- సీట్లు మంజూరుపై కరుణించని ఎంసీఐ
- రాష్ట్రంలో అన్ని కళాశాలలకు పునరుద్ధరించినా సిద్ధార్థకు దక్కని వైనం
- ఈ ఏడాది వంద సీట్లకే పరిమితం
లబ్బీపేట : సిద్ధార్థ వైద్య కళాశాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కరుణించ లేదు. అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరుపై చివరి నిమిషంలోనైనా ఆమోదం వస్తుందన్న యూనివర్సిటీ అధికారులు ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 350 ఎంబీబీఎస్ సీట్లు పునరుద్ధరించిన ఎంసీఐ, సిద్ధార్థకు మాత్రం మొండిచెయ్యి చూపింది. వైద్య మంత్రి సొంత జిల్లాలో ఉన్న కళాశాలకు సీట్లు రప్పించడంలో చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది సిద్ధార్థ వైద్య కళాశాల వందసీట్లకు పరిమితం కానుంది.
సిద్ధార్థ కళాశాలకు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 40 శాతం, ఎస్వీయూ పరిధిలో 20 శాతం, ఉస్మానియా పరిధిలో 40 శాతం మందికి సీట్లు కేటాయిస్తారు. ఏకైక స్టేట్ వైడ్ కళాశాలగా ఉన్న సిద్ధార్థకు అదనపు సీట్లు కేటాయించక పోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులకు నష్టమేనని నిపుణులు చెపుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిల్లో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు పేర్కొంటున్నారు. బోధకులు కొరత తీవ్రంగా ఉండటాన్ని ఎంసీఐ గుర్తించినట్లు వారు అంటున్నారు. ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సీట్లు దక్కేవని చెబుతున్నారు.
వంద సీట్లు ఉన్న కళాశాలకు 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో 50 మంజూరు చేసింది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో వాటిని భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలు చేసి సౌకర్యాలు లేని కారణంగా వాటిని రద్దు చేసేంది. గత ఏడాది వంద సీట్లనే భర్తీ చేశారు. అదనంగా సీట్లు మంజూరు చేయాలంటూ కళాశాల అధికారులు మళ్లీ ఎంసీఐకు ద రఖాస్తు చేయడంతో బృందం అకస్మికంగా తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
అధికారుల నిర్లక్ష్యం
కళాశాలకు అదనపు సీట్లు దక్కని విషయంలో అధికారుల వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధిని ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. ఎంసీఐ బృందం తనిఖీలను వస్తున్నట్లు ముందుగానే తెలిసినా పలు విభాగాలను సిద్ధం చేయలేదు. కళాశాలలోని ఓ విభాగంలో వైజ్ఞానిక ప్రదర్శన దుమ్ముపట్టి ఉండటాన్ని ఎంసీఐ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకే తనిఖీలకు ఎంసీఐ సభ్యులు రాగా, 11 గంటల సమయంలో కూడా వైద్యులు విధులకు రావడం, ఐడీ కార్డులు, నెఫ్రాన్‌లు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల అదనపుసీట్లు రాక పోవడంలో పాలకుల నిర్లక్ష్యంతో పాటు, అధికారుల వైఫల్యం కూడా ఉంది.
ఎంసీఐ అభ్యంతరాలు ఇవి
టీచింగ్ క్లాసులు నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. బ్లడ్ బ్యాంక్‌కు ప్రత్యేక ప్రవేశ మార్గం ఉండాలి. బహిరంగ ప్రదేశంలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. వ్యాధి నిర్ధారణ విభాగంలో సైతం అధునాతన పరికరాలు లేవని , ఆర్‌సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం రిపేరులో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లైబ్రరీ, పెథాలజీ సెకండ్ డొమాస్టిక్ రూమ్, కమ్యునిటీ మెడిసిన్‌కు ప్రాక్టికల్ ల్యాబ్ లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్స్ లేక పోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాదికైనా సీట్లు దక్కే అవకాశం ఉంది.