Hopes
-
నిర్మలమ్మ పద్దుపై భారీ ఆశలు
-
పండుగ సీజన్‌పై భారీ ఆశలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌పై ఆటోమొబైల్ కంపెనీలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల అమ్మకాలు మందగించినప్పటికీ వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడి, మిగతా ఏడాదంతా అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నాయి. ఏటా పండుగ సీజన్ సాధారణంగా ఓనంతో ప్రారంభమై దీపావళితో ముగుస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 3–4 నెలలుగా విక్రయాలు నెమ్మదించాయని కియా ఇండియా నేషనల్ హెడ్ (సేల్స్, మార్కెటింగ్) హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. అయితే, గత కొద్ది నెలలుగా కొంత డిమాండ్ పేరుకున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మార్కెట్ మెరుగుపడగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్‌లో బుకింగ్స్ పుంజుకున్నాయని, అక్టోబర్‌లోనూ ఇదే ధోరణి కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘ఈసారి పండుగలన్నీ కూడా అక్టోబర్‌లోనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 5–10 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం‘ అని బ్రార్ వివరించారు. జనవరి–ఏప్రిల్ మధ్య కాలంలో ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ 7 శాతం వృద్ధి చెందగా, మే–సెప్టెంబర్ వ్యవధిలో 2–3 శాతం మేర తగ్గింది. దీంతో నిల్వలు పేరుకుపోయాయి. కఠిన పరిస్థితులు.. మూడు, నాలుగు నెలలుగా పరిశ్రమ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోందని, పండుగ సీజన్లో కొంత ఊరట లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. ‘ఈ త్రైమాసికం ఎలా ఉండబోతోందనేది పండుగ సీజన్‌ను బట్టి తెలుస్తుంది. అలాగే మూడో త్రైమాసికాన్ని బట్టి మిగతా సంవత్సరం ఎలా ఉండబోతోందనేది తెలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. అందుకే అంతా పండుగ సీజన్ విషయంలో ఆతృతగా ఉన్నట్లు వివరించారు. మరోవైపు, షోరూమ్‌లను సందర్శించే వారు, వాహనాల కోసం ఎంక్వైరీ చేసే వారు క్రమంగా పెరుగుతున్నారని టయోటా కిర్లోస్కర్ మోటర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సరీ్వస్, యూజ్డ్ కార్ వ్యాపార విభాగం) శబరి మనోహర్ తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కూడా మెరుగుపర్చుకున్నట్లు, మూడో షిఫ్ట్‌ను ప్రవేశపెట్టడం మొదలైనవి చేసినట్లు ఆయన చెప్పారు. బాగా డిమాండ్ ఉన్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లాంటి మోడల్స్ సరఫరాను పెంచడంతో వెయిటింగ్ పీరియడ్ తగ్గుతోందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పర్యావరణ అనుకూల టెక్నాలజీ ఉన్న వాహనాలపై ఆసక్తి పెరుగుతోందని మనోహర్ పేర్కొన్నారు. లిమిటెడ్ ఎడిషన్లు.. కొత్తగా లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా విక్రయాలు పెంచుకునేందుకు ప్రయతి్నస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. వినాయక చవితి, జన్మాష్టమి సందర్భంగా అమ్మకాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. సెపె్టంబర్ ఆఖరు నాటికి తమ వాహన విక్రయాలు మరింతగా పెరిగాయని, మిగతా సీజన్లోను ఇదే సానుకూల ధోరణి కనిపించే అవకాశాలు ఉన్నాయని టాటా మోటర్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. -
కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లిన అఖిలేష్!
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో ఆరుగురు అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పి) విడుదల చేసింది. దీనికి ముందు మూడు దశల్లో 31 మంది అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గానూ 37 స్థానాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే శుక్రవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో నగీనా సీటు చర్చనీయాంశంగా మారింది. నగీనా లోక్‌సభ స్థానం నుంచి మనోజ్ కుమార్ పోటీ చేస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. మనోజ్ కుమార్ ఇండియా అలయన్స్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. యూపీలో మరికొన్ని చిన్న పార్టీలను ఇండియా కూటమిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చంద్రశేఖర్ ఆజాద్‌కు కంచుకోటగా ఉన్న నగీనా స్థానంలో ఏ అభ్యర్థినీ నిలబెట్టవద్దని కాంగ్రెస్ అఖిలేష్‌కు సూచించింది. అయితే తాజాగా అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మనోజ్ కుమార్‌ను నగీనా అభ్యర్థిగా చేయడం ద్వారా, చంద్రశేఖర్ ఆజాద్ ఇకపై ఇండియా కూటమిలో చేరలేని పరిస్థితి ఏర్పడింది. యూపీలోని ఖతౌలీ, రాంపూర్, మెయిన్పూర్ ఉపఎన్నికల సమయంలో చంద్రశేఖర్ బహిరంగంగానే ఎస్పీ కూటమితో బరిలోకి దిగారు. చంద్రశేఖర్ పలు సందర్భాలలో అఖిలేష్ యాదవ్ పక్కన కనిపించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఇండియా కూటమిలో ఉంటారని, నగీనా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రకటించారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ నేడు (శనివారం) నగీనాలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు. -
G20 summit: ఏకాభిప్రాయం సాధిస్తాం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని భారత్ ప్రకటించింది. ‘ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ దిశగా సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నాయి’ అని భారత్ ప్రకటించింది. సదస్సుకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో సమ్మతి సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఆయన చెప్పలేదు. ‘ ఆఫ్రికా యూనియన్‌కు జీ20 కూటమిలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనే అంశంపై శనివారం జరిగే సదస్సులో నిర్ణయం తీసుకోవచ్చు’ అని క్వాత్రా తెలిపారు. ‘ప్రధాని మోదీకి గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రగాఢ విశ్వాసముంది. అందుకే ఆఫ్రికా యూనియన్ను కలుపుకుందామని జీ20 సభ్యదేశాలకు రాతపూర్వకంగా మోదీ విన్నవించుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అనేది గ్లోబల్ సౌత్‌కు, అభివృద్ధి దేశాలకు గొంతుకగా ఉంటుంది. జీ20కి భారత సారథ్యం సమ్మిళితంగా, లక్ష్య సాధకంగా, క్రియాశీలకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు ’ అని జీ20 షెర్పా అయిన అమితాబ్ కాంత్ చెప్పారు. ‘ భారత వైవిధ్య, సమాఖ్య నిర్మాణానికి గుర్తుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 నగరాలు, పట్టణాల్లో 220కిపైగా జీ20 సంబంధ సమావేశాలు జరిగాయని అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. అగ్ర నేతలు పాల్గొనే సెషన్స్‌లు మూడు విడిగా జరుగుతాయి. వీటికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని నామకరణం చేశారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అగ్రనేతల గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. జీ20 నేతలంతా రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీకి ఘన నివాళులు అర్పించనున్నారు. ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, సమ్మిళిత వృద్ధి, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణంలో పెను మార్పులు, గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర కీలక అంశాలు నేతల మధ్య భేటీలో చర్చకు రానున్నాయి. మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ సహా ఇతర దేశాల నేతలు, ఈయూ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఓఈసీడీ, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు హాజరుకానున్నారు. -
బడ్జెట్ టైమ్: ఆర్థిక భారతానికీ టీకా వేస్తారా?
ఒక్క నెల జీతం ఆగితేనే ఆరిపోయే బతుకులు!! మరి ఏడాది పాటు జీవితాలే ఆగిపోతే!!? ఊహలకే అందని ఈ విలయాన్ని... కోవిడ్ నిజం చేసింది. వేల మంది ప్రాణాలు పోయాయి. కోట్ల మంది జీవచ్ఛవాలయ్యారు. కుటుంబపెద్దలు పోయి... కుటుంబాలు వీధినపడ్డాయి. ఆర్థిక రథ చక్రాలు తునాతునకలైపోయాయి. మళ్లీ ఇవి గాడినపడేదెప్పుడు? ఆర్థిక మంత్రి ఈ రోజున ప్రవేశపెట్టే బడ్జెట్... గతేడాది గాయాలకు ఎలాంటి మందు వేస్తుంది? కోవిడ్ కొందరి సంపద పెంచి ఉండొచ్చు. అంబానీ, అదానీ లక్షల కోట్లకు ఎగబాకి ఉండొచ్చు. కానీ కోట్ల మంది అత్యంత విషాదకరమైన ఆర్థిక విష వలయాన్ని చూశారు. స్కూళ్లు మూసేయటంతో.. పాఠాలు చెప్పే టీచర్లు... ఆయాలు... అద్దెలు కట్టలేని చిన్నచిన్న యాజమాన్యాలు... పిల్లల్ని తీసుకెళ్లే ఆటోడ్రైవర్లు... ఈ వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వండి వడ్డించేవారికి తిండిలేదు. థియేటర్లలో సినిమా చూపించేవారు నిజమైన హర్రర్ ఫిల్మ్ చూశారు. చిన్నచిన్న కంపెనీలు, మాల్స్, షాపులు, క్యాబ్‌లు, సెలూన్లు... వీటి చుట్టూ అల్లుకున్న చిరు ఆర్థిక వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయి. చదవండి: (స్కూల్ బెల్ నేటి నుంచే..) కూలీలు, తోపుడు బళ్లు, ఇంటిపని వాళ్లే కాదు... పడుపు వృత్తిలో ఉన్నవారు సైతం స్వచ్ఛంద సంస్థల దానధర్మాలపై ఆధారపడక తప్పలేదు. కోట్ల మందికి పిడికెడు బియ్యం కూడా పుట్టని ఈ మహా విలయాన్ని ఇవ్వాళ ప్రవేశపెట్టే ఒక్క.. బడ్జెట్టూ ఏ మేరకు సరిచేయగలదు? ఇవేమీ ఒక్కరోజులో మానిపోయే గాయాలు కాదు. కానీ మందు వేయటం తప్పనిసరి. కాస్త త్వరగా తగ్గే మందు వేయాలి. లోపల గాయం ఇంకొన్నేళ్లు పచ్చిగానే ఉండొచ్చు. నొప్పి బాధయినా ఉపశమించాలి కదా? అందరి ఆశా అదే... అందరి చూపూ ఆర్థిక మంత్రి వైపే!!. సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2021–22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు నేరుగా లబ్ధి కలిగేలా కేంద్ర బడ్జెట్ ఉండాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా తమ విజ్ఞప్తులను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగు ణంగా రాష్ట్రాలకు స్పెషల్ గ్రాంటుల మంజూరు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, రుణాలు సమకూర్చుకునే విషయంలో కొం త సరళంగా ఉండాలని కోరుతున్న రాష్ట్రం... ‘తెలుగింటి కోడలు’ ఈసారి ప్రవేశపెట్టే పద్దులో ఆ విజ్ఞప్తులు ఎంత మేరకు నెరవేరుతాయోననే ఉత్కంఠతో ఉంది. పింఛన్ సాయం పెంపు, కేంద్ర ప్రాయోజిత పథ కాల (సీసీఎస్) అమ లులో రాష్ట్రాలకు స్వేచ్ఛ, కేంద్రం విధించే సెస్‌ల తగ్గింపు, జీఎస్టీ పరిహారం పూర్తి స్థాయిలో చెల్లింపు లాంటి అంశాలు కరోనా కష్టకాలంలో ఊరట కలిగిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని అంశాలపై తమ ప్రతిపాదనలను వివరిస్తూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నిర్మలా సీతారామన్‌కు ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలపై కేంద్ర బడ్జెట్లో స్పందన ఎలా ఉంటుందన్న దానిపైనే వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లెక్క ఆధారపడి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ►ఆర్థిక సంఘాలు చేసే సిఫారసుల ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చే ఆనవాయితీ చాలా కాలంగా వస్తోంది. కానీ 2020–21 బడ్జెట్ సందర్భంగా కేంద్రం ఈ ఆనవాయితీని పక్కన పెట్టింది. దీంతో కేంద్ర పన్నుల వాటాల్లో తగ్గుదలను భర్తీ చేసేందుకు దేశంలోని మూడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు స్పెషల్ గ్రాంట్లు ఇవ్వాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు అమలు కాలేదు. ఈ కారణంగా రాష్ట్రానికి రూ. 723 కోట్ల నిధులు రాలేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసును పరిగణనలోకి తీసుకుని వెంటనే ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. ఆర్థిక సంఘం పరిమితి ముగిసే వరకు ఈ ఆనవాయితీని కొనసాగించాలి. లేఖలో హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తులు ►సెస్‌లు, సర్‌చార్జీల రూపంలో కేంద్రం వివిధ వినియోగ వస్తువులపై విధిస్తున్న పన్నులను కేంద్ర పన్నుల వాటాలో కలపడం లేదు. దీంతో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గిపోతోంది. సెస్, సర్‌చార్జీలు విధిస్తున్న వాటిలో ఎక్కువగా రాష్ట్రాల జాబితాలోవే ఉన్నాయి. దీంతో రాష్ట్రాలకు ఉన్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి తగ్గిపోతోంది. ఈ ఏడాది నుంచి అయినా సెస్‌లు, సర్‌చార్జీలను రాష్ట్రాలకు వాటా కల్పించే పన్ను మొత్తంలో కలపడానికి కేంద్రం శ్రీకారం చుట్టాలి. ►కరోనా కష్టకాలంలో రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కలిగేందుకు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు అనుమతించే మొత్తంతోపాటు జీఎస్డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునే అవకాశాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలి. ►ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్ 94 (2) ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. దీని ప్రకారం ఏటా రాష్ట్రానికి రూ. 450 కోట్లు రావాలి. 2019–20, 2020–21 సంవత్సరాలకు జిల్లాల వారీగా ఇచ్చే ఈ నిధులు కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదు. వాటిని వెంటనే మంజూరు చేయడంతోపాటు రానున్న ఐదేళ్ల పాటు కూడా ఈ సాయాన్ని కొనసాగించాలి. ►స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు వర్తింపజేస్తామని 2020–21 బడ్జెట్లోనే చెప్పినా ఇప్పటికీ 50 శాతం జిల్లాలకే వర్తింపజేస్తున్నారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు ఇప్పటికైనా అమలు చేయాలి. ►జీఎస్టీ పరిహారాన్ని ఎలాంటి నిబంధనలూ లేకుండా రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. కేంద్ర పన్నుల్లో వాటాఏటా పెరిగేలా బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టాలి. ►జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ) కింద పింఛన్ కోసం నెలకు రూ. 200 మాత్రమే ఇస్తున్నారు. పేదల అవసరాలు తీర్చేందుకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ఈ బడ్జెట్ నుంచి అయినా దీన్ని రూ. 1,000కి పెంచాలి. ►కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలని కేంద్రం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘం 2016లోనే నిర్ణయించింది. దీని ప్రకారం కేంద్ర పథకాల కింద వచ్చే నిధులను రాష్ట్రం అమలు చేసే ఇతర సంక్షేమ పథకాలకు మరల్చుకునే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇవ్వాలి. కానీ ఇది అమలు కావడం లేదు. ఈ బడ్జెట్లో అయినా ఆ ప్రతిపాదనకు మోక్షం కలిగించాలి. -
అనుకున్నట్లుగానే జరగాలనుకుంటున్నాం
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) టోక్యో ఒలింపిక్స్ షెడ్యూలు ప్రకారమే జరగాలని ఆశిస్తోంది. ప్రాణాంతక వైరస్ కోవిడ్–19 ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ మెగా ఈవెంట్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో అప్పటివరకు వైరస్ నియంత్రణలోకి రావొచ్చని ఐఓఏ భావిస్తోంది. జరిపి తీరాలనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయానికి ఒకరకంగా ఐఓఏ మద్దతు పలుకుతోంది. ఐఓసీ, టోక్యో గేమ్స్ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అత్యవసర సమావేశంలో ఒలింపిక్స్ నిర్వహణ దిశగానే అడుగులు వేస్తామని ఐఓసీ స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు అసాధారణ నిర్ణయాలేవీ (రద్దు, వాయిదా) తీసుకోలేమని కూడా చెప్పింది. దీంతో కొందరు చాంపియన్ అథ్లెట్లు తీవ్రంగా స్పందించారు. అథ్లెట్లు, ప్రజారోగ్యం పట్టదా అని ఐఓసీపై మండిపడ్డారు. అయితే ఐఓఏ మాత్రం నిర్వహణ నిర్ణయానికి మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ‘కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించడం నిజమే... కానీ ఒకట్రెండు నెలల్లో ఈ వైరస్ అదుపులోకి రాగలదని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే కరోనా పుట్టిన చైనాలోనే నియంత్రణలోకి వచ్చేసింది. దీంతో మిగతా దేశాల్లోనూ అప్పటిలోగా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఒలింపిక్స్ కూడా ఎలాంటి అడ్డంకుల్లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భావిస్తున్నాం’ అని సీనియర్ ఐఓఏ అధికారి ఒకరు వివరించారు. ఐఓసీ తమకు మాతృ సంస్థ అని, తప్పకుండా ఐఓసీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల భారత అథ్లెట్ల సన్నాహకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని... అయినప్పటికీ మెగాఈవెంట్లో రెండంకెల పతకాలు సాకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఒలింపిక్ సంఘం సంబంధిత సమాఖ్యలతో, అథ్లెట్లతో టచ్‌లో ఉందని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తాము నడుచుకుంటున్నట్లు తెలిపారు. -
ఆ దర్శకుడిపై నమ్మకం పోయింది
ఆ దర్శకుడిపై నమ్మకం సన్నగిల్లిపోయిందనే అభిప్రాయానికి నటి అనుష్క వచ్చిందా? దీనికి సినీ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ స్వీటీలోని అందం, అభినయం ఏది బెటర్ అంటే రెండూ పోటీ పడతాయనే చెప్పాలి. ఇటీవల అనుష్క నటించిన రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు మచ్చుక అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందీ అన్న ప్రశ్న తలెత్తవచ్చు. అయితే అంత పేరున్న అనుష్క భాగమతి చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలం అయినా మరో చిత్రానికి కమిట్ కాలేదు. దీంతో ఆమె గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని, కారణం పెళ్లికి సిద్ధం అవడమేనని, ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువగానే ఉంది లాంటి అవాస్తవ ప్రచారాలు జోరుగానే సాగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే అనుష్కకు చాలా అవకాశాలు వస్తున్నాయట. వాటిలో కొన్ని కథలను వింటున్నారట.అయితే భాగమతి చిత్ర ప్రమోషన్ సందర్భంలోనే అనుష్క చాలా అవకాశాలు వస్తున్నా, ఒక్క గౌతమ్‌మీనన్ చిత్రం మినహా ఏ చిత్రాన్ని అంగీకరించలేదని చెప్పింది. ఆమె ఆ విషయం చెప్పి చాలా కాలమైంది. గౌతమ్‌మీనన్ కూడా ఒక మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు, అందులో నటి అనుష్క నటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పుటి వరకూ ప్రారంభం కాలేదు. గౌతమ్‌మీనన్ ధనుష్ హీరోగా ఎన్నైనోకి పాయు తూట్టా, విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం చిత్రాలను పూర్తి చేసే పనిలోనే ఉన్నారు. తదుపరి శింబు హీరోగా విన్నైతాండి వరువాయా–2 చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన చిత్రం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అనుష్క ఓపిక నశించడంతో పాటు, దర్శకుడు గౌతమ్‌మీనన్‌పై నమ్మకం సన్నగిల్లిందట. దీంతో ఈయన చిత్రం కోసం ఇంకా వేచి చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చిందన్నది తాజా సమాచారం. అంతే తనతో చిత్రాలు చేస్తామన్న దర్శక నిర్మాతలను పిలిచి కథలు రెడీ చేసుకుని త్వరలో ఆ చిత్రాల వివరాలను ప్రకటించండి అని చెప్పారట. -
కమల విలాపం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ పార్టీల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండే పార్టీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలతో హంగామా సృష్టిస్తాయి. అయితే, జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పరిస్థితి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఒకప్పుడు ఎంతో హంగామా సాగించిన కమలం పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం కొట్టుమిట్టాడుతుండడం గమనార్హం. పార్టీ సీనియర్ నేతల వ్యవహార శైలి కారణంగా కొత్త నేతలు వచ్చి చేరేందుకు విముఖత చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఉన్న కొద్ది మంది నేతల్లో కూడా గ్రూపు తగాదాల కారణంగా పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే సాధారణ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే నాయకుల కోసం వెతకాల్సిన పరిస్థితి నెలకొనేలా కనిపిస్తోంది. గతంలో ఊపు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో బీజేపీ హవా కొనసాగింది. ఈ పార్టీ నేతలు సర్పంచ్‌లు మొదలుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో సైతం బలమైన పోటీ ఇచ్చి కొన్ని స్థానాల్లో విజయం సాధించారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీగా జితేందర్‌రెడ్డి 1999లో కమలం గుర్తుపైనే పోటీ చేసి గెలుపొందారు. అలంపూర్ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉన్నప్పుడు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి సైతం ఈ పార్టీ తరఫునే పోటీకి దిగి గెలుపొందారు. అలాగే కొన్ని మున్సిపాలిటీలను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నది. గతంలో గద్వాల మున్సిపల్ చైర్మన్, ఇటీవలి కాలం వరకు నారాయణపేట మున్సిపల్ కుర్చీ బీజేపీ ఖాతాలో ఉండేది. అదే విధంగా తెలంగాణ ఉద్యమకాలంలో మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇలా మొత్తం మీద పాలమూరు ప్రాంతంలో బీజేపీకి ఘనమైన చరిత్రే ఉంది. ముగ్గురు నేతలదే హవా.... సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. పాలమూరు ప్రాంతంలో కేవలం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోనే ఆశలున్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉంది. అయితే మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో సీనియర్ నేతలుగా చెలామణి అవుతున్న ముగ్గురి చేతుల్లోనే పార్టీ బందీగా మారిందనే ప్రచారం ఉంది. ఆ ముగ్గురు నేతలు ఏం చెబితే అదే జిల్లా పార్టీకి దిశా, నిర్దేశంగా మారింది. ఒక వేళ వారిని కాదని ఎవరైనా ముందడుగు వేస్తే పదడుగుల దూరం పెడుతు న్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిని కాదని కనీసం ప్రెస్‌మీట్ పెట్టే పరిస్థితి కూడా లేదని నేతలు వాపోతున్నారు. వీరి ఆగడాలు శృతిమించడంతో ఒక ప్రధాన విభాగానికి బాధ్యులుగా ఉన్న వ్యక్తి రాజీనామా సైతం చేసినట్లు సమాచారం. దీంతో ఆగమేఘాల మీద సదరు నేతకు నచ్చజెప్పి రాజీనామాను ఉపసంహరింప చేశారు. అంతేకాదు పార్టీపై అభిమానంతో బలోపేతం చేద్దామని ద్వితీయశ్రేణి నాయకులెవరైనా ముందుకొస్తే నీరుగార్చే చర్యలు అవలంభిస్తారనే ప్రచారం ఉంది. ఇలా వీరి ఆధిపత్యం కారణంగానే ద్వితీయశ్రేణి నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో ఏ ఒక్క ని యోజకవర్గంలోనూ ఆశించిన స్థాయి లో పార్టీ పుంజుకోవడం లేదని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం విషయానికొస్తే పార్టీ పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్నట్లు చెబుతుండగా.. కేడర్‌లో అయోమయం నెల కొంది. అలాగే దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి ఎగ్గని నర్సింహులుకు పార్టీ కేడర్ అంతగా సహకరించడం లేదని చెబుతారు. మక్తల్ నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత కొండన్నకు తాజాగా వర్కటం జగన్నాథరెడ్డి పోటీకి వచ్చేశారు. ఇలా ఎక్కడిక్కడ గ్రూపు తగాదాల కారణంగా పార్టీ రోజురోజుకు బలహీనపడుతుందనే విమర్శలున్నాయి. పోరాటాలేవి? పాలమూరు ప్రాంతంలో గతమెంతో ఘన చరిత్ర అన్నట్లుగా చెప్పుకునే బీజేపీ పరిస్థితి ప్రస్తుతం దయనీయం గా తయారైంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఇప్ప టి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి బీజే పీ నిర్మాణాత్మకమైన పోరా టాలు చేసిన దాఖలాలు లేవని పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ప్రజల పక్షాన గట్టి గొంతు వినిపించడంలో నేతలు విఫలమవుతున్నారనే విమర్శలున్నా యి. గతంలో జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మార్చి నెలలో ప్రజా ఉద్యమాలను పాలమూరు నుంచే శ్రీకారం చుడుతామని చెప్పారు. కానీ మార్చి పోయి ఏప్రిల్ వచ్చినా ఇప్పటి వరకు ఆదిశగా ఆలోచనలే చేయడం లేదు. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పార్టీ తరఫున ప్రజా సమస్యలపై ఉద్యమాలకు నేతలు శ్రీకారం చుట్టడం లేదు. దీంతో కింది స్థాయి కేడర్ నైర్యాశంలో కొట్టుమిట్టాడుతోంది. గతంలో నాగం జనార్ధన్‌రెడ్డి మాత్రమే పార్టీ తరఫున ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేసేవారు. ప్రస్తుతం ఆ స్థాయిలో పాలనా పరమైన లోపాలపై విమర్శించడంలో నాయకత్వం విఫలమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లారనే ఆందోళన ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పట్టి పీడిస్తోంది. ఒక్కరిద్దరు నేతలే.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సంబంధించి గుర్తింపు కలిగిన నేతలను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఈ ప్రాంతానికి చెందిన... రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన నాగం జనార్ధన్రెడ్డితాజాగా పార్టీకి గుడ్‌బై చెప్పడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి కల్వకుర్తి నియోజకవర్గం కాస్త మెరుగ్గా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నా రు. కల్వకుర్తి గడ్డ మీద కాషాయం జెండా ఎగురవేయడానికి మూడు, నాలుగు పర్యాయాలుగా పార్టీ సీనియర్‌నేత టి. ఆచారి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో అతితక్కువ మెజార్టీతో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కారణంగానే నియోజకవర్గంలో పార్టీ కాస్తంత బలంగా ఉంది. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు వచ్చే సరికి పరిస్థితి అయోమయంగా తయారైంది. సీనియర్ నేత నాగం పార్టీకి గుడ్‌బై చెప్పడంతో పార్టీ జెండా ఎత్తే నాథులే కరువయ్యారు. అలాగే కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జగదీశ్వర్‌రావు కూడా నాగం దారిలో వెళ్తుండడంతో పరిస్థితి దయనీయంగా మారింది. అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చే సరికి బల్మూరు కు చెందిన మల్లేశ్వర్ కొంత కాలంగా పోరాడుతున్నారు. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎన్నారై కొత్త ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉన్నారు. అదే విధంగా గద్వాల నియోజకవర్గంలో ఉన్నంతలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే కాస్తంత పోరాట పటిమ కనబరుస్తున్నారు. ఇక అలంపూర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఒకప్పుడు బీజేపీ జెండా ఎగిరిన చరిత్ర ఉన్నా.. ప్రస్తుతం పోటీ చేసే నాయకులే కరువయ్యారు. -
నిరుద్యోగుల ఆశలపై సర్కార్ లంచం నీళ్ళు
-
ఆశలు వర్షార్పణం
వర్షానికి దెబ్బతిన్న పంటలు గోరంట్ల, బుక్కపట్టణం మండలాల్లో అరటి, మామిడికి నష్టం బుక్కపట్టణం మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షం అన్నదాతల ఆశలను చిదిమేసింది. భూగర్భజలాలు అంతంతమాత్రంగానే ఉన్న జిల్లాలో ప్రకృతికి ఎదురు నిలిచి సాగుచేసిన రైతన్నల కష్టాన్ని నేలపాలుచేసింది. మంగళవారం జిల్లాలో కురిసిన వర్షంతో పంటలకు నష్టం వాటిల్లగా..పిడుగుపాటుతో బుక్కపట్టణం మండలం కొత్తకోట గ్రామంలో జయచంద్ర (21) అనే విద్యార్థి మృత్యువాత పడ్డారు. నేల రాలిన మామిడి అకాల వర్షంతో పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువు గ్రామంలో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఎకరాలపైగానే మామిడి పంటకు నష్టం వాటినట్లు తెలుస్తోంది. ఇక గోరంట్ల మండలం కసిరెడ్డిపల్లి గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వాన పడటంతో రైతు సదాశివరెడ్డికి చెందిన కాకర పంట నాశనమైంది. మొత్తమ్మీద మంగళవారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలో అత్యధికంగా 45 మి.మీ వర్షపాతం నమోదు కాగా రొద్దం 35 మి.మీ, పరిగి 25 మి.మీ, సోమందేపల్లి 20 మి.మీ, కొత్తచెరువు, తాడిపత్రి, గోరంట్లలో 15 మి.మీ, పెనుకొండ, తనకల్లు, పుట్లూరు మండలాల్లో 10 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. ఆయా గ్రామాల్లో అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ముదిగుబ్బ, చెన్నేకొత్తపల్లి, శింగనమల, నార్పల, తాడిమర్రి, బుక్కపట్టణం, మడకశిర, యల్లనూరు, చిలమత్తూరు, లేపాక్షి, ఓడీ చెరువు తదితర మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. -
తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఆశలు ?
-
ఏం చేస్తారో?
నేడు పొగాకు బోర్డు సమావేశం రైతుల ఆశలన్నీ సమావేశం పేనే మర్రిపాడు: రాష్ట్రంలో 2016–17 పంట కాలానికి రైతులకు పొగాకు పండించేందుకు అనుమతులు, పొగాకు పంట పరిస్థితి, గిట్టుబాటు ధరలపై బుధవారం గుంటూరులో పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుండటంతో రైతుల ఆశలన్నీ సమావేశంపైనే ఉన్నాయి. పరిస్థితేంటంటే 2015–16 పంట కాలంలో దక్షిణ ప్రాంత తేలిక నేలలైన (ఎస్ఎల్ఎస్) ప్రాంతంలోని పొదిలి, కందుకూరు, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో ఒక్కో బ్యారెన్‌కు 3400 కిలోలు పొగాకు పండించేందుకు అనుమతి ఇచ్చారు. అయినా అధిక శాతం రైతులు నష్టాల పాలయ్యారు. మార్కెట్లో ధరలు అంతంత మాత్రం ఉండడంతో రైతుల బాగోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా పొగాకు పంటపై శీతకన్ను వేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాదైనా పరిస్థితి మారుతుందా? ఈ ఏడాది ప్రస్తుతం పొగాకు పంట అదును సమీపిస్తుండడంతో రైతుల పరిస్థితి ఏమిటోనంటూ సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి కలిగిరి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు రైతులు పంట పండించేందుకు విస్తీర్ణం తగ్గిస్తారని, అంతే కాకుండా పొగాకు పంటకు అనుమతి కూడా తగ్గిస్తారని ప్రచారం సాగుతుండడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. 3400 కిలోలు బ్యారెన్‌కు అనుమతిస్తేనే గిట్టుబాటు కావడం లేదని, ఇంకా తగ్గిస్తే గిట్టుబాటు కాక పొగాకు పంటను సరిపెట్టుకోవాల్సి వస్తుందంటూ పలువురు రైతులు పేర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పొగాకు పంటను తగ్గించాలనే ఆశయంతోనే పొగాకు బోర్డుపై ఒత్తిడి తెచ్చి రైతులు పంట పండించేందుకు అనుమతి కూడా ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది పంట అనుమతి తగ్గిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల కనికరం చూపి పంట అనుమతిని తగ్గించుకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
చిగురించిన ఆశలు
దేవరకొండ వరుణుడు ఎట్టకేలకు మళ్లీ పలకరించాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు విత్తనాలు విత్తుకున్న రైతుల ఆశలు మంగళవారం, బుధవారం కురి సిన వర్షాలతో చిగురించాయి. విత్తనాలు విత్తన నాటి నుంచి వరుణుడు ముఖం చాటెయ్యడంతో పంట చేలు వాడుబట్టాయి. కొన్ని చోట్ల అసలు విత్తనాలు మెులవనేలేదు. ఈ ఏడాది కరువు తప్పదనుకుని నిరాశలో ఉన్న రైతన్నకు వరుణుడు కరుణించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు మెులవని చోట మళ్లీ పనిలో పడ్డారు. ఇదే రీతిలో ఒకటి రెండు పెద్ద వానలు పడితే కరువు నుంచి బయటపడవచ్చని రైతులు పేర్కొంటున్నారు. హరితహారం మొక్కలకు జీవం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొని మొక్కలు నాటుతున్నా వర్షాలు లేకపోవడంతో నాటిన మొక్కలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఎండిపోతున్నాయి. ఇది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు కాపాడుకోవడానికి ఫైర్ ఇంజన్ల సహాయంతో మొక్కలకు నీళ్లు పోసి కాపాడాలని అధికారులను ఆదేశించారు. అయినా ఫైర్ ఇంజన్లకు సైతం నీళ్లు లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేని దుస్థితి. కాని గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హరితహారంలో నాటిన మొక్కలకు జీవం పోసినట్లయింది. 7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు ఖరీఫ్ సీజన్ మొదటి నుంచి జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ దేవరకొండ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు చుక్క వర్షం కూడా కురవని పరిస్థితి నెలకొంది. రైతులంతా తొలకరి వర్షాలకే పత్తి, ఇతర పంటలను విత్తుకోగా వాటికి జీవం లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. చాలా ఎకరాల్లో పంటలు కూడా ఎండిపోయాయి. ఈ పరిస్థితికి రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో జిల్లాపరిషత్ చైర్మన్ బాలునాయక్ చందంపేట మండలం పెద్దమునిగల్ ముత్యాలమ్మ దేవాలయంలో వర్షాలు కురిస్తే మొక్కు చెల్లించుకుంటానని ప్రత్యేక పూజలు చేయడం, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఈనెల 31న దేవరకొండ పట్టణంలోని శివాలయంలో వరుణయాగం తలపెట్టడం నియోజకవర్గంలో కరువు పరిస్థితికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. ఇకపోతే గ్రామాలలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం పరిపాటి అయ్యింది. దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా 7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
మార్కెట్ లో సన్ టీవీ మెరుపులు
చెన్నై: తమిళనాడులో అధికార పగ్గాలు డీఎంకే కే అన్న ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో సన్ టీవీ షేర్లు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రతిపక్ష డిఎంకెకు సానుకూలంగా రావడంతో మంగళవారం నాటి మార్కెట్ లో సన్ టివి నెట్ వర్క్ లిమిటెడ్ షేర్లు మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. 9.5 శాతానిపై గా లాభంతో 430 రూ. దగ్గర ట్రేడవుతూ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తప్పదని తేలడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు ఈ పేరు జోరును మరింత కొనసాగించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ క్రమంలో 540రూ.లకు షేర్ విలువ చేరితే, 560కి చేరే అవకాశాలున్నాయని. ఈ స్థాయిని కూడా దాటి నిలదొక్కుకొని, కొనుగోళ్ల మద్దతు లభిస్తే మరింత లాభపడే అవకాశం ఉందని తెలిపారు. ఒక వేళ 560 స్థాయి దగ్గర బలంగా లేకపోతే అప్రమత్తంగా ఉండాలని విశ్లేష్లకులు సూచిస్తున్నారు. అధికార పార్టీకి 103 సీట్లు తగ్గుతాయని, డీఎంకె, కాంగ్రెస్ కూటమి 120 సీట్లకు పైగా కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధిపతి కరుణా నిధి (90) సీఎం పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. మార్చి త్రైమాసికంలో లాభాలను సాధిస్తుందనే అంచనాల నేపథ్యంలో కూడా సన్ టీవీపై మదుపర్లు దృష్టి సారించారని విశ్లేషకులు భావిస్తున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ క్యూ 4 ఫలితాలు కూడా సన్ టీవీ లాభాలకు నమూనాగా ఉంటాయని, ఇది కూడా స్టాక్ ధరలు పెరగడానికి కారణమని ఏంజిల్ బ్రోకింగ్ చెందిన మయురేష్ జోషి చెప్పారు.కాగా చెన్నైకు చెందిన సన్ టీవీ కి డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి మనవడు కళానిధి మారన్ అధిపతిగా ఉన్న సంగతి తెలిసిందే. -
అయినవాళ్లు రోడ్డున పడేస్తే...
నైజీరియాలో మంత్రగాడి పేరుతో బహిష్కరణకు గురైన పసివాడిని ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఆఫ్రికాలో అనాథ బాలల కోసం స్వచ్ఛంద సంస్థ స్థాపించిన అంజా రింగ్రెన్ లోవెన్ ఎంతో కష్టపడి మరీ ఆ పిల్లాడిని వెదికి పట్టుకుంది. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ బాలుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఎముకల గూడులా మారి, నిస్సహాయంగా దొరికిన చిన్నారి మొఖంలో నవ్వులు పూయించింది. వివరాల్లోకి వెళితే నైజీరియాలో మంత్రగాడు అనే నెపంతో ఓ పసి బాలుడిని కుటుంబసభ్యులు రోడ్డున పడేశారు. సుమారు ఏడాదిన్నర వయసు ఉన్న ఆ పిల్లాడిని ఆకలితో మాడ్చి చంపేయాలని అలా మూర్ఖంగా వదిలేశారు. చంటి బిడ్డ అలా రోడ్డున తిరుగుతున్నా... ఏ ఒక్కరూ జాలి పడలేదు. సరికదా మంత్రగాడంటూ దుర్భాష లాడుతూ, అమానుషంగా ప్రవర్తించారు. అలా ఎనిమిది నెలల నుంచి నడిరోడ్డుపై జీవనం సాగించిన ఆ చిన్నారి అష్టకష్టాలు పడ్డాడు. కడుపు నింపుకోవడం కోసం రోడ్డు మీద ఏది పడితే అది తిన్నాడు. ఫలితంగా కడుపంతా నులి పురుగులు పట్టాయి. రక్త ప్రసరణ సన్నగిల్లింది. ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయి శరీరమంతా విషమయంగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లోవెన్ ఆ పిల్లాడిని వెతికి పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టి చివరికి సాధించింది. చిక్కి శల్యమై ఎముగల గూడులా మారిన ఆ చిన్నారిని చేరదీసి 'హోప్' అని పేరు పెట్టింది. సపర్యలు చేసి స్నానం చేయించి... ఆసుపత్రిలో చేర్చింది. దీంతోపాటుగా బాలుడి సహాయార్ధం లోవెన్ సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్థిక సాయాన్ని అర్ధించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. రెండు రోజుల్లో ... పదిలక్షల డాలర్లు సమకూరాయి. 'ఇపుడు హోప్ నవ్వుతున్నాడు.. తనకు తానుగా కూర్చుంటున్నాడు. నా కొడుకుతో ఆడుకుంటున్నాడంటూ' లోవెన్ తన సంతోషాన్ని ఫేస్బుక్ ద్వారా పంచుకుది. కాగా 'ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ పౌండేషన్ ' అనే సంస్థను స్థాపించిన లోవన్ గత మూడేళ్లుగా తన సేవలందిస్తోంది. భర్త డేవిడ్ ఇమ్మానుయేల్ ఆమెకు పూర్తిగా అండగా ఉన్నారు. 2016, జనవరి 29న ఆ బాలుడి ఆచూకీ కనుక్కొని లోవెల్ చేరదీసింది. ఆ రోజు నుంచి అతడిని కంటికి రెప్పలా కాపాడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు హోప్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడినట్టు లోవెన్ ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. తనంతట తాను ఆహారం తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది. కాగా ఆఫ్రికా దేశాల్లో చాలాచోట్ల ఇలాంటి అనాగరిక అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వేలాదిమంది హోప్ లాంటి పిల్లలు వీధి పాలవుతున్నారు. -
విశ్వసనీయత సరే.. తీరని ఆశల మాటేమిటి?
అవలోకనం బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు. మరి ప్రధాని మోదీ మాటేమిటి? దశాబ్దాల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, విశ్వసనీయమైన భారత నేతగా నరేంద్ర మోదీ తన స్థానాన్ని దృఢపర్చుకున్న సంవత్సరం 2015. ఇందిరా గాంధీ హయాంలోనే కాదు.. జవహర్లాల్ నెహ్రూ కాలంలో కూడా ఇంత ప్రజాదరణను, ఇంత జనాకర్షణను పొందిన నేతను మనం చూడలేదు. మహత్తర మార్పును వాగ్దానం చేస్తూ మోదీ అధికారంలోకి వచ్చారు. అయితే ఇంతవరకూ ఆ మార్పు జరగలేదు. నిజమే. మోదీ పాలనలో భారీ అవినీతి కుంభకోణాలపై చాలా తక్కువ కథనాలే వచ్చాయి. కానీ, మన్మోహన్ సింగ్ పాలన కంటే, అంతకు క్రితం పాలించిన వారికంటే మోదీ పాలనలో భారత్ ఏమైనా విభిన్నంగా ఉందా? అధికారం చేపట్టినప్పుడు మోదీ ప్రారంభించిన కీలకమైన పథకాలు పరిశీ లకులనే నివ్వెరపరిచాయి. స్వచ్ఛభారత్ అనేది మరుగుదొడ్లను నిర్మించడానికి సంబంధించి దశాబ్దాలుగా అమలులో ఉన్న పథకాలకు పేరు మార్పిడీయేనా? అయితే మంచిదే. కానీ ప్రధాని చీపురు చేపట్టి వీధులను ఊడ్చారు. అంటే స్వచ్ఛ భారత్ కేవలం పరిశుభ్రతకు సంబంధించిందీ, ఆరోగ్యంగా ఉండవలసిందిగా భారతీయులను ప్రోత్సహించేదీ మాత్రమేనా? అదే అయితే సామాజిక సంస్కరణ చేయడమే ప్రభుత్వ విధి అని చెప్పవచ్చా? కుటుంబ నియంత్రణను ప్రోత్సహిం చడం, మద్యనిషేధం అమలు, ఆడ శిశువుల హత్యలను నిరోధించడం వగైరా రూపాల్లో ప్రభుత్వం ఇప్పటికే సామాజిక సంస్కరణను చేపట్టిందని ఎవరైనా వాదించవచ్చు. కానీ వాటితో పోలిస్తే పరిశుభ్రత అనేది తగ్గు స్థాయికి సంబంధిం చింది. స్వచ్ఛ భారత్ ఉద్దేశం అర్థవంతమైనదే అయినప్పటికీ, పన్ను రాబడిపై ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. పైగా, పదేళ్ల మన్మోహన్ సింగ్ హయాంతో పోలిస్తే, సగటున ఆర్థిక వ్యవస్థ మందకొడి దిశగా వృద్ధి చెందుతోంది. ప్రభుత్వ చెల్లింపుల షీట్‌ను బలోపేతం చేయడానికి, పూర్తిగా పతనమైన ముడి చమురు ధరలను మోదీ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. లేకుంటే ఆర్థిక వ్యవస్థ నీరసించిపోయేది. తన వేగ వృద్ధి వల్ల కాకుండా చైనా వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పేరు పొందుతోంది. మోదీ ప్రకటించిన భారీ పారిశ్రామిక విధానం మేక్ ఇన్ ఇండియా ఒక అద్భు తమైన లోగో. ఎంతో అట్టహాసంగా దీన్ని ప్రారంభించారు కానీ ఇక్కడ కూడా ఈ విధానం ఉద్దేశం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌తోపాటు అనేకమంది నిపుణులు సైతం వస్తూత్పత్తి రంగాన్ని చైనా నుంచి భారత్‌కు ఆకర్షించవచ్చన్న భావాన్నే తోసిపుచ్చారు. ఇక ప్రతీకాత్మకతకు సంబం ధించి చూస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం (వల్లభ్ భాయ్ పటేల్‌ది) గుజరాత్లో నిర్మిస్తామని ప్రకటించారు. కానీ దాన్ని చైనీయులు నిర్మించబోతు న్నారని తర్వాత తెలిసింది. మొట్టమొదటి భారత బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణం కోసం తేలికపాటి రుణాన్ని అందిస్తామని జపానీయులు ప్రతిపాదించారు కానీ, 99,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు వ్యయం గురించి నేను చదివిన ఏ ఆర్థికవేత్త కూడా ప్రస్తావించినట్లు లేదు. విదేశీ విధానానికి సంబంధించి, మోదీ రెండు కీలక అంశాలు పూర్తి చేశారు. అత్యంత భారీ జనాకర్షణ ద్వారా విదేశీ నగరాల్లోని ప్రవాస భారతీయులను ఆయన అద్భుతంగా సమీకరించారు. ఈ భారీ జన సమీకరణ ప్రయోజనం ఏమి టన్నది స్పష్టం కావడం లేదు. దీనికి సంబంధించిన పొందికయిన వివరణ బహుశా భవిష్యత్తులో రావచ్చు. ఇక పాకిస్తాన్ విషయంలో నా అంచనా ప్రకారం మోదీ ప్రభుత్వం గత 18 నెలల కాలంలో తన వైఖరిని కనీసం 9 సార్లు మార్చు కుంది. దౌత్య నిపుణులతో సహా ఏ ఒక్కరికీ పాకిస్తాన్ పట్ల భారత్ విధానం ఏమిటి లేక అసలు అలాంటి విధానం ఏమైనా ఉందా అనేది నిజంగానే తెలీటం లేదు. ఇప్పటికైతే మనం పాక్‌తో మళ్లీ చర్చిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇంతకు ముందే ఎందుకు చర్చించలేకపోయాం? లేక వచ్చే నెలలో మనం చర్చలు కొనసాగించగలుగుతామా? అని ఎవరూ చెప్పలేరు. ఎన్నికల ప్రచార సమయంలో మోదీ చేసిన కొన్ని వాగ్దానాలు మృదువుగా చెప్పాలంటే అసత్యాలుగా పరిణమించాయి. ఉదాహరణకు, నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ఆయన ప్రకటించారు. మరో ఉదాహరణ.. అవినీతి ఆరోపణలకు గురైన ఎవరినైనా తాను కాపాడబోనని మోదీ తేల్చి చెప్పారు. తన వ్యవహారశైలిని అలా పక్కనబెడితే, మోదీ అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నారు. పైగా తిరుగులేని జనాకర్షణ ఉంది కూడా. ఆయన రేటింగులు 75 శాతం మార్కును చేరుకుంటున్నట్లు పోల్ సర్వేలు నిత్యం సూచిస్తున్నాయి. అంటే బీజేపీయేతర ఓటర్లనుంచే ఆయనకు మద్దతు అధికంగా వస్తోందని దీని అర్థం. (జాతీయ ఓటులో బీజేపీకి దక్కింది 32 శాతమే). ఆయన నిజంగానే శక్తివంతు డిగా, అర్థవంతమైన నేతగా, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందారు. తన ఈ ప్రజాదరణనే మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ, ఆ ఎన్నికల్లో తన శక్తిమేరా ఆయన కృషి చేశారు. ఎన్నికల ప్రచారం పొడవునా ఆయన ఉపయో గించిన కటువైన పదజాలం ఫలితంగా కేంద్రాన్ని పనిచేయనివ్వడంలో ప్రతిపక్షం ఎలాంటి ప్రోత్సాహాన్ని అందివ్వలేదు. ఈ విషయంలో మాత్రం సోనియాగాంధీ కుటుంబం సంవత్సరం మొత్తం మీద పేలవమైన పనితీరునే ప్రదర్శించింది. పరాభవం నుంచి కోలుకోవడానికి స్పష్టమైన వ్యూహం వారికి లేకుండాపోయింది. తాము రంగంలో ఇంకా ఉన్నా మని చూపించుకునేందుకు వారు పార్లమెంటును అడ్డుకోవడం వంటి ఎత్తు గడలను ఉపయోగించారు. ఒక ఎత్తుగడగా ఇది బాగున్నా, ప్రధాని దార్శనికతకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించలేక ఇది అసంపూర్తిగానే మిగిలిపోయింది. బిహార్, గుజరాత్‌లలో ఆయన పార్టీ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నప్పటికీ మోదీ మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. వందకోట్లమందికి పైగా భారతీయులు ఆయనలో ఇంకా విశ్వాసాన్ని, ఆశను కలిగి ఉంటున్నారు. మోదీ పదేళ్లపాటు అధికారంలో ఉంటారని కశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నేత ముఫ్తీ మహమ్మద్ తేల్చి చెబుతున్నారు. ముఫ్తీ అభిప్రాయం నిజమే అయితే ప్రధానిగా 18 నెలల కాలం ఏమంత ముఖ్యమైనది కాదు. అయితే బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు. ఇది నిజమైతే, నవ్య భారత్‌ను రూపు దిద్దడానికి అసంపూర్ణమైన, చెదిరి పోయిన ఆవిష్కరణలను ప్రధాని మోదీ ప్రకటించడం కంటే తన ప్రజాదరణను, విశ్వసనీయతను ఉన్నత స్థాయిలో నిలుపుకోవడానికి ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: అకార్ పటేల్( aakar.patel@icloud.com) -
గ్రీడ్ ఈజ్ బ్యాడ్
సోల్ / దురాశ ఆశ నిరాశలు మానవ జీవితంలో సహజాతి సహజమే అయినా, ప్రాథమికంగా మనిషి ఆశాజీవి. ఆశాభంగాలు ఎదురైనప్పుడు వాటిల్లో నిరాశ నుంచి త్వరగా తేరుకుని, ఆశాదీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోగలిగే వాళ్లను ఆశావాదులంటారు. నిజానికి ఇలాంటి వాళ్లే కార్యసాధకులు. బతుకు మీద ఆశను అడుగంటించేసుకుని నిరంతరం నిరాశలో మునిగిపోయే వారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఇలాంటి నిరాశావాదులు తమ జబ్బును పక్కవాళ్లకూ అంటించేందుకు ప్రయత్నిస్తారు. నిరాశావాదులు మన పరిసరాల్లో ఉంటే కార్యసాధనలో మనమూ వెనుకబడిపోతాం. కాబట్టి వీళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే! ఆశావాదులు, నిరాశావాదుల సంగతి అలా ఉంచితే, లోకంలో కొందరు దురాశావాదులూ ఉంటారు. అన్నీ తమకే కావాలనుకుంటారు ఇలాంటి వాళ్లు. తాము ఆశించేదానికి తగిన యోగ్యత తమకు ఉందా లేదా అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇలాంటి వాళ్లే మరీ డేంజరస్ పీపుల్. వీళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం. సంతృప్తికి ఆమడ దూరం సామాన్యులు ఎంతసేపూ ఆశ నిరాశాల్లోనే కొట్టుమిట్టాడుతుంటారు. తమకు గల చిన్ని చిన్ని ఆశలు నెరవేరిపోతే చాలు తృప్తిగా జీవితాన్ని వెళ్లదీసేస్తారు. ఆశించినది దక్కకుంటే కొంతకాలం నిరాశలో మునిగినా, తిరిగి తేరుకుని తమ కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటారు. దురాశావాదులు అలా కాదు. ఆశాభంగములను వారెన్నడూ సహించజాలరు. ఆశించినది దక్కేంత వరకు కంటి నిండా నిద్రపట్టదు. షడ్రసోపేతమైన భోజనమూ రుచించదు. తమ ఆశాభంగాలకు కారణమని భావించే వారిపై నిష్కారణంగా పగ పెంచుకుంటారు. అదను చూసి వారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్లే రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఎదుటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కేసి మరీ పెకైదిగిపోతారు. యోగ్యతా సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా కోరుకున్నవి పొందడానికి వీళ్లు ఎంతకైనా తెగిస్తారు. దురాశాపరులు సంతృప్తికి ఆమడ దూరంలో ఉంటారు. ఎంతటి అయాచిత, అనాయాస లాభాలు సైతం వాళ్లకు సంతృప్తినివ్వలేవు. ఎంత సంపద పోగేసుకున్నా వీళ్ల నోటంట ‘ఇక చాలు’ అనే మాట చచ్చినా రాదు. ఇలాంటి దురాశాపరులకు పొరపాటున అధికారం దొరికిందంటే, ఇక అంతే సంగతులు! జనాలను యథేచ్ఛగా దోచుకుంటూ నియంతలుగా తయారవుతారు. దురాశా పురాణం ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల్లోను, పురాణాల్లోను దురాశ గురించిన ప్రస్తావన ఉంది. మన పురాణాలు దురాశనే ‘లోభం’గా పేర్కొన్నాయి. లోభాన్ని అరిషడ్వర్గాలలో ఒకటిగా పరిగణించాయి. దురాశ మహా పాపం అని కూడా పలు మతాలు ఉద్బోధించాయి. దురాశ వల్ల ఎన్ని సంపదలు సమకూరినా, మనశ్శాంతి మాత్రం ఉండదని హితవు పలికాయి. పోగాలము దాపురించినప్పుడు హితవచనాలేవీ రుచించవని ఆర్యోక్తి. దురాశ మితిమీరితే అది ఆత్మవినాశనాన్ని కూడా కొని తెస్తుంది. అతి లోభం... అంటే, మితిమీరిన దురాశ వల్ల దుర్యోధనుడు నాశనమైన ఉదంతాన్ని పురాణ ప్రవచనాలు చెప్పే వారందరూ ఉద హరిస్తూ ఉంటారు. అయితే, దురాశాపరులకు ఇలాంటివేవీ పట్టవు. పురాణాల్లోనే కాదు, చరిత్రలోనూ దురాశాపరుల గురించి చాలా ఉదాహరణలు దొరుకుతాయి. రోమన్ చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా పేరుమోసిన రోమన్ సేనాని మార్కస్ క్రాసస్, మంగోల్ నాయకుడు చెంగిజ్ ఖాన్, బురిడీ స్కీములతో జనాల నెత్తిన కుచ్చుటోపీ పెట్టి కోట్లు కొల్లగొట్టిన అమెరికన్ కేటుగాడు చార్లెస్ పొంజీ వంటి దురాశాపరులు జనాలను దారుణంగా దోచుకున్నారు. దురాశ వల్ల ఎన్నో అనర్థాలు మానవజాతికి అనుభవానికి వచ్చినా జనాభాలో దురాశాపరుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. యుగ ధర్మమా..? జనాల ఖర్మమా..? కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో కుంటి నడక నడుస్తుందని, అలాంటి ధర్మ‘సంకట’ కాలంలో లోకంలో దురాశాపరులు పెచ్చరిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి. పలువురు కాలజ్ఞానులు కూడా ఇదే విషయాన్ని బలపరచారు కూడా. మనుషుల్లో దురాశ మితిమీరడం యుగ ధర్మం అనుకుని సరిపెట్టుకోవాలో, ఇదంతా మన ఖర్మమని సరిపెట్టుకోవాలో తెలియని అయోమయావస్థ సామాన్యులకు మిగిలింది. ఆధునిక యుగంలో అన్ని రంగాలూ అధునాతనంగా పరిణమించినట్లే, దురాశ కూడా మరింత ఆధునికతను సంతరించుకుంది. ప్రజాస్వామ్యం చలామణీలో ఉన్న చోట్ల అయితే, మరీ సాఫిస్టికేటెడ్‌గా మారింది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న దేశాల్లో దురాశాపరుల్లో మెజారిటీ జనాలు రాజకీయాల్లో చేరి, యథేచ్ఛగా మూడు స్కీములు, ఆరు స్కాములతో ఆ విధంగా ముందుకు పోతున్నారు. ప్రజాస్వామిక దేశాల్లోనే దురాశాపరుల పురోగతి ఇలా ఉంటే, ఇక నియంతృత్వ రాజ్యాల సంగతి చెప్పేదేముంది? ఆధునిక యుగంలో దురాశాపరులు కూడా తెలివి మీరారు. ఉత్త దురాశతోనే ఉపయోగం లేదని, దురాశలు నెరవేరాలంటే కూసింత తెలివితేటలు ఉండాలని గ్రహించిన వారయ్యారు. మెదడు తలకాయలో లేకున్నా, బొత్తిగా అరికాల్లోకి జారిపోకుండా దానిని కనీసం మోకాల్లో పదిలంగా ఉండేట్లు చూసుకుంటే చాలు, లోకాన్ని ఏలేయవచ్చనే నమ్మకం ప్రబలిన వాళ్లయ్యారు. ఇలాంటి వాళ్లు విజయానికి అడ్డదారులు... జనాలను కొల్లగొట్టడం ఎలా..? వంటి అముద్రిత గ్రంథాలను రహస్యంగా చదువుకుంటూ చావు తెలివితేటలను పెంచుకుంటూ ఉంటారు. తెలివితక్కువ సన్నాసుల్లోనూ దురాశాపరులు లేకపోలేదు. అయితే, వాళ్ల వల్ల జనాలకు పెద్దగా అనర్థాలేమీ జరిగే ప్రమాదమేదీ ఉండదు. వాళ్ల మూర్ఖత్వమే జనాలకు శ్రీరామరక్ష. ‘కన్యాశుల్కం’లో లుబ్ధావధానులు తెలివితక్కువ దురాశాపరుడు. ఆ ముసలాడు తెలివితక్కువ వాడు కావడం వల్లనే, రామప్పంతులు మొదలుకొని కరటకశాస్త్రి శిష్యుడి వరకు అతగాడికి టోకరా ఇస్తారు. ఒకప్పుడు ‘దురాశ దుఃఖమునకు చేటు’ అనే నీతివాక్యం బడిగోడల మీద విరివిగా కనిపించేది. ఆ కాలంలోనూ దురాశాపరులు ఉండేవాళ్లు. ఇప్పుడా నీతివాక్యం అంత విరివిగా కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు దురాశాపరుల సంఖ్య ద్విగుణం బహుగుణంగా వృద్ధి చెందుతోంది. -
అడుగంటిన ఆశలు
- కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ ఖాళీ - మొత్తం నిల్వ సామర్థ్యం 709.47 టీఎంసీలు.. ఇప్పుడున్నది 188.08టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణా, గోదావరి నదుల పరీవాహక పరిధిలోని ప్రాజెక్టులన్నీ వట్టిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి మట్టాలన్నీ గణనీయంగా పడిపోతున్నాయి. ఆగస్టు రెండో వారం ముగిసినా ఆశించిన స్థాయి వ ర్షాలు లేకపోవడం, ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ భారీగా నీటి లోటు ఉండటం ఆందోళన కలుగజేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 710 టీఎంసీలు కాగా.. మునుపెన్నడూ లేని రీతిలో ఇప్పుడు కేవలం 188 టీఎంసీల నీరే ఉండడం... అందులోనూ వినియోగార్హమైన నీరు కేవలం 50 టీఎంసీలే ఉండటం తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ కాస్త నీటినీ తాగు అవసరాలకే వినియోగించాలని... సాగు అవసరాలను పూర్తిగా పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే మూడో వంతుకు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, సింగూరు, మానేరు, కడెం ప్రాజెక్టులన్నీ కలిపి నిల్వ సామర్థ్యం 709.47 టీఎంసీలు కాగా... ఇప్పుడు 188.06 టీఎంసీలే ఉన్నాయి. మొత్తంగా 521.41 టీఎంసీల లోటు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులన్నింటిలో కలిపి 425.50 టీఎంసీల నీరు లభ్యతగా ఉంది. అంటే గత ఏడాదితో పోల్చినా ఈసారి సుమారు 237 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలోనూ కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్‌లో కలిపి 20 నుంచి 30 టీఎంసీలు, గోదావరిలో మరో 20 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుల్లో నీటి లోటుతో 15 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతోంది. సాగర్ ఎడమ కాల్వ కింద 6 లక్షల ఎకరాలు, జూరాల కింద లక్ష ఎకరాలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కింద ఉన్న మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. దీనికి తోడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఇచ్చంపల్లి, కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో కొత్తగా 6.2 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్న ప్రభుత్వ సంకల్పం కూడా వ్యర్థమవుతోంది. ఆ నిర్ణయం వెనక్కి.. జూరాల ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలకుగానూ జూలైలో 6.09 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అదే సమయంలో కర్ణాటకలో వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌లకు నీటి చేరిక పెరగడంతో ఆగస్టు రెండో వారం నుంచి జూరాల కింది ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పు డు ప్రాజెక్టులో 5 టీఎంసీల మేర మాత్రమే నీరుండటం, ఎగువన ప్రవాహాలు లేకపోవడంతో... సాగుకు నీరివ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్ తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఎగువ రాష్ట్రాల్లోనూ అంతే.. సరైన వర్షాలు లేనికారణంగా ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పరీవాహకం తక్కువగా ఉండటంతో ఎగువ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అవి నిండి దిగువకు నీరొస్తేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో మొత్తంగా 91 టీఎంసీల నీరు కొరతగా ఉంది. ప్రస్తుతం తుంగభద్రకు 17 వేల క్యూసెక్కులు, ఆల్మట్టి, నారాయణపూర్‌లకు 10 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ తొలివారానికి ప్రాజెక్టులు నిండి.. దిగువకు నీరు వచ్చే అవకాశముంది. లేదంటే దిగువ ప్రాజెక్టులకు గడ్డు పరిస్థితి తప్పదు. -
ప్రతిభకు తగిన గుర్తింపు... ఆశలు ఫలిస్తాయి... ప్రయత్నాలు కలిసి వస్తాయి
మేషం: ఈ రాశివారికి ప్రథమార్ధంలో కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగులకు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అసంతృప్తి ఉండి, కొత్త కంపెనీలో మారాలనుకునేవారి ప్రయత్నాలు జూన్ 19 తర్వాత సఫలమవుతాయి. ఈ లోగా ఉన్న ఉద్యోగంలోనే ఉండటం మంచిది. పోటీ పరీక్షలు రాసేవారికి ఇది మంచి సమయం. పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నవారికి దిగువ స్థాయి వారి నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. జూన్ వరకు షేర్‌మార్కెట్ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. శుభకార్యాలకు, ధార్మిక కార్యాలకు ధనం ఖర్చు చేయవలసి రావడం వల్ల డబ్బుకు కటకటలాడాల్సిన పరిస్థితి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ఉత్తమం. స్త్రీలకు తమ జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొనవలసి రావచ్చు. లవర్స్ మధ్య గొడవలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. పాతస్నేహితుల స్థానంలో కొత్త స్నేహితులు వచ్చే అవకాశం. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశివారు నిత్యం దక్షిణామూర్తిని ధ్యానించడం వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగి, శుభ ం జరుగుతుంది. వృషభం: వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూల సమయం. ఈ రాశిలో జన్మించిన వారి తండ్రికి ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతభత్యాలలో పెరుగుద ల. పిల్లల కోసం ఎదురు చూసేవారి ఆశలు ఫలించి, సంతానవంతులవుతారు. ఉద్యోగులు జులై నుంచి విధులల అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వోద్యోగులకు అప్రధానమైన శాఖకు మార్చడం లేదా దూరప్రాంతానికి బదిలీ అయే అవకాశం ఉంది. అంవలన పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు ఇది మంచి సమయం. వారిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలికి వ స్తుంది. వారి ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పోటీపరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. ఈ రాశి వారి తలిదండ్రులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. మరిన్ని అనుకూల ఫలితాల కోసం వీరు శుక్రజపం లేదా నవగ్రహ హోమం చేయించుకోవాలి. అనాథ కన్యలకి వివాహ ఖర్చులు భరించటం మరింత శుభఫలితాలనిస్తుంది.11 మంది కన్నెపిల్లలకు గాజులు, దుస్తులు దానం చేయడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. మిథునం: వీరికి ఈ సంవత్సరం ధనాభివృద్ధి జరుగుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు, స్టాక్మార్కెట్లో లాభాలు, ఆస్తుల విలువ అనూహ్యంగా పెరగటం వల్ల అధిక ధనాదాయం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కాంపిటీటివ్ పరీక్షలు రాసేవారికి, కొత్త వ్యాపారాలు చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కోరుకున్న చోటకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి, పై అధికారులతో చిక్కులు. పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆరోగ్యం చక్కబడుతుంది. జులై తర్వాత ఈ రాశివారి తలిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరిన్ని మెరుగయిన, అనుకూల ఫలితాల కోసం వీరు గణేశునిపూజించటం, అనాథాశ్రమాలకు, పేదలకు అన్నదానం చేయడం మంచిది. శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల ధనాదాయం కలుగుతుంది. కర్కాటకం: వీరికి జూన్ 19 వరకు పనుల ఒత్తిడి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే కచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు చేసే పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు వివాహ ప్రాప్తి. సాంకేతిక రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. విదేశీ విద్య, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. జులై నుంచి ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. జులై నుంచి రాహువు వక్రదృష్టి వలన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్ధం నుంచి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నవగ్రహ ఆరాధన, దుర్గామాతను పూజించటం, అనాథలకు బెల్లం పాయసం పంచిపెట్టడం, దేవాలయాల కొలనులోని చేపలకు గోధుమపిండితో చేసిన ఉండలు ఆహారంగా పెట్టడం వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు. సింహం: ఈ రాశివారికి ఈ సంవత్సరం కుటుంబ కలతలు, బంధువులతో విభేదాలు, అనవసర వ్యయం అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే మానసిక వ్యధ, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటాయి. పనుల ఒత్తిడికితోడు తమ పనిని ఎవరూ గుర్తించడం లేదన్న మనస్తాపం, ఆత్మన్యూనతాభావం కలుగుతాయి. జులై నుంచి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అంతవరకు ఇతరులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. మీడియా రంగంలో ఉన్నవారి ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది.పొగడ్తలకు పొంగిపోవటం ఈ రాశివారి సహజ స్వభావం కావడం వల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య విషయాలలో అప్రమత్తత అవసరం. స్త్రీలకు పని చేసే చోట ఒత్తిళ్లు ఎదురవుతాయి. దీనికి అతిగా స్పందించకుండా చాకచక్యంగా, సంయమనంగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు కొంచెం కష్టకాలమనే చెప్పాల్సి ఉంటుంది. మరిన్ని అనుకూల ఫలితాల కోసం ఈ రాశివారు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మన్యసూక్త పారాయణం చేయించుకోవడం మంచిది. కన్య: ఈ రాశివారు సహజంగానే జాగ్రత్తపరులు, మంచి తెలివితేటలు కలిగి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. జూన్ 19 వరకు ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఊహించినదానికన్నా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.స్పెక్యులేషన్లు, స్టాక్‌మార్కెట్లు, లాటరీలలో లాభిస్తారు. సంతానవృద్ధి జరుగుతుంది. పిల్లల ఉద్యోగ, వివాహాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది.ఆరోగ్యపరంగా, కెరీర్‌పరంగా బాగుంటుంది. బంధువులతో, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీపరీక్షలలో కష్టంతో విజయం సాధిస్తారు. ఈ రాశివారు రాహుజపం, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయడం, దక్షిణామూర్తిని ఆరాధించటం వల్ల కలిసిస్తుంది. పేదవిద్యార్థులకు పుస్తకాలు కొనిపెట్టడం, ఫీజులు కట్టడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి. తుల: నవంబర్ 2014 నుంచి ఈ రాశివారికి మంచికాలంగా భావించవచ్చు. అధికశ్రమ, తక్కువలాభం, అవమానాలు, అనారోగ్య బాధలు వంటి వాటి నుంచి వీరు బయటకు వచ్చారు. అయితే కుటుంబ సౌఖ్యానికి దూరంగా ఉండటం, పని ఒత్తిడి, పని మీద ఆసక్తి లేకపోవటం, పని చేసే చోట అవమానాలు సంభవం. ధనవృద్ధి, ఉద్యోగులకు బోనస్, భార్యతరఫున ధనాదాయం లభిస్తాయి. జులై నుండి పిల్లల విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆస్తులు పెంపొదించుకుంటారు. పాత ఆస్తులు లేదా షేర్స్, స్టాక్స్ విలువ పెరగటం, ఉద్యోగులు తాము కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయే అవకాశం ఉంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రథమార్ధంలో కష్టంగా ఉన్నా, ద్వితీయార్ధంలో సెటిలవుతారు. నవగ్రహారాధన, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, శని జపం చేయించుకోవటం, కాకులకు తీపిపదార్థాలు తినిపించటం మంచిది. వృశ్చికం: ఈ రాశివారికి మానసిక సంఘర్షణ, అపవాదులు, అవమానాలు ఎదురయే అవకాశం ఉంది. అయితే బృహస్పతి వీరికి అనుకూలించటం వల్ల కష్టాలు వీరిని అంతగా బాధించవు. రాబడి పెరుగుతుంది. కీర్తి, సంఘంలో గౌరవం లభిస్తాయి. వీరు గతంలో కొన్న షేర్ల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. 2015 జూన్ వరకు ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆ తర్వాత బృహస్పతి స్థానం మార్చుకోవటం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు, ప్రభుత్వోద్యోగులకు అంతగా ప్రాముఖ్యంలేని శాఖకు లేదా దూరప్రాంతాలకు బదిలీ కావటం, షేర్ల ధరలు పడిపోవటం, ఆర్థికంగా దెబ్బతినటం వంటి పరిణామాలు సంభవిస్తాయి. స్త్రీలకు జీవిత భాగస్వామి నుంచి, పిల్లల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. పని ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునేవారి కోరిక జులై నుంచి నెరవేరుతుంది. ఏలినాటి శని దుష్ర్పభావం నుంచి తప్పించుకోవడానికి వీరు శనికి జపం చేయించాలి. అనాథలకు, వృద్ధులకు సాయం చేయాలి. నల్లకుక్కకు ఆహారం తినిపించాలి. ధనుస్సు: ఏలిననాటి శని ప్రభావం, అష్టమంలో బృహస్పతి సంచారం, రాహువు 10వ ఇంట సంచారం వల్ల ఈ రాశివారికి మనోవ్యాకులత, అనవసర విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటు, స్వంత వారినుంచి వ్యతిరేకత ఎదుర్కొనడం సంభవం. జూన్ వరకు ఖర్చులు ఎక్కువ అవడం వల్ల అప్పులు చేయవలసి రావచ్చు. ఆ తర్వాత బృహస్పతి సంచారం వలన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగులకు ఇది మంచికాలం. ఉద్యోగంలో సౌకర్యాలు, వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపడి నోరు జారకుండా చూసుకోవటం అవసరం.విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దక్షిణామూర్తిని ఆరాధించటం, నవగ్రహ హోమం, శివాభిషేకం చేయించుకోవటం, గురువులను గౌరవించటం, సన్మానించటం, ఆవులకు సెనగలు తినిపించటం వల్ల చిక్కులు తొలగి, మంచి జరుగుతుంది. మకరం: వీరికి ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ధనసంపాదనకు అవకాశాలు సంభవం. అవివాహితులకు వివాహ యోగం, ఆస్తుల విలువ పెరుగుతుంది. జులై వరకు స్పెక్యులేషన్ వలన లాభపడతారు. ఆ తర్వాత ఆర్థిక విషయాలలో అప్రమత్తత అవసరం. సేవింగ్స్ పెరుగుతాయి. జీవిత భాగస్వామి వలన ధనం కలిసి వస్తుంది. మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం ధనానికి లోటు ఉండదు. ఆస్తులు కొనే అవకాశంతోబాటు ఇతరులు వీరిని చూసి అసూయపడేటంతగా వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులు ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి కాలం. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే శనికి తైలాభిషేకం, దక్షిణామూర్తికి అభిషేకం, వృద్ధులకు అన్నదానం చేయడం మంచిది. కుంభం: ఈ రాశివారికి 6వ ఇంట బృహస్పతది, 10వ ఇంట శని సంచారం వలన తోటివారినుంచి, స్వంతవారినుంచే వ్యతిరేకత సంభవం.అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఆరోగ్య భంగం కలగవచ్చు. అసంతృప్తికి గురి కావలసి వస్తుంది. వివాహితులు భర్తతోనూ, పిల్లలతోనూ ఓర్పుగా మెలగాలి. ఎప్పటినుంచో దాచుకున్న డబ్బు అంతా ఖర్చు అవుతుంది. షేర్లు, స్టాక్‌మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. జులై నుంచి జీవిత భాగస్వామి ఆదాయం పెరుగుతుంది. పిల్లల వివాహ, ఉద్యోగ విషయాలలో చేసే ప్రయత్నాలు పురోగమిస్తాయి. విద్యార్థులు విదే శాలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు జులై తర్వాత ఫలిస్తాయి. మెరుగైన ఫలితాల కోసం శనికి తైలాభిషేకం, ఈశ్వరారాధన, మన్యుసూక్త పారాయణం చేయించుకోవటం మంచిది. మీనం: వీరికి ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనది. అన్నింటా అభివృద్ధి పథంలో నడుస్తారు. ఆర్థికంగా, కుటుంబపరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీపరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఊహించినదానికన్నా ఉన్నతమైన ఉద్యోగాలలో సెటిలవుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే చోట గౌరవం లభిస్తుంది. అవివాహిత యువతులకు కల్యాణం సంభవం. సంతానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. యోగవంతమైన సంతానం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న వారి కోరిక ఫలిస్తుంది. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలంటే దక్షిణామూర్తిని ఆరాధించటం, గోవులకు సెనగలు తినిపించటం, పండితులు, గురువులను తగువిధంగా సత్కరించటం మంచిది. -
బడ్జెట్‌పై భారీ ఆశలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సుమారు నెల రోజుల పాటు కొనసాగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రతిపాదనలపై జన సామాన్యంలో భారీ ఆశలు నెలకొన్నాయి. ‘బంగారు తెలంగాణ’ కల నెరవేర్చే దిశగా బడ్జెట్లో ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆసక్తి నెలకొంది. కరువు, కరెంటు కోతలు, గిట్టుబా టు ధరలు తదితర అంశాలపై ప్రజాప్రతిని ధుల స్పందన కీలకం కానున్నది. సాగు కలిసిరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు పరిహారం చెల్లింపుపై ప్రకటన కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వాటర్ గ్రి డ్, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతు వంటి భారీ ప్రణాళికలు ఓ వైపు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాయి. పింఛన్లు, రేషను కా ర్డుల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారడంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో సాగుతున్న అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశంలో చర్చించే అంశాలు, ప్రతిపాదనలపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రోడ్ల నిర్మాణానికి నిధుల కోసం ప్రయత్నిస్తా తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు పునాది. బడ్జెట్ ప్రతిపాదనల్లో జిల్లాకు పెద్దపీట వేస్తారని భావిస్తున్నా. పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు జడ్చర్ల నియోజకవర్గానికి మేలు జరిగేలా కేటాయింపులుంటాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందించే అవకాశముంది. రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా. -సి.లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కువ నిధులివ్వాలని కోరతా అన్ని నియోజకవర్గాల కంటే జిల్లా కేంద్రానికే ఎక్కువ నిధులు మంజూరు చెయ్యాలని కోరతా. నీటి సమస్య పరిష్కారానికి గతంలో పంపిన ప్రణాళికలను మంజూరు చేయించుకొని, వాటి ద్వారా చేపట్టాల్సిన పనులు పూర్తి చేసేందుకు కృష చేస్తా. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చూస్తా. రోడ్లు, ఇతరత్రా అభివృ్ధకి కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లోనే మంజూరయ్యేలా సీఎంను కోరతా. -శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే విద్యుత్ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గడువు పూర్తయినా పనులు పూర్తి కావడం లేదు. వాటర్‌గ్రిడ్‌లో కలపకుండా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించాలని కోరతా. కొత్తగా పాల కేంద్రాల ఏర్పాటు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఒత్తిడి తెస్తా. విద్యుత్ సమస్య తీర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తా. -చల్లా వంశీచంద్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే రైతు సమస్యలు ప్రస్తావిస్తా పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. నాగర్‌కర్నూల్ తాలుకాను కరువు ప్రాంతంగా ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగర్‌కర్నూల్‌లో ఇంజనీరింగ్ కళాశాల, డ్రైనేజీ, సీసీరోడ్లు వంటి సమస్యలను ప్రస్తావిస్తా. 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుపై మాట్లాడుతా. -మర్రి జనార్దన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రోడ్ల నిర్మాణానికి నిధులు కోరతా జిల్లా, నియోజకవర్గ అృవద్ధికి తొలి బడ్జెట్ పునాది వేస్తుందని ఆశిస్తున్నా. రోడ్ల నిర్మాణానికి నిధులు కోరతా. కోయిల్‌సాగర్, రామన్‌పాడు, శంకరసముద్రం రిజర్వాయర్ల పూర్తికి నిధులు ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదించా. సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాన్ని సాయం కోరతా. చెరువుల పునరుద్ధరణకు అవసరమైన నిధులు సాధిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు రాబడతాం. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే రైతు రుణమాఫీ గురించి ప్రస్తావిస్తా రైతుల రుణమాఫీ గురించి ప్రశ్నిస్తా. ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ జిల్లాకు రుణమాఫీలో కొంత వెసులుబాటు దక్కింది. అదే తరహాలో మన జిల్లాకు కూడా నిబంధనలు సడలించి రుణమాఫీ ద్వారా రైతులను ఆదుకునే అంశాన్ని ప్రస్తావిస్తా. అనంతపూర్‌లో 10ఎకరాలు మాగాణి లేదా 5ఎకరాలు తరి పొలం ఉన్న రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకొంది. -రేవంత్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే జూరాల-పాకాలను వ్యతిరేకిస్తా విద్యుత్ కొరత మూలంగా పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాగునీటి కొరత కూడా తీవ్రంగా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇస్తూ కృష్ణా జలాల్లో ఎనిమిది టీఎంసీల వాటా కేటాయించారు. అయితే ప్రభుత్వం కొత్తగా జూరాల-పాకాల అంటూ చేస్తున్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తాం. రుణమాఫీపై నిలదీస్తాం. - రాజేందర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే సాగు, తాగునీటిపై చర్చిస్తా నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో మాట్లాడతా. అచ్చంపేటలో వంద పడకల అస్పత్రి నిర్మాణం, భూత్పూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, పాలెం అగ్రికల్చర్ రీచర్స్ సెంటర్ ఏర్పాటుతో పాటు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో ఇండస్టీయల్ కారిడార్ ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. -గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే రోడ్ల విస్తరణపై మాట్లాడతా వనపర్తి పట్టణంలోని ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావిస్తా. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని గుడిపల్లి గట్టు నుంచి గోపాల్పేట, ఖిల్లాఘణపురం మండలాలలకు సాగు నీరందించేందుకు నిధులు రాబడతా. వాటర్‌గ్రిడ్ ద్వారా వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి పథకాలు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణలో భాగంగా నిధులు కోరతా. - జి.చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే సాగు, తాగునీరు, విద్యుత్‌పై మాట్లాడతా అసెంబ్లీ సమావేశాల్లో తాగు, సాగునీరు, విద్యుత్, రుణమాఫీ పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల విషయాన్ని ప్రస్తావిస్తా. భీమా ప్రాజెక్టు, చంద్రఘడ్, నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి లిఫ్టిరిగేషన్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నియోజకవర్గంలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. - చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే కరువు ప్రాంతంగా ప్రకటించేలా కృషి ఎత్తై ప్రాంతంలో ఉండడంతో నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరతా. షాద్‌నగర్ పట్టణంలో మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా తాగు నీరు అందించాలని కోరతా. - అంజయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే విప్ హోదాలో సమస్యలు లేవనెత్తుతా : ఆర్డీఎస్ అంశంతో పాటు రాష్ట్ర విభజన మూలంగా సరిహద్దు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆర్టీసీ డిపో, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్స్టేషన్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం, 2009 వరదల్లో నష్టపోయిన వారి పునరావాసం వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. కాంగ్రెస్ లెజిస్లేచర్ విప్ హోదాలో ఇతర సమస్యలను లేవనెత్తుతా. - సంపత్‌కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే అభివృద్ధిపై మాట్లాడతా అభివృద్ధి అంశాలపై సమావేశంలో మాట్లాడతా. విద్య, వైద్యం, రోడ్లు, పర్యాటకం, తాగు, సాగునీటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తా. కొల్లాపూర్ నుంచి పెబ్బేరు, కొల్లాపూర్ నుంచి వనపర్తి వరకూ డబుల్‌లైన్ రహదారుల నిర్మాణాలకు నిధుల మంజూరు కోరతా. కొల్లాపూర్‌లో పీజీ, డీగ్రీ కళాశాల భవనాల నిర్మాణం, ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు పనులపై చర్చిస్తా. -జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే -
‘సుప్రీం తీర్పుతో నిరాశ
ప్రొద్దుటూరు: రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలన్నింటికీ కలిపి 9,500 వరకు సీట్లు ఉండగా ఇందులో 2,500 కూడా తొలి విడతలో భర్తీ కాలేదు. రెండోమారు కౌన్సెలింగ్ జరిగితే పరిస్థితి మెరుగు పడుతుందని పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఎంతో ఆశతో ఎదురుచూశాయి. అయితే ఉన్నట్లుండి సుప్రీంకోర్టు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో అటు కళాశాలల యాజమాన్యాలతోపాటు ఇటు విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యంగా జరగడంతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మన ప్రాంతం విద్యార్థులు హైదరాబాద్‌లో చేరే పరిస్థితి ఉండదని, దీని వల్ల మంచి రోజులు వచ్చినట్లేనని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆశించాయి. అయితే కౌన్సెలింగ్ నిర్వహణలో జాప్యం ఏర్పడటంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి. తొలుత ఏదో ఒక కళాశాలలో చేరాలనే లక్ష్యంతో కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు రెండో విడతలో ఇష్టమైన కళాశాలను ఎంపిక చేసుకోవాలని భావించారు. వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. జిల్లాలోని 20 ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి 15 కళాశాలల్లో అడ్మిషన్లు రెండంకెలకు మించని పరిస్థితి నెలకొంది. వారిని బ్రాంచిల వారిగా విభజిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కళాశాలలకు సంబంధించి అడ్మిషన్ల దృష్ట్యా తరగతులు నిర్వహిస్తారా లేదా అని విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు తల్లిదండ్రులు కళాశాలల వద్దకు వెళ్లి తమ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చవిచూడలేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
సౌదీ సాలెగూడు
దేశం కాని దేశంలో చిక్కుకున్న అభాగ్యులు మెరుగైన ఆదాయం కోసం ఎన్నో ఆశలు జీతం రాక, ఆకలి తీరక ఇప్పుడు ఎడారిలో ఖైదీలు స్వదేశంలో కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు అనారోగ్యం పాలైన కుమారుడికి మంచి వైద్యం అందించే ఉద్దేశంతో ఒకరు.. అంతోఇంతో సంపాదించుకుని జీవితం సాఫీగా గడపాలన్న ఆశతో ఒకరు.. కుటుంబ పోషణ కోసం కాయకష్టం చేసైనా తగినంత ఆదాయం సంపాదించాలన్న ఆలోచనతో ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ధ్యేయంతో పరాయి గడ్డకు పయనమయ్యారు. తగినంత రాబడి ఉంటుందన్న ఆశతో అప్పో సప్పో చేసి మరీ ఏజెంట్లకు లక్షల్లో సమర్పించి సౌదీ విమానమెక్కారు. కానీ అక్కడికి వెళ్లాక వారికి ఎడారి దేశంలో ఎండమావి కనిపించింది. నిరాశ ఎదురొచ్చింది. వేతనం లేదు సరికదా, ఆకలి తీరే దారి కూడా లేకుండా పోయింది. సౌదీలో చిక్కుకున్న జిల్లా వాసుల విషాద కథనమిది.. మల్కాపురం: కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఉద్దేశంతో గల్ఫ్ వెళ్లిన ఆ యువకుడు ఎడారి దేశంలో చిక్కుకున్నాడు. అటు జీతమూ లేక, ఇటు ఆకలీ తీరక నానా అవస్థలు పడుతున్నాడు. 47వ వార్డులోని ములగాడ హౌసింగ్ కాలనీకి చెందిన పిళ్లా గణేశ్ (33) ఇప్పుడు సౌదీ అరేబియాలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నాడు. గణేశ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాజువాక ఆటోనగర్‌లోని ప్రజ్ఞాన్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా సౌదీ అరేబియాలో ఫిట్టర్‌గా విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అప్పుచేసి ఏజెంట్‌కు లక్ష రూపాయలు చెల్లించి సౌదీకి పయనమయ్యాడు. కంపెనీ ఏజెంట్లు అక్కడ గణేశ్‌కు నెలకు రూ. 22 వేలు జీతం, ఉచిత భోజనం, గది ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ఒకపూట భోజనమే పెడుతూ నరకాన్ని చూపిస్తున్నారని గణేశ్ చెప్పినట్టు అతడి భార్య, తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ఐదేళ్ల క్రితం గణేశ్‌కు వివాహమైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, 10 నెలల కుమారుడు ఉన్నారు. కుమారుడికి ఆరోగ్యం బాగులేకపోవడంతో అతడికి వైద్యం కోసం గణేశ్ ఎక్కువ వడ్డీకి అప్పు చేసి సౌదీకి వెళ్లాడు. అక్కడ ఉపాధి లేక, పూట గడవక, స్వదేశానికి రాలేక సతమతమవుతున్నాడు. తన భర్త క్షేమంగా ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని గణేశ్ భార్య రాజ్యలక్ష్మి రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకుంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. ఆశలు నేలపాలు కశింకోట: తేగాడకు చెందిన బోదెపు నరసింగరావు ఎన్నో ఆశలతో సౌదీకి బయల్దేరి చివరికి రిక్తహస్తాలతో వెనక్కు రావాల్సిన పరిస్థితి ఎదురైంది. పదో తరగతి చదివిన నరసింగరావు ఒక్కడే కుటుంబానికి ఆధారం. తల్లిదండ్రులు సూర్యాకాంతం, అప్పలనాయుడు వృద్ధులు కావడంతో వారి పోషణభారం అతడిదే. సొంత ఊరిలో ఎంత కూలి చేసినా కుటుంబ పోషణ కష్టం కావడంతో అతడు ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశతో సౌదీకి పయనమయ్యాడు. విశాఖకు చెందిన యువకులతోపాటు అతడు కూడా నాలుగు నెలల క్రితం సౌదీ అరేబియా వెళ్లి పనిలో చేరాడు. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో జీతం కూడా లభించని పరిస్థితి ఎదురుకావడంతో అతడి ఆశలు నేలకూలాయి. ఇంక అక్కడ ఉండి ఫలితం లేదని తేలిపోయింది. వెనక్కు వచ్చేద్దామనుకుంటున్నట్టు సౌదీ నుంచి కొడుకు గురువారం ఫోన్ చేసి చెప్పాడని నరసింగరావు తల్లి సూర్యాకాంతం శుక్రవారం తెలిపారు. ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అప్పులు పెరిగిపోయాయని, 30 సెంట్ల భూమి మాత్రమే ఉండడంతో బతుకు గడవడం కష్టమైందని, సౌదీలో కూడా కుమారుడికి నిరాశే ఎదురైందని ఆమె విచారంతో చెప్పారు. తల్లికి తీరని వేదన అనకాపల్లి: ‘నా కొడుకు ఎప్పుడొస్తాడు?... ‘క్షేమంగా వస్తాడా?’ అని అనారోగ్యంతో బాధ పడుతున్న ఆ తల్లి ప్రశ్నిస్తూ ఉంటే బంధువులకు ఏం జవాబు చెప్పాలో అర్ధం కావడం లేదు. దూర ప్రాంతానికి వెళ్లి నానా అవస్థలు పడుతున్న కొడుకును తలచుకు ఆ వృద్ధురాలు విలపిస్తూ ఉంటే ఎలా ఓదార్చాలో అర్ధం కావడం లేదు. బతుకుతెరువుకోసం సౌదీ వెళ్లిన అనకాపల్లి యువకుని దీనావస్థ తీరే దారేమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. అనకాపల్లి మండలం రామాపురం కాలనీకి చెందిన రాయి శ్రీనివాస్ పరిస్థితి ఇది. శ్రీనివాస్ తండ్రి అప్పారావు పదేళ్ల క్రితమే కన్నుమూయడంతో తల్లి సింహాచలం అన్నీ తానే అయి కుమారుడిని, ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. ఇద్దరు కుమార్తెలకు తానే వివాహాలు చేసింది. సెల్‌ఫోన్ మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ లక్ష రూపాయల వరకు సమకూర్చుకొని ఐదు నెలల క్రితం గాజువాకకు చెందిన ఒక కన్సల్టెన్సీ ద్వారా 10 మందితో కలసి పయనమయ్యాడు. అయితే అతడికి అక్కడి వాస్తవాలు వెక్కిరించాయి. వేతనం సంగతి అటుంచితే కడుపు నింపుకొనేందుకు కూడా నానా యాతన పడాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి ఎలా రావాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్నాడు. ఫోన్ చేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో తెలిసిన వారి ద్వారా కుమారుడికి సింహాచలం ఫోన్ చేయించింది. కుమారుడు అక్కడి నుంచి ఎలా వస్తాడని ఇప్పుడామె కుమిలిపోతోంది. ఆమె ఆరాటం ఏరీతిలో తీరుతుందో ఎవరు చెప్పగలరు? వేతనానికి బదులు వేదన పెదగంట్యాడ: పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన మహ్మద్ హాఫీజుల్లా దుస్థితిని తలచుకుని అతడి సోదరి ఆఖీషా విలవిలలాడుతోంది. పెదగంట్యాడ రూరల్ మండలం పెదపాలెం గ్రామానికి చెందిన హాఫీజుల్లా సుమారు ఐదునెలల క్రితం మరికొందరితో పాటు సౌదీ వెళ్లాడు. వీరిని సౌదీ తీసుకువెళ్లిన సంస్థ జీతాలను చెల్లించకపోవడం వల్ల అక్కడ నానా ఇక్కట్లూ పడుతున్నట్టు సమాచారం అందింది. గతంలో తన సోదరుడు రెండుసార్లు సౌదీ వెళ్లి వచ్చాడని, ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని అఖీషా వాపోతోంది. తన సోదరుడిని క్షేమంగా తీసుకురావాలని అధికారులను కోరుతోంది. నిలువునా ముంచిన నయవంచన ఉపాధి కల్పిస్తామని సౌదీ తీసుకువెళ్లిన కంపెనీ నట్టేట ముంచడంతో ఇప్పుడేం చేయాలో తోచడం లేదని పెదగంట్యాడకు చెందిన మరో బాధితుడు ఎ.గోవిందరావు బంధువులు ఆక్రోశిస్తున్నారు. వెల్డింగ్ పనిలో కుదుర్చుతామని గోవిందరావును సౌదీకి తీసుకువెళ్లిన కంపెనీ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడంలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలైలో దుబాయ్ వెళ్లినప్పుడు ఎటువంటి ఇబ్బందీ ఎదురు కాలేదని. ఈ ఏడాది మార్చిలో సౌదీ వెళ్లి ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. తన భర్తను వెనక్కు తీసుకు రావాలని గోవిందరావు భార్య వారం క్రితం కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేశారు కూడా. వేతనాలు అందకపోవడంతో తన భర్త, మరో 39 మంది వెనక్కు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
సిద్ధార్థ వైద్య కళాశాలకు మొండిచెయ్యి
సీట్లు మంజూరుపై కరుణించని ఎంసీఐ రాష్ట్రంలో అన్ని కళాశాలలకు పునరుద్ధరించినా సిద్ధార్థకు దక్కని వైనం ఈ ఏడాది వంద సీట్లకే పరిమితం లబ్బీపేట : సిద్ధార్థ వైద్య కళాశాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కరుణించ లేదు. అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరుపై చివరి నిమిషంలోనైనా ఆమోదం వస్తుందన్న యూనివర్సిటీ అధికారులు ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 350 ఎంబీబీఎస్ సీట్లు పునరుద్ధరించిన ఎంసీఐ, సిద్ధార్థకు మాత్రం మొండిచెయ్యి చూపింది. వైద్య మంత్రి సొంత జిల్లాలో ఉన్న కళాశాలకు సీట్లు రప్పించడంలో చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది సిద్ధార్థ వైద్య కళాశాల వందసీట్లకు పరిమితం కానుంది. సిద్ధార్థ కళాశాలకు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 40 శాతం, ఎస్వీయూ పరిధిలో 20 శాతం, ఉస్మానియా పరిధిలో 40 శాతం మందికి సీట్లు కేటాయిస్తారు. ఏకైక స్టేట్ వైడ్ కళాశాలగా ఉన్న సిద్ధార్థకు అదనపు సీట్లు కేటాయించక పోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులకు నష్టమేనని నిపుణులు చెపుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిల్లో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు పేర్కొంటున్నారు. బోధకులు కొరత తీవ్రంగా ఉండటాన్ని ఎంసీఐ గుర్తించినట్లు వారు అంటున్నారు. ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సీట్లు దక్కేవని చెబుతున్నారు. వంద సీట్లు ఉన్న కళాశాలకు 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో 50 మంజూరు చేసింది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో వాటిని భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలు చేసి సౌకర్యాలు లేని కారణంగా వాటిని రద్దు చేసేంది. గత ఏడాది వంద సీట్లనే భర్తీ చేశారు. అదనంగా సీట్లు మంజూరు చేయాలంటూ కళాశాల అధికారులు మళ్లీ ఎంసీఐకు ద రఖాస్తు చేయడంతో బృందం అకస్మికంగా తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యం కళాశాలకు అదనపు సీట్లు దక్కని విషయంలో అధికారుల వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధిని ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. ఎంసీఐ బృందం తనిఖీలను వస్తున్నట్లు ముందుగానే తెలిసినా పలు విభాగాలను సిద్ధం చేయలేదు. కళాశాలలోని ఓ విభాగంలో వైజ్ఞానిక ప్రదర్శన దుమ్ముపట్టి ఉండటాన్ని ఎంసీఐ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకే తనిఖీలకు ఎంసీఐ సభ్యులు రాగా, 11 గంటల సమయంలో కూడా వైద్యులు విధులకు రావడం, ఐడీ కార్డులు, నెఫ్రాన్లు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల అదనపుసీట్లు రాక పోవడంలో పాలకుల నిర్లక్ష్యంతో పాటు, అధికారుల వైఫల్యం కూడా ఉంది. ఎంసీఐ అభ్యంతరాలు ఇవి టీచింగ్ క్లాసులు నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. బ్లడ్ బ్యాంక్‌కు ప్రత్యేక ప్రవేశ మార్గం ఉండాలి. బహిరంగ ప్రదేశంలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. వ్యాధి నిర్ధారణ విభాగంలో సైతం అధునాతన పరికరాలు లేవని , ఆర్సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం రిపేరులో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లైబ్రరీ, పెథాలజీ సెకండ్ డొమాస్టిక్ రూమ్, కమ్యునిటీ మెడిసిన్‌కు ప్రాక్టికల్ ల్యాబ్ లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్స్ లేక పోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాదికైనా సీట్లు దక్కే అవకాశం ఉంది. -
‘కాఫీ’... మళ్లీ హ్యాపీ!
ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం మళ్లీ ఆర్వీనగర్కు? మన్యానికి తెచ్చేందుకు అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే చొరవ శాస్త్రవేత్తల అందుబాటుపై గిరిజన రైతుల్లో చిగురిస్తున్న ఆశ గూడెంకొత్తవీధి: విశాఖ మన్యంలోని కాఫీ రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా కొన్నేళ్ల క్రితం మైదాన ప్రాంతానికి తరలిపోయిన ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రాన్ని తిరిగి ఆర్వీ నగర్‌కు తెచ్చేం దుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కేంద్రం ద్వారా శాస్త్రవేత్తల సేవలు అందుబాటులోకి వస్తే కాఫీ సాగులో మంచి ఫలితాలు తీసుకురావచ్చన్న గిరిజన రైతుల ఆకాంక్ష మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించారు. కాఫీ పరిశోధన కేంద్రాన్ని గత స్థానమైన ఆర్వీనగర్కు ప్రభుత్వం తరలించేలా తమ వంతు కృషి చేస్తుండటంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జీకే వీధి మండలం ఆర్వీనగర్లో 1970లో ఏర్పాటైన ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం... 1990 దశకంలో నక్సల్స్ మందుపాతరలు పెట్టి పేల్చేయడంతో భద్రతా కారణాల రీత్యా జిల్లాలోని నర్సీపట్నానికి తరలిపోయిన సంగతి విదితమే. దేశంలోనున్న ఆరు ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రాల్లో ఇదొకటి. అంతేకాదు మన రాష్ట్రంతో పాటు ఒరిశాలోని కాఫీ రైతులకు ఇదే సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన్యంలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉండగా, వాటిపై సుమారు లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కాఫీసాగును ఉపాధి హామీ పథకం వర్తింపజేయడంతో గిరిజనులు మరింత మంది కాఫీ సాగుపై చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సూచనలు, సలహాలివ్వడం, అధిక దిగుబడినిచ్చే మేలుజాతి వంగడాల రూపకల్పన, విత్తనోత్పత్తి వంటి సేవలందించే కాఫీ పరిశోధన కేంద్రం అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. ఎన్నో విన్నపాల మేరకు ఆర్వీ నగర్‌లోని పూర్వ పరిశోధన కేంద్రాన్ని కాఫీ బోర్డు పరిశోధన క్షేత్రంగా మార్పు చేసింది. ఈ క్షేత్రంలో ఫాం మేనేజర్‌తోపాటు తోటల పరిరక్షకులు, సాంకేతిక సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళ్తున్నారు. కాఫీ రైతులకు వారి సేవలు అంతగా అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన కేంద్రాన్ని తిరిగి ఆర్వీ నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. -
వ్యాపార సేవకులు
ఆ న లుగురు కాలేజీలో కలిశారు... వాళ్లతో పాటు అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు కూడా కలిశాయి. ఒకే బెంచ్‌లో కూర్చోసాగారు, ఒకే బ్యాచ్‌గా మారారు. చదువు అయిపోగానే నలుగురు కలిసి మొదట ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనుకొన్నారు. ఈ ప్రయాణంలో జీవిత సత్యాన్ని న్వేషిద్దామనుకొన్నారు. అయితే దాని వల్ల తమకు ప్రపంచంతో పరిచయం ఏర్పడుతుందేమో కానీ, ప్రపంచానికి తాము పరిచయం కామన్న విషయాన్ని అర్థం చేసుకొన్నారు. ఈ ప్రపంచంలో తాము ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలంటే ఏదైనా సాధించాలనుకొన్నారు. అలా ఆలోచించిన ఆ మిత్రబృందం మొదలు పెట్టినదే ‘వార్బీ పార్కర్’. దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సాగుతూ అందరి కళ్లకూ కనిపిస్తున్న కళ్ల జోడు కంపెనీ ఇది. దీని వ్యవస్థాపకులైన నలుగురు స్నేహితులే నీల్, ఆండ్రూ, జెఫ్రీ, డేవిడ్. ఒక కళ్ల జోడు సెట్‌ను అమ్మితే... మరో కళ్ల జోడు సెట్‌ను అవసరార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది ఈ కంపెనీ సిద్ధాంతం! ఇదే సిద్ధాంతంతో నాలుగేళ్లలోనే దృష్టిలోపంతో బాధపడుతున్న అవసరార్థులకు ఏకంగా 50 లక్షల కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసింది ఈ సంస్థ. మెదడు, మనసు ఉన్న నలుగురు యువకుల ఆలోచన ఫలితంగా ఆవిష్కృతమైన కంపెనీ ఇది. ఒకవైపు నాణ్యతతోనూ, నవ్యతతోనూ వినియోగదారులను ఆకట్టుకొంటూనే.. స్వచ్ఛంద సేవలోనూ ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది. సేవకు వ్యాపారమే ఊతం!: దృష్టి దోషం ఉన్న వాళ్లకు అవసరమయ్యే కళ్ల జోళ్లను, సన్ గ్లాసెస్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్తన్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డేవిడ్ గిల్ బో, నీల్ మెంథ్నల్, ఆండ్రూ హంట్, జెఫ్రీ రైడర్ లు తమకు తల్లిదండ్రులు ప్యాకెట్ మనీ కింద ఇచ్చిన 2,500 డాలర్ల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఒకవైపు వ్యాపారం చేస్తూనే తద్వారా వచ్చిన లాభంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది ఆ నలుగురు యువకుల ప్రణాళిక. మరి వీళ్ల లక్ష్యం మంచిది, వీళ్ల శ్రమ చిత్తశుద్ధితో కూడుకొన్నది.. దీంతో కళ్ల జోళ్లవాడకంపై మంచి క్రేజ్ ఉన్న అమెరికా దేశంలో ఆ కంపెనీకి కూడా మంచి ఆదరణ లభించింది. పెట్టుబడి తక్కువ కావడంతో.. తాము ఉత్పత్తి చేసిన కళ్లజోళ్లను ఎలా అమ్మాలో కూడా ఈ యువకులకు మొదట అర్థం కాలేదు. ఆ సమయంలో వీళ్లకు వోగ్డాట్కామ్ సహాయకారిగా నిలిచింది. ఈ నలుగురు యువకుల ప్రణాళికను, తపనను అందరికీ తెలియజెప్పింది. వీళ్ల వెబ్సైట్ అడ్రస్‌ను ఇచ్చి అమ్మకాలకు ఊపుతెచ్చింది. మీరు ఒక కళ్ల జోడును కొంటే, మేము అవసరార్థులకు ఉచితంగా ఒక కళ్ల జోడును పంపిణీ చేస్తాం(బయ్ వన్, గివ్ వన్) అనే విధానం నచ్చి చాలా మంది వీళ్ల ద గ్గరే కళ్ల జోళ్లను కొనసాగారు. ఇండియాపైన దృష్టి...: దృష్టి లోపాలతో బాధపడుతూ కూడా కళ్లజోడును కొనుక్కోలేనంత పేదరికం ఉండేది పేద ఆఫ్రికా, ఆసియాదేశాల ప్రజల్లోనే. ఈ విషయం గ్రహించి వీళ్లు ముందుగా భారతదేశం, బంగ్లాదేశ్‌లపై దృష్టి సారించారు ఈ స్నేహితులు. విజన్ స్ప్రింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నాలుగేళ్లు గడిచే సరికి ఐదు మిలియన్ల కళ్ల జోళ్లను పంపిణీ చేయించి ఈ కంపెనీ బాసులుగా ఉన్న ఆ నలుగురు యువకులు తమ సత్తాను రెండు విధాలుగా చాటుకొన్నారు. సాధారణ నేపథ్యం...: వీళ్ల ఆలోచన తీరు వైవిధ్యమైనది కానీ ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేకమంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. అయితే ఇప్పటికీ ఈ సంస్థకు ఉన్న దుకాణాల సంఖ్య తక్కువే. ప్రధానంగా వెబ్సైట్ ఆధారంగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ‘బయ్ వన్ -గివ్ వన్’అనే నినాదాన్ని అమలు పెట్టడం అనేది మాటల్లో చెప్పినంతటి సులభమైన వ్యవహారం కాదు. దానకర్ణులుగా పేరు పొందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా విరాళం విషయంలో ఇలాంటి విధానాన్ని అమల్లో పెట్టే సాహసం చేయలేదు. కానీ తాము అనుకొన్న విధానాన్ని అమలులో పెట్టి ఈ నలుగురు యువకులు తమ శక్తి యుక్తులు ఏ స్థాయివో నిరూపించారు. ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేక మంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. -
మా మంచి నాన్న
ఫాదర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనాలు పెద్ద కొడుకుగా నా ఆశయం నెరవేర్చింది డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి భూంరెడ్డి ముస్తాబాద్ : నాన్నంటే వేలు పట్టి నడిపించేవాడే కాదు.. కదిలే దైవం. వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే బాధత్య వారి కడుపులో పుట్టిన బిడ్డలది. తెలంగాణ తొలి ఉద్యమంలో కళ్లు తెరిచి, మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మాదేవేందర్‌రెడ్డి పోరుబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో డెప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కొండం భూంరెడ్డి, విజయ దంపతుల పెద్ద కూతురు పద్మ. ఆమె గురించి తండ్రి భూంరెడ్డి మాటల్లోనే.. దూరభారం తగ్గించుకునేందుకు లేఖలతో దగ్గరయ్యేది పద్మ నా పెద్ద కూతురు. తెలంగాణ తొలి ఉద్యమం జరుగుతున్న సమయంలోనే 6.01.1969లో పద్మ జన్మించింది. ఆమె తర్వాత అనిత, కొడుకు వంశీధర్‌రెడ్డి. చదువులో ఎప్పుడు ముందుండే పద్మ పట్ల నాకు కొద్దిగా ప్రేమ ఎక్కువే. ఏడు వరకు నామాపూర్‌లోనే చదివింది. ఎంతో చలాకీగా ఉండేది. స్కూల్లో భరతమాత వేషాలు వేసేది. అల్లూరిసీతారామరాజు ఏకపాత్రభినయంతో ఆకట్టుకునేది. క్లాస్‌లో ఇతరుల కంటే ఒక్క మార్కు తక్కువ వచ్చినా పట్టుదలతో చదివి ఫస్ట్ వచ్చేది. నేను చెన్నూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు తరచూ నాకు పద్మ లేఖలు రాసేది. ఉత్తరాలతో కుటుంబ క్షేమ సమాచారాలు అందించేది. నా కొడుకు జబ్బుపడ్డప్పుడు పెద్ద కొడుకుగా వెన్నంటి నిలిచి మాకు ఓదార్పునిచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పనిచేసేది. తెలంగాణ తొలి శాసనసభకు డెప్యూటీ స్పీకర్ అయింది. తండ్రిగా ఇంతకంటే ఏం కావాలి. ఆడపిల్లను అనే భయం ఆమెలో ఏనాడు నేను చూడలేదు. - కొండం భూంరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి నాన్న లేఖలే పాఠాలయ్యాయి.. ఏడో తరగతి వరకు నామాపూర్‌లో చదివా. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో పనిచేసేవాడు. నాకేమో నాన్న దగ్గర ఉండాలని కోరిక. ఐదో తరగతిలో ఉన్నప్పుడే నాన్నకు లేఖలు రాసేదాన్ని. అమ్మ విజయ చెబుతుంటే నేను ఉత్తరాలు రాస్తూ, క్షేమ సమాచారాలు తెలుసుకునేదాన్ని. నాన్న రాసే లేఖల్లో ఎన్నో మంచి విషయాలు ఉండేవి. అమ్మ, చెల్లి, తమ్ముడిని బాగా చూసుకోవాలని, పట్టుదలతో చదవాలని చెప్పేవారు. అలా నాన్న ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేశా. డిగ్రీ కాగానే దేవేందర్‌రెడ్డితో నిశ్చితార్థం చేశారు. చదువుకోవాలన్న నా కోరికను నాన్న దేవేందర్‌రెడ్డితో చెప్పారు. పెళ్లైన అనంతరం న్యాయ శాస్త్రం చదివించారు. అప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. ఎమ్మెల్యేగా తెలంగాణ బాధలను అసెంబ్లీలో వినిపించే అవకాశం వచ్చేది కాదు. ఇప్పుడు అదే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభకు ఉపసభాపతిగా ఎన్నిక కావడం వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, నాన్న పెంపకం, దేవేందర్‌రెడ్డి ప్రోత్సాహం ఉన్నాయి. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్గొనడం నా ముందు ఉన్న సవాల్. -పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభ డెప్యూటీ స్పీకర్ నాన్న నుంచి నేర్చుకున్నా.. నాన్నది అరుదైన వ్యక్తిత్వం. అంతకుమించి మాటకు కట్టుబడే వ్యక్తి. నాన్న గురించి చెప్పాలంటే నిజంగానే మాటలు రావడం లేదు. తండ్రిగా తను చేయాల్సిందంతా చేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత మొండిగా వ్యవహరించారో అందరికి తెలిసిందే. తెలంగాణ రావడంతో ఎంతో ఆన ందంగా ఉంది. కేసీఆర్ తనయుడిగా ఈ జీవితానికి నాకిది చాలు. తండ్రి పేరు చెడగొట్టకుండా ఉండాలన్నదే నా లక్ష్యం. ప్రజాజీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే నాన్న మాకు తక్కువ సమయం కేటాయించారు. నిజంగానే ఇప్పుడు నేను అదే అనుభవిస్తున్నా. బిజీగా ఉండడమే దానికి కారణం. ప్రజల కోసం పని చేయాలన్న తత్వం నాన్నది. నాన్న ప్రభావం నాపై చాలానే ఉంది. అమ్మతో మేం ఎక్కువ గడిపేవాళ్లం. తండ్రిగా అన్ని బాధ్యతలు నెరవేర్చారు. నేనెంతో నేర్చుకున్నా. ఇంతకంటే ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. - సిరిసిల్ల -
ఉజ్వల భవిష్యత్ కోసం ఓటేయండి
ఓటరు అవగాహన ర్యాలీలో కలెక్టర్ కిషన్ వరంగల్ చౌరస్తా, న్యూస్‌లైన్ : ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి.. ఉజ్వల భవిష్యత్ కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడం అవసరం.. అందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ పిలుపునిచ్చారు. వరంగల్ చౌరస్తాలో సోమవారం రోటరీ, ఇన్నర్‌వీల్, వాసవీ, వాసవీ వనితా క్లబ్‌ల ప్రతినిధులు, గోల్డెన్ త్రిశూల్, రిషి స్పోకెన్, శారదా పబ్లిక్ స్కూ ల్ అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన ఓటరు అవగాహన ర్యాలీ ని ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కేవలం 53 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈ సారి ఓటింగ్ 80 శాతానికి పెంచడానికి ఓటరు చైతన్య ర్యాలీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో అక్షరాస్యులు అధికంగా ఉన్నా ఓటుకు దూరంగా ఉండటం సరి కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడంతోపాటు సుపరిపాలన కోసం ప్రతి ఒక్కరూ ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ వందశాతానికి పెంచేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపా రు. ర్యాలీ జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మమైదాన్ వరకు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ఓటు అనే అస్త్రం సంధించి నిస్వార్థమైన నేతలను ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కార్యక్రమ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యం లో జరిగిన ఈ ర్యాలీలో వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు కె.రాజగోపాల్, సెక్రటరీ తోట వైద్యనాథ్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు సత్యనారయణ, కార్యదర్శి టి.వాసుదేవులు, కోశాధికారి గాదె వాసుదేవ్, వెలిశాల ఆనంద్, ఐత గోపీనాథ్, వాసవీ వనితా క్లబ్ ప్రతినిధులు కళావతి, విజలక్ష్మి, గోల్డెన్ త్రిశూల్ కరస్పాండెంట్ డాక్టర్ కె.చంద్రశేఖర్ ఆర్యా, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి పాల్గొన్నారు. ర్యాలీలో గోల్డెన్ త్రిశూల్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మువ్వన్నెల రంగుల షర్టులు ధరించిన చిన్నారులు ‘ఫ్లీజ్ ప్రతి ఒక్కరూ ఓటేయండి’ అంటూ బుల్లిబుల్లి మాటలతో ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వారిని అభినందించారు. -
నవ చైతన్యానికి నాంది
తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది. ప్రభవనామ సంవత్సరం మొదలు అక్షయ నామ సంవత్సరం వరకు ఉన్న తెలుగు వసంతాల పేర్లతో ఒక్కో ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తూ... ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాదిగా జరుపుకుంటారు. యుగాల ప్రారంభానికి ఆది అయిన రోజు కనుక యుగాదిగా పిలిచేవారు. ఇదే కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఈ ఏడాది ఉగాది పేరు శ్రీజయ. మార్చి 31న శ్రీజయ నామ సంవత్సరం ప్రారంభం అవుతోంది. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రస్తు తథా సూర్యోదయే సతి॥ చైత్రమాసపు శుక్లపక్షంలోని మొదటి సూర్యోదయ కాలంలో బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని పై శ్లోకానికి అర్థం. ఏ పూర్ణిమ అయితే చిత్తా నక్షత్రంతో కూడి ఉంటుందో అదే చైత్రమాసం. ఈ చైత్రమాసం మొదటి రోజే ఉగాది. యుగారంభంలో శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై పవళించినట్లు మనకు పురాణాలు విశదపరుస్తున్నాయి. నవ చైతన్యానికి, నవ్య శోభకు, విశ్వ సౌందర్యానికీ ఉజ్వల ప్రతీకగా ‘ఉగాది’ని అభివర్ణించారు పెద్దలు. ప్రకృతిని ఆశలకు, ఆకాంక్షలకు ప్రతీకగా చూపి... మానవునిలోని నిరాశా నిస్పృహలను పోగొట్టి నవ చైతన్యాన్ని కలిగించి, కొత్త కలలకు మొగ్గలు తొడిగించి శోభింపజేసేదే ఉగాది. మోడువారి నిశ్చేతనంగా ఉన్న శిశిరంలోంచి వినూత్న శోభను చిగురింపజేసి దివ్యానుభూతులకు పలికే నాందీ వాచకమే ఉగాది. ఆదిలో ఈ ఉగాది పర్వదినం రోజునే చతుర్ముఖ బ్రహ్మ ఈ చరాచర సృష్టిని ఆరంభించినట్లు ‘బ్రహ్మాండ పురాణం’ తెలియజేస్తోంది. వసుచక్రవర్తి ఘోరాతిఘోరమైన తపమొనరించి రాజ్యాధికారం పొందినప్పుడు దేవేంద్రుడే స్వయంగా ఆయనకు ఉగాది రోజున నూతన దివ్య వస్త్రాలను బహూకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా శ్రీరామ చంద్రుడు రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యా నగరానికి ఈ ఉగాది పర్వదినానే వచ్చినట్లు రామాయణ కావ్యంలో ఉంది. సరిగ్గా ఆ ఉగాది నాడు శ్రీరాముని పట్టాభిషేకం కూడా జరిగింది. యుగాలు మార్పు చెందినప్పుడల్లా సృష్టిలో, సకల చరాచర ప్రకృతిలో విశిష్టమైన మార్పులు చోటు చేసుకున్నట్లు ప్రాచీన వాఙ్మయంలో సుస్పష్టమైన ఆధారాలున్నాయి. దీని మూలం ‘కాలతంత్రం’ అని భాగవతం చెబుతోంది. పంచభూతాల సంయోగ-వియోగాలకు కాలమే కారణభూతం అవుతోంది. ఒక యుగం మారి మరొక యుగంలో పాదం మోపే సంధి సమయంలో చిత్ర విచిత్రాలైన పెనుమార్పులు సంభవిస్తుంటాయి. ద్వాపర యుగాంతంలో, కలియుగ ఆరంభంలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగింది. ఇందుకు కారణం సప్తరుషులు మఖానక్షత్రంలోనికి ప్రవేశించడమేనని జ్యోతిష శాస్త్రజ్ఞుల నమ్మకం. సృష్టిలోని సమస్త పశువులు, పక్షులు, మానవులు, అచరములైన పర్వతాలు, వృక్షాలు, సముద్రాలు అన్నిటిపై కాలం తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ‘కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః అని శ్రీకృష్ణ పరమాత్మ తన గీతా సందేశంలో సర్వమానవాళికి తెలియపరిచాడు. ఈ కాల గమనాన్ని స్తంభీభూతం చేయాలంటే మనం సెకనుకు 1,80,000 మైళ్ల కాంతి వేగంతో ప్రయాణించాలి. ఇది మానవ మాత్రులకు సాధ్యం కాదు కనుక కాలంతో పాటు ప్రయాణించాలి. ఈ ‘శ్రీజయ’ ఉగాది అందరిలోనూ నవనవోత్సాహాన్ని రేకెత్తించి ప్రగతి పథంలో ముందుకు సాగేలా చేస్తుందని ఆశిద్దాం! - గత్తం వేంకటేశ్వరరావు, సంస్కృత పండితులు వసంత వైభవం వసంతకాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. మల్లెల సుగంధం ప్రతి మనసునీ మత్తెక్కిస్తుంది. కోకిల పాటలు అలౌకిక ఆనందాన్నిస్తాయి. వసంతకాలంలో పుష్పాలలో ‘మధువు’ (తేనె) ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాసాన్ని మధుమాసం అంటారు. కాళిదాసు రచించిన రుతుసంహార కావ్యంలో మధుమాస శోభ అనంతంగా కనిపిస్తుంది. వసంత మాసానికి సురభి అనే పేరు ఉందని అమరకోశం చెబుతోంది. సురభి అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. అంటే.. వసంతమాసం ప్రజలు కోరుకున్న కోరికలను సిద్ధింపజేస్తుందని అన్వయించుకోవచ్చు. ‘రుతూనాం ముఖో వసంతః’ అని తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉంది. రుతువులన్నింటిలోనూ వసంతరుతువుదే అగ్రస్థానం అని దీని భావం. ‘వసతి కామోస్మిన్నితి’ - అంటే వసంత రుతువులో కామప్రకోపం ఎక్కువగా ఉంటుందని అర్థం. దాంపత్య సౌఖ్యానికి ఈ రుతువు అనుకూలం. ఇలా మానవగమనంలోని ప్రతి అడుగుకీ ‘వసంతం’ ఒక ప్రాతిపదిక కల్పిస్తుంది. మానవ జీవన వికాసానికి పునాదిగా నిలుస్తుంది. వసంత నవరాత్రులు హైందవ ఆధ్యాత్మిక వ్యవస్థలో నవరాత్రులకు విశేషమైన స్థానం ఉంది. ఇందులో గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు బాగా ప్రసిద్ధి పొందాయి. కానీ, వీటికన్నా ముందుగా ఉగాది ప్రారంభం నుంచి వసంత నవరాత్రులు జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. చైత్రశుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచి చైత్ర శుద్ధ నవమి (శ్రీరామనవమి) వరకు తొమ్మిది రోజుల కాలాన్ని వసంత నవరాత్రులుగా వ్యవహరిస్తారు. దేవీభాగవతం, ధర్మసింధువు తదితర గ్రంథాల్లో వీటి ప్రాశస్త్యాన్ని ఎంతగానో వివరించారు. చైత్ర మాసం సంధికాలం. శీతలం నుంచి ఉష్ణానికి వాతావరణం మారుతుంది. ఈ మార్పులవల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వీటి నుంచి ప్రజలను రక్షించడానికి వసంత నవరాత్రులనే పేరుతో పూర్వీకులు కొన్ని నియమాలను విధించారు. ఉగాది రోజున కలశస్థాపన చేసి, విధివిధానంగా అర్చన, మంటపారాధన చేయాలి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను, శ్రీరామచంద్రమూర్తిని అర్చించాలి. ఈ పద్ధతులన్నింటిలో అంతర్లీనంగా ఆరోగ్యసంరక్షణ దాగి ఉంది. భగవతత్త్వానికి ‘పర’, ‘అపర’ అనే రెండు ప్రకృతులు ఉన్నాయి. ఒకటి అచేతనం కాగా మరొకటి చేతనం. బాహ్యంగా కనిపించే పంచభూతాలు; అహంకారం, బుద్ధి, వ్యక్తం అనే ఎనిమిదికి (అపరా ప్రకృతి) పరాప్రకృతి కలిపితే మొత్తం తొమ్మిది అంశాలు అవుతాయి. ఈ తొమ్మిది అంశీభూతాలను తొమ్మిది రోజులపాటు ‘వసంత నవరాత్రులు’గా అర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఆధ్యాత్మిక రహస్యం. - కప్పగంతు జానకీరామశర్మ