లబ్బీపేట : ‘అత్యవసర చికిత్సా విభాగానికి వస్తే నాడిని పరీక్షించేందుకు పల్స్ ఆక్సి మీటర్లు లేవు.. మధ్యాహ్నం 12 గంటలు దాటితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందుబాటులో ఉండదు... రాత్రి ఎనిమిది దాటితే సిటీ స్కానింగ్ ఉండదు.. ఎంఆర్‌ఐ స్కానింగ్ కూడా అంతే.. ముఖ్యమైన రక్త పరీక్షలు బయటకు పంపాలి. పరిస్థితి దయనీయంగా ఉంటే రోగులకు సేవలు ఎలా చేయాలి... చివరికి డెత్ డిక్లేర్ చేసేందుకు ఈసీజీ కూడా అందుబాటులో లేదు’ అని జూడాలు ఆవేశంగా ఆవేదనను అధికారుల ముందు వెళ్లగక్కారు.
మూడురోజులుగా సేవలు బహిష్కరించి సమ్మె చేస్తున్న జూడాలతో చర్చించేందుకు అకడమిక్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వెంకటేష్ సోమవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాల్‌లో సమావేశమయ్యారు. రోగులు ఇబ్బందులు పడుతుంది తమ వల్ల కాదని, ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లేనని జూడాలు పేర్కొన్నారు. ఒక దశలో జూడాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీఎంఈ సైతం వారి బాటలోనే మాట్లాడాల్సిన పరిస్థితి. చర్చా కార్యక్రమం ఇలా సాగింది..
జూడాలు : ప్రభుత్వాస్పత్రి వరస్ట్ కండీషన్‌లో ఉంది. కనీస సౌకర్యాలు లేక నిత్యం వందలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని నిత్యం చూస్తున్నాం. ఇక్కడే ఇలా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి ఎలా పనిచేయాలి?.
డీఎంఈ : ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. బోధనాస్పత్రుల్లో 105 వెంటిలేటర్లు అందుబాటులోకి రానున్నాయి.
జూడాలు : సార్.. వర్షం వచ్చిన రోజు మా కాలేజీకి రండి.. మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చేందుకు ప్రిన్సిపాల్ నావా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణం సంద్రంలా మారుతుంది. హాస్టల్‌లోకి పాములు సైతం వస్తున్నాయి
డీఎంఈ : మురుగు సమస్య పరిష్కారానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఆర్కిటెక్చర్‌కూ చెప్పాం. మూడేళ్లలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం.
సీనియర్ రెసిడెంట్స్ : నెలా నెలా జీతం ఇస్తామని కంపల్ సరీ సర్వీసు పేరుతో డిగ్రీలు రిజిస్ట్రేషన్లు సైతం నిలిపి మమ్మల్ని నియమించారు. ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు మా పరిస్థితి ఏమిటి?
డీఎంఈ : రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున జీతాలు ఇవ్వలేకున్నాం.
సీనియర్ రెసిడెంట్స్ : డబ్బులు లేనప్పుడు మాతో ఎందుకు పని చేయిస్తారు. మమ్మల్ని రిలీవ్ చేయండి. డబ్బులు ఉన్నప్పుడు పిలిస్తే మళ్లీ వచ్చి చేస్తాం.
జూడాలు : కంపల్ సరీ సర్వీసులు వాలంటరీ సర్వీసుగా మార్చండి, స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొస్తాం. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో మా డిగ్రీలు రిజిస్ట్రేషన్ చేయండి?
డీఎంఈ : అది ప్రభుత్వ విధానం. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. సర్టిఫికెట్లు ముందే రిజిస్ట్రేషన్ విషయం కూడా ప్రభుత్వం నిర్ణయించాలి.
మా డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామంటూ జూడాలు చర్చలు ముగించారు. చర్చల్లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ శశాంక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సూర్యకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
డిమాండ్లు పరిష్కరిస్తేనే విధుల్లోకి
Published Tue, Nov 25 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement