగీకారం కూడా అవసరం. కాగా కళాశాలలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా సోకే వ్యాధుల జీన్స్, ఏ రకం వ్యాధి అనేది గుర్తించనున్నారు. కరోనాలో కొత్త వేరియెంట్లతో పాటు హెచ్3ఎన్2 వైరస్ వంటి వాటిని కూడా గుర్తించే సదుపాయం ఉంది. అందుబాటులోకి నూతన వైద్య విధానాలు ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఎక్కడో చేసిన పరిశోధనల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. అలా కాకుండా మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పద్ధతులపై ఇక్కడే పరిశోధనలు చేయడం ద్వారా నూతన వైద్య విధానాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు చేసే పరిశోధనల్లో వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములు కానుండటంతో వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చదువుకునే సమయంలోనే పరిశోధనలపై పట్టు సాధించడంతో పాటు కొత్త విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కొత్త చికిత్సలపై అవగాహన పెరుగుతుంది.. వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో పరిశోధనలతో వైద్య విద్యార్థుల్లో పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. నూతన వైద్య విధానాలు, కొత్త చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తయ్యాయి. పరిశోధనల కోసం వైద్య కళాశాలలో ప్రత్యేకంగా మలీ్టడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. –డాక్టర్ కంచర్ల సుధాకర్, ప్రిన్సిపాల్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
Covid-19: దేశాన్ని గడగడలాడించింది ఈ వేరియంటే..
సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్ వ్యాప్తి 2020 మార్చి నుంచి ఉన్నా వేరియంట్లపై మనం ఎక్కువ దృష్టి సారించింది సెకండ్ వేవ్‌లోనే. దేశంలో అత్యంత ప్రభావం చూపింది డెల్టా వేరియంటే. ఈ రోజుకు కూడా డెల్టా వేరియంట్ వివిధ రాష్ట్రాల్లో ఉంది. తదుపరి మరో 25 రకాల ఉప (సబ్ లీనియన్స్) వేరియంట్లను సృష్టించుకుంది. వాటినే ‘ఏవై 1 – ఏవై 25’ అని వ్యవహరిస్తున్నాం..’ అని హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందుకూరి తెలిపారు. ఏపీలో శాటిలైట్ సెంటర్ (జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ) ఏర్పాటు కోసం సిద్ధార్థ మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలివీ... థర్డ్‌వేవ్ ముప్పు ఏమేరకు ఉండవచ్చు? థర్డ్ వేవ్‌పై ఏం మాట్లాడినా అది ఊహాజనితం అవుతుంది. మనం ఇప్పుడు సెకండ్ వేవ్ చివరి దశలో ఉన్నాం. థర్డ్‌వేవ్ వస్తుందా.. రాదా? అనేది ఎవరూ చెప్పలేరు. ఒక్కసారి దేశంలో ఇన్ఫ్లుయంజా వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే. దీనిపై కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. థర్డ్‌వేవ్ అనేది రకరకాల పరిస్థితులపై ఆధారపడి ఉంది. డెల్టా వేరియంట్ ప్రభావం ఎంత? దేశాన్ని గడగడలాడించింది ఇదే. దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా శాంపిళ్లు జినోమిక్ సర్వే చేస్తే డెల్టా ప్రభావమే ఎక్కువగా ఉంది. దీనికి మళ్లీ ఏవై పేరుతో 25 ఉప వేరియంట్లు వచ్చాయి. వీటిలో ఏవై 12, ఏవై 4 అనే రెండు మాత్రమే ప్రభావం చూపాయి. డెల్టా తర్వాత ఏ వేరియంట్ ప్రభావం చూపిస్తుందనేది చెప్పలేం. డెల్టా తర్వాత కొత్త వేరియంట్ రాలేదు. డెల్టా ప్లస్ అంటున్నారు కానీ దానిపై స్పష్టత లేదు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా కేసులు వచ్చాయి కదా? కరెక్టే. ఇది డెల్టా వేరియంట్ వల్లే. ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని మరీ ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అందుకే కొంతమందికి వ్యాక్సిన్ తీసుకున్నా వచ్చింది. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే వీరిలో తీవ్రత తక్కువ అని తేలింది. డెల్టా వేరియంట్‌కు వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేరళలో కేసులు పెరగడానికి కారణాలేమిటి? కేరళలో ఇప్పుడు సెకండ్ వేవ్ పీక్ దశలో ఉంది. ఢిల్లీలో పీక్ దశలో ఉన్నప్పుడు కేరళలో సీరో సర్వెలైన్స్ 40 శాతమే ఉంది. అప్పుడు ఢిల్లీలో 70 శాతానికి పైగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దశలో సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు కేరళలోనూ అంతే. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ చివరి దశలో ఉంది. స్కూళ్లు ప్రారంభమయ్యాయి కదా.. పరిస్థితి ఏమిటి? స్కూళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే. బాగా వెంటిలేషన్ (వెలుతురు), ఫ్యాన్ తిరుగుతూ ఉంటే సమస్య ఉండదు. జర్మనీలో ఇది నిర్ధారణ అయింది. అందుకే పిల్లలను బాగా వెంటిలేషన్ ఉన్న గదుల్లో ఉంచమని చెబుతున్నాం. భవిష్యత్ పరిణామాలను ఎలా ఎదుర్కోగలం? అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కిక్కిరిసిన జన సమూహాలు (మాస్ గ్యాథరింగ్స్) లేకుండా చూసుకోవడం, మాస్కులు విధిగా ధరించడం వల్ల థర్డ్‌వేవ్‌ను చాలావరకూ నిలువరించవచ్చు. ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, వ్యవహరించే తీరును బట్టే వైరస్ పోకడ ఉంటుంది. చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉందా? అలాగని ఏమీ లేదు. ఇప్పటివరకూ వాళ్లు తక్కువగా ప్రభావితమయ్యారు. వ్యాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి పిల్లలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. పిల్లలకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఎక్కడా లేదు. శాటిలైట్ ల్యాబొరేటరీ వల్ల ఉపయోగాలేమిటి? దేశవ్యాప్తంగా శాటిలైట్ ల్యాబొరేటరీలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంతవరకూ వైరస్ పరివర్తనాలు, ఎలాంటి వైరస్లు ఉన్నాయి లాంటివాటిని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపేవారు. విజయవాడలో ఏర్పాటు చేస్తే ఇక్కడే నమూనాలను పరిశీలించవచ్చు. దాన్ని బట్టి ఏ వేరియంట్ వస్తే ఎలా చికిత్స చేయవచ్చు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం సీసీఎంబీకి పంపిస్తున్న నమూనాలు కూడా యథావిధిగా వెళతాయి. దీనికి సుమారు రూ.కోటిన్నర ఖర్చవుతుంది. నెలకు గరిష్టంగా రెండు వేల వరకూ నమూనాలను పరిశీలించే అవకాశం ఉంది. జినోమిక్ ల్యాబ్ ఏర్పాటుపై ఎంవోయూ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో శాటిలైట్ సెంటర్ (జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ)ఏర్పాటుకు సంబంధించి సీసీఎంబీ డైరెక్టర్ డా.వినయ్ నందుకూరితో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ గురువారం ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు స్టేట్ బ్యాంక్ ఇండియా ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందిస్తోంది. ల్యాబ్ ఎస్బీఐ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందచేస్తుంది. ల్యాబ్‌కు కావాల్సిన స్థలం, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. సాంకేతిక సహకారాన్ని జాన్ హాప్కిన్స్ సంస్థ అందిస్తుంది. కరోనా వైరస్‌కు సంబంధించిన వేరియంట్ల ఉనికిని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ నెలకు 2 వేల నమూనాలను పరిశీలించే అవకాశం ఉంది. నెల రోజుల్లో ల్యాబ్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జినోమిక్ సీక్వెన్స్‌తో రకరకాల వేరియంట్ల ఉనికిని తెలుసుకోవడం వల్ల చికిత్సను ఎప్పటికప్పుడు మార్చుకునే వీలు కలుగుతుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వస్తే ఈ ల్యాబ్‌ను మరోరకంగా కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. వైరస్ బలహీనపడే అవకాశాలున్నాయా? చెప్పలేం. గతంలో ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అది బలహీనపడుతూ వచ్చింది. కరోనా వైరస్ కూడా మన దేశానికి వచ్చి రెండేళ్లు కావస్తోంది. బలహీన పడుతుందని ఆశాభావంతో ఉన్నాం. దీంతో పాటు ప్రజల్లో కూడా ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది కదా. డెల్టా కంటే ప్రభావవంతమైన వేరియంట్ వస్తే తప్ప అంతగా ప్రభావం ఉండదని భావిస్తున్నాం. త్వరగా వ్యాక్సినేషన్ చేయగలిగితే చాలామటుకు వైరస్ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయి. -
ప్రజారోగ్య రథయాత్ర
ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చరిత్రలో గొప్పగా చెప్పుకోదగ్గ రోజు. ఎందుకంటే.. 1,088 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించాము. అవి రోడ్డుపై పోతూ ఉంటే.. మనస్సుకు ఎంతో ఆనందం కలిగింది. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమైపోతున్న వాహనాలను చూసి ఎంతో సంతోషం కలిగింది. ఇది ఒక రికార్డు. ఇన్ని అధునాతన అంబులెన్స్‌లను ఒకేరోజు ప్రారంభించడం, జిల్లాలకు పంపించడం అనేది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అది విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజ్ సర్కిల్.. బుధవారం ఉదయం సరిగ్గా 9 గంటలా 25 నిమిషాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరునవ్వుతో కాన్వాయ్‌లో నుంచి కిందకు దిగారు.. అప్పటికే బారులు తీరి సేవల రంగంలోకి ఉరికేందుకు 108, 104 వాహనాలు కనుచూపు మేర సిద్ధంగా ఉన్నాయి.. సీఎం వైఎస్ జగన్ జెండా ఊపగానే ఒక్కసారిగా కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ పరుగులు తీశాయి. కనీ వినీ ఎరుగుని రీతిలో వాహన శ్రేణి ఒక్కసారిగా చూడముచ్చటగా ముందుకు సాగిపోతుంటే కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులు కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు. ప్రాంగణాన్ని దాటుకుని వెళుతున్న ప్రతి వాహనానికి రెండు చేతులూ జోడించి ముఖ్యమంత్రి నమస్కరిస్తుండగా, అంబులెన్స్ డ్రైవర్లు ప్రతి నమస్కారం చేస్తూ వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు వాహన శ్రేణి కదులుతూన్నంత సేపూ వేదిక మీద నిల్చొని ముఖ్యమంత్రి అభివాదం చేసిన దృశ్యం అంబులెన్స్ సిబ్బందికే కాదు.. రాష్ట్ర ప్రజలందరినీ ముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అంబులెన్స్‌ల వ్యవస్థపై చూపిన శ్రద్ధ ఇప్పుడు ఆయన తనయుడిగా సీఎం వైఎస్ జగన్ చూపిస్తున్నారని అక్కడున్న పలువురు చర్చించుకోవడం కనిపించింది. మంత్రులు ఆళ్లనాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మరికొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బారులు తీరిన అంబులెన్స్‌లు ► రెండు మాసాలుగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆయా వాహనాలన్నీ ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకున్నాయి. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ఉన్నాయి. ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను ప్రారంభించగానే 412 కొత్త 108 వాహనాలు, 676 కొత్త 104 వాహనాలు సైరన్ మోగిస్తూ.. కేటాయించిన జిల్లాలకు బయలుదేరాయి. ► సీఎం ప్రతి ఒక్క వాహన చోదకుడికీ అభివాదం చేశారు. దీంతో డ్రైవర్లు, టెక్నీషియన్ల ముఖంలో ఆనందం కనిపించింది. ► బెంజి సర్కిల్ నుంచి కొన్ని వాహనాలు రామవరప్పాడు వైపు, మరికొన్ని వారధి వైపు వెళ్లాయి. రూ.203 కోట్లు వ్యయం చేసి ఇంత పెద్ద స్థాయిలో వాహనాలు కొనుగోలు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని అక్కడకు వచ్చిన వారు చర్చించుకున్నారు. డీజిల్ లేదు.. టైర్లు పోయాయన్న మాటే లేకుండా.. ► గతంలో డీజిల్ లేక, టైర్లు దెబ్బతిని అంబులెన్స్‌లు ఆగిపోయిన సందర్భాలు కోకొల్లలు. అది గతం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త వాహనాలను ఏర్పాటు చేసింది. ► మండలానికి కేటాయించిన అంబులెన్స్‌ను ఈఆర్సీ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్)కు అనుసంధానించింది. ఫోన్ చేయగానే 15 నిమిషాల్లో ఘటనా స్థలికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన నియోనేటల్ అంబులెన్స్‌లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సమూల మార్పులతో 104 వాహనాలు ► 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్న 104 వాహనాలే మొన్నటి వరకూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమూ కొత్తవి కొనలేదు. మెజారిటీ వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయి. ► అందుకే ఒక్కటంటే ఒక్క పాత వాహనాన్ని తీసుకోకుండా మండలానికి ఒకటి లెక్కన 676 వాహనాలూ కొత్తగా కొన్నారు. ► ఈ వాహనాలు ప్రతి పల్లెనూ నెలలో ఒకసారి తాకి రావాల్సిందే. ఆ ఊళ్లో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిందే. గతంలో 52 రకాల మందులు.. ఇప్పుడు 74 రకాల మందులు. రక్త పరీక్షలు అక్కడికక్కడే చేస్తారు. ► ప్రతి వాహనమూ ప్రాథమిక కేంద్రానికి అనుసంధానమై ఉంటుంది. రోగుల వివరాలతో పాటు సమస్త సమాచారాన్ని క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ కార్డులో నిక్షిప్తం చేస్తారు. దీంతో జబ్బుల ఉనికిని త్వరగా కనుక్కుని ముందస్తు చర్యలు తీసుకునే వీలుంటుంది. ► వైద్య సేవలే కాకుండా మాతా శిశు మరణాలు అరికట్టడం, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం, పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి సేవలు అందించడం, సీజన్‌ను బట్టి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ ఇకపై 104 వాహనాల ద్వారానే చేస్తారు. -
కుయ్.. కుయ్.. ఇక కొత్తగా
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం జగన్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108, 104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా, ఇప్పుడు సీఎం జగన్ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 108 సర్వీసుల్లో మార్పులు ► అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు. ► కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్)గా తీర్చిదిద్దారు. ► మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఎన్నో సదుపాయాలు ► బీఎల్ఎస్ అంబులెన్స్‌లలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్ఎస్ అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. జనాభా–అంబులెన్స్‌ల నిష్పత్తి ► గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది. ► గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆవరణలో 104,108 వాహనాలు ఎంఎంయూ(104)ల్లో సదుపాయాలు ► ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు. ► ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది. ► ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయడం సులువు అవుతుంది. వేగంగా సేవలు ► పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ► ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ► ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎంఎంయూల్లో 20 రకాల సేవలు ► మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ మొత్తం 20 రకాల సేవలందించేలా 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. ► అన్నీ కలిపి ఒకేసారి మొత్తం 1,088 వాహనాలను సీఎం జగన్ బుధవారం ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్స్‌లతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ.318.93 కోట్లు ఖర్చు కానుంది. 104 సర్వీసుల్లో మార్పులు.. కొత్తగా 676 వాహనాలు ► మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక 104 సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 676 సర్వీసులను సిద్ధం చేశారు. గతానికి ఇప్పటికీ మార్పు ► రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్స్‌లు 440కి గాను ప్రతి మండలం (676 మండలాలు)తో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ సేవలందించనున్నాయి. ► మండలానికి ఒకటి చొప్పున ఉండే 104 వాహనాలు నెలలో ఒక రోజు ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులను ఇవ్వనున్నాయి. ► రోజుకు ఒక గ్రామ సచివాలయాన్ని సందర్శించడంతో పాటు రోజంతా ఆ గ్రామంలో డాక్టర్లు ఉంటారు. గ్రామంలోని ఇళ్లను, అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను కూడా సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. ► గ్రామీణ ప్రాంతాల్లో ఒకే డాక్టర్ ద్వారా వైద్య సేవలు కల్పించడం ద్వారా విదేశాల తరహాలో ఫ్యామిలీ డాక్టర్‌గా మంచి సేవలు అందించడానికి వీలుంటుంది. ► గతంలో 104 అంబులెన్స్‌లు (ఎంఎంయూ) 292 మాత్రమే (మూడు మండలాలకు ఒకటి) ఉండగా, ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలతో పాటు 74 రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయి. గతంలో 52 ఔషధాలు మాత్రమే ఉండేవి. ► ఇప్పుడు హైపర్ టెన్షన్ (బీపీ), మధుమేహం (సుగర్), సాధారణ అవుట్ పేషంట్లకు చికిత్స అందించడంతో పాటు మలేరియా, టీబీ, లెప్రసీ, మాతా శిశు సంరక్షణ, తదితర 20 రకాల వైద్య సేవలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ► సీజనల్ వ్యాధులతో సహా 29 పరికరాలతో అంటువ్యాధులు, ఇతర వ్యాధుల స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. గతంలో ఈ అంబులెన్స్‌లలో కేవలం వైద్యులు మాత్రమే అతి కష్టం మీద అందుబాటులో ఉండేవారు. ► ప్రస్తుతం 104 సర్వీసుల్లో మొత్తం 744 మంది వైద్యులు సేవలందించనున్నారు. వీటిని డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. తద్వారా అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందనున్నాయి. ► గతంలో 292 వాహనాలతో రోజుకు కేవలం 20 వేల మంది రోగులకు సేవలందించగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 676 సర్వీసుల ద్వారా రోజూ 40,560 మందికి సేవలందుతాయి. నేడు సువర్ణ అధ్యాయానికి నాంది ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని రాష్ట్ర ప్రజారోగ్య రంగంలో ఒక సువర్ణ అధ్యాయానికి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంది పలుకుతున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1088 కొత్త 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం 9 గంటల సమయంలో సీఎం ప్రారంభించనున్నారని వెల్లడించారు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన ఈ సేవలను చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రతకు 108 సర్వీస్ లింక్ ► 108 అంబులెన్స్ సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్ వైఎస్సార్ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. ► రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ.50 వేల వ్యయం వరకు వైద్య సేవలందిస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. -
హవ్వ..ఇదేం తీరు...అమాత్యా?!
మరమ్మతులకు ఎన్ని శిలాఫలకాలు వేస్తారు ఆగస్టు 8న మరమ్మతు పనులకు కొత్తాస్పత్రిలో మంత్రి శిలాఫలకాలు మళ్లీ సోమవారం పాత ఆస్పత్రిలో అదేమంటే ఇంజినీర్లు సరిగా పనిచేయాలని హితబోధ లబ్బీపేట: ఆర్భాటపు ప్రచారం మినహా ..అభివృద్ధి శూన్యమనే దాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తీరే నిదర్శనంగా మారుతోంది. ఆస్పత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టిన మరమ్మతు పనులను ఈ నెల 8న కొత్తాస్పత్రిలో ఆర్భాటంగా శిలాఫలకాలు వేసి ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , మళ్లీ అదే పనులకు సంబంధించి సోమవారం పాత ఆస్పత్రిలో శిలాఫలకాలను మంత్రి కామినేని నిస్సిగ్గుగా ఆవిష్కరించారు. ఆస్పత్రి అభివృద్ధికి తామేమి నిధులు ఇవ్వకపోయినా, ఆస్పత్రి ఆరోగ్యశ్రీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఏకంగా రెండు శిలాఫలకాలు ఆవిష్కరించి ఆర్భాటపు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పరికరాల నిధులు..ప్యాచ్ వర్క్లుకా..? ప్రభుత్వాస్పత్రిలో 2008 సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించిన సేవలకుగాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధులు ప్రభుత్వం వద్ద ఉంచారు. వాటితో నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఒకవైపు ఆపరేషన్ థియేటర్లో సరైన పరికరాలు లేక ఇబ్బందులు ఎదురవడంతోపాటు, వ్యాధి నిర్థారణ పరీక్షలకు అవసరమైన అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తమ ప్రచారం కోసం... పరికరాలు కోసం ఉంచిన రూ. 4 కోట్లు నిధులను ప్యాచ్ వర్క్‌ల కోసం కేటాయించి,ఏకంగా రెండు ఆస్పత్రిల్లో రెండు శిలాఫలకాలు వేయించేసుకున్నారు. ఎక్కైడె నా కొత్త భవనాలు ప్రారంభోత్సవానికి, నిర్మాణాలను శిలాఫలకాలు వేస్తారు కానీ, ఈ మంత్రి రిపేర్లకు శిలాఫలకాలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు. స్థానిక నేతల కోసమేనా రెండు ప్రాంతాల్లో శిలా ఫలకాలు స్థానిక ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యుల పేర్లు కోసం తాపత్రయ పడి వేసినట్లు సమాచారం. వారు వేసినప్పటికీ నిసిగ్గుగా వైద్య మంత్రి వచ్చి ప్రారంభించడమేమిటని పలువురు మండి పడుతున్నారు. రెండు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసేందుకు రూ.లక్షకు పైగా సొమ్ము దుర్వినియోగం అయినందనే వాదన వినిపిస్తుంది. ఇప్పటికైన ఎమ్మెల్యేలు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలనే కానీ, ఆర్భాటపు ప్రచారానికి కాదని హితవు పలుకుతున్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఎస్ఎస్వై ద్వారా మంజూరైన నిధులకు సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆ నిధులు మళ్లీ వెనక్కివెళ్లే అవకాశం వుందని నిపుణులు సూచిస్తున్నారు. -
సూపర్ ‘జాప్యం’
చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ప్రకటనలకే పరిమితం నిధులిచ్చినా.. ఒక్క అడుగూ ముందుకు పడని వైనం నేటికీ ఎక్కడ కడతారో తెలియని దుస్థితి విజయవాడ : విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కల ఎప్పటికి నెరవేరుతుందో అర్థం కాని అయోమయ స్థితి నెలకొంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుంది. గత ఏడాది జూన్‌లో కేంద్రం ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.150 కోట్లు కేటాయించింది. వాటిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ప్రత్యేకంగా భవన నిర్మాణం చేపట్టడంతో పాటు, అత్యాధునిక పరికరాలు సమకూర్చేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సూపర్ ఆశ నెరవేరినట్లేనని అందరూ భావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది గడిచినా నేటికీ అంచనాలు రూపొందించే దశలోనే ఉండటంతో ఎప్పటికి పూర్తవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఎక్కడ కట్టాలనేదే సమస్య... ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా రూ.150 కోట్లు కేటాయించగా, వాటిలో రూ.80 కోట్లు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. మిగిలిన రూ.70 కోట్లతో అత్యాధునిక పరికరాలు సమకూర్చడంతో పాటు, ప్రస్తుతం ఉన్న విభాగాల్లో మరమ్మతులు చేపట్టాలని భావించారు. అయితే భవన నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలనేది సమస్యగా మారింది. తొలుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సందర్శించి ప్రస్తుతం ఉన్న వైద్యకళాశాల భవనాల్లో సగ భాగాన్ని తొలగించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌లు వైద్య కళాశాలను సంద ర్శించి క్రీడా ప్రాంగణంలోని కొంత భాగంలో సూపర్ స్ఫెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు ఒక ప్రాంతంలో, ప్రజాప్రతినిధులు మరో ప్రాంతంలో ప్రతిపాదనలు చేయడంతో వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీర్లు రెండు ప్రాంతాల్లోనూ డిజైన్లు వేసి ప్రభుత్వానికి పంపారు. అక్కడ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. గతం పునరావృతమయ్యేనా? నాలుగేళ్ల కిందట వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తొలి విడతగా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.9 కోట్లు విడుదల చేశారు. దానికి మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయక పోవడంతో రెండో విడత నిధులను వైద్య కళాశాల కోల్పోవాల్సి వచ్చింది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు రెండు, మూడు విడ తలు నిధులు పొందగా మన రాష్ట్రంలో మాత్రం మొదటి విడతతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కేటాయించిన రూ.150 కోట్లలో 20 శాతం అంటే రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ నిధులు కూడా సగంలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు చెపుతున్నారు. -
వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్
సౌకర్యాలపై తనిఖీలకు రానున్న ఎంసీఐ బృందం ఇప్పటికే ఎంబీబీఎస్ 50 సీట్లకు అనుమతి నిరాకరణ పీజీ సీట్లకూ పొంచివున్న ముప్పు లబ్బీపేట : ‘ఏ సమయంలోనైనా ఎంసీఐ బృందం తనిఖీలకు రావచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండండి. హెచ్వోడీలు, ప్రొఫెసర్లు సెలవులకు వెళ్లకుండా సమయానికి విధులకు రావాలి.’ ఇవీ వారం పది రోజులుగా సిద్ధార్థ వైద్య కళాశాలలో అధికారులు, ప్రొఫెసర్లు, విభాగాధిపతులకు ఇస్తున్న ఆదేశాలు. రోజూ ఎంసీఐ బృందం వచ్చేస్తోందంటూ హడావుడి చేస్తూ మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకూ వేచి చూసి, ‘హమ్మయ్య ఈ రోజు రాదులే’ అని ఊపిరి పీల్చుకోవడం నిత్యకృత్యంగా మారింది. యూజీ సీట్ల సౌకర్యాలపై తనిఖీలు గత ఏడాది పెంచిన 50 ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి సౌకర్యాలను పరిశీలించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం ఆకస్మికంగా తనిఖీలకు రానుంది. దీంతో పది రోజులుగా వైద్యులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అలెర్ట్‌గా ఉండాలంటూ ఇప్పటికే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రొఫెసర్లు, హెచ్వోడీలకు సెలవులు సైతం పరిమితంగా ఇస్తున్నారు. ఎంసీఐ బృం దం ఎప్పుడు వచ్చినా అడిగిన సమాచారం అం దించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆయా డిపార్ట్మెంట్లకు సం బంధించి పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేయాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు తెలిసింది. సీట్లు ఉండేనా...ఊడేనా ? సిద్ధార్థ వైద్య కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నవంబర్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంసీఐ బృందం నివేదిక రూపొందించింది. పెంచిన 50 సీట్లకు సంబంధించి సౌకర్యాలు అందుబాటులో లేవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ సీట్లు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి నెలకంది. గత అనుభవాలతోనే.. నవంబర్‌లో ఎంసీఐ బృందం వైద్య కళాశాలకు ఉదయం 8 గంటలకు చేరుకోగా, అప్పటికి ప్రిన్సిపాల్‌తో పాటు, వైద్యులెవరూ అందుబాటులో లేరు. ఎంసీఐ బృందం వచ్చిందని తెలుసుకుని అరగంటలో చేరుకున్నారు. అనంతరం పలు విభాగాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. అంతకు ముందు ఎంసీఐ బృందం వచ్చేవరకూ ఒక విభాగం తలుపులు తీయకపోవడంతో ఆ విభాగాన్ని వాడటంలేదని త నిఖీ బృందం రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం సిద్ధార్థ వైద్య కళాశాలలో 50 అదనపు సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసినా చేసిందేకానీ, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదు. సీట్ల మంజూరు సమయంలో ఎంసీఐకి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చనందునే ప్రస్తుతం సీట్లు కోల్పోవాల్సిన దుస్థితి నెల కొందని సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. ప్రతి విభాగంలో యూనిట్లు పెంచాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అప్పట్లో లేఖ రాసినా పట్టిం చుకోకుండా పక్కన పెట్టడం, సౌకర్యాల విషయంలో నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెపుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. గతంలో ఏమి పేర్కొందంటే... నిబంధనల ప్రకారం యూనిట్లను చూపుతున్నా, అందుకు అనుగుణంగా పడకలు అందుబాటులో లేవు. కనీసం ఎక్స్‌రే కూడా అందుబాటులో లేదు. నిబంధనల ప్రకారం రోజూ ఎక్స్‌రేలను తీయలేక పోతున్నారు. బ్లడ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి రెసిడెన్షియల్ క్వార్టర్లు అందుబాటులో లేవు. పూర్తిస్థాయిలోగ్రంథాలయం లేదు. ఆడిటోరియం రిపేరులో ఉంది. వ్యాధి నిర్ధారణ విభాగం సైతం అస్తవ్యస్తంగా మారింది. ఈ నివేదిక ఆధారంగా అదనంగా 50 సీట్లు అడ్మిషన్లకు ఈ ఏడాది అనుమతి ఇవ్వలేమని ఎంసీఐ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సదుపాయాలను పరిశీలించాలని చేసిన వినతి మేరకు ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీలకు రానుంది. -
విజయవాడలో మహిళపై హత్యాచారం!
విజయవాడ: విజయవాడ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీ క్రీడా మైదానంలో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందని పోలీసులు తెలిపారు. దుండగులు మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిమాండ్లు పరిష్కరిస్తేనే విధుల్లోకి
లబ్బీపేట : ‘అత్యవసర చికిత్సా విభాగానికి వస్తే నాడిని పరీక్షించేందుకు పల్స్ ఆక్సి మీటర్లు లేవు.. మధ్యాహ్నం 12 గంటలు దాటితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందుబాటులో ఉండదు... రాత్రి ఎనిమిది దాటితే సిటీ స్కానింగ్ ఉండదు.. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా అంతే.. ముఖ్యమైన రక్త పరీక్షలు బయటకు పంపాలి. పరిస్థితి దయనీయంగా ఉంటే రోగులకు సేవలు ఎలా చేయాలి... చివరికి డెత్ డిక్లేర్ చేసేందుకు ఈసీజీ కూడా అందుబాటులో లేదు’ అని జూడాలు ఆవేశంగా ఆవేదనను అధికారుల ముందు వెళ్లగక్కారు. మూడురోజులుగా సేవలు బహిష్కరించి సమ్మె చేస్తున్న జూడాలతో చర్చించేందుకు అకడమిక్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వెంకటేష్ సోమవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాల్లో సమావేశమయ్యారు. రోగులు ఇబ్బందులు పడుతుంది తమ వల్ల కాదని, ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లేనని జూడాలు పేర్కొన్నారు. ఒక దశలో జూడాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీఎంఈ సైతం వారి బాటలోనే మాట్లాడాల్సిన పరిస్థితి. చర్చా కార్యక్రమం ఇలా సాగింది.. జూడాలు : ప్రభుత్వాస్పత్రి వరస్ట్ కండీషన్లో ఉంది. కనీస సౌకర్యాలు లేక నిత్యం వందలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని నిత్యం చూస్తున్నాం. ఇక్కడే ఇలా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి ఎలా పనిచేయాలి?. డీఎంఈ : ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. బోధనాస్పత్రుల్లో 105 వెంటిలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. జూడాలు : సార్.. వర్షం వచ్చిన రోజు మా కాలేజీకి రండి.. మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చేందుకు ప్రిన్సిపాల్ నావా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణం సంద్రంలా మారుతుంది. హాస్టల్లోకి పాములు సైతం వస్తున్నాయి డీఎంఈ : మురుగు సమస్య పరిష్కారానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఆర్కిటెక్చర్కూ చెప్పాం. మూడేళ్లలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. సీనియర్ రెసిడెంట్స్ : నెలా నెలా జీతం ఇస్తామని కంపల్ సరీ సర్వీసు పేరుతో డిగ్రీలు రిజిస్ట్రేషన్లు సైతం నిలిపి మమ్మల్ని నియమించారు. ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు మా పరిస్థితి ఏమిటి? డీఎంఈ : రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున జీతాలు ఇవ్వలేకున్నాం. సీనియర్ రెసిడెంట్స్ : డబ్బులు లేనప్పుడు మాతో ఎందుకు పని చేయిస్తారు. మమ్మల్ని రిలీవ్ చేయండి. డబ్బులు ఉన్నప్పుడు పిలిస్తే మళ్లీ వచ్చి చేస్తాం. జూడాలు : కంపల్ సరీ సర్వీసులు వాలంటరీ సర్వీసుగా మార్చండి, స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొస్తాం. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో మా డిగ్రీలు రిజిస్ట్రేషన్ చేయండి? డీఎంఈ : అది ప్రభుత్వ విధానం. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. సర్టిఫికెట్లు ముందే రిజిస్ట్రేషన్ విషయం కూడా ప్రభుత్వం నిర్ణయించాలి. మా డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామంటూ జూడాలు చర్చలు ముగించారు. చర్చల్లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ శశాంక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సూర్యకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
సిద్ధార్థకు ‘పీఎంఎస్ఎస్వై’ కన్సల్టెన్సీ రాక
రూ. 150 కోట్ల కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేనా? ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవల నిమిత్తం విజయవాడ : కేంద్ర ప్రభుత్వం సిద్ధార్థ వైద్య కళాశాలకు ప్రధానమంత్రి స్వాస్త్ సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) పథకం ద్వారా కేటాయించిన రూ.150 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులను ఎంపిక చేసేందుకు కన్సల్టెన్సీ వారం పది రోజుల్లో రానున్నట్లు తెలిసింది. ఈమేరకు బుధవారం వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ సూచనప్రాయంగా తెలియజేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ విభాగాల అభివృద్ధితో పాటు, మెరుగైన సేవలందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలకు గత బడ్జెట్లో పీఎంఎస్ఎస్వై కింద నిధులు కేటాయించగా, సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.150 కోట్లు కేటాయించారు. ఆ నిధుల వినియోగానికి సంబంధించి పలు ప్రతిపాదనలను ఆస్పత్రి, వైద్య కళాశాల అధికారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికినివే దించారు. ప్రస్తుతం ఉన్న న్యూరాలజీ, న్యూరోసర్జరీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలను ఆధునీకరించడంతో పాటు అంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి విభాగాల ఏర్పాటుతో పాటు, ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేయాల్సి ఉందని అధి కారులు నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా పథకం నియమ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలను అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించడంతో పాటు, పరికరాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ వైద్య కళాశాలకు రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను వారికి చూపించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆ ప్లాన్ ప్రకారం భవనాల నిర్మాణానికే రూ.250 కోట్లు అవుతుందని, ప్రస్తుతానికి అది సాధ్యపడదని అధికారులే అంటున్నారు. మ్యాచింగ్ గ్రాంటు వస్తేనే మెరుగైన సేవలు కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్ఎస్వై పథకం కింద రూ.150 కోట్లు కేటాయించగా, దానిలో 20 శాతం అంటే రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతమొత్తం చెల్లించడం సందేహాస్పదంగా మారింది. గతంలో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించగా, దానికి మ్యాచింగ్ గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రెండేళ్లు పనులు చేపట్టకుండా అలాగే ఉంచి చివరికి తిరిగి పంపించారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా సకాలంలో చెల్లిస్తే సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని పలువురు ఆశిస్తున్నారు. -
పీజీ డెంటల్ కౌన్సెలింగ్ గందరగోళం
ఆపాలని కొంతమంది.. కొనసాగించాలని మరికొంతమంది విద్యార్థుల్లో టెన్షన్..టెన్షన్ ఎట్టకేలకు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభ ం విజయవాడ : డెంటల్ పోస్టుగ్రాడ్యుయేషన్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మరలా నిర్వహించాలని కొందరు.. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చివరి రోజు కావడంతో ఏమి జరుగుతుందోననే ఆందోళనలో మరికొందరు విద్యార్థులతో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. డెంటల్ పీజీ ప్రవేశ పరీక్ష ‘కీ’లో ఏడు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు హైకోర్టును ఆశ్రయించడంతో, కౌన్సెలింగ్‌ను నిలిపివేసి, ప్రశ్నాపత్రాలు పరిశీలించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అప్పటికే పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థుల్లో ఆందోళన ప్రారంభమైంది. హైకోర్టు నుంచిస్టే వచ్చిందని ప్రచారం జరగడం, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం గురువారం నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉన్నందున్న కౌన్సెలింగ్ జరగకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు సైతం ప్రవేశ పరీక్ష కీలో తప్పుగా సమాధానాలు ఇచ్చారని, దీంతో ర్యాంకులు తారుమారయ్యాయంటూ ఆందోళన ప్రారంభించారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు వ ర్సిటీ అధికారులు హైదరాబాద్, విజయవాడ డెంటల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ బాలిరెడ్డి, డాక్టర్ టి.మురళీమోహన్‌లతోకూడిన ఎక్స్పర్ట్ కమిటీ ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం 12 గంటలకు కౌన్సెలింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న డాక్టర్ శశాంక్ వద్దకు వెళ్లి కోర్టు ఇచ్చినకాపీలను అందజేశారు. ఈ విషయంలో తామేమి చేయలేమని, వర్సిటీ అధికారులను కలిస్తే వివరణ ఇస్తారని వారు విద్యార్థులకు సూచించారు. దీంతో వారు వెనుదిరగడంతో అనంతరం కౌన్సెలింగ్‌ను కొనసాగించారు. -
సిద్ధార్థ వైద్య కళాశాలకు మొండిచెయ్యి
సీట్లు మంజూరుపై కరుణించని ఎంసీఐ రాష్ట్రంలో అన్ని కళాశాలలకు పునరుద్ధరించినా సిద్ధార్థకు దక్కని వైనం ఈ ఏడాది వంద సీట్లకే పరిమితం లబ్బీపేట : సిద్ధార్థ వైద్య కళాశాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కరుణించ లేదు. అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరుపై చివరి నిమిషంలోనైనా ఆమోదం వస్తుందన్న యూనివర్సిటీ అధికారులు ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 350 ఎంబీబీఎస్ సీట్లు పునరుద్ధరించిన ఎంసీఐ, సిద్ధార్థకు మాత్రం మొండిచెయ్యి చూపింది. వైద్య మంత్రి సొంత జిల్లాలో ఉన్న కళాశాలకు సీట్లు రప్పించడంలో చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది సిద్ధార్థ వైద్య కళాశాల వందసీట్లకు పరిమితం కానుంది. సిద్ధార్థ కళాశాలకు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 40 శాతం, ఎస్వీయూ పరిధిలో 20 శాతం, ఉస్మానియా పరిధిలో 40 శాతం మందికి సీట్లు కేటాయిస్తారు. ఏకైక స్టేట్ వైడ్ కళాశాలగా ఉన్న సిద్ధార్థకు అదనపు సీట్లు కేటాయించక పోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులకు నష్టమేనని నిపుణులు చెపుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిల్లో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు పేర్కొంటున్నారు. బోధకులు కొరత తీవ్రంగా ఉండటాన్ని ఎంసీఐ గుర్తించినట్లు వారు అంటున్నారు. ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సీట్లు దక్కేవని చెబుతున్నారు. వంద సీట్లు ఉన్న కళాశాలకు 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో 50 మంజూరు చేసింది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో వాటిని భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలు చేసి సౌకర్యాలు లేని కారణంగా వాటిని రద్దు చేసేంది. గత ఏడాది వంద సీట్లనే భర్తీ చేశారు. అదనంగా సీట్లు మంజూరు చేయాలంటూ కళాశాల అధికారులు మళ్లీ ఎంసీఐకు ద రఖాస్తు చేయడంతో బృందం అకస్మికంగా తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యం కళాశాలకు అదనపు సీట్లు దక్కని విషయంలో అధికారుల వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధిని ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. ఎంసీఐ బృందం తనిఖీలను వస్తున్నట్లు ముందుగానే తెలిసినా పలు విభాగాలను సిద్ధం చేయలేదు. కళాశాలలోని ఓ విభాగంలో వైజ్ఞానిక ప్రదర్శన దుమ్ముపట్టి ఉండటాన్ని ఎంసీఐ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకే తనిఖీలకు ఎంసీఐ సభ్యులు రాగా, 11 గంటల సమయంలో కూడా వైద్యులు విధులకు రావడం, ఐడీ కార్డులు, నెఫ్రాన్లు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల అదనపుసీట్లు రాక పోవడంలో పాలకుల నిర్లక్ష్యంతో పాటు, అధికారుల వైఫల్యం కూడా ఉంది. ఎంసీఐ అభ్యంతరాలు ఇవి టీచింగ్ క్లాసులు నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. బ్లడ్ బ్యాంక్‌కు ప్రత్యేక ప్రవేశ మార్గం ఉండాలి. బహిరంగ ప్రదేశంలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. వ్యాధి నిర్ధారణ విభాగంలో సైతం అధునాతన పరికరాలు లేవని , ఆర్సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం రిపేరులో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లైబ్రరీ, పెథాలజీ సెకండ్ డొమాస్టిక్ రూమ్, కమ్యునిటీ మెడిసిన్‌కు ప్రాక్టికల్ ల్యాబ్ లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్స్ లేక పోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాదికైనా సీట్లు దక్కే అవకాశం ఉంది. -
వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్ !
లబ్బీపేట, న్యూస్‌లైన్ : సిద్ధార్థ వైద్య కళాశాల అధికారులకు ఎంసీఐ ఫీవర్ పట్టుకుంది. కళాశాలలో సౌకర్యాలు లేవంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గత ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేసింది. తిరిగి వాటిని పొందేందుకు అధికారులు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం ఏ క్షణంలోనైనా తనిఖీలకు వచ్చే అవకాశం ఉంది. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా వార్డులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది ఎంసీఐ బృందం వచ్చిన తర్వాత ఫిజియాలజీ ల్యాబ్‌ను తెరవడంతో, వారు తన రిపోర్టులో దానిని వినియోగించడం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సారి అటువంటి తప్పిదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు వైద్యులకు సూచిస్తున్నారు. అయితే శాశ్వత నిర్మాణాల విషయంలో గత ఏడాదికి ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఏమి జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 2012లో 50 సీట్లు మంజూరు వంద ఎంబీబీఎస్ సీట్లు ఉన్న సిద్ధార్థ వైద్య కళాశాలను 2012లో ఎంసీఐ బృందం తనిఖీ చేసి అదనంగా మరో 50 సీట్లు మంజూరు చేసింది. ఆ సమయంలో లైబ్రరీ, రూరల్ కమ్యూనిటీ హెల్త్ (ఆర్సీహెచ్) బ్లాక్ నిర్మాణం, బోధనా సిబ్బంది పెంపు వంటి సమస్యలను ఏడాదిలో పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలకు రాగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చక పోగా, మరిన్ని సమస్యలను వారు గుర్తించారు. దీంతో పెంచిన 50 సీట్లకు సంబంధించి సౌకర్యాలు లేని కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చేసేది లేక ఈ ఏడాది వంద సీట్లకే అడ్మిషన్లు నిర్వహించారు. ఇప్పటికీ ఈ సమస్యలన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసి ప్రయోజనం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిలిచిపోయిన కేంద్ర నిధులు దేశ వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిధులు కేటాయించింది. వాటికి మ్యాచింగ్ గ్రాంటు కిందట 25 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం సిద్ధార్థ వైద్య కళాశాలకు కేంద్రప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. ఇందులో తొలివిడతగా రూ.11 కోట్లు మంజూరవగా, వివిధ పరికరాల కొనుగోళ్లు, నిర్మాణపనులకు వెచ్చించారు. మ్యాచింగ్ గ్రాంటు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయక పోవడంతో, కేంద్రం రెండో విడత విడుదల చేయాల్సిన గ్రాంటు రూ.11కోట్లు నిలిచిపోయాయని, దీంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి తలెత్తేది కాదనేది వారి వాదన . తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో నిధులు సద్వినియోగం చేసుకుంటే మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని అధికారులు వాపోతున్నారు. -
ముగిసిన వైద్యుల నియామక కౌన్సెలింగ్
రాష్ట్ర వ్యాప్తంగా 1,009 పోస్టుల భర్తీ పోస్టింగ్ ఆర్డర్ల కోసం అభ్యర్థుల పడిగాపులు జిల్లాలో పోస్టింగ్ తీసుకున్న 40 మంది విజయవాడ, న్యూస్‌లైన్ : వైద్య ఆరోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) నియామకాలకు సంబంధించి నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్టుల కోసం 1,239 మంది హాజరగా, వారిలో 1,009 మంది పోస్టింగ్‌లు పొందారు. మిగిలిన వారు వివిధ కారణాలతో పాటు, తాము కోరుకున్న ప్రాంతంలో ఖాళీలు లేక పోస్టింగ్ తీసుకోవడానికి నిరాకరించారని సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 5, 6వ తేదీల్లో నియామక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కేవలం ఒక్క రోజు ముందు ప్రకటించిన ఉన్నతాధికారులు, అందుకు తగిన ఏర్పాట్టు చేయలేదు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆద్యంతం నత్తనడకన సాగింది. అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న తీరుపై అభ్యర్థులు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో రెండు రోజుల్లో ముగియాల్సిన కౌన్సెలింగ్‌కు నాలుగు రోజులు పట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలపాటు అభ్యర్థుందరికీ కౌన్సెలింగ్ పూర్తి చేశారు. వారికి శనివారం నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. అయితే కంప్యూటర్ ప్రింటర్లు మొరాయించడం, విద్యుత్ కోతకారణంగా మధ్యాహ్నం వరకూ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఒక్కరోజు ముందు ఫోన్‌చేసి కౌన్సెలింగ్‌కు పిలవడంతో చంటిబిడ్డలతో వచ్చామని, నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని మహిళా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టింగ్ ఆర్డర్ల కోసం శనివారం నాలుగు వందల మంది అభ్యర్థులు పడిగాపులుకాశారు. సీఏఎస్‌ల నియామకాల్లో భాగంగా కృష్ణా జిల్లాలో 40 మంది కొత్త వైద్యులు పోస్టింగులు పొందారు. వారంతా 15 రోజుల్లో విధుల్లో చేరతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరసిజాక్షి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.