దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్‌లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్‌లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.
ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్‌క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు.
ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు
అక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.
నివేదికలోని వివరాలు..
ఎఫ్‌ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్‌ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.
2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.
ఎఫ్‌ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లు
ఎఫ్‌ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లు
వస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లు
పొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లు
మద్యం-రూ.66,106 కోట్లు
ఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓ
దేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment