‘ఓప్రా విన్ఫ్రే’షో: అతిథిగా ఇరవై మూడేళ్ళ యువతి!
ఆపిల్ కంపెనీ ఇంటర్నెట్ టీవీ చానెల్ ‘ఆపిల్ ప్లస్’ ప్రారంభం అయిన ఈ పదహారు నెలల్లో ఆ చానెల్ షోలలో అత్యధికంగా వీక్షకుల రేటింగ్ ఉన్న ‘ది ఓప్రా విన్ఫ్రే కాన్వర్జేషన్’ షో మొన్న శుక్రవారం మొదలవగానే ఆ చిన్న తెరకు ఒక పెద్దకళ వచ్చింది! అతిథి ఇరవై మూడేళ్ల అమందా గోర్మన్. ఆతిథ్యమిచ్చినది అరవై ఏడేళ్ల ఓప్రా విన్ఫ్రే. ఇద్దరూ కూడా వయసుతో నిమిత్తం లేని ప్రతిభా సామర్థ్యాలతో ప్రముఖులుగా గుర్తింపు పొందిన (విన్ఫ్రే), పొందుతున్న (అమందా) వారు. ఇద్దరూ నల్లజాతి అమెరికన్ మహిళలు.
ఒకరోజు వస్తుంది. ఆ రోజున భయజ్వాల ఛాయ నుంచి బయట పడతాం. కొత్త ఉదయంలోకి..కొత్త వెలుగులోకి వచ్చేస్తాం. వెలుగును ధైర్యంగా చూడాలి. వెలుగును చూసేందుకు ధైర్యం చేయాలి.
అమందా ‘ది హిల్ వియ్ క్లైంబ్’ అనే కవితలోని కొంత భాగం
కెరీర్లో విన్ఫ్రేతో పోల్చి చూసినప్పుడు అమందా ఇంకా జీవితారంభంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ, ఇంటర్వూ్యలో విన్ఫ్రే ఆమెను అలా అనిపించనివ్వలేదు. ఒక చిన్న పిల్లలా కాక, ఒక వ్యక్తితో మాట్లాడినట్లే విన్ఫ్రే సంభాషణ మొత్తం నడిపారు. ఆ ధోరణి టీవీ వీక్షకులలో విన్ఫ్రేతో సమానంగా అమందా పైన కూడా గౌరవం కలిగేలా చేసింది! ‘‘అమెరికా ఒక గొప్ప ప్రాధాన్యం కలిగి ఉన్న చారిత్రక క్షణాలలోకి ప్రవేశిస్తున్న సమయంలో వర్తమానంలోకి అమందా రావడం జరిగింది! తనను నేను కలుసుకున్న తొలి క్షణంలోనే అమె యవ్వనోత్సానికి మంత్ర ముగ్ధురాలిని అయ్యాను’’ అని అమందా ఇంటర్వూ్య ప్రారంభానికి ముందు చెప్పారు ఓప్రా విన్ఫ్రే! చారిత్రక క్షణాలు అంటే ఆమె ఉద్దేశం.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భం లోనివని. ఆ రోజు జనవరి 20 న అమందా ‘ది హిల్ వియ్ క్లైంబ్’ అనే కవితను చదివి వినిపించారు.
అది ఆమె రాసిందే. అయితే బైడెన్ ప్రత్యేక ఆహ్వానంతో అమందాకు లభించిన ప్రాధ్యానం కాదది. ఆ మునుపే ఆమె తన పద్దెనిమిదవ యేట నుంచీ పెద్ద పేరున్న కవయిత్రి. ఆరవ యేట నుంచీ మానవతావాద కవితలు రాస్తున్నారు. ఎంపిక చేసుకున్న కార్యక్రమాలలో మాత్రమే కవితా పఠనం చేస్తూ వస్తున్నారు. ఆ ‘ఎంపిక’ పూర్తిగా ఆమెదే. గత ఏడాది జూలై 4 న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా ఆమె తన ‘ఇనాగురల్ పొయెట్రీ’ని వినిపించారు. ఆమెకు ప్రారంభోత్సవాల కవయిత్రిగా పేరు. అయితే ఆ కవితలేవీ ఎవరినీ కొనియాడేవి కావు. సమ మానవ భావనను రేకెత్తించేవి. హార్వర్డ్ యూనివర్సిటీ వార్షికోత్సవంలోనైతే ఆమె కవితకు ప్రొఫెసర్లు సైతం ప్రణమిల్లారు. ‘నా కవిత జీవితకాలం ఒక రాత్రి. కానీ హృదయాన్ని స్పృశిస్తుంది’ అని అమందా అంటుంటారు. ఆమె ఒక కార్యక్రమానికి ఒక కవితను మాత్రమే రాస్తారు.
ఆమెకు ఇష్టమైన కవులు ఎలిజబెత్ అలెగ్జాండర్, రిచర్డ్ బ్లాంకో. వాళ్లిద్దరూ ఆమె కన్నా రెండింతల వయసు ఉన్నవాళ్లు. తరచు వెళ్లి వాళ్లను కలుస్తుంటారు అమందా. టీనేజ్లోనే అమందా తొలి కవితా సంకలనం వెలువడింది. ‘ది వన్ ఫర్ హూమ్ ఫుడ్ ఈజ్ నాట్ ఇనఫ్’ ఆ పుస్తకం పేరు. ఇంకో రెండు పుస్తకాలు వస్తున్నాయి. వాటిని ప్రచురించేందుకు ప్రసిద్ధ వైకింగ్ సంస్థ ఆమెతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుని ఉంది. ఇవన్నీ తెలిసిన విషయాలే. తాజాగా ఓప్రే విన్ఫ్రే ఇంటర్వూ్య మూలంగా తెలిసిన కొత్త సంగతి ఏమిటంటే.. అమందా భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలిగా పోటీ చేయబోతున్నారు! ఆ మాత్రం ఫైటింగ్ స్పిరిట్ లేకుంటే విన్ఫ్రే ఎవర్నైనా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? విన్ఫ్రే ఇంటర్వ్యూ చేయడం కూడా అమందాకు ఒక పెద్ద ప్రశంసాపత్రమే.
లేదా ఒక అవార్డు అనుకోవచ్చు. విన్ఫ్రే ఏ స్థాయి వ్యక్తులతో టీవీ స్క్రీన్‌పై సంభాషిస్తారో ప్రపంచానికి తెలియంది కాదు. ఇటీవల ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్‌తో ఓప్రా చేసిన ఇంటర్వూ్య సంచలనం రేపింది. విన్ఫ్రే ప్రశ్నలు అలా ఉంటాయి మరి. అతిథుల గౌరవం తగ్గకుండా వాళ్లకు తెలియకుండానే వాళ్ల గుండె లోతుల్లోకి మాటలతో ఈదుకుంటూ వెళ్లి సడీ చప్పుడూ లేకుండా మళ్లీ బయటికి వచ్చేస్తారు. ఇప్పుడీ ఆపిల్ ప్లస్ చానల్లోనే వన్ఫ్రే ఇంతవరకు ఇంటర్వ్యూ చేసిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హాలీవుడ్ నటుడు మాథ్యూ మెకానీ, అమెరికన్ గాయకుడు, గేయ రచయిత స్టీమ్ వండర్, అమెరికన్ రచయిత ఇబ్రహిం ఎక్స్.కెండీ వంటి వారు ఉన్నారు. వాళ్లందరిలోకి చిన్న అయినా కూడా వాళ్లందరిలా సృజన ఉన్న కారణంగా అమందాకు.. వారితో సమానంగా ప్రాధాన్యం లభిచింది.
ఇంతకీ అమందా ఏమంటారు? 2036 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట. ఆ ఏడాదికి ఆమె 35 ఏళ్లు దాటి ఉంటారు. అమెరికా ప్రెసిడెంటుగా పోటీ చేయడానికి అవసరమైన కనీస వయసు అది. అమందా బ్లాక్ క్యాథలిక్. లాస్ ఏంజెలిస్‌లోని సెయింట్ బ్రిగిడ్ క్యాథలిక్ చర్చిలో సభ్యురాలు. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కవితను చదివి వినిపించిన రెండో రోజు ఆమె ‘ది లేట్ లేట్ షో విత్ జేమ్స్ కార్డెన్’ షోలో కనిపించారు! దేవుడు సృష్టించిన వారిలో కోర్డన్ తన అభిమాన మానవుడు’ అని అమందా ఆ షోలో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. ‘అమందా ఒక పవర్‌హౌస్ అనీ, ఆమె జీవిత చరిత్ర ప్రతి రెండు వారాలకు పాతబడిపోతుందని స్వచ్ఛంద ‘అర్బన్ వర్డ్ ఎన్.వై.సి.’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ సిరీల్లే అభినందించారు.
అమందాకు అన్నిట్లోనూ తల్లి జోన్ విక్స్ స్ఫూర్తి. కవితలు రాయడానికి, మానవ హక్కుల ఉద్యమాల్లో పని చేయడానికి కూడా. కూతురికి అంతగా ప్రేరణ ఇచ్చే ఆ తల్లి అమందా రాజకీయాల్లోకి వెళతానంటే వద్దంటుందా! జోన్ విక్స్ ఆరో తరగతి ఇంగ్లిష్ టీచర్. అమందాను, అమందా ఇద్దరు అక్కచెల్లెళ్లను సింగిల్ మదర్‌గా పెంచి పెద్ద చేశారు.