సాక్షి, అమరావతి: తక్కువకు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది స్మగుల్ గూడ్స్ కొంటూ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఏటా లక్షల కోట్లు చేతులు మారతాయంటే నమ్మగలమా? ఈ స్మగ్లింగ్ వల్ల ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తోంది. దేశంలో పరిశ్రమల విస్తరణకు విఘాతంగా మారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది.
స్మగ్లింగ్ దందా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా దెబ్బతీస్తోందనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రముఖ మార్కెట్ అధ్యయన సంస్థ ‘థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(టీఏఆర్‌ఐ) ద్వారా అధ్యయనం చేయించింది. దేశ మార్కెట్లోకి అక్రమంగా చొరబడుతున్న ఉత్పత్తుల్లో మొదటి ఐదు స్థానాల్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, గృహ వినియోగ, మద్యం, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
ఈ ఐదు కేటగిరీల్లో స్మగ్లింగ్ దందా ప్రభావాన్ని టీఏఆర్‌ఐ ద్వారా అధ్యయనం చేశారు. విదేశాల నుంచి దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్న టాప్–5 ఉత్పత్తుల విలువ ఏటా రూ. 2.60 లక్షల కోట్లుగా ఉంటోంది. దాంతో భారత ప్రభుత్వం పన్నుల ద్వారా రావాల్సిన రూ. 58 వేల కోట్ల ఆదాయాన్ని ఏటా కోల్పోతోంది. అంతే కాదు 51 లక్షల ఉపాధి అవకాశాలకు కూడా గండి పడుతోంది. ఆ ఐదు కేటగిరీల స్మగ్లింగ్ తీవ్రత ఎలా ఉందంటే..
ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు
దేశంలోకి ఏటా సగటున రూ. 1,42,284 కోట్ల విలువైన ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో ఈ అక్రమ దిగుమతి ఉత్పత్తుల వాటా ఏకంగా 25.09 శాతం ఉంటోంది. తద్వారా దేశం రూ. 17,074 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. అంతేకాదు అక్రమ ఉత్పత్తులతో దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల పరిశ్రమను దెబ్బతీస్తోంది. దాంతో దేశంలో 7.94 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.
గృహ వినియోగ ఉత్పత్తులు
గృహోపకరణాలు, గృహవినియోగ ఉత్పత్తులు, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులే దేశంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ ఉత్పత్తులు కొల్లగొడుతున్నాయి. దేశంలోకి ఏటా రూ. 55,530 కోట్ల విలువైన గృహవినియోగ ఉత్పత్తులు అక్రమగా దిగుమతి అవుతున్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఈ ఉత్పత్తుల వాటా 34.25 శాతం ఉంది. దాంతో దేశం ఏటా రూ. 9,995 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఇక పరిశ్రమలు దెబ్బతినడంతో దేశంలో ఏటా 2.89 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.
మద్యం ఉత్పత్తులు..
విదేశాల నుంచి వచ్చే అక్రమ మద్యం దేశ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఏటా రూ. 23,466 కోట్ల విలువైన విదేశీ అక్రమ మద్యం దేశ మార్కెట్‌లోకి చొరబడుతోంది. దేశంలో మద్యం మార్కెట్లో ఈ అక్రమ మద్యం వాటా 19.87 శాతం. దాంతో దేశం ఏటా రూ. 15,262 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 97 వేల మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి.
పొగాకు ఉత్పత్తులు
విదేశాల నుంచి దేశ మార్కెట్‌లోకి ఏటా రూ. 22,930 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. దేశ పొగాకు మార్కెట్లో ఈ ఉత్పత్తుల వాటా 20.04 శాతం ఉంది. దాంతో దేశం ఏటా సగటున రూ. 13,331 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 3.7 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.
మొబైల్ ఫోన్ల మార్కెట్
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ల మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ చీడ పీడిస్తోంది. విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఏటా రూ. 15,884 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు వచ్చి చేరుతున్నాయి. దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో ఈ ఫోన్ల వాటా 7.56 శాతంగా ఉంది. దాంతో దేశం రూ. 2,859 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో పాటు దేశంలో 35 వేల మంది ఉపాధి అవకాశాలకు గండి పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment