గుప్పుమన్న గంజాయి ఘాటు | Stop the illegal trafficking of marijuana | Sakshi
Sakshi News home page

గుప్పుమన్న గంజాయి ఘాటు

Published Tue, Aug 12 2014 1:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Stop the illegal trafficking of marijuana

  •       ఆగని అక్రమ రవాణా
  •      ఏటా రూ.200 కోట్ల అక్రమ వ్యాపారం
  •      నెలరోజుల్లో రూ.10 కోట్ల గంజాయి పట్టివేత
  •      పోలీసులు పట్టుకున్నదే అధికం
  •      మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
  • గంజాయి సాగుకు.. అక్రమ రవాణాకు విశాఖ జిల్లా అడ్డాగా మారినట్లు పలు కేసులు రుజువు చేస్తున్నాయి. మత్తుపదార్థాల అక్రమ రవాణా, తయారీ, సాగును అరికట్లాల్సిన జిల్లా ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తులో తేలుతుండడం వల్లే, కోట్ల విలువచేసే గంజాయి రోజూ రోడ్డు,రైలు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
     
    చోడవరం:  ఏజెన్సీతోపాటు, మైదాన గిరిజన ప్రాంతాల్లోనూ గంజాయి విస్తృతంగా సాగవుతోంది. ప్రధానంగా పాడేరు, చింతపల్లి ఏజెన్సీకి ప్రధాన రహదారులుగా ఉన్న మాడుగుల వయా చోడవరం, నర్సీపట్నం వయా తాళ్లపాలెం రహదారుల్లో గంజాయి అక్రమ రవాణా సాగుతున్నట్లు అనేక కేసులు రుజువు చేశాయి. కోటవుట్ల వయా అడ్డురోడ్డు,  కొత్తవలస మీదుగా విశాఖపట్నం రూట్లలోనూ జోరుగా సాగుతోంది. గడిచిన  ఏడాది కాలంలో జిల్లాలో సుమారు రూ. 80 కోట్లకు పైబడి విలువ చేసే గంజాయిని అడపాతడపా సమాచారంతో పట్టుకున్నారు. ఒక్క జూలైలోనే సుమారు రూ.10 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారంటే అక్రమ రవాణా ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
     
    కటకటాల్లో గంజాయి బస్తాలు!
     
    చోడవరం, మాడుగుల, రోలుగుంట, రావికమతం మండలాల్లో ఈ మధ్య కాలంలోనే భారీగా గంజాయి బస్తాలు పట్టుకున్నారు. సో మవారం కూడా సుమారు రూ.40లక్షల విలువైన గంజాయిని మాడుగుల, చోడవరంలో పట్టుకున్నారు. విశేషమేమిటంటే ఎక్సైజ్ శాఖ దాడులు కంటే పోలీసులు పట్టుకున్న గంజాయే ఎక్కువ. కొన్ని స్టేషన్లలో ఖైదీలు ఉండాల్సిన కటకటాల గదులు సైతం గంజాయి బస్తాలతో నిండిపోయి ఉన్నాయి. శీలావతి రకం గంజాయి అయితే ఇక్కడ కేజీ రూ.5వేలకు మించే ధర పలుకుతున్నట్లు సమాచారం.
     
    ఆ గ్రామాలు గంజాయి రవాణాకు ప్రసిద్ధి!

     
    ఇంత భారీగా లాభాలు వస్తున్నందున మాడుగుల, చీడికాడ, రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, దేవరాపల్లి, కె.కోటపాడు, నాతవరం మండలాల్లో కొన్ని గ్రా మాలు కేవలం గంజాయి విక్రయాలకే అడ్డాగా మారాయని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. ఏజెన్సీ నుం చి తెచ్చిన గంజాయిని ఈ ప్రాంతాల్లోనే ప్యాక్ చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకోసం ప్రత్యేకంగా ఆటోలు, జీపులు, కార్లు, వ్యాన్, మినీలారీలను వినియోగిస్తున్నారు. ప్రయాణికుల మాదిరిగా బ్యాగులను పట్టుకుని ఆర్టీసీ బస్సుల్లోనూ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు.  
     
    రైళ్లలోనూ...!
     
    అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం(అడ్డురోడ్డు), యలమంచిలి, గుల్లిపాడు రైల్వేస్టేషన్ల ద్వారా నిత్యం గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో ఓ రైలులో బెర్త్‌కింద దాచి ఉంచిన గంజాయి బ్యాగులను ప్రయాణికులే కనుగొని పట్టించడం దీనికి నిదర్శనం. రెండ్రోజుల కిందట పాడేరు ఐటీడీఏకు చెందిన అంబులెన్స్‌లోనే గంజాయి రవాణా అవుతూ పట్టుబడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత భారీగా అక్రమవ్యాపారం సాగుతున్నా దీనిని అరిక ట్టేందుకు ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పట్టుకున్న కేసుల్లో కూడా అమాయకులను అరెస్టు చేసి బడా వ్యాపారులను వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
     
    సమాచారం లేకే..

    గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఇస్తున్నవారిపై మాఫియా బెదిరింపుల వల్ల కొంత సమాచారం తగ్గింది. మాకంటే పోలీసులకే ఎక్కువ సమాచారం అందడం వల్ల వారు అధికంగా గంజాయి పట్టుకున్నారు. అన్నిచోట్లా వారి ప్రహారా కూడా ఎక్కువ. దీనికి తోడు మా సర్కిల్ పరిధిలో సిబ్బంది కొరత కారణంగా తర చూ దాడులు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇటీవల బెల్టుషాపులు నిలువరించాలని ఆదేశించడంతో ఉన్న సిబ్బందంతా దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయినా గంజాయి రవాణా మాఫియాపై విస్తృతంగానే దాడులు చేస్తున్నాం. మాఫియా నాయకులను అరెస్టు చేసే విధంగా నిఘా పెంచాం. మామూళ్ల మత్తులో మా శాఖ ఉన్నట్లు వచ్చే ఆరోపణలన్నీ అర్థరహితం.
     
    - శ్రీనివాస్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, మాడుగుల

     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement