ఇథిలిన్ యూనిట్లు ప్రచారానికి తూట్లు | Ithilin units undermined campaign | Sakshi
Sakshi News home page

ఇథిలిన్ యూనిట్లు ప్రచారానికి తూట్లు

Published Fri, May 20 2016 5:47 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

ఇథిలిన్ యూనిట్లు  ప్రచారానికి తూట్లు - Sakshi

ఇథిలిన్ యూనిట్లు ప్రచారానికి తూట్లు

మామిడి మాగబెట్టేందుకు  కార్బైడ్‌కు ప్రత్యామ్నాయం
ప్రచారం మాత్రం అంతంతమాత్రం
నూజివీడులోని మామిడి హబ్‌లకు    స్పందన నిల్
కార్బైడ్‌కే ఓటేస్తున్న వ్యాపారులు

 

తెనాలి : మామిడికాయలను పండించేందుకు వినియోగించే కాల్షియం కార్బైడ్‌పై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝుళిపించింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కార్బైడ్ వాడకానికి కళ్లెం వేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేస్తూనే.. పండ్లను మాగబెట్టేందుకు ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు పాలకులు కూడా చర్యలు తీసుకున్నారు. అయితే, ఇథిలిన్ యూనిట్లకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, కార్బైడ్‌ను అరికట్టడానికి చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తక్కువ ధరతో కాయలు పండిస్తున్న వ్యాపారులు, ఆర్థికభారం పేరుతో ఇథిలిన్ హబ్‌లకు వెళ్లట్లేదు. రాష్ట్రంలో కార్బైడ్ వినియోగం మితిమీరిన నేపథ్యంలో హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై కదిలిన తెలుగు రాష్ట్రాల అధికారులు మామిడి మార్కెట్లపై దాడులు చేశారు. వివిధ ప్రాంతాల్లో నమూనాలను సేకరించి అంతటితో సరిపెట్టేశారు. కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ యూనిట్ల ఏర్పాటుకు ఉద్యానశాఖ 35 శాతం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు.

 
ఎందువల్లంటే..

కార్బైడ్‌తో మామిడిపండుకు మంచి రంగు వస్తుంది. తొందరగా పండుతుంది. పచ్చి సరుకైనందున వ్యాపారులు త్వరితగతిన చేతులు మార్చి వీలైనంత లాభాలు ఆర్జించాలని చూస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మామిడి దిగుబడి భారీగా పడిపోయింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కో మామిడి పండు రూ.25-రూ.40 పలుకుతోంది. ఇథిలిన్‌తో మాగబెడితే మరింత ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుందని, ఎక్కువగా కార్బైడ్‌నే ఆశ్రయిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు చైనా, కొరియా దేశాల నుంచి పొడిరూపంలో వస్తున్న కార్బైడ్‌ను వారు వినియోగిస్తున్నారు.

 
నూజివీడు హబ్‌లకు ప్రచార మేదీ?

రాష్ట్రంలో నూజివీడు, తిరుపతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మ్యాంగో హబ్ పేరుతో ఇథిలిన్ యూనిట్లు నడుస్తున్నాయి. ఎగు          మతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే వీటిని నిర్మించింది . వీటిని ఓ ప్రైవేటు సంస్థ లీజుకు కూడా ఇచ్చింది. ప్రభుత్వ సబ్సిడీతో కృష్ణాజిల్లా నూజివీడులోని ఆగిరిపల్లి మండలం ఈదర శివారు బొద్దనపల్లిలో రత్నం మ్యాంగో హబ్ పేరుతో ఏర్పాటుచేసిన భారీ యూనిట్ గత మార్చి నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఇథిలిన్ యూనిట్లకు ఏ ఒక్కదానిలోనూ తగినంత మామిడికాయలు మాగబెట్టేందుకు రావటం లేదు. ఉదాహరణకు 300 టన్నుల సామర్థ్యం కలిగిన రత్నం మ్యాంగో హబ్‌కు అందులో కనీసం 10 శాతం వినియోగం కావటం లేదు. ప్రభుత్వ యూనిట్లలోనూ ఇందుకు భిన్నంగా లేదంటున్నారు. టన్ను కాయలు ఇథిలిన్‌తో మాగబెట్టాలంటే రూ.1,000 నుంచి రూ.4,000 వరకూ వ్యయం చేయాల్సి వస్తోంది. కార్బైడ్ అయితే కేవలం రూ.600-700తో సరిపోతున్నందున వ్యాపారులు ఇథిలిన్‌పై ఆసక్తి చూపించడ లేదు. వ్యాపారుల విజ్ఞప్తులతో చూసీచూడనట్టు ఉండాలని పాలకులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు దాడులు చేసి సేకరించిన శాంపిల్స్ నివేదికలను ఇప్పటికీ తెప్పించకపోవటం దీనికి ఊతమిస్తోందని పేరు చెప్పని ఒక వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement