Fruit traders
-
Priya Chhetri: ప్రియమైన విజయం
రెండేళ్ల కిందట ... ప్రియా ఛత్రి ఒక నిస్సహాయ మహిళ. ఢిల్లీ, గుర్గావ్లో ఓ క్లినిక్ ముందు నిలబడి అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఊహించుకుంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భర్త తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పరీక్ష చేసిన డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ ఆమె చేతిలో ఉంది. చీటీ అనడం అలవాటైన మాట, కానీ ఆమె చేతిలో ఉన్నది మందుల జాబితా. ఆ మందులు వాడాలంటే తను, భర్త సంపాదిస్తున్న డబ్బు చాలదు. మందులకు ఖర్చు చేస్తే ఇల్లు గడవదు. ఇల్లు గడిస్తే వైద్యం అందదు. తనేమో నాలుగు ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త సంజీత్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి నుంచి బతుకుదెరువు కోసం దేశ రాజధాని బాట పట్టిన అనేక కుటుంబాల్లో ప్రియ కుటుంబం ఒకటి. ఇరవై నాలుగేళ్ల వయసులో జీవితం ఆమెకి పెట్టిన పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గిన ప్రియ ఇప్పుడు సిలిగురిలో తోటి మహిళలకు రోల్ మోడల్ అయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే... మనదేశంలో పండని పండ్లను, గింజలను ఇంటింటికీ చేర్చడమే. తాజాగా, నాణ్యంగా ఉన్న పండ్లను ఇస్తుందన్న విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వారి వారి పనులు చేసుకుంటూనే పండ్ల వ్యాపారం చేస్తూ నెలకు ముఫ్పైవేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు ఆమె పెట్టుబడి తన శ్రమ మాత్రమే. ఆమెకు అండగా నిలిచింది ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని రాశి సోమన్ గొప్ప మనసు. జీవితం పండింది ప్రియ తన పండ్లు, గింజల వ్యాపారానికి తాను పని చేసే ఇళ్ల నుంచే కస్టమర్లను వెతుక్కుంది. తొలి ప్రయత్నంగా ఢిల్లీ మండి నుంచి పది అవకాడోలు తెచ్చింది. మూడు వందల ఆదాయం వచ్చింది. ‘‘రాశి అక్క నాకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకి తీసుకెళ్లి చూపించింది. మన దేశంలో అరుదుగా లభించే పరదేశీ పండ్ల గురించి వివరించింది. సాధారణంగా ఒక పండు హోల్‌సేట్ మార్కెట్ నుంచి తినేవారి చేతికి వచ్చే మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది. అనేక దఫాలు రవాణా అవుతుంది. పండ్ల దుకాణానికి చేరి పండ్లు కొనేవారికి అందేలోపు వాడిపోయేవి, కుళ్లిపోయేవి ఎన్నో. దుకాణదారులు ఆ నష్టాలను కూడా బాగున్న పండ్ల మీదనే రాబట్టుకోవాలి. నేను మండీ నుంచి కొనే గింజలు, పండ్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి కూడా నా కస్టమర్లకు అవసరమైన పండ్లనే తెస్తాను. కాబట్టి నా దగ్గర నిల్వ ఉండవు. తెచ్చిన రోజే కస్టమర్లకు చేరుస్తాను. అలాగే నాణ్యమైన పండ్లను మాత్రమే తెస్తాను. ఏరోజుకారోజు తాజా పండ్లను తినే వెసులుబాటును కల్పిస్తున్నాను. కాబట్టి నా దగ్గర క్రమం తప్పకుండా పండ్లు తెప్పించుకునే వాళ్లు 250 మంది ఉన్నారు. అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాను. వారానికి ఒకసారి తెప్పించుకునే వాళ్లు ఆదివారం రోజు గూగుల్ ఫార్మ్‌లో వాళ్లకు అవసరమైనవి తెలియచేస్తారు. గురువారం వాళ్లకు అందచేస్తాను. ఇవి కాకుండా తాజా పండ్లు రోజూ తెప్పించుకునే వాళ్లకు అలాగే అందిస్తున్నాను. పండ్ల దుకాణంలో దరకంటే చాలా తక్కువగా లభిస్తుండడంతో నా ప్రయత్నం విజయవంతమైంది. రెడ్ గ్లోబ్ గ్రేప్స్, బ్లూ బెర్రీ, మాండేరియన్స్, గోల్డెన్ కివీ, గ్రీన్ కివీ వంటి పండ్లతోపాటు వాల్నట్స్, ఫిగ్, విదేశీ ఖర్జూరాలు, హాజిల్‌నట్, క్రాన్బెర్రీ, మంచి జీడిపప్పు, బాదం వంటివి 30 రకాలు అందిస్తున్నాను. నేను, సంజీత్ మా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నాం. దీనిని వ్యాపారం, లాభాలు అనాలా లేక నేను అందిస్తున్న సర్వీస్‌కి లభిస్తున్న చార్జ్ అనాలో తెలియదు. కానీ నా పిల్లలు కూడా ప్యాకింగ్, డెలివరీ వంటి పనుల్లో సాయం చేస్తున్నారు. నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. దాంతో పదకొండవ తరగతితోనే చదువు ఆగిపోయింది. నాకున్న కొద్దిపాటి చదువుతో, నా శ్రమను పెట్టుబడి పెట్టాను. పెద్ద చదువులు చదివిన వాళ్లకంటే తక్కువేమీ కాదని ఈ ఏడాది మహిళాదినోత్సవం రోజు నా గురించి పేపర్లో రాశారు. అంతా మా యజమాని రాశి అక్క సహాయమే’’ అన్నది ప్రియా ఛత్రి. జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెట్టి విజేతలుగా నిలబెట్టాలని చూస్తుంది. ఆ పరీక్షలో విజయవంతమైన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. పరీక్ష నుంచి పారిపోయిన వాళ్లు పరీక్షతోపాటు జీవితేచ్ఛను కూడా పోగొట్టుకున్న పరాజితులుగా మిగులుతారు. ప్రియా ఛత్రి తన జీవితానికి తానే రక్షణ గొడుగు పట్టుకుంది. -
విష ఫలాలు!
♦ పండ్ల నిల్వకు ఫంగిసైడ్స్ ♦ విచ్చలవిడిగా వాడుతున్న వ్యాపారులు ♦ బండ్లగూడలో వెలుగులోకి వచ్చిన దారుణం ♦ వరుసదాడులు చేసిన పాతబస్తీ పోలీసులు ♦ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: హైకోర్టు హెచ్చరించినా పండ్ల వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. లాభార్జనే తప్ప ప్రజల ప్రాణాలకు ముప్పని తెలిసినా వారికి పట్టడం లేదు. పండ్లను గోదాముల్లో నిల్వ ఉంచేందుకు పంటలపై వాడే శిలీంద్ర నాశకాల (ఫంగిసైడ్స్)ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. పాతబస్తీలోని ఏడు ఠాణాల పరిధిలో సౌత్ జోన్ పోలీసులు బుధవారం చేపట్టిన వరుస తనిఖీల్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివిధ రకాల పండ్లను మగ్గించడానికి రసాయనాలు వాడటం తెలిసిందే. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో దాడులు చేసిన పోలీసులకు అంతకు మించిన ఆందోళనకర ‘ఫంగనీస్’ అంశం కళ్లముందు కనిపించింది. జంట కమిషనరేట్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను రొటీన్‌కు భిన్నంగా అర్ధరాత్రిళ్లు కాకుండా పగటిపూట చేపట్టాలని దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ నిర్ణయించారు. అందులో భాగంగా బుధవారం పగటిపూట ఈ ఆపరేషన్ చేపట్టారు. పాతబస్తీలోని మీర్‌చౌక్, రెయిన్‌బజార్, మొఘల్‌పుర, భవానీనగర్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ ఠాణాల పరిధిలోని 22 పండ్ల గోదాముపై ఏక కాలంలో దాడులు చేశారు. 200 మంది సిబ్బంది 15 బృందాలుగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. నిషేధిత రసాయనాల వాడకం... మొత్తం 22 గోదాముల్లో తనిఖీలు చేసిన పోలీసులు ఏడింటిలో ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. కాల్షియం కార్బైడ్‌తో మామిడి కాయలు, నిషేధిత రసాయనాలతో సపోటా, అరటి, కర్బూజాలను మగ్గిస్తున్నట్లు గమనించారు. చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ రహ్మత్‌నగర్‌లో ఉన్న ‘ఇస్మాయిల్ ఫ్రూట్స్’ గోదాములో మరింత ప్రమాదకరంగా పంటలపై వచ్చే ఫంగస్ సంబంధిత చీడపీడల్ని నిరోధించడానికి వినియోగించే ఫంగిసైడ్ ‘కార్బన్డిజం’ గుర్తించారు. దీని నిర్వాహకుడు ఇబ్రహీం బిన్ ఈసా జుంబ్లీని అదుపులోకి తీసుకున్నారు. గోదాముల్లో నిల్వ ఉంచే పండ్లకు పురుగులు, చీమలు పట్టి నాశనం చేయకుండా వాటిపై ఫంగిసైడ్స్ కలిపిన నీటిని పిచికారీ చేస్తున్నట్టు విచారణలో బిన్ వెల్లడించాడు. మిగిలిన ఆరు గోదాముల నిర్వాహకులు అరటి, సపోటా, కర్బూజా పండ్లను మగ్గించడానికి రసాయనాలు... పుచ్చకాయల రుచి, రంగు పెంచడానికి కెమికల్ కలర్స్, స్వీట్నింగ్లను ఇంజెక్షన్ల ద్వారా వాటిలోకి పంపుతున్నారని పోలీసులు వెల్లడించారు. బిన్‌తో పాటు షేక్ అన్వర్, మహ్మద్ నసీర్, సయ్యద్ ఒమర్, మహ్మద్ ఖదీర్, మహ్మద్ మహబూబ్, షేక్ ఎజాజ్‌లను అరెస్టు చేయగా... సయ్యద్ హుస్సేన్ పరారీలో ఉన్నాడన్నారు. వినియోగదారుల్ని మోసం చేస్తున్నందుకు ఐపీసీ 420, ఆహార పదార్థాలను విషపూరితంగా మారుస్తున్నందుకు 272, 273 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరెటరీకి పంపిస్తామన్నారు. గోదాములకు అనుమతులే లేవు... చాంద్రాయణగుట్ట పరిధిలో జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా పండ్ల గోదాములు సాగుతున్నాయి. మొఘల్‌పుర, మీర్‌చౌక్ పరిధిలోని గోదాముల్లో ప్రమాదకర యునీ రెపీ, రెస్పన్ స్ప్రేలను పండ్లపై చల్లుతున్నారు. ఫలక్‌నుమా పరిధిలోని గోదాముల్లో పుచ్చకాయలకు ‘ఇంజెక్షన్లు’ ఇస్తున్నారు. ఎలుకల్ని చంపడానికి వాడే జింక్ ఫాస్ఫేట్ను విచ్చలవిడిగా వాడటంతో అది పండ్లలోకీ చేరుతోంది. ఎన్నో అనర్థాలు ఫంగిసైడ్స్ కలిసిన పండ్లు తింటే వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణకోశ, కేన్సర్, నాడీ-రక్తప్రసరణ సమస్యలు, గుండె, కిడ్నీ వ్యాధులు వస్తాయని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బి.రవిశంకర్ తెలిపారు. -
కార్బైడ్‌కు కళ్లెం ఏదీ?
* దొంగచాటుగా వినియోగం * ప్రజల ఆరోగ్యంతో చెలగాటం * క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా సత్తెనపల్లి: హానికరమైన కార్బైడ్‌తో మాగబెట్టిన కొన్ని రకాల పండ్లు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి పండ్లు ప్రజారోగ్యంపై దుష్పప్రభావం చూపుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రధాన పండ్ల మార్కెట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. దీంతో వ్యాపారులు కొద్ది రోజులు కార్బైడ్ జోలికి వెళ్లలేదు. తనిఖీలు తగ్గుముఖం పట్టగానేమళ్లీ పండ్లను కార్బైడ్‌తో మాగ బెట్టి మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో కొన్ని పండ్లు రుచి, అసహజంగా ఉండడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది. రసాయనాలతో మాగబెట్టి మార్కెట్‌కు... పండ్ల వ్యాపారంపై అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ, నియంత్రణ ఉన్నప్పుడే అక్రమ వ్యాపారానికి కళ్లెం పడే వీలుంది. జిల్లాలో సహజంగా పండిన పండ్లు మార్కెట్లో భూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఆరు గాలం కష్టపడి పండించిన తమ దిగుబడులను రైతు క్షణం ఆలస్యం చేయకుండా అమ్ముకునేందుకు చూస్తుంటారు. వాటిని కొందరు వ్యాపారులు మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. దీంతో రసాయనాలతో మాగబెట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. అరటి, సపోటా, యాపిల్, వంటి పండ్లను కార్బైడ్‌తో మాగబెడుతున్నారు. అరటి గెలలపై రసాయనాలు చల్లి త్వరగా మాగబెడతారు. ప్రస్తుతం అరటి పండ్లను ఇథిలిన్ గదుల్లో మాగబెట్టే ప్రక్రియను వ్యాపారులు అనుసరిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, పట్టణ ప్రాంతాల్లో అరటి పంట్లను హోల్‌సేల్ వ్యాపారులు ఇథిలిన్ గదుల్లో మాగబెట్టి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తనిఖీలు తూతూ మంత్రం ... యాపిల్, పైనాపిల్, కమలా వంటి పండ్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి అవుతున్నాయి. మామిడి, అరటి, సపోటా, కర్భూజా జిల్లాలో పండుతున్నాయి. పెద్ద వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు నేరుగా సరఫరా అవుతున్నాయి. ఆయా పండ్లను గుట్టు చప్పుడు కాకుండా కార్బైడ్‌తో మాగబెడుతున్నట్లు సమాచారం. అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు గాలికి... పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రంలో పండ్ల వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా కొంత మంది పండ్లను కాయల రూపంలో ఉన్నప్పుడే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి అమ్మకాలు జరుపుతున్నారు. ఎన్నో ఏజెన్సీల ద్వారా ఈ వ్యాపారం సాగుతుంది. పండ్ల దుకాణాల వద్ద నిషేధిత రసాయనాలతో మాగబెట్టలేదు అనే బోర్డులు పెట్టించాలని ప్రభుత్వానికి గతంలో అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నా... ఎక్కడా పండ్ల వ్యాపారులు అలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత మూడు, నాలుగు, నెలల క్రితం వ్యాపార సంస్థల వద్ద హడావుడి చేసిన అధికారులు ప్రస్తుతం అటువైపు వెళ్లడం లేదు. దీంతో వ్యాపారులు కార్బైడ్‌తో పండిస్తున్నారు. ఎంత వరకు ఆరోగ్యం... అరటి పండ్లు గెల ప్రకృతి సిద్ధంగా మాగేందుకు కనీసం ఆరు రోజులు పడుతుంది. పసుపురంగు ఎక్కువగా ఉండదు. కానీ కొంత మంది వ్యాపారులు నీటిలో రసాయనాలను కలిపి గెలలపై పిచికారీ చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే పండు పసుపు పచ్చగా మారి నిగనిగలాడుతుంది. జిల్లాలో సీజన్లో ప్రధానంగా అరటి, దానిమ్మ, పుచ్చకాయలు, మామిడి పండ్లు ఎక్కువగా పండుతున్నాయి. ఈ కాయలన్నీంటికి కార్బైడ్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఇలాంటి పండ్లను తినడం వల్ల జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు చూసీ చూడనట్లు ఉండడంతో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. -
కార్బైడ్ వినియోగానికి స్వస్తి
ప్రజారోగ్య పరిరక్షణకు సహకరిస్తామంటున్న పండ్ల వ్యాపారులు ధర్మవరం టౌన్: పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో తమ వంతు పాత్ర పోషిస్తామంటున్నారు ధర్మవరం పట్టణంలోని పండ్ల వ్యాపారులు. నిర్వహణ వ్యయం అధికంగానే ఉన్నా.. మామిడి, అరటి తదితర పండ్లను పక్వం చెందించడంలో క్యాల్షియం కార్బైడ్ వినియోగానికి స్వస్తి పలికి, సహజ పద్ధతులను అవలంబిస్తున్నామని, తద్వారా తమ వంతుగా సమాజానికి సేవ చేస్తున్నామంటున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇథిలీన్ ద్వారా పండ్లను మాగబెట్టే యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఇథిలీన్ యూనిట్లలో మాగబెట్టిన పండ్ల వినియోగం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ప్రోత్సాహం అవసరం రూ. 80 విలువ చేసే కిలో క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి ఒక టన్ను కాయలను మాగబెట్టే అవకాశం ఉంది. అదే ఇథిలీన్‌ను వినియోగిస్తే టన్ను కాయలకు విద్యుత్తు, ఇథిలీన్ గ్యాస్‌తో కలిపి రూ.2,500 వరకు వ్యయం అవుతుంది. పైగా ఈ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులే ఇంతకాలం క్యాల్షియం కార్బైడ్ వినియోగించేందుకు కారణమయ్యాయి. కాగా, ప్రభుత్వం స్పందించి ఇథిలీన్ యూనిట్ ఏర్పాటుకు ప్రోత్సహించాలని వ్యాపారులు కోరుతున్నారు.