కార్బైడ్‌కు కళ్లెం ఏదీ? | Illegal trade in Fruit market | Sakshi
Sakshi News home page

కార్బైడ్‌కు కళ్లెం ఏదీ?

Published Wed, Mar 9 2016 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

కార్బైడ్‌కు కళ్లెం ఏదీ?

కార్బైడ్‌కు కళ్లెం ఏదీ?

* దొంగచాటుగా వినియోగం
* ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
* క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా

సత్తెనపల్లి: హానికరమైన కార్బైడ్‌తో మాగబెట్టిన కొన్ని రకాల పండ్లు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి పండ్లు ప్రజారోగ్యంపై దుష్పప్రభావం చూపుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రధాన పండ్ల మార్కెట్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. దీంతో వ్యాపారులు కొద్ది రోజులు కార్బైడ్ జోలికి వెళ్లలేదు. తనిఖీలు తగ్గుముఖం పట్టగానేమళ్లీ పండ్లను కార్బైడ్‌తో మాగ బెట్టి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో కొన్ని పండ్లు రుచి, అసహజంగా ఉండడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది.
 
రసాయనాలతో మాగబెట్టి మార్కెట్‌కు...
పండ్ల వ్యాపారంపై అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ, నియంత్రణ ఉన్నప్పుడే అక్రమ వ్యాపారానికి కళ్లెం పడే వీలుంది. జిల్లాలో సహజంగా పండిన పండ్లు మార్కెట్‌లో భూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఆరు గాలం కష్టపడి పండించిన తమ దిగుబడులను రైతు క్షణం ఆలస్యం చేయకుండా అమ్ముకునేందుకు చూస్తుంటారు. వాటిని కొందరు వ్యాపారులు మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు.

దీంతో రసాయనాలతో మాగబెట్టి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అరటి, సపోటా, యాపిల్, వంటి పండ్లను కార్బైడ్‌తో మాగబెడుతున్నారు. అరటి గెలలపై రసాయనాలు చల్లి త్వరగా మాగబెడతారు. ప్రస్తుతం అరటి పండ్లను ఇథిలిన్ గదుల్లో మాగబెట్టే ప్రక్రియను వ్యాపారులు అనుసరిస్తున్నారు.  గుంటూరు, నరసరావుపేట, పట్టణ ప్రాంతాల్లో అరటి పంట్లను హోల్‌సేల్ వ్యాపారులు ఇథిలిన్ గదుల్లో మాగబెట్టి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
 
తనిఖీలు తూతూ మంత్రం ...
యాపిల్, పైనాపిల్, కమలా వంటి పండ్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి అవుతున్నాయి. మామిడి, అరటి, సపోటా, కర్భూజా జిల్లాలో పండుతున్నాయి. పెద్ద వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు నేరుగా సరఫరా అవుతున్నాయి. ఆయా పండ్లను గుట్టు చప్పుడు కాకుండా కార్బైడ్‌తో మాగబెడుతున్నట్లు సమాచారం. అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 
నిబంధనలు గాలికి...
పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రంలో పండ్ల వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా కొంత మంది పండ్లను కాయల రూపంలో ఉన్నప్పుడే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి అమ్మకాలు జరుపుతున్నారు. ఎన్నో ఏజెన్సీల ద్వారా ఈ వ్యాపారం సాగుతుంది. పండ్ల దుకాణాల వద్ద నిషేధిత రసాయనాలతో మాగబెట్టలేదు అనే బోర్డులు పెట్టించాలని ప్రభుత్వానికి గతంలో అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నా... ఎక్కడా పండ్ల వ్యాపారులు అలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత మూడు, నాలుగు, నెలల క్రితం వ్యాపార సంస్థల వద్ద హడావుడి చేసిన అధికారులు ప్రస్తుతం అటువైపు వెళ్లడం లేదు. దీంతో వ్యాపారులు  కార్బైడ్‌తో పండిస్తున్నారు.
 
ఎంత వరకు ఆరోగ్యం...
అరటి పండ్లు గెల ప్రకృతి సిద్ధంగా మాగేందుకు కనీసం ఆరు రోజులు పడుతుంది. పసుపురంగు ఎక్కువగా ఉండదు. కానీ కొంత మంది వ్యాపారులు నీటిలో రసాయనాలను కలిపి గెలలపై పిచికారీ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే  పండు పసుపు పచ్చగా మారి నిగనిగలాడుతుంది. జిల్లాలో సీజన్‌లో ప్రధానంగా అరటి, దానిమ్మ, పుచ్చకాయలు, మామిడి పండ్లు ఎక్కువగా పండుతున్నాయి. ఈ కాయలన్నీంటికి కార్బైడ్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఇలాంటి పండ్లను తినడం వల్ల జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు చూసీ చూడనట్లు ఉండడంతో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement