విష ఫలాలు!
♦ పండ్ల నిల్వకు ఫంగిసైడ్స్
♦ విచ్చలవిడిగా వాడుతున్న వ్యాపారులు
♦ బండ్లగూడలో వెలుగులోకి వచ్చిన దారుణం
♦ వరుసదాడులు చేసిన పాతబస్తీ పోలీసులు
♦ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు హెచ్చరించినా పండ్ల వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. లాభార్జనే తప్ప ప్రజల ప్రాణాలకు ముప్పని తెలిసినా వారికి పట్టడం లేదు. పండ్లను గోదాముల్లో నిల్వ ఉంచేందుకు పంటలపై వాడే శిలీంద్ర నాశకాల (ఫంగిసైడ్స్)ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. పాతబస్తీలోని ఏడు ఠాణాల పరిధిలో సౌత్ జోన్ పోలీసులు బుధవారం చేపట్టిన వరుస తనిఖీల్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివిధ రకాల పండ్లను మగ్గించడానికి రసాయనాలు వాడటం తెలిసిందే. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ క్రమంలో దాడులు చేసిన పోలీసులకు అంతకు మించిన ఆందోళనకర ‘ఫంగనీస్’ అంశం కళ్లముందు కనిపించింది. జంట కమిషనరేట్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను రొటీన్‌కు భిన్నంగా అర్ధరాత్రిళ్లు కాకుండా పగటిపూట చేపట్టాలని దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ నిర్ణయించారు. అందులో భాగంగా బుధవారం పగటిపూట ఈ ఆపరేషన్ చేపట్టారు. పాతబస్తీలోని మీర్‌చౌక్, రెయిన్‌బజార్, మొఘల్‌పుర, భవానీనగర్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ ఠాణాల పరిధిలోని 22 పండ్ల గోదాముపై ఏక కాలంలో దాడులు చేశారు. 200 మంది సిబ్బంది 15 బృందాలుగా ఈ దాడుల్లో పాల్గొన్నారు.
నిషేధిత రసాయనాల వాడకం...
మొత్తం 22 గోదాముల్లో తనిఖీలు చేసిన పోలీసులు ఏడింటిలో ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. కాల్షియం కార్బైడ్‌తో మామిడి కాయలు, నిషేధిత రసాయనాలతో సపోటా, అరటి, కర్బూజాలను మగ్గిస్తున్నట్లు గమనించారు. చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ రహ్మత్‌నగర్‌లో ఉన్న ‘ఇస్మాయిల్ ఫ్రూట్స్’ గోదాములో మరింత ప్రమాదకరంగా పంటలపై వచ్చే ఫంగస్ సంబంధిత చీడపీడల్ని నిరోధించడానికి వినియోగించే ఫంగిసైడ్ ‘కార్బన్‌డిజం’ గుర్తించారు. దీని నిర్వాహకుడు ఇబ్రహీం బిన్ ఈసా జుంబ్లీని అదుపులోకి తీసుకున్నారు.
గోదాముల్లో నిల్వ ఉంచే పండ్లకు పురుగులు, చీమలు పట్టి నాశనం చేయకుండా వాటిపై ఫంగిసైడ్స్ కలిపిన నీటిని పిచికారీ చేస్తున్నట్టు విచారణలో బిన్ వెల్లడించాడు. మిగిలిన ఆరు గోదాముల నిర్వాహకులు అరటి, సపోటా, కర్బూజా పండ్లను మగ్గించడానికి రసాయనాలు... పుచ్చకాయల రుచి, రంగు పెంచడానికి కెమికల్ కలర్స్, స్వీట్నింగ్‌లను ఇంజెక్షన్ల ద్వారా వాటిలోకి పంపుతున్నారని పోలీసులు వెల్లడించారు. బిన్‌తో పాటు షేక్ అన్వర్, మహ్మద్ నసీర్, సయ్యద్ ఒమర్, మహ్మద్ ఖదీర్, మహ్మద్ మహబూబ్, షేక్ ఎజాజ్‌లను అరెస్టు చేయగా... సయ్యద్ హుస్సేన్ పరారీలో ఉన్నాడన్నారు. వినియోగదారుల్ని మోసం చేస్తున్నందుకు ఐపీసీ 420, ఆహార పదార్థాలను విషపూరితంగా మారుస్తున్నందుకు 272, 273 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరెటరీకి పంపిస్తామన్నారు.
గోదాములకు అనుమతులే లేవు...
చాంద్రాయణగుట్ట పరిధిలో జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండా పండ్ల గోదాములు సాగుతున్నాయి. మొఘల్‌పుర, మీర్‌చౌక్ పరిధిలోని గోదాముల్లో ప్రమాదకర యునీ రెపీ, రెస్పన్ స్ప్రేలను పండ్లపై చల్లుతున్నారు. ఫలక్‌నుమా పరిధిలోని గోదాముల్లో పుచ్చకాయలకు ‘ఇంజెక్షన్లు’ ఇస్తున్నారు. ఎలుకల్ని చంపడానికి వాడే జింక్ ఫాస్ఫేట్‌ను విచ్చలవిడిగా వాడటంతో అది పండ్లలోకీ చేరుతోంది.
ఎన్నో అనర్థాలు
ఫంగిసైడ్స్ కలిసిన పండ్లు తింటే వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణకోశ, కేన్సర్, నాడీ-రక్తప్రసరణ సమస్యలు, గుండె, కిడ్నీ వ్యాధులు వస్తాయని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బి.రవిశంకర్ తెలిపారు.