calcium carbide
-
మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..
వేసవి కాలం అంటే నోరూరించే మామిడి పండ్ల సీజన్. వీటిని ఇష్టపడని వారెవ్వరుంటారు. అయితే ఆ మామిడి పండ్లను కృత్రిమంగా పండించడంపై ఫుడ్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వ్యాపారస్తులను, పండ్ల వ్యాపరులను ఆహార భద్రత ప్రమాణలు పాటించాని పేర్కొంది. చట్టవిరుద్ధంగా కాల్షియం కార్పైడ్ వంటి రసాయనాలను వినియోగించకూడదని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అసలు కృత్రిమంగా మామిడి పండ్లను పండించేందుకు ఏం ఉపయోగాస్తారు? కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించగలం తదితరాలు గురించి తెలుసుకుందాం.!కాల్షియం కార్బైడ్ అంటే..మామిడిపండ్లు తొందరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్‌ని వినియోగిస్తారు. దీనిలో ఫాస్పరస్ జాడలు కలిగి ఉన్న ఎసిటిలీన్ వాయవుని విడుదల చేస్తుంది. అందువల్ల ఈ రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరం. ఇలా పండించిన పండ్లను తీసుకోవడం వల్ల తలనొప్పి, తరుచుగా దాహం, చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది. వాంతులు, చర్మపు పూతలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అందువల్ల ఇలాంటి కెమికల్స్ వినియోగాన్ని నిషేధించింది. 2011 రెగ్యులేషన్ నిబంధనల ప్రకారం కృత్రిమంగా పండించేందుకు కాల్షియ కార్బైడ్ వినియోగించొద్దని తెలిపింది. ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ వాయువును ఉపయోగించొచ్చని తెలిపింది. ఇథిలిన్ వాయువు కార్బైడ్ వాయువుకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంది. ఇది పండును సహజంగా పండేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఇథిలిన్ వాయువుని గణనీయమైన పరిమాణంలోనే వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది పంట రకం, పరిపక్వత ఆధారంగా ఎంత మేర వినయోగించాలనేది నిర్ణయించడం జరుగుతుంది. చాలా వరకు సుమారు 100 పీపీఎంల వరకు వినియోగించేలా అనుమతి ఇచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. దీన్ని ఎలా గుర్తించాలంటే..ఇక్కడ మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను పండించారా? లేదా సహజమైన రీతీలో పండాయా అనేది ఎలా గుర్తించాలంటే..అందుకు నాలుగు సింపుల్ చిట్కాల ఉన్నాయి. అవి ఫాలో అయిపోండి. అవేంటంటే..ఆకృతిని పరిశీలించటం: మామిడిపండ్లు అసహజంగా ఏకరీతిగా కనిపించి చుట్టూ ఈగలు, కీటకాలు లేకుంటే వాటికి ఘాటైన రసాయనాలను కలిపారని అర్థం. వాటర్ పరీక్ష: కృత్రిమంగా పండిన మామిడి పండ్లు నీటిపై తేలుతుంది. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత మామిడికాయలను ఒక బకెట్ నీటిలో ఉంచండి. అవి సేంద్రియంగా పండించారా లేదా అన్నది తెలిసిపోతుంది. టేస్టీని బట్టి: కృత్రిమంగా పండిన మామిడిపండ్లు సేంద్రీయ వాటితో పోల్చితే తక్కువ జ్యూసీ, తక్కువ బరువుని కలిగి ఉంటాయి. అగ్గిపుల్ల టెస్ట్: ఈ పరీక్ష అత్యంత భద్రతతో నిర్వహించాల్సి ఉంటుంది. అగ్గిపుల్లను వెలిగించి మామిడి పండ్ల దగ్గరకు తీసుకువస్తే..మంటలు లేదా మెరుపులో కూడిన మంట వెదజల్లిన కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టారని అర్థం. (చదవండి: హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!) -
మామిడి పండు తింటున్నారా?.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
కర్నూలు(అగ్రికల్చర్): పళ్లలో మామిడి రారాజు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తూ నోరూరిస్తున్నాయి. పసుపు పచ్చ రంగులో ఆకర్షించే అలాంటి మామిడిని చూసి మోసపోవద్దంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు అయితేనే అంతలా ఊరిస్తాయని, వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమంటూ హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా లేదా ఎథ్రిల్ లిక్విడ్‌తోనైనా మాగబెట్టిన పండ్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లకు సహజసిద్ధంగా మాగిన పండ్లను ఎలా గుర్తు పట్టాలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. చదవండి: ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే! కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు.. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు మొత్తం లేత పసుపు రంగులో ఒకే విధమైన కాంతితో నిగనిగలాడుతూ ఉంటుంది. పైకి మాగినట్లు కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి రుచి పుల్లగా ఉంటుంది. పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం తక్కువగా ఉండి, తీపి, రుచి అంతంత మాత్రమే ఉంటాయి. పండు తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. పండు త్వరగా పాడైపోతుంది. సహజసిద్ధంగా మాగిన పండు.. సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. తీయగా, రుచిగా ఉంటుంది. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు.. కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తింటే కాన్సర్, అల్సర్, కాలేయం(లివర్), మూత్ర పిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీన్ వాయువు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయ పద్ధతులు.. మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాలలో ఉంచాలి. లేదా పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. లేదా తప్పని పరిస్థితుల్లో మామిడి కాయలు మాగబెట్టాల్సి వస్తే ఇథిలిన్ వాయువు(గ్యాస్) 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేలా ఉంచితే 5 రోజుల్లో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ఈపద్ధతిని రైపనింగ్ చాంబర్లో వినియోగిస్తున్నారు. ఎథ్రిల్ లిక్విడ్‌లో 5 నిముషాలు పాటు ముంచి మూడు, నాలుగు రోజులు నిల్వ చేస్తే సహజత్వానికి దగ్గర మాగుతాయి. ముంచడం సాధ్యం కానిపక్షంలో ఎథ్రిల్ లిక్విడ్‌ను కాయలకు స్ప్రే చేయవచ్చు. తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీళ్లతో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. లేదా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కాల్షియం కార్బైడ్‌తో మాగించొద్దు ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగించరాదు. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎలా మాగించాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, ఏడీ ఉద్యానశాఖ కర్నూలు -
ఎన్‌రిప్.. 'పండంటి' ఆరోగ్యానికి టిప్!
సాక్షి, హైదరాబాద్: పండ్లను మగ్గబెట్టే క్రమంలో అటు పర్యావరణానికి, ఇటు మానవ ఆరోగ్యానికి హానికలిగించే రసాయన కారకాలను పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇథిలిన్ వినియోగంతో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ‘ఎన్‌రిప్’అనే ఉత్పత్తులను వినియోగించనుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించే మామిడి, నారింజ, అరటి పండ్లను మగ్గబెట్టే క్రమంలో భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించనుంది. బెంగళూరులోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మామిడి, అరటి పండ్లపై ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపిన అనంతరం ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’కూడా ఈ ఉత్పత్తులను అనుమతించింది. దీంతో మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సహకారంతో ఉద్యాన శాఖ ముందుగా రాష్ట్రంలోని పెద్ద పండ్ల మార్కెట్లలో త్వరలోనే ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టడంపై పరిశీలన జరపనుంది. వెంటనే ప్రారంభించండి త్వరలోనే మామిడి పండ్ల సీజన్ రానున్నందున ‘ఎన్‌రిప్’పరిజ్ఞానం వినియోగంపై ప్రయోగం చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పేరుగాంచిన గడ్డిఅన్నారం, జగిత్యాల, వరంగల్ మార్కెట్లలో ప్రయోగాలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వీటిలో త్వరలోనే ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆ ప్రకారం పండ్లను మగ్గబెట్టే వ్యాపారులు లేదా ఏజెంట్లు ఎప్పటికప్పుడు నమూనాలను పరిశీలించి తాము అనుసరిస్తున్న పద్ధతుల్లో ‘ఎసిటిలిన్’లేదా ‘కార్బైడ్’లను వినియోగించడం లేదని ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా ఆ విధానాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు గతంలో మాదిరిగా వ్యవసాయ క్షేత్రాల్లోనే ‘ఇథిలిన్’పౌడర్ ద్వారా మగ్గబెట్టే విధానాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యాల్షియం కార్బైడ్‌తో అనర్థాలివే - కాల్షియం కార్బైడ్ వినియోగం ద్వారా వెలువడే కార్బైడ్, ‘ఎసిటిలిన్’వాయువు ద్వారా పండ్లను మగ్గబెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరమంటూ 2011 నుంచి ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ఈ పద్ధతిని అనుమతించడం లేదు. - ఈ పద్ధతిలో పండ్లను పక్వానికి తెచ్చే పనిని చేపట్టే కార్మికులు, ఆ వ్యాపారులు, పండ్లు అమ్మే చిరు వ్యాపారులు, వారితో కలిసి జీవించే వారి కుటుంబీకులతో పాటు పండ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా కార్బైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. - ఈ పండ్లు తినే చిన్నారులు, వృద్ధులతో పాటు గర్భిణుల ఆరోగ్యానికి ముప్పు. - మగ్గబెట్టిన పండ్లను రవాణా చేసే సమయంలో అవి పాడుకాకుండా ఉండేందుకు క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించడం వల్ల హానికర వాయువులు వెలువడి పర్యావరణంతో పాటు పంటలు, ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. దీంతో ‘ఇథిలిన్’తో పాటు ‘ఎన్‌రిప్’ఉత్పత్తులను వినియోగించాలని నిర్ణయించింది. -
కార్బైడ్ పండ్లను ఇలా గుర్తించొచ్చు
సాక్షి, అమరావతిబ్యూరో : కొందరు వ్యాపారుల కాసుల కక్కుర్తి సామాన్య ప్రజలను అనారోగ్యం పాలు జేస్తోంది. మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపించే మామిడి పండ్లు మగ్గబెట్టేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్, ఇథలిన్‌ను వినియోగిస్తున్నారు. ఇటీవల వీచిన పెనుగాలులకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. కృష్ణా జిల్లాలో నూజివీడు, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో అధికంగా మామిడి తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82 వేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. జిల్లాలో పండిన మామిడి కాయలే గాక తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున విజయవాడలోని నున్న మామిడి మార్కెట్‌కు తరలి వస్తుంటాయి. ఇక్కడి నుంచి రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ప్రకృతి పరంగా కాయలు మగ్గబెట్టకుండా కార్బైడ్, ఇథిలిన్‌తో మాగబెట్టడం వల్ల కాయలు తొందరగా పాడవుతున్నాయి. ఇథలిన్ అమ్మకాలపై కేంద్రం ఆరా రాష్ట్రంలో ఇథలిన్ అమ్మకాలపై ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం అధికారులు ఆరా తీశారు. రాష్ట్రంలో మామిడి పండ్లను మగ్గబెట్టడంతో ఇబ్బడిముబ్బడిగా రసాయనాలు వాడుతున్న సమాచారం రావడంతో దీనిపై ఇక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైనా నుంచి ఇథలిన్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. మామిడి పండ్లు మగ్గబెట్టడంతో పాటు రంగు రావడంలో కీలకపాత్ర పోషించేందుకు కలిపే రసాయనాలలో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇథలిన్ ఏ ప్యాక్‌లో వస్తోంది.. ఎన్ని గ్రాములు ఉంటోంది, దీన్ని ఎలా వాడుతున్నారో పూర్తి వివరాలు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తనిఖీలు నామమాత్రం ప్రజలకు సురక్షిత పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది.ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ఉన్న సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కార్బైడ్, ఇథలిన్ వాడకాన్ని హైకోర్టు నిషేధించినా లెక్కచేయడం లేదు. వక్రమార్గాల ద్వారా రసాయనాలను తెప్పించుకుని వినియోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలకు వెళ్లినప్పుడు పండ్ల ను తీసుకెళ్లి నిషేధిత రసాయనాలు వాడినట్లు నిర్థారణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి.. తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. స్వచ్ఛమైన పండ్లను ఇలా గుర్తించొచ్చు ♦ పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. ♦ పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది. ♦ తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన గుబాళిస్తుంది. కొద్ది దూరం వరకు పరిమిళమైన వాసన వస్తుంది. కార్బైడ్, ఇథలిన్‌తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి ♦ పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపురంగు కలిగి ఉంటుంది. ♦ పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. ♦ పండును ముక్కు దగ్గర ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. ♦ పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి. ♦ తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కార్బైడ్, ఇథలిన్‌తో పెను ప్రమాదం సహజసిద్ధంగా పండిన పండ్లను కాకుండా కార్బైడ్, ఇథిలిన్‌తో మగ్గబెట్టిన పండ్లు తినడం వల్ల అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీస్ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రమాదం చూపడంతో పాటు జీర్ణవ్యవస్థ మందగించడం, తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, విరోచనాలు అవుతాయి. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువగా తింటే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. – రత్నగిరి, వైద్యుడు -
ఆ రసాయనం.. హానికరం
► కాల్సియం కార్బైడ్‌తో పండ్లు మాగపెట్టొద్దు ► నిపుణుల సూచన కడప: మామిడి కాయలు మాగబెట్టే (పక్వానికి తెచ్చే) సీజను వచ్చిందంటే కాల్సియం కార్బైడ్ రసాయన అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆసక్తికర విషయాలను ఉమ్మడి రాష్ట్ర ఉద్యాన శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వేంపల్లె లక్ష్మీరెడ్డి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.... కార్భైడ్ ఎందుకు వాడతారంటే.. కాల్సియం కార్బైడ్‌ను 1988 నుంచి నేటివరకు పారిశ్రామికంగా సున్నం, కోక్ మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ ఫర్నెస్లో సుమారు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తయారుచేస్తున్నారు. ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజనితో కలిసినప్పుడు కాల్సియం సైనమైడ్ ఏర్పడుతుంది. దీనిని రసాయనిక ఎరువుగా వాడతారు. ఉక్కు పరిశ్రమలో కూడా దీనిని వినియోగిస్తారు. కాయలను మాగించేందుకు.. కాల్సియం కార్బైడ్ తేమతో కలిసిప్పుడు ఎసిటిలీన్ అనే వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు మాగే (పక్వానికి తెచ్చే) ప్రక్రియను ప్రారంభింపజేస్తుంది. రానురాను మామిడి, చీనీ (బత్తాయి), నిమ్మలాంటి వాటిని మాగించేందుకు ఈ రసాయనాన్ని వాడుతున్నారు. మామిడి కాయలను మార్కెట్లోకి ముందుగా ప్రవేశపెడితే మంచి ధరలు పలుకుతాయని సరైన పక్వానికి రాకముందే వీటిని కోసి కార్బైడ్ సహాయంతో మాగబెట్టి విక్రయిస్తుంటారు. దీని వల్ల పండ్లు మాగినట్లు కనిపించినా తియ్యగా ఉండవు. ► కాయలను మాగబెట్టేందుకు వాడే కాల్సియం కార్బైడ్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఆర్సెనిక్, ఫాస్ఫరస్ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ► ఇది కాన్సర్‌ను కలుగజేసే ఎసిటాల్డిహైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు కాన్సరుకు గురయ్యే ప్రమాదం ఉంది ► కాల్సియం కార్బైడ్ తేమతో కలిసినపుడు విడుదలయ్యే ఎసిటిలిన్ వాయువు వినియోగదారుల మెదడుకు ప్రాణవాయువు సరఫరాను తగ్గించి నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. కాల్సియం కార్బైడ్ వాడకాన్ని నిరోధించేందుకు సూచనలు... ► ఇప్పటికే చాలా దేశాల్లో కాల్సియంకార్బైడ్‌తో కాయలను మాగించడాన్ని నిషేధించారు. మన దేశంలో కూడా దీని వాడకాన్ని నిషేధించారు. ఆహార కల్తీ నిరోధక చట్టం (ప్రివెన్స్ ఆఫ్ పుడ్ అడల్టరేషన్ యాక్ట్) 44 ఏఏ ప్రకారం ఎసిటిలీన్ వాయువుతో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను అమ్మడాన్ని నిషేధించారు. ► అయితే ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు దీనిపై దృష్టి సారించడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ► మార్కెటింగ్ శాఖ వారు వారి మార్కెట్ యార్డుల పరిధిలో కాల్సియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించాలి నిషేదాజ్ఞలను ఉల్లంఘించే వ్యాపారస్తుల లైసెన్స్‌లను రద్దు చేయాలి. ► ఉద్యాన, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో కార్బైడ్ వాడకంవల్ల కలిగే నష్టాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం సీజనులో సదస్సులు, మేళాలు నిర్వహించాలి. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలను ఉపయోగించుకుని ఆరోగ్యానికి కలిగే హానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలి. పండ్లను అమ్మే మార్కెట్లో మైకుల ద్వారా ప్రచారం చేయాలి. ► రైతులు, వ్యాపారులు బాగా పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోస్తే సహజ సిద్ధంగా మాగి మంచి రంగు, రుచి, వాసనను సంతరించుకుంటాయి.కాల్సియం కార్బైడ్ వాడాల్సిన అవసరం ఉండదు. ► వ్యాపారులు కూడా నైతిక,సామాజిక బాధ్యతలు గుర్తించి కాయలను మాగించేందుకు కార్బైడ్‌ను వాడకూడదు. ► వినియోగదారులు కార్బైడ్‌తో మాగించిన పండ్లను వాడటం చాలిస్తే సమస్య దానంతట అదే నివారించబడుతుంది. వినియోదారులు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అలా కాకపోతే అనారోగ్యాలను కొనితెచ్చుకున్నవారవుతారు. -
రైట్.. రైట్
♦ జోరుగా కాల్షియం కార్బైడ్ రవాణా ♦ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం ♦ స్పందించని అధికారులు ప్రొద్దుటూరు టౌన్: పండ్లను మాగబెట్టేందుకు వినియోగిస్తున్న కాల్షియం కార్బైడ్ జిల్లాలో జోరుగా రవాణా అవుతోంది. అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ నెల 6న ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, తదితర ప్రాంతాల్లో ఉన్న కొందరు వ్యాపారులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ద్వారా పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌ను బీరువాల తయారీకి వినియోగిస్తున్నారు. దీనిని సాకుగా చూపుతూ తెప్పించుకుంటున్నారు. తర్వాత కొందరు వ్యాపారులు పండ్లను మాగబెట్టే వారికి కిలోల ప్రకారం విక్రయిస్తున్నారు. గృహాలే గోడన్లుగా... పండ్లను మాగబెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పండ్ల మార్కెట్లపై అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు గృహాలను గోడౌన్లగా చేసుకుని మామిడి, సపోట పండ్లను మాగబెడుతున్నారు. వీటిని మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించడం లేదు. ప్రొద్దుటూరులో కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ డబ్బాలను హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. పట్టణంలోని కోనేటి కాలువ వీధి, మైదుకూరు రోడ్డులో ఉన్న కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ను తెప్పించి విక్రయిస్తున్న విషయం అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాల్షియం కార్బైడ్ అమ్మకాలు, పండ్లను నిల్వ చేసేందుకు తీసుకోవాల్సిన అనుమతుల గురించి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ప్రొద్దుటూరు, కోడూరు, కడప తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టి, మున్సిపల్ అధికారులు కాల్షియం కార్బైడ్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అయినా వ్యాపారులు తర్వాత నిల్వ ఉంచుతున్నారు. లెసైన్స్‌లు తప్పనిసరి కాల్షియం కార్బైడ్ పేలుడు పదార్థం కాబట్టి లెసైన్స్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరికి విక్రయిస్తున్నారు, ఎంత మోతాదులో విక్రయిస్తున్నారు, ఏ అవసరానికి దాన్ని వాడుతున్నారు అనే వివరాలు కూడా దుకాణదారులు నమోదు చేయాల్సి ఉంది. అలాగే ఎక్కువ నిల్వ ఉంచకూడదు. కాల్షియం కార్బైడ్ విక్రయిస్తున్న వ్యాపారుల ట్రేడ్ లెసైన్స్‌లను మున్సిపల్ అధికారులు రద్దు చేసి, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులపై కూడా అధికారులు తూతూమంత్రంగా నిఘా ఉంచుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులోని పోలీస్స్టేషన్ల సమీపంలో ఉన్న ట్రాన్స్‌పోర్టుల ద్వారానే రవాణా చేస్తున్నారు. దీంతో అధికారులు ప్రధానంగా రవాణాపై దృష్టి సారించాల్సి ఉంది. ఇప్పటికైనా పోలీసు, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు, ఫుడ్ సేఫ్టి అధికారులు సమన్వయంగా వ్యవహరించి అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇథిలిన్ యూనిట్లు ప్రచారానికి తూట్లు
మామిడి మాగబెట్టేందుకు కార్బైడ్‌కు ప్రత్యామ్నాయం ప్రచారం మాత్రం అంతంతమాత్రం నూజివీడులోని మామిడి హబ్‌లకు స్పందన నిల్ కార్బైడ్కే ఓటేస్తున్న వ్యాపారులు తెనాలి : మామిడికాయలను పండించేందుకు వినియోగించే కాల్షియం కార్బైడ్‌పై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝుళిపించింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కార్బైడ్ వాడకానికి కళ్లెం వేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేస్తూనే.. పండ్లను మాగబెట్టేందుకు ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు పాలకులు కూడా చర్యలు తీసుకున్నారు. అయితే, ఇథిలిన్ యూనిట్లకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, కార్బైడ్‌ను అరికట్టడానికి చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తక్కువ ధరతో కాయలు పండిస్తున్న వ్యాపారులు, ఆర్థికభారం పేరుతో ఇథిలిన్ హబ్‌లకు వెళ్లట్లేదు. రాష్ట్రంలో కార్బైడ్ వినియోగం మితిమీరిన నేపథ్యంలో హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై కదిలిన తెలుగు రాష్ట్రాల అధికారులు మామిడి మార్కెట్లపై దాడులు చేశారు. వివిధ ప్రాంతాల్లో నమూనాలను సేకరించి అంతటితో సరిపెట్టేశారు. కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు ఉద్యానశాఖ 35 శాతం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఎందువల్లంటే.. కార్బైడ్‌తో మామిడిపండుకు మంచి రంగు వస్తుంది. తొందరగా పండుతుంది. పచ్చి సరుకైనందున వ్యాపారులు త్వరితగతిన చేతులు మార్చి వీలైనంత లాభాలు ఆర్జించాలని చూస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మామిడి దిగుబడి భారీగా పడిపోయింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కో మామిడి పండు రూ.25-రూ.40 పలుకుతోంది. ఇథిలిన్‌తో మాగబెడితే మరింత ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుందని, ఎక్కువగా కార్బైడ్నే ఆశ్రయిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు చైనా, కొరియా దేశాల నుంచి పొడిరూపంలో వస్తున్న కార్బైడ్‌ను వారు వినియోగిస్తున్నారు. నూజివీడు హబ్‌లకు ప్రచార మేదీ? రాష్ట్రంలో నూజివీడు, తిరుపతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మ్యాంగో హబ్ పేరుతో ఇథిలిన్ యూనిట్లు నడుస్తున్నాయి. ఎగు మతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే వీటిని నిర్మించింది . వీటిని ఓ ప్రైవేటు సంస్థ లీజుకు కూడా ఇచ్చింది. ప్రభుత్వ సబ్సిడీతో కృష్ణాజిల్లా నూజివీడులోని ఆగిరిపల్లి మండలం ఈదర శివారు బొద్దనపల్లిలో రత్నం మ్యాంగో హబ్ పేరుతో ఏర్పాటుచేసిన భారీ యూనిట్ గత మార్చి నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఇథిలిన్ యూనిట్లకు ఏ ఒక్కదానిలోనూ తగినంత మామిడికాయలు మాగబెట్టేందుకు రావటం లేదు. ఉదాహరణకు 300 టన్నుల సామర్థ్యం కలిగిన రత్నం మ్యాంగో హబ్‌కు అందులో కనీసం 10 శాతం వినియోగం కావటం లేదు. ప్రభుత్వ యూనిట్లలోనూ ఇందుకు భిన్నంగా లేదంటున్నారు. టన్ను కాయలు ఇథిలిన్‌తో మాగబెట్టాలంటే రూ.1,000 నుంచి రూ.4,000 వరకూ వ్యయం చేయాల్సి వస్తోంది. కార్బైడ్ అయితే కేవలం రూ.600-700తో సరిపోతున్నందున వ్యాపారులు ఇథిలిన్పై ఆసక్తి చూపించడ లేదు. వ్యాపారుల విజ్ఞప్తులతో చూసీచూడనట్టు ఉండాలని పాలకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు దాడులు చేసి సేకరించిన శాంపిల్స్ నివేదికలను ఇప్పటికీ తెప్పించకపోవటం దీనికి ఊతమిస్తోందని పేరు చెప్పని ఒక వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. -
పండ్లు తినాలంటే భయమేస్తోంది
♦ కార్బైడ్ వాడకంపై హైకోర్టు ♦ ప్రజలకు అవగాహన కల్పించండి ♦ ‘అమికస్’ సూచనల అమలుకు సిద్ధమని హైకోర్టుకు నివేదించిన ఉభయ రాష్ట్రాలు సాక్షి, హైదరాబాద్: కార్బైడ్‌తో పండ్లను మగ్గబెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని తినడానికి భయపడాల్సి వస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము కూడా పండ్లను ఒకటికి నాలుగు సార్లు పరిశీలించిన తర్వాతే తిం టున్నామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండ్లను వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పండ్లను మగ్గబెడుతున్న విధానంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు దానిపై విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమా ర్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఇరు ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో కార్బైడ్ నిరోధానికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని, ఈ విషయంలో కోర్టు సహాయకారి (అమికస్‌క్యూరీ) చేసిన సూచనలు, సల హాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి హైకోర్టుకు నివేదించాయి. అలా అయితే హానికర రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా పండ్లను మాగబెట్టే ప్రక్రియకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ముం దు సామాన్య ప్రజలకు ఏవి సహజంగా మగ్గిన పండ్లు, ఏవి కృత్రిమంగా మగ్గబెట్టినవి అన్న విషయంపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాలని సూచించింది. రసాయన ప్రక్రి య ద్వారా పండ్లను మగ్గబెట్టినట్లు వినియోగదారులకు అనుమానం వస్తే, ఆ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఓ ఫోన్ నంబర్‌ను కేటాయించాలని, దాని గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచిం చింది. తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారుల్లో భయం కలిగించాలి... విచారణ సందర్భంగా అమికస్ క్యూరీ ఎస్.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ రసాయన ప్రక్రియ ద్వారా పండ్లను మగ్గబెడుతున్న వ్యాపారులపై కఠినంగా వ్యహరించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు చర్యలకు పాల్పడే వ్యాపారుల్లో ఒకింత భయాన్ని కలిగించాలని, ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. కల్తీ పండ్లకే పరిమితం కాలేద ని పాలు, కూరగాయలు వినియోగించలేని పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. ఆహారభద్రత చట్ట నిబంధనల ప్రకారమే కాక ఐపీసీ కింద కూడా కేసులు నమోదు చేయవచ్చని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కృత్రిమంగా పండ్లు మగ్గపెడితే జైలే
సాక్షి, హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్ధాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఫిబ్రవరి 18న దాడులు జరిపి, పండ్ల నమూనాలను నాచారం ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు. 73 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తున్నదన్నారు. కాల్షియం కార్బైడ్ అనర్ధాలపై ఐపీఎం డైరక్టర్ శివలీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరక్టర్ నాగయ్య కాంబ్లే కూడా పాల్గొన్నారు. -
కార్బైడ్ వాడితే.. ఆరునెలల జైలు
హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్థాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కృత్రిమంగా మగ్గ పెట్టిన పండ్లను తినడం ద్వారా కాన్సర్‌తో పాటు జీర్ణ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర ప్రచార సామగ్రి సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తోందని తెలిపారు. ఆరుగురు వ్యాపారులు సొంతంగా ఇథిలీన్ ఛాంబర్ల నిర్మాణానికి ముందుకు వచ్చారని.. మార్చి ఆఖరులోగా వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రై వేటు రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఇథిలీన్ ఛాంబర్లు వుండగా.. అవసరమైన చోట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. -
పండ్లకు కాల్షియం కార్బైడ్ వద్దు : జేసీ
కాకినాడ సిటీ : కాల్షియం కార్బైడ్‌ను పండ్లకు వాడడం ద్వారా ప్రజలు అనేక ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. పండ్లను పక్వానికి తెచ్చేలా దీని వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు కలెక్టరేట్లో శనివారం జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించారు. జిల్లాలో ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వాడుతున్నట్టు తెలిస్తే, దాడులు జరిపి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం, అంబాజీపేటలో 11 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపారు. రాజమండ్రిలో యాపిల్, అరటి, బత్తాయి తదితర పండ్లకు సంబంధించి 5 శాంపిళ్లలో కాల్షియం కార్బైడ్ వాడినట్టు నివేదిక వచ్చిందని, ఆ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కాకినాడలో బత్తాయి, నిమ్మ, ఫైనాపిల్కు సంబంధించి మూడు శాంపిళ్లలో కూడా దానిని వాడినట్టు నివేదిక వచ్చిందని, వారిపై కూడా కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఏ వ్యాపారైనా పండ్లలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నట్టు తెలిస్తే ప్రజలు 90320 50351కు, 94402 75889 సెల్‌నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. హోల్‌సేల్ పండ్ల వర్తకులు తప్పనిసరిగా లెసైన్సు తీసుకోవాలని, రిటైల్, చిన్నవ్యాపారులు విధిగా ఆహార భద్రత, ప్రమాణాల శాఖ కింద రిజిస్టర్ కావాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బీవీఎస్ఆర్కే ప్రసాద్‌తో పాటు మార్కెటింగ్ ఏడీ, వివిధ మున్సిపల్ అధికారులు, పంచాయతీ, రవాణా, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తియ్యటి విషం!
కాల్షియం కార్బైడ్‌తో త్వరితగతిన మాగుతున్న మామిడి ఈ పండ్లు తింటే అనారోగ్యమే! మామిడి మార్కెట్‌ను ముంచెత్తుతున్న కాల్షియం కార్బైడ్ మిగిలిపోయిన పండ్లుతిని ఒక ఎద్దు మృత్యువాత గుట్టు చప్పుడు కాకుండా పెన్నాలో పాతి పెట్టిన వైనం ‘సాక్షి’ చొరవతో కంపోస్ట్ యార్డ్‌లో ఖననం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆర్జించడానికి మామిడి పండ్ల వ్యాపారులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వారం రోజుల్లో మాగాల్సిన మామిడి కాయలను కాల్షియం కార్బైడ్ సహాయంతో రెండు రోజుల్లోపసుపు పచ్చని రంగు తెప్పించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. మిగిలిపోయి కాస్త పాడైన పండ్లు తిని ఓ ఎద్దు మృతి చెందడం ప్రొద్దుటూరులో కలకలం లేపింది. క్యాల్షియం కార్బైడ్‌ను కెమికల్ ఫ్యాక్టరీలలో వినియోగిస్తారు. ఘన రూపంలో ఉన్న దీనిని పొడిగా మార్చి వాడతారు. మనం తినే పదార్థాల్లో ఇది కలిసి ఉంటే గ్యాస్ట్రిక్, అలర్జీ సమస్యలతో పాటు కంటి చూపు దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం జంతువులపై కూడా తీవ్రంగా ఉంటుంది. ప్రొద్దుటూరు టౌన్ : క్యాల్షియం కార్బైడ్.. మోతాదు మించితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అయితేనేం మాకు కావాల్సింది ఆదాయం అంటున్నారు మామిడి పండ్ల వ్యాపారులు. ప్రతి రోజు క్యాల్షియం కార్బైడ్ 50 కిలోల డబ్బాలు నేరుగా పండ్ల మార్కెట్లో దించుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. ప్రొద్దుటూరు పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి మామిడి పండ్లు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయి. అయితే ఇక్కడి వ్యాపారులు క్యాల్షియం కార్బైడ్‌ను పెద్ద ఎత్తున తెప్పించి పొడి చేసి.. ప్యాకెట్లలో నింపి మామిడి కాయలను మాగబెడుతున్నారు. దీని మోతాదు కాస్త ఎక్కువైతే పండ్లు కుళ్లిపోతున్నాయి. ఇలా కుళ్లిన పండ్లను మార్కెట్ ప్రధాన రోడ్డుపై ఉన్న చెత్త తొట్టి వద్ద పడేస్తున్నారు. ఇలాంటి పండ్లను తిన్న జంతువులు అస్వస్థతకు గురవుతున్నాయి. బుధవారం రాత్రి ఓ ఎద్దు వీటిని ఎక్కువగా తిని అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలో పరిశీలించగా పండ్ల దుకాణాల వద్ద క్యాల్షియం కార్బైడ్ డబ్బాలు కనిపించాయి. ఓ దుకాణంలో కూలీలు కార్బైడ్‌ను పగులగొట్టి పొడి చేసి పేపరు ప్యాకెట్లల్లో నింపుతూ కనిపించారు. వారు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కనిపించింది. క్యాల్షియం కార్బైడ్ ఎక్కువ కావడం వల్ల కుళ్లిపోయిన మామిడి పండ్లు సైతం కనిపించాయి. ఈ విషయాన్ని కమిషనర్ ప్రమోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా అది ఫుడ్ ఇన్స్పెక్టర్ చూసుకోవాలని తాను కూడా ఇది వరకే ఫోన్ చేసి చెప్పానని అన్నారు. క్యాల్షియం కార్బైడ్‌ను వ్యాపారులు పెద్ద ఎత్తున వాడుతున్న విషయంపై ఫుడ్ కంట్రోలర్ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా తాను హైదరాబాదులో మీటింగ్‌లో ఉన్నానని, వచ్చాక వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇదిలా ఉండగా మృతి చెందిన ఎద్దును శానిటరీ సిబ్బంది పెన్నా నదిలో పడేశారు. బయటకు కనిపించకుండా పైన చెత్త వేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ శానిటరీ సూపర్వైజర్ గోవిందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన పెన్నా నది వద్దకు వచ్చారు. ఎద్దు కళేబరాన్ని ట్రాక్టర్లో కంపోస్టు యార్డుకు తరలించి పూడ్చి వేయించారు. -
'మధురం' మాటున విషం
కాల్షియం కార్బైడ్‌తో మామిడిపండ్లను మగ్గిస్తున్న వ్యాపారులు సహజ రుచిని కోల్పోతున్న రాజఫలం అనారోగ్యం ఖాయమంటున్న వైద్యులు ఘట్కేసర్ టౌన్: ఫలరాజంగా పేరుగాంచిన మామిడిపండ్లు మాధుర్యానికి మారుపేరు. జనాలు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తూ ఇష్టంగా తింటుంటారు. వేసవిలో మార్కెట్‌ను ముంచెత్తే మామిడి పండ్లు.. వ్యాపారుల కక్కుర్తితో విషమయమవుతున్నాయి. ఈవిషయమై చాలామందికి తెలియదు. కొందరు వ్యాపారులు లాభాపేక్షతో మామిడికాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారు. సహజ పద్ధతులను విడిచిపెట్టి ఫలరాజాన్ని కాల్షియం కార్బైడ్‌తో మగ్గిస్తున్నారు. దీంతో మామిడిపండ్లు చూడడానికి ఆకర్షణగా కనిపించినా రుచిలో మాత్రం తేడా కనిపిస్తుంది. ముందే మార్కెట్‌ను ముంచెత్తిన పండ్లు.. వ్యాపారుల లాభాపేక్ష కారణంగా నేడు మామిడిపండ్లు విషపూరితమవుతూ జనాలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. మామిడిపండ్లు పక్వానికి రాకముందే తెంపడం, గాలులకు రాలిన కాయలను కాల్షియం కార్బైడ్‌తో పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. రసాయనాల ద్వారా మామిడికాయలను 24 గంటల్లోనే పండ్లుగా మారుస్తున్నారు. దీంతో మామిడిపండ్లు ఆకర్షణగా కనిపిస్తాయి. లోపల మాత్రం తెలుపురంగులో పుల్లగా రుచిలేకుండా ఉంటాయి. కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అసహ జ పద్ధతుల ద్వారా మగ్గిన పండ్లను తింటే ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని నిషేధించింది. అయినా వ్యాపారులు యథేచ్ఛగా వినియోగిస్తూ నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు. పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని అన్నోజీగూడ, నారపల్లి, జోడిమెట్ల తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై కొందరు వ్యాపారులు కాల్షియంతో మగ్గించిన మామిడిపండ్లను విక్రయిస్తున్నారు. ఆరోగ్యం గుల్ల.. కాల్షియం కార్బైడ్‌తో మగ్గించిన పండ్లను తినడం వల్ల ప్రధానంగా గర్భిణులు, చిన్నారులను పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గర్భిణులకు విరేచనాలు, కంటి సంబంధ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. కాన్సర్, అల్సర్, లివర్, మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. కార్బైట్ ద్వారా వెలువడే ఎసిటలిన్ వాయువు కారణంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా తలనొప్పి , జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదముంది. -ప్రసాద్, కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి -
కార్బైడ్ వినియోగానికి స్వస్తి
ప్రజారోగ్య పరిరక్షణకు సహకరిస్తామంటున్న పండ్ల వ్యాపారులు ధర్మవరం టౌన్: పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో తమ వంతు పాత్ర పోషిస్తామంటున్నారు ధర్మవరం పట్టణంలోని పండ్ల వ్యాపారులు. నిర్వహణ వ్యయం అధికంగానే ఉన్నా.. మామిడి, అరటి తదితర పండ్లను పక్వం చెందించడంలో క్యాల్షియం కార్బైడ్ వినియోగానికి స్వస్తి పలికి, సహజ పద్ధతులను అవలంబిస్తున్నామని, తద్వారా తమ వంతుగా సమాజానికి సేవ చేస్తున్నామంటున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇథిలీన్ ద్వారా పండ్లను మాగబెట్టే యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఇథిలీన్ యూనిట్లలో మాగబెట్టిన పండ్ల వినియోగం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ప్రోత్సాహం అవసరం రూ. 80 విలువ చేసే కిలో క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి ఒక టన్ను కాయలను మాగబెట్టే అవకాశం ఉంది. అదే ఇథిలీన్‌ను వినియోగిస్తే టన్ను కాయలకు విద్యుత్తు, ఇథిలీన్ గ్యాస్‌తో కలిపి రూ.2,500 వరకు వ్యయం అవుతుంది. పైగా ఈ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులే ఇంతకాలం క్యాల్షియం కార్బైడ్ వినియోగించేందుకు కారణమయ్యాయి. కాగా, ప్రభుత్వం స్పందించి ఇథిలీన్ యూనిట్ ఏర్పాటుకు ప్రోత్సహించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
ఆలోచించి.. ఆరగించండి
*మామిడి రంగుచూసి మోసపోవద్దు * కాల్షియం కార్బైడ్‌తో కాయల పక్వం *తింటే అనారోగ్యమే * పట్టని అధికారులు తాళ్లూరు, న్యూస్‌లైన్: పీచు పదార్థాలతో పాటు ఏ, సీ విటమిన్లు పుష్కలంగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో మామిడి ప్రధానమైంది. మామిడికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగబెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్బైడ్ వంటి వాటిని వాడుతున్నారు. మామిడి తోటల్లో నుంచి తెచ్చిన పచ్చి కాయల్ని ఒక గదిలో రాశిగా పోసి..ప్రతి 50 కాయల మధ్య 200 గ్రాముల కార్బైట్ ఉంచుతారు. కార్బైడ్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రతలు పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. పచ్చని రంగు వస్తాయి. అనంతరం మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ఉండే పోషక విలువలు వీటిలో ఉండవు. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులంటున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే గ్యాస్ట్రబుల్ రావడం, జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ నిర్వీర్యమవడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు ముప్పు.... కార్బైడ్‌తో మగ్గించిన పండ్లు తింటే గర్భిణులకు ప్రమాదకరం. ఒక్కోసారి అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులంటున్నారు. పిల్లలు అంగవైకల్యంతో పుట్టవచ్చని, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. ఎండు గడ్డితో పండేవి మంచివి... మామిడి కాయలు చెట్టు మీద పక్వానికి వచ్చిన తర్వాత కోస్తారు. వీటిని గంపల్లో వేసి ఎండు గడ్డి కప్పి వారం రోజుల పాటు మగ్గ బెడతారు. తర్వాత గడ్డిని తొలగించి చూస్తే మంచి వాసనతో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా.. రుచికరంగా ఉంటాయి. - రసాయనాలతో మాగబెట్టినప్పుడు పండ్ల తొక్కలపై అధిక ప్రభావం ఉంటుంది. తొక్కలోనే రసాయనాలు అధికంగా ఉంటాయి. పండ్లను ఉప్పునీటిలో కడిగి పైన తొక్కను తీసేసి తింటే కొంత మేలని వైద్యులు పేర్కొంటున్నారు. - ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని గోడౌన్లలో మామిడి కాయల్ని కృత్రిమ పద్ధతుల్లో మాగబెట్టి..జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని పండ్ల దుకాణాల్లో విక్రయించే వాటిని కూడా అక్కడి నుంచే తెస్తున్నారు. అధికారులు స్పందించి అటువంటి పండ్లను మార్కెట్లోనికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మధుర ఫలం.. విషతుల్యం..
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ మొదలైంది. ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లో కంటికింపుగా కనిపించే మామిడి పండ్లు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకు కారణం వ్యాపారుల మధ్య ఉన్న పోటీ. సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు మార్కెట్లోకి వచ్చే పచ్చి కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను వినియోగించి ఒక్కరోజులోనే కాయల రంగు, రుచి మార్చేస్తున్నారు. 30 కిలోల మామిడి కాయలను 200 గ్రాముల కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పండబెడుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాలను ఎగుమతి చేసే పండ్లను బాక్సుల్లో ప్యాక్ చేసి వాటి మధ్యలో కాల్షియం కార్బైట్ ప్యాకెట్లను ఉంచుతున్నారు. దీంతో అవి నిర్ధేశిత ప్రదేశానికి చేరుకునేలోగానే పండుతున్నాయి. ఇలా అన్నిదశల్లో కాల్షియం కార్బైడ్ వినియోగిస్తుండడంతో ఆ పండు సహజ రుచిని కోల్పోయి విషతుల్యం అవుతున్నాయి. పట్టించుకోని అధికారులు.... కాల్షికార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా దానిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడతున్నారు. కాల్షియం కార్బైడ్‌తో వచ్చే వ్యాధులు.... రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తిన్న ప్రజలు పలు వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ ర్భిణులకు, చిన్న పిల్లలు తింటే అనేక రకాల ఆరోగ్య రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అయితే శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు విరేచనాలు అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక కళ్ల సంబంధిత సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుందని, పరిస్థితి విషమిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా అయితేనే మంచిది..... మామిడి పండ్లను చెట్టుపైనే బాగా ముదిరిన తర్వాత కోయాలి. ఆ తర్వాత గడ్డి వేసి అందులో కాయలు మగ్గబెట్టాలి. వారం రోజుల పాటు అలా ఉంచితే మధురమైన వాసనతో పాటు రుచి, పోషక విలువలు ఉన్న మామిడి పండ్లు సిద్ధం అవుతాయి. గతంలో మామిడి పండ్లను ఇలానే పండించి విక్రయించేవారు. -
మామిడి మధురం.. చేదు నిజం..!
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మామిడి, అరటి, బొప్పాయి, సపోట, ద్రాక్ష, దానిమ్మ ఇలా అనేక రకాల పండ్లు కాలాలకు అనుగుణంగా ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. శరీర ఎదుగుదలకు, పరిపుష్టికి దోహదపడుతాయి. అన్ని కాలాలలో దొరికేది అరటి. వేసవి కాలంలో దొరికేది మాత్రం మామిడి. అయితే పండ్ల వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగపెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్భైట్, పొగబెట్టి మాగబెట్టడం వంటి చర్యలతో కాయలను పండ్లుగా మారుస్తున్నారు. అనంతరం బహిరంగ మర్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. శరీరం నీరసించిపోయినప్పుడు ఇవి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మలబద్ధకం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో ఇవి ఉండవు. కాగా, ఆరోగ్యానికి హానికరం. జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, చెన్నూర్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో మామిడి వ్యాపారం జరుగుతాయి. ఏటా రూ.11 కోట్ల మామడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. మామిడిని ఎలా మాగ పెడతారంటే.. మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారంకు కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైట్‌ను కొనుగోలు చేస్తారు. ఈ రసాయనాన్ని పొట్లాలుగా మారుస్తారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో, నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు కార్బైట్ పొట్లాలను మధ్య మధ్యన పెడతారు. ఆ కార్బైట్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. నాలుగు రోజులపాటు బాక్స్‌లలో, నేల మీద రాశులుగా ఉన్న మామిడికాయలు పండ్లుగా మారతాయి. పూర్తి పచ్చదనంలోకి వచ్చి మామిడి ప్రియుల నోర్లు ఊరించేలాగా మారుతాయి. అలా తయారైన మామిడి పండ్లను మార్కెట్లోకి రిటైల్ అమ్మకం దారులకు విక్రయిస్తారు. అలా చేతులు మారిన మామిడి పండ్లు మామిడి ప్రియుల చేతికి చేరి కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. గ్యాస్ ద్వారా పండ్లుగా మార్చడం మరో పద్ధతి గ్యాస్ ద్వారా కూడా మామిడి కాయలను పండ్లుగా మార్చడం కొత్త పద్ధతి. గతేడాది మంచిర్యాలలో ప్రారంభమైంది. కాల్షియం కార్బైట్ తక్కువ ఖర్చుతో పండ్లుగా మార్చే వీలున్నప్పటికి పెద్ద మొత్తంలో పండ్లుగా మారడం సాధ్యం కాదు. దాంతో కూలింగ్ స్టోర్ విధానం ద్వారా కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఒకేసారి 8 వేల కిలోల వరకు కాయలను పండ్లుగా మార్చే సౌలభ్యం కూలింగ్ స్టోర్‌లో ఉంటుంది. ఇథిలేన్ అనే గ్యాస్‌ని కూలింగ్ స్టోరేజ్‌లోకి పంపుతారు. పగలంతా కూలింగ్, రాత్రి వేళ మాత్రమే గ్యాస్‌ను స్టోర్‌లోకి విడుదల చేస్తారు. అలా రసాయనాల ప్రభావంతో నాలుగు రోజుల్లోనే కాయలు పండ్లుగా మారతాయి. ఒక మామిడిపండే కాకుండా అరటికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. పండ్లను మాగ పెట్టడానికి కూలింగ్ స్టోరేజ్‌లు పెట్టడానికి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు వ్యయం చేస్తున్నారంటే లాభాలు ఎలా ఉన్నాయో తేట తెల్లం అవుతుంది. అమలు కాని నిషేధం బహిరంగ మార్కెట్లో కార్బైట్ విచ్చలవిడిగా దొరుకుతోంది. కిలో విలువ రూ.80 ఉంటుంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించిన అమలుకావడం లేదు. వ్యాపారులు గోదాముల్లో కార్బైన్‌ను వినియోగించి మాగబెడుతున్నా పట్టించుకోవడం లేదు. వీటి వాడకాన్ని తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు.