పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు | Pulses, Oils On 'Control' hike | Sakshi
Sakshi News home page

పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు

Published Wed, Sep 23 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు

పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు

ఏడాది పెంపునకు కేబినెట్ నిర్ణయం: రవిశంకర్ వెల్లడి
* అక్రమ వ్యాపారం, నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు ఆస్కారం
* రిజిస్టర్డ్ గోదాముల్లో పప్పులు, నూనెల నిల్వలపైనా పరిమితులు
న్యూఢిల్లీ: పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించేందుకు చర్యలు తీసుకునే వీలు కల్పిస్తూ నిత్యావసర సరుకుల చట్టం కింద జారీ చేసిన నియంత్రణ ఉత్తర్వు గడువును మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

పప్పుధాన్యాలు, వంట నూనెలు, వంట నూనె గింజల కొరత దృష్ట్యా.. వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటిని నియంత్రణ ఉత్తర్వు కిందకు తీసుకురావాలని 2014లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ నియంత్రణ ఉత్తర్వు గడువును ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించినట్లు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విలేకరులకు తెలిపారు.

పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజలకు సంబంధించి.. రిజిస్టర్ చేసుకున్న గోదాముల్లో నిల్వపై పరిమితులు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నియంత్రణ ఉత్తర్వు గడువు పెంపు వల్ల.. ఆయా సరుకుల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వలపై పరిమితులు విధించటం, లెసైన్సు నిబంధనలు కఠినం చేయటం వంటి చర్యలు చేపట్టవచ్చునని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. తద్వారా అంతర్గత మార్కెట్లలో ఆయా సరుకులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు కూడా నియంత్రణలో ఉండేలా చూడవచ్చునని పేర్కొంది.

నిత్యావసర సరుకులు, వాటి ధరలు.. ప్రత్యేకించి పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూసేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపింది. ‘కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలపై ఫ్యూచర్ ట్రేడింగ్‌ను ఇప్పటికే నిలిపివేశాం. పప్పుధాన్యాల ఎగుమతిని నిషేధించాం. వాటి దిగుమతిపై సుంకం తొలగించాం. దేశీయ మార్కెట్‌లో పప్పుధాన్యాల లభ్యతను పెంచేందుకు 5,000 టన్నుల కందులు, 5,000 టన్నుల మినుముల దిగుమతికి ఆదేశాలిచ్చాం.

ఇవి త్వరలోనే రానున్నాయి. వీటివల్ల ధరల పరి స్థితి కాస్త సరళమవుతుంది’ అని వివరించింది. ఇదిలావుంటే.. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారత్, కంబోడియా దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement