illegal trade
-
DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్ నిరోధం సాధ్యం
న్యూఢిల్లీ: అక్రమ రవాణా, వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులను అణిచివేసేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయం అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధ వ్యాపారం వెనుక ఉన్న ‘‘మాస్టర్ మైండ్స్’’ ను పట్టుకోవడంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధానికి విచారణా సంస్థల సమన్వయ చొరవలు అవసరమని ఆమె అన్నారు. అక్రమంగా రవాణా, లేదా చట్టవిరుద్ధ వ్యాపార స్వభావం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా మారలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, అటవీ లేదా సముద్ర జీవుల అక్రమ రవాణా కొనసాగడం విచారకరమని అన్నారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ ముప్పును అరికట్టడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆమె ఈ సందర్బంగా అన్నారు. సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడంలో సాంకేతికత వినియోగం చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఎన్ఫోర్స్మెంట్ మేటర్స్ 2023’’ అన్న అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇక్కడ నిర్వహించిన ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆర్థికమంత్రి చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► చాలా వరకు అక్రమంగా వ్యాపారం చేసే వస్తువులు అలాగే ఉంటాయి. కస్టమ్స్ అధికారులు కంగుతినేంత స్థాయిలో కొత్త వస్తువుల అక్రమ రవాణా ఏదీ లేదు. దశాబ్ద కాలంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటే... దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో సమాజానికి తెలియాలి. ∙అక్రమ రవాణా సూత్రధారుల అణచివేతకు డబ్ల్యూసీఓ (ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్)తో పాటు ప్రభుత్వాల మధ్య సహకారానికి చాలా ముఖ్యం. తద్వారా అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకో గలుగుతాము. ► జప్తు చేసిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, మార్కెట్లోకి తీసుకురాకుండా అడ్డుకోగలిగితే, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం తేలికవుతుంది. ► అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడినవారికి శిక్ష తప్పదని, ఆయా చర్యల నిరోధం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం మన కర్తవ్యం. ► బంగారం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, పురాతన వస్తువులు, వన్యప్రాణి సంపద అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. ► దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన వస్తువులన్నింటినీ వాటికి సంబంధించిన స్వదేశాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. దీనికీ అంతర్జాతీయ సమన్వయం, సహకారం అవసరం. ► ఈ కార్యక్రమంలో డీఆర్ఐ ’ఆపరేషన్ శేష’ నాల్గవ దశను మంత్రి ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ రీజినల్ ఇంటెలిజెన్స్ లైజన్ ఆఫీస్ (ఆర్ఐఎల్ఓ) ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌ల సహకారం అందిస్తోంది. కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు 2015లో తొలిసారిగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమ రవాణా పెరుగుతోంది: సంజయ్ కుమార్ అగర్వాల్ పరోక్ష పన్నులు– కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం పరస్పరం అనుసంధానం కావడం, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి అంశాల నేపథ్యంలో పురాతన వస్తువులు, సిగరెట్లు, బంగారం, అంతరించిపోతున్న వన్యప్రాణులసహా నిషేధిత వస్తువుల అక్రమ తరలింపు పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ విలువ దాదాపు 650 బిలియన్ డాలర్లని ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్రమ ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఈ వాటా దాదాపు 30 శాతమని తెలిపారు. ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తోందని పేర్కొన్న ఆయన, మనీలాండరింగ్ తీవ్రవాద కార్యకలాపాల ఫైనాన్షింగ్ ఫైనాన్సింగ్‌కు ఇది దారితీస్తోందని, ఆయా అంశాలు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిరోధానికి విచారణా సంస్థల మధ్య సన్నిహిత సమన్వయ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వ్యాపార వ్యయాలను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచే సులభతర వాణిజ్య చర్యలను కూడా ఈ దిశలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
స్మగ్లింగ్ దందా.. 51 లక్షల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి, అమరావతి: తక్కువకు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది స్మగుల్ గూడ్స్ కొంటూ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఏటా లక్షల కోట్లు చేతులు మారతాయంటే నమ్మగలమా? ఈ స్మగ్లింగ్ వల్ల ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తోంది. దేశంలో పరిశ్రమల విస్తరణకు విఘాతంగా మారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. స్మగ్లింగ్ దందా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా దెబ్బతీస్తోందనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రముఖ మార్కెట్ అధ్యయన సంస్థ ‘థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(టీఏఆర్‌ఐ) ద్వారా అధ్యయనం చేయించింది. దేశ మార్కెట్లోకి అక్రమంగా చొరబడుతున్న ఉత్పత్తుల్లో మొదటి ఐదు స్థానాల్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, గృహ వినియోగ, మద్యం, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఐదు కేటగిరీల్లో స్మగ్లింగ్ దందా ప్రభావాన్ని టీఏఆర్‌ఐ ద్వారా అధ్యయనం చేశారు. విదేశాల నుంచి దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్న టాప్–5 ఉత్పత్తుల విలువ ఏటా రూ. 2.60 లక్షల కోట్లుగా ఉంటోంది. దాంతో భారత ప్రభుత్వం పన్నుల ద్వారా రావాల్సిన రూ. 58 వేల కోట్ల ఆదాయాన్ని ఏటా కోల్పోతోంది. అంతే కాదు 51 లక్షల ఉపాధి అవకాశాలకు కూడా గండి పడుతోంది. ఆ ఐదు కేటగిరీల స్మగ్లింగ్ తీవ్రత ఎలా ఉందంటే.. ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు దేశంలోకి ఏటా సగటున రూ. 1,42,284 కోట్ల విలువైన ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల మార్కెట్లో ఈ అక్రమ దిగుమతి ఉత్పత్తుల వాటా ఏకంగా 25.09 శాతం ఉంటోంది. తద్వారా దేశం రూ. 17,074 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. అంతేకాదు అక్రమ ఉత్పత్తులతో దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల పరిశ్రమను దెబ్బతీస్తోంది. దాంతో దేశంలో 7.94 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. గృహ వినియోగ ఉత్పత్తులు గృహోపకరణాలు, గృహవినియోగ ఉత్పత్తులు, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులే దేశంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ ఉత్పత్తులు కొల్లగొడుతున్నాయి. దేశంలోకి ఏటా రూ. 55,530 కోట్ల విలువైన గృహవినియోగ ఉత్పత్తులు అక్రమగా దిగుమతి అవుతున్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఈ ఉత్పత్తుల వాటా 34.25 శాతం ఉంది. దాంతో దేశం ఏటా రూ. 9,995 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఇక పరిశ్రమలు దెబ్బతినడంతో దేశంలో ఏటా 2.89 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మద్యం ఉత్పత్తులు.. విదేశాల నుంచి వచ్చే అక్రమ మద్యం దేశ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఏటా రూ. 23,466 కోట్ల విలువైన విదేశీ అక్రమ మద్యం దేశ మార్కెట్లోకి చొరబడుతోంది. దేశంలో మద్యం మార్కెట్లో ఈ అక్రమ మద్యం వాటా 19.87 శాతం. దాంతో దేశం ఏటా రూ. 15,262 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 97 వేల మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. పొగాకు ఉత్పత్తులు విదేశాల నుంచి దేశ మార్కెట్లోకి ఏటా రూ. 22,930 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. దేశ పొగాకు మార్కెట్లో ఈ ఉత్పత్తుల వాటా 20.04 శాతం ఉంది. దాంతో దేశం ఏటా సగటున రూ. 13,331 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 3.7 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్ల మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ల మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ చీడ పీడిస్తోంది. విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఏటా రూ. 15,884 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు వచ్చి చేరుతున్నాయి. దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఈ ఫోన్ల వాటా 7.56 శాతంగా ఉంది. దాంతో దేశం రూ. 2,859 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో పాటు దేశంలో 35 వేల మంది ఉపాధి అవకాశాలకు గండి పడుతోంది. -
జీఎస్టీతో జీరో దందా!
సాక్షి, హైదరాబాద్ : వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడం, చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరుకులు రాష్ట్ర మార్కెట్లోకి వస్తున్నాయి. పన్ను ప్రసక్తే లేకుండా పెద్ద ఎత్తున జీరో దందా సాగుతోంది. ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లలో చిల్లు పడుతోంది. దాదాపు ఆరు నెలలుగా జరుగుతున్న ఈ తంతు అక్టోబర్ నుంచి ఊపందుకుందని.. దీంతో పన్నులశాఖ దాడులకు ఉపక్రమించిందని చర్చ జరుగుతోంది. అడ్డదారులు.. అనేక మార్గాలు వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా సరుకుల బ్లాక్‌మార్కెట్, జీరో దందా ఎప్పుడూ ఉండేదే. కానీ జీఎస్టీ నేపథ్యంలో పన్నుల శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇది విచ్చలవిడిగా మారింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు గుజరాత్, కేరళ, రాజస్థాన్ల నుంచి చాలా రకాల సరుకులు ఎలాంటి బిల్లులు లేకుండానే రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం నుంచి టైల్స్, టైక్స్టైల్స్.. గుజరాత్‌లోని ఉంజా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి జీలకర్ర, జీడిపప్పు, ధనియాలు, ఖర్జూర లాంటి వస్తువులు.. రాజస్థాన్ నుంచి గ్రానైట్, మార్బుల్స్, హ్యాండ్లూమ్స్ వంటివి రాష్ట్రంలోని బ్లాక్‌మార్కెట్‌కు వెల్లువలా వస్తున్నాయి. కేరళ నుంచి ప్లైవుడ్, టింబర్... గోవా నుంచి ట్రావెల్ బస్సుల్లో గుట్కాలు, ఢిల్లీ చాందినీ మార్కెట్ నుంచి చైనా వస్తువులు, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ పరికరాలు, ప్లగ్గులు, స్విచ్‌లు, వైర్లు, ఫ్యూజ్‌లు ఇక్కడి మార్కెట్లోకి పెద్ద మొత్తంలో వస్తున్నాయి. నిత్యావసరాలు కూడా.. నిత్యావసరాలైన కందిపప్పు, శనగలు, గోధుమ పిండి, మైదా, రవ్వ వంటి సరుకులు కూడా బిల్లుల్లేకుండానే వందల టన్నులు వస్తున్నాయని.. ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సీజన్‌ను బట్టి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పంచదార పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వస్తోందని పన్నుల శాఖ అధికారులే చెబుతున్నారు. ఇదంతా పన్నుల శాఖ అధికారులకు తెలియనిదేమీ కాదని.. ఉన్నతాధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బ్లాక్ మార్కెట్ వ్యవహారం శ్రుతి మించడంతో అధికారులు ఇటీవల రెండుసార్లు దాడులు చేశారని.. స్పెషల్ డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఈ దాడుల్లో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సరుకులే ఎక్కువగా పట్టుబడ్డాయని చెబుతున్నారు. మన దగ్గరి నుంచి కూడా.. మన రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఐరన్ ఉత్పత్తులు బిల్లులు లేకుండా వెళ్లిపోతున్నాయి. బళ్లారి నుంచి వచ్చే ముడిసరుకుతో శంషాబాద్, షాద్‌నగర్‌లలో ఐరన్ ఉత్పత్తులను తయారుచేసి బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇలా కనీసం రోజుకు 50 లారీల ఐరన్ ఉత్పత్తులు ఎలాంటి బిల్లులు లేకుండా, పన్ను కట్టకుండా ఇతర రాష్ట్రాలకు వెళుతున్నట్టు అంచనా. ట్రాన్స్పోర్టర్లు, డీలర్లు కుమ్మక్కై పెద్ద ఎత్తున సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం బ్లాక్ మార్కెట్ సమస్య పెరుగుతోంది. స్పెషల్ డ్రైవ్‌లు సరేగానీ.. దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న జీరో దందాతో రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం జరిగిన తర్వాత మేల్కొన్న పన్నుల శాఖ అధికారులు... ఈనెల ఏడో తేదీన పెద్ద ఎత్తున దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 బృందాలుగా ఏర్పడి 2 వేలకు పైగా వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో ఎలాంటి బిల్లులు లేకుండా 126 వాహనాల్లో రవాణా అవుతున్న సరుకులను సీజ్ చేసి.. రూ. 1.25 కోట్లు జరిమానా విధించారు. అంతకు ముందు హైదరాబాద్‌లో దాడులు చేసి రూ. 34 లక్షలు జరిమానా వసూలు చేశారు. అయితే ఈ దాడులను మరింత విస్తృతం చేయాల్సి ఉందని, అప్పుడు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 12 బృందాలకు షెడ్యూల్ ఇచ్చి.. తగిన శిక్షణ అందించి తనిఖీలు చేపట్టాలని చెబుతున్నారు. -
కార్బైడ్‌కు కళ్లెం ఏదీ?
* దొంగచాటుగా వినియోగం * ప్రజల ఆరోగ్యంతో చెలగాటం * క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా సత్తెనపల్లి: హానికరమైన కార్బైడ్‌తో మాగబెట్టిన కొన్ని రకాల పండ్లు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి పండ్లు ప్రజారోగ్యంపై దుష్పప్రభావం చూపుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రధాన పండ్ల మార్కెట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. దీంతో వ్యాపారులు కొద్ది రోజులు కార్బైడ్ జోలికి వెళ్లలేదు. తనిఖీలు తగ్గుముఖం పట్టగానేమళ్లీ పండ్లను కార్బైడ్‌తో మాగ బెట్టి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో కొన్ని పండ్లు రుచి, అసహజంగా ఉండడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది. రసాయనాలతో మాగబెట్టి మార్కెట్‌కు... పండ్ల వ్యాపారంపై అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ, నియంత్రణ ఉన్నప్పుడే అక్రమ వ్యాపారానికి కళ్లెం పడే వీలుంది. జిల్లాలో సహజంగా పండిన పండ్లు మార్కెట్లో భూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఆరు గాలం కష్టపడి పండించిన తమ దిగుబడులను రైతు క్షణం ఆలస్యం చేయకుండా అమ్ముకునేందుకు చూస్తుంటారు. వాటిని కొందరు వ్యాపారులు మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. దీంతో రసాయనాలతో మాగబెట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. అరటి, సపోటా, యాపిల్, వంటి పండ్లను కార్బైడ్‌తో మాగబెడుతున్నారు. అరటి గెలలపై రసాయనాలు చల్లి త్వరగా మాగబెడతారు. ప్రస్తుతం అరటి పండ్లను ఇథిలిన్ గదుల్లో మాగబెట్టే ప్రక్రియను వ్యాపారులు అనుసరిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, పట్టణ ప్రాంతాల్లో అరటి పంట్లను హోల్‌సేల్ వ్యాపారులు ఇథిలిన్ గదుల్లో మాగబెట్టి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తనిఖీలు తూతూ మంత్రం ... యాపిల్, పైనాపిల్, కమలా వంటి పండ్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి అవుతున్నాయి. మామిడి, అరటి, సపోటా, కర్భూజా జిల్లాలో పండుతున్నాయి. పెద్ద వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు నేరుగా సరఫరా అవుతున్నాయి. ఆయా పండ్లను గుట్టు చప్పుడు కాకుండా కార్బైడ్‌తో మాగబెడుతున్నట్లు సమాచారం. అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు గాలికి... పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రంలో పండ్ల వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా కొంత మంది పండ్లను కాయల రూపంలో ఉన్నప్పుడే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి అమ్మకాలు జరుపుతున్నారు. ఎన్నో ఏజెన్సీల ద్వారా ఈ వ్యాపారం సాగుతుంది. పండ్ల దుకాణాల వద్ద నిషేధిత రసాయనాలతో మాగబెట్టలేదు అనే బోర్డులు పెట్టించాలని ప్రభుత్వానికి గతంలో అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నా... ఎక్కడా పండ్ల వ్యాపారులు అలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత మూడు, నాలుగు, నెలల క్రితం వ్యాపార సంస్థల వద్ద హడావుడి చేసిన అధికారులు ప్రస్తుతం అటువైపు వెళ్లడం లేదు. దీంతో వ్యాపారులు కార్బైడ్‌తో పండిస్తున్నారు. ఎంత వరకు ఆరోగ్యం... అరటి పండ్లు గెల ప్రకృతి సిద్ధంగా మాగేందుకు కనీసం ఆరు రోజులు పడుతుంది. పసుపురంగు ఎక్కువగా ఉండదు. కానీ కొంత మంది వ్యాపారులు నీటిలో రసాయనాలను కలిపి గెలలపై పిచికారీ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే పండు పసుపు పచ్చగా మారి నిగనిగలాడుతుంది. జిల్లాలో సీజన్లో ప్రధానంగా అరటి, దానిమ్మ, పుచ్చకాయలు, మామిడి పండ్లు ఎక్కువగా పండుతున్నాయి. ఈ కాయలన్నీంటికి కార్బైడ్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఇలాంటి పండ్లను తినడం వల్ల జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు చూసీ చూడనట్లు ఉండడంతో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. -
పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు
ఏడాది పెంపునకు కేబినెట్ నిర్ణయం: రవిశంకర్ వెల్లడి * అక్రమ వ్యాపారం, నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు ఆస్కారం * రిజిస్టర్డ్ గోదాముల్లో పప్పులు, నూనెల నిల్వలపైనా పరిమితులు న్యూఢిల్లీ: పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించేందుకు చర్యలు తీసుకునే వీలు కల్పిస్తూ నిత్యావసర సరుకుల చట్టం కింద జారీ చేసిన నియంత్రణ ఉత్తర్వు గడువును మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు, వంట నూనెలు, వంట నూనె గింజల కొరత దృష్ట్యా.. వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటిని నియంత్రణ ఉత్తర్వు కిందకు తీసుకురావాలని 2014లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ నియంత్రణ ఉత్తర్వు గడువును ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించినట్లు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజలకు సంబంధించి.. రిజిస్టర్ చేసుకున్న గోదాముల్లో నిల్వపై పరిమితులు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నియంత్రణ ఉత్తర్వు గడువు పెంపు వల్ల.. ఆయా సరుకుల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వలపై పరిమితులు విధించటం, లెసైన్సు నిబంధనలు కఠినం చేయటం వంటి చర్యలు చేపట్టవచ్చునని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. తద్వారా అంతర్గత మార్కెట్లలో ఆయా సరుకులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు కూడా నియంత్రణలో ఉండేలా చూడవచ్చునని పేర్కొంది. నిత్యావసర సరుకులు, వాటి ధరలు.. ప్రత్యేకించి పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూసేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపింది. ‘కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలపై ఫ్యూచర్ ట్రేడింగ్‌ను ఇప్పటికే నిలిపివేశాం. పప్పుధాన్యాల ఎగుమతిని నిషేధించాం. వాటి దిగుమతిపై సుంకం తొలగించాం. దేశీయ మార్కెట్లో పప్పుధాన్యాల లభ్యతను పెంచేందుకు 5,000 టన్నుల కందులు, 5,000 టన్నుల మినుముల దిగుమతికి ఆదేశాలిచ్చాం. ఇవి త్వరలోనే రానున్నాయి. వీటివల్ల ధరల పరి స్థితి కాస్త సరళమవుతుంది’ అని వివరించింది. ఇదిలావుంటే.. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారత్, కంబోడియా దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
జోరుగా బొగ్గు దందా!
కొండపాక:అక్రమ బొగ్గు దందా మళ్లీ పడగ విప్పింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ అక్రమ వ్యాపారం మళ్లీ యథేచ్ఛగా కొనసాగుతోంది. బొగ్గు అక్రమ దందా వల్ల పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లుతోంది. దళారుల హస్తలాఘవంతో నాసిరకం బొగ్గును వినియోగించడం వల్ల బాయిలర్ల ద్వారా సరియైన మోతాదులో స్టీం ఉత్పత్తి కాక తీవ్ర నష్టం వాటిల్లుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బొగ్గు వ్యాపారంపై గతంలో మండలానికి చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఉన్నతాధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి కఠినంగా వ్యవహరించారు. దీంతో బొగ్గు దందా కొంతకాలం నిలిచిపోయినా విషయం పాతబడడం, అప్పుడున్న అధికార వ్యవస్థ మారడంతో మళ్లీ ఊపందుకుంది. మరోవైపు అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొండపాక మండలంలోని రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న లకుడారం, తిమ్మారెడ్డిపల్లి, దుద్దెడ, కుకునూర్‌పల్లి గ్రామాలు బొగ్గు అక్రమ వ్యాపారానికి కేంద్రాలుగా మారాయి. ఈ గ్రామాల్లో రాత్రి వేళ భారీ ఎత్తున బొగ్గు వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలకు వెళ్లే లక్షల రూపాయల విలువైన బొగ్గు దళారుల పాలవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడం.. ఈ వ్యాపారం కాసులు కురిపిస్తుండడంతో దళారులు అనతికాలంలోనే లక్షలు ఆర్జిస్తున్నారు. కొన్నేళ్ల కిందట దుద్దెడలో ఒకటి, రెండు కేంద్రాలతో ప్రారంభమైన ఈ వ్యాపారం అనతికాలంలోనే పలు గ్రామాలకు విస్తరించి సుమారు 30 దుకాణాల వరకు విస్తరించింది. దోపీడీ జరుగుతున్నది ఇలా... మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరి ఖనీ, చందాపూర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ పారిశ్రామిక వాడకు నిత్యం వందలాది లారీల బొగ్గు సరాఫరా అవుతోంది. దళారుల మాయాజాలం వల్ల ఈ బొగ్గులో కొంతభాగ ం అక్రమార్కుల పాలవుతోంది. మార్గమధ్యంలో అక్రమంగా వెలసిన బొగ్గు దుకాణాల్లో డ్రైవర్లు రూ. 350 నుంచి 400లకు క్వింటాలు చొప్పున అర టన్ను నుంచి రెండు టన్నుల వరకు నాణ్యమైన బొగ్గును అమ్ముతారు. అనంతరం తూకంలో వ్యత్యాసం రాకుండా దుకాణాల్లో ఉండే నాసిరకం బొగ్గు పొడినిగానీ, నీటిని చల్లడం ద్వారా సరిచేస్తారు. దళారులు అలా తీసిన బొగ్గును క్వింటాలుకు రూ. 600 వరకు ఇటుక బట్టీల నిర్మాణాలకు, ఇతర చిన్న చిన్న పరిశ్రమలకు విక్రయిస్తారు. బొగ్గు వ్యాపారులు డ్రైవర్లకు అడ్వాన్సుల రూంలో కొంత డబ్బు ముట్టజెప్పి తమ వైపు తిప్పుకుంటారు. గతంలో కిరాయి ట్రాక్టర్లతో బొగ్గును తరలించిన దళారులు నేడు సొంత లారీలతో గాజుల రామారం, గండిమైసమ్మ ప్రాంతంలోని పరిశ్రమలకు తరలిస్తూ లాభాలు గడిస్తుండటం గమనార్హం.మండల పరిధిలో 20కి పైగా ఉన్న బొగ్గు దుకాణాల్లో ప్రతీరోజూ రాత్రికి రాత్రే సుమారు 50 టన్నులకుపైగా బొగ్గును డంపు చేస్తున్నారు. తెల్లవారేసరికి ఆ బొగ్గును వ్యాపారులు లోడ్ చేసి అమ్ముతున్నారు. చీకటి మాటునే రోజుకు లక్షల విలువైన, పరిశ్రమలకు చెందిన బొగ్గు చేతులు మారుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా బొగ్గు లారీల రాకపోకల వల్ల గ్రామాలకు వెళ్లే రోడ్లు ఛిద్రమవుతున్నాయనీ, ఈ విషయంలో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
గుప్పుమన్న గంజాయి ఘాటు
ఆగని అక్రమ రవాణా ఏటా రూ.200 కోట్ల అక్రమ వ్యాపారం నెలరోజుల్లో రూ.10 కోట్ల గంజాయి పట్టివేత పోలీసులు పట్టుకున్నదే అధికం మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ గంజాయి సాగుకు.. అక్రమ రవాణాకు విశాఖ జిల్లా అడ్డాగా మారినట్లు పలు కేసులు రుజువు చేస్తున్నాయి. మత్తుపదార్థాల అక్రమ రవాణా, తయారీ, సాగును అరికట్లాల్సిన జిల్లా ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తులో తేలుతుండడం వల్లే, కోట్ల విలువచేసే గంజాయి రోజూ రోడ్డు,రైలు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చోడవరం: ఏజెన్సీతోపాటు, మైదాన గిరిజన ప్రాంతాల్లోనూ గంజాయి విస్తృతంగా సాగవుతోంది. ప్రధానంగా పాడేరు, చింతపల్లి ఏజెన్సీకి ప్రధాన రహదారులుగా ఉన్న మాడుగుల వయా చోడవరం, నర్సీపట్నం వయా తాళ్లపాలెం రహదారుల్లో గంజాయి అక్రమ రవాణా సాగుతున్నట్లు అనేక కేసులు రుజువు చేశాయి. కోటవుట్ల వయా అడ్డురోడ్డు, కొత్తవలస మీదుగా విశాఖపట్నం రూట్లలోనూ జోరుగా సాగుతోంది. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో సుమారు రూ. 80 కోట్లకు పైబడి విలువ చేసే గంజాయిని అడపాతడపా సమాచారంతో పట్టుకున్నారు. ఒక్క జూలైలోనే సుమారు రూ.10 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారంటే అక్రమ రవాణా ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కటకటాల్లో గంజాయి బస్తాలు! చోడవరం, మాడుగుల, రోలుగుంట, రావికమతం మండలాల్లో ఈ మధ్య కాలంలోనే భారీగా గంజాయి బస్తాలు పట్టుకున్నారు. సో మవారం కూడా సుమారు రూ.40లక్షల విలువైన గంజాయిని మాడుగుల, చోడవరంలో పట్టుకున్నారు. విశేషమేమిటంటే ఎక్సైజ్ శాఖ దాడులు కంటే పోలీసులు పట్టుకున్న గంజాయే ఎక్కువ. కొన్ని స్టేషన్లలో ఖైదీలు ఉండాల్సిన కటకటాల గదులు సైతం గంజాయి బస్తాలతో నిండిపోయి ఉన్నాయి. శీలావతి రకం గంజాయి అయితే ఇక్కడ కేజీ రూ.5వేలకు మించే ధర పలుకుతున్నట్లు సమాచారం. ఆ గ్రామాలు గంజాయి రవాణాకు ప్రసిద్ధి! ఇంత భారీగా లాభాలు వస్తున్నందున మాడుగుల, చీడికాడ, రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, దేవరాపల్లి, కె.కోటపాడు, నాతవరం మండలాల్లో కొన్ని గ్రా మాలు కేవలం గంజాయి విక్రయాలకే అడ్డాగా మారాయని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. ఏజెన్సీ నుం చి తెచ్చిన గంజాయిని ఈ ప్రాంతాల్లోనే ప్యాక్ చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకోసం ప్రత్యేకంగా ఆటోలు, జీపులు, కార్లు, వ్యాన్, మినీలారీలను వినియోగిస్తున్నారు. ప్రయాణికుల మాదిరిగా బ్యాగులను పట్టుకుని ఆర్టీసీ బస్సుల్లోనూ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. రైళ్లలోనూ...! అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం(అడ్డురోడ్డు), యలమంచిలి, గుల్లిపాడు రైల్వేస్టేషన్ల ద్వారా నిత్యం గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా అనకాపల్లి రైల్వేస్టేషన్లో ఓ రైలులో బెర్త్కింద దాచి ఉంచిన గంజాయి బ్యాగులను ప్రయాణికులే కనుగొని పట్టించడం దీనికి నిదర్శనం. రెండ్రోజుల కిందట పాడేరు ఐటీడీఏకు చెందిన అంబులెన్స్‌లోనే గంజాయి రవాణా అవుతూ పట్టుబడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత భారీగా అక్రమవ్యాపారం సాగుతున్నా దీనిని అరిక ట్టేందుకు ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పట్టుకున్న కేసుల్లో కూడా అమాయకులను అరెస్టు చేసి బడా వ్యాపారులను వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సమాచారం లేకే.. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఇస్తున్నవారిపై మాఫియా బెదిరింపుల వల్ల కొంత సమాచారం తగ్గింది. మాకంటే పోలీసులకే ఎక్కువ సమాచారం అందడం వల్ల వారు అధికంగా గంజాయి పట్టుకున్నారు. అన్నిచోట్లా వారి ప్రహారా కూడా ఎక్కువ. దీనికి తోడు మా సర్కిల్ పరిధిలో సిబ్బంది కొరత కారణంగా తర చూ దాడులు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇటీవల బెల్టుషాపులు నిలువరించాలని ఆదేశించడంతో ఉన్న సిబ్బందంతా దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయినా గంజాయి రవాణా మాఫియాపై విస్తృతంగానే దాడులు చేస్తున్నాం. మాఫియా నాయకులను అరెస్టు చేసే విధంగా నిఘా పెంచాం. మామూళ్ల మత్తులో మా శాఖ ఉన్నట్లు వచ్చే ఆరోపణలన్నీ అర్థరహితం. - శ్రీనివాస్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మాడుగుల