ఏం చేస్తారో?
నేడు పొగాకు బోర్డు సమావేశం
రైతుల ఆశలన్నీ సమావేశం పేనే
మర్రిపాడు: రాష్ట్రంలో 2016–17 పంట కాలానికి రైతులకు పొగాకు పండించేందుకు అనుమతులు, పొగాకు పంట పరిస్థితి, గిట్టుబాటు ధరలపై బుధవారం గుంటూరులో పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుండటంతో రైతుల ఆశలన్నీ సమావేశంపైనే ఉన్నాయి.
పరిస్థితేంటంటే
2015–16 పంట కాలంలో దక్షిణ ప్రాంత తేలిక నేలలైన (ఎస్‌ఎల్‌ఎస్) ప్రాంతంలోని పొదిలి, కందుకూరు, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో ఒక్కో బ్యారెన్‌కు 3400 కిలోలు పొగాకు పండించేందుకు అనుమతి ఇచ్చారు. అయినా అధిక శాతం రైతులు నష్టాల పాలయ్యారు. మార్కెట్‌లో ధరలు అంతంత మాత్రం ఉండడంతో రైతుల బాగోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా పొగాకు పంటపై శీతకన్ను వేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఈ ఏడాదైనా పరిస్థితి మారుతుందా?
ఈ ఏడాది ప్రస్తుతం పొగాకు పంట అదును సమీపిస్తుండడంతో రైతుల పరిస్థితి ఏమిటోనంటూ సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి కలిగిరి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు రైతులు పంట పండించేందుకు విస్తీర్ణం తగ్గిస్తారని, అంతే కాకుండా పొగాకు పంటకు అనుమతి కూడా తగ్గిస్తారని ప్రచారం సాగుతుండడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు.
3400 కిలోలు బ్యారెన్‌కు అనుమతిస్తేనే గిట్టుబాటు కావడం లేదని, ఇంకా తగ్గిస్తే గిట్టుబాటు కాక పొగాకు పంటను సరిపెట్టుకోవాల్సి వస్తుందంటూ పలువురు రైతులు పేర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పొగాకు పంటను తగ్గించాలనే ఆశయంతోనే పొగాకు బోర్డుపై ఒత్తిడి తెచ్చి రైతులు పంట పండించేందుకు అనుమతి కూడా ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది పంట అనుమతి తగ్గిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల కనికరం చూపి పంట అనుమతిని తగ్గించుకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.