కార్బైడ్ వినియోగానికి స్వస్తి
ప్రజారోగ్య పరిరక్షణకు సహకరిస్తామంటున్న పండ్ల వ్యాపారులు
ధర్మవరం టౌన్: పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో తమ వంతు పాత్ర పోషిస్తామంటున్నారు ధర్మవరం పట్టణంలోని పండ్ల వ్యాపారులు. నిర్వహణ వ్యయం అధికంగానే ఉన్నా.. మామిడి, అరటి తదితర పండ్లను పక్వం చెందించడంలో క్యాల్షియం కార్బైడ్ వినియోగానికి స్వస్తి పలికి, సహజ పద్ధతులను అవలంబిస్తున్నామని, తద్వారా తమ వంతుగా సమాజానికి సేవ చేస్తున్నామంటున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇథిలీన్ ద్వారా పండ్లను మాగబెట్టే యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఇథిలీన్ యూనిట్లలో మాగబెట్టిన పండ్ల వినియోగం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
ప్రోత్సాహం అవసరం
రూ. 80 విలువ చేసే కిలో క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి ఒక టన్ను కాయలను మాగబెట్టే అవకాశం ఉంది. అదే ఇథిలీన్‌ను వినియోగిస్తే టన్ను కాయలకు విద్యుత్తు, ఇథిలీన్ గ్యాస్‌తో కలిపి రూ.2,500 వరకు వ్యయం అవుతుంది. పైగా ఈ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులే ఇంతకాలం క్యాల్షియం కార్బైడ్ వినియోగించేందుకు కారణమయ్యాయి. కాగా, ప్రభుత్వం స్పందించి ఇథిలీన్ యూనిట్ ఏర్పాటుకు ప్రోత్సహించాలని వ్యాపారులు కోరుతున్నారు.