అలాంటి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
ఆరోగ్యంగా ఉండే పశువుల వధకు ధ్రువపత్రాలిచ్చే వైద్యులపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆవు, ఎద్దు, దూడలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందుకు విరుద్ధంగా వధకు అనుకూలమైన వేనంటూ సర్టిఫికెట్ ఇచ్చే పశువుల డాక్టర్‌పై గోవధ నిషేధ చట్టం కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా చట్ట సవరణలు తీసుకురావాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా ధ్రువపత్రాలు ఇచ్చిన వైద్యుడిపై మోసం, హాని కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టా ల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జంతువులను వధించడం, హాని తలపె ట్టడం వంటి నేరానికి పాల్పడే వారిపై కేసు నమోదు చేసేందుకు భారత శిక్షా స్మృతిలో నిర్దేశించిన సెక్షన్ 429ను సవరించి, దానిని నాన్ బెయిలబుల్‌గా మార్చాలని ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎంత వరకు అమలయ్యాయో తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ధర్మాసనం తన రిజిస్ట్రీని ఆదేశించింది.
అంతేకాక జంతు హింస నిరోధక చట్టం, గోవధ నిషేధం చట్టాలకు సైతం సవరణలు చేసి, సెక్షన్ 429లో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఈ చట్టాల కింద కూడా విధించేలా చర్యలు తీసుకున్నారో లేదో కూడా తెలియచేయాలని సూచించింది. గోవులు, ఇతర జంతువుల సంక్షేమం కోసం చట్ట ప్రకారం ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థ లేకపోతే... దాని ఏర్పాటునకు ఏం చర్యలు తీసుకున్నారో కూడా ప్రభుత్వాల నుంచి తెలుసుకుని చెప్పాలంది. తదుపరి విచారణను జూలై 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఇటీవల ఉత్తర్వులిచ్చారు.
ఇదీ కేసు... : నల్లగొండ జిల్లా గొరికినేని తండాకు చెందిన రమావత్ హనుమ అలి యాస్ హనుమంతు బక్రీద్ సందర్భంగా వధించేందుకు 63 ఆవులు, 2 ఎద్దులను మేపుతున్నాడు. ఈ క్రమంలో వీటిని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా... సమాచారం అందుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశా రు. స్వాధీనం చేసుకున్న ఆవులు, ఎద్దులను వదిలిపెట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హనుమంతు కింది కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో హనుమంతు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఇటీవల విచారణ జరిపి, 97 పేజీల ఉత్తర్వులు జారీ చేశారు.