వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్ | Fever ensiai to medical college | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్

Published Mon, May 4 2015 2:17 AM | Last Updated on Tue, Oct 9 2018 5:50 PM

వైద్య కళాశాలకు  ఎంసీఐ ఫీవర్ - Sakshi

వైద్య కళాశాలకు ఎంసీఐ ఫీవర్

సౌకర్యాలపై తనిఖీలకు రానున్న ఎంసీఐ బృందం
ఇప్పటికే ఎంబీబీఎస్ 50 సీట్లకు అనుమతి నిరాకరణ
పీజీ సీట్లకూ పొంచివున్న ముప్పు

 
లబ్బీపేట : ‘ఏ సమయంలోనైనా ఎంసీఐ బృందం తనిఖీలకు రావచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండండి. హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లు సెలవులకు వెళ్లకుండా సమయానికి విధులకు రావాలి.’ ఇవీ వారం పది రోజులుగా సిద్ధార్థ వైద్య కళాశాలలో అధికారులు, ప్రొఫెసర్లు, విభాగాధిపతులకు ఇస్తున్న ఆదేశాలు. రోజూ ఎంసీఐ బృందం వచ్చేస్తోందంటూ హడావుడి చేస్తూ మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకూ వేచి చూసి, ‘హమ్మయ్య ఈ రోజు రాదులే’ అని ఊపిరి పీల్చుకోవడం నిత్యకృత్యంగా మారింది.
 
యూజీ సీట్ల సౌకర్యాలపై తనిఖీలు


గత ఏడాది పెంచిన 50 ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి సౌకర్యాలను పరిశీలించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం ఆకస్మికంగా తనిఖీలకు రానుంది. దీంతో పది రోజులుగా వైద్యులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అలెర్ట్‌గా ఉండాలంటూ ఇప్పటికే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రొఫెసర్లు, హెచ్‌వోడీలకు సెలవులు సైతం పరిమితంగా ఇస్తున్నారు. ఎంసీఐ బృం దం ఎప్పుడు వచ్చినా అడిగిన సమాచారం అం దించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆయా డిపార్ట్‌మెంట్‌లకు సం బంధించి పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేయాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు తెలిసింది.

సీట్లు ఉండేనా...ఊడేనా ?

సిద్ధార్థ వైద్య కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నవంబర్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంసీఐ బృందం నివేదిక రూపొందించింది. పెంచిన 50 సీట్లకు సంబంధించి సౌకర్యాలు అందుబాటులో లేవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ సీట్లు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి నెలకంది.
 
గత అనుభవాలతోనే..

నవంబర్‌లో ఎంసీఐ బృందం వైద్య కళాశాలకు ఉదయం 8 గంటలకు చేరుకోగా, అప్పటికి ప్రిన్సిపాల్‌తో పాటు, వైద్యులెవరూ అందుబాటులో లేరు. ఎంసీఐ బృందం వచ్చిందని తెలుసుకుని అరగంటలో చేరుకున్నారు. అనంతరం పలు విభాగాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. అంతకు ముందు ఎంసీఐ బృందం వచ్చేవరకూ ఒక విభాగం తలుపులు తీయకపోవడంతో ఆ విభాగాన్ని వాడటంలేదని త నిఖీ బృందం రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

సిద్ధార్థ వైద్య కళాశాలలో 50 అదనపు సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసినా చేసిందేకానీ, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదు. సీట్ల మంజూరు సమయంలో ఎంసీఐకి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చనందునే ప్రస్తుతం సీట్లు కోల్పోవాల్సిన దుస్థితి నెల కొందని సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. ప్రతి విభాగంలో యూనిట్లు పెంచాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అప్పట్లో లేఖ రాసినా పట్టిం చుకోకుండా పక్కన పెట్టడం, సౌకర్యాల విషయంలో నిధులు కేటాయించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెపుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
 
 గతంలో ఏమి పేర్కొందంటే...

నిబంధనల ప్రకారం యూనిట్లను చూపుతున్నా, అందుకు అనుగుణంగా పడకలు అందుబాటులో లేవు.
కనీసం ఎక్స్‌రే కూడా అందుబాటులో లేదు. నిబంధనల ప్రకారం రోజూ ఎక్స్‌రేలను  తీయలేక పోతున్నారు.
బ్లడ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు.
టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి రెసిడెన్షియల్ క్వార్టర్లు అందుబాటులో లేవు.
పూర్తిస్థాయిలోగ్రంథాలయం లేదు. ఆడిటోరియం రిపేరులో ఉంది.
వ్యాధి నిర్ధారణ విభాగం సైతం అస్తవ్యస్తంగా మారింది.  

ఈ నివేదిక ఆధారంగా అదనంగా 50 సీట్లు అడ్మిషన్లకు ఈ ఏడాది అనుమతి ఇవ్వలేమని ఎంసీఐ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సదుపాయాలను పరిశీలించాలని చేసిన వినతి మేరకు ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీలకు రానుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement