భారీగా గంజాయి స్వాధీనం
- వ్యాన్ సీజ్..
- ఇద్దరు వ్యక్తులు అరెస్టు
నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్: చింతపల్లి నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జగన్‌మోహన్‌రావు తెలిపారు. గంజాయిని తరలించేందుకు ఉపయోగించిన వ్యాన్‌ను సీజ్ చేశారు. శనివారం సీఐ విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లి నుంచి వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు.
ఎక్సైజ్, పోలీసుల భయంతో సదరు వ్యాన్ దారి మళ్లించి పాకలపాడు గ్రామం మీదుగా వస్తుండగా మర్రిపాలెం వంతెన వద్ద పట్టుకున్నామన్నారు. వ్యాన్‌తో పాటు ఏటిగైరంపేటకు చెందిన కాళ్ల అప్పలనాయుడు(30), నాతవరం మండలం బెన్నవరం గ్రామానికి చెందిన దమ్ము రాజు(30) ఆదుపులోకి తీసుకున్నామన్నారు.వీరు కూలీ పని నిమిత్తం వెళ్లినట్టు విచారణలో తేలిందన్నారు.
గంజాయి తరలించడానికి ప్రధాన కారుకుడు, వ్యాన్ యజమాని అయిన చింతపల్లి మండలం, ఎర్రబొమ్మలు గ్రామానికి చెందిన బన్నిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ గంజాయిని విశాఖపట్నం షీలానగర్ తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్ బొంజన్న పాల్గొన్నారు.
రోలుగుంట: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. సీఐ కృష్ణవర్మ, ఎస్సై కృష్ణారావు రత్నం పేట-బీబీ.పట్నం రూట్‌లో ఆదివారం ఉదయం జరిపిన సోదాల్లో 40 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. బి.పట్నం-రత్నంపేట రూటులో పోలీసులు పెట్రోలింగు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు గోనె సంచుల్లో నింపిన గంజాయి ప్యాకింగ్‌లతో వాహనంలో తరలించడానికి పక్షుల చెరువు వద్ద తారసపడ్డారు. అనుమానం వచ్చి పరిశీలించగా గంజాయి బయటపడింది. ఈ సందర్భంగా రత్నంపేటకు చెందిన బత్తిన శ్రీను(26) బుదిరెడ్ల చెల్లినాయుడు(25)అను అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.