కాల్షియం కార్బైడ్‌తో త్వరితగతిన మాగుతున్న మామిడి
ఈ పండ్లు తింటే అనారోగ్యమే!
మామిడి మార్కెట్‌ను ముంచెత్తుతున్న కాల్షియం కార్బైడ్
మిగిలిపోయిన పండ్లుతిని ఒక ఎద్దు మృత్యువాత
గుట్టు చప్పుడు కాకుండా పెన్నాలో పాతి పెట్టిన వైనం
‘సాక్షి’ చొరవతో కంపోస్ట్ యార్డ్‌లో ఖననం
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆర్జించడానికి మామిడి పండ్ల వ్యాపారులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వారం రోజుల్లో మాగాల్సిన మామిడి కాయలను కాల్షియం కార్బైడ్ సహాయంతో రెండు రోజుల్లోపసుపు పచ్చని రంగు తెప్పించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. మిగిలిపోయి కాస్త పాడైన పండ్లు తిని ఓ ఎద్దు మృతి చెందడం ప్రొద్దుటూరులో కలకలం లేపింది.
క్యాల్షియం కార్బైడ్‌ను కెమికల్ ఫ్యాక్టరీలలో వినియోగిస్తారు. ఘన రూపంలో ఉన్న దీనిని పొడిగా మార్చి వాడతారు. మనం తినే పదార్థాల్లో ఇది కలిసి ఉంటే గ్యాస్ట్రిక్, అలర్జీ సమస్యలతో పాటు కంటి చూపు దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం జంతువులపై కూడా తీవ్రంగా ఉంటుంది.
ప్రొద్దుటూరు టౌన్ : క్యాల్షియం కార్బైడ్.. మోతాదు మించితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అయితేనేం మాకు కావాల్సింది ఆదాయం అంటున్నారు మామిడి పండ్ల వ్యాపారులు. ప్రతి రోజు క్యాల్షియం కార్బైడ్ 50 కిలోల డబ్బాలు నేరుగా పండ్ల మార్కెట్‌లో దించుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. ప్రొద్దుటూరు పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి మామిడి పండ్లు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయి. అయితే ఇక్కడి వ్యాపారులు క్యాల్షియం కార్బైడ్‌ను పెద్ద ఎత్తున తెప్పించి పొడి చేసి.. ప్యాకెట్లలో నింపి మామిడి కాయలను మాగబెడుతున్నారు. దీని మోతాదు కాస్త ఎక్కువైతే పండ్లు కుళ్లిపోతున్నాయి.
ఇలా కుళ్లిన పండ్లను మార్కెట్ ప్రధాన రోడ్డుపై ఉన్న చెత్త తొట్టి వద్ద పడేస్తున్నారు. ఇలాంటి పండ్లను తిన్న జంతువులు అస్వస్థతకు గురవుతున్నాయి. బుధవారం రాత్రి ఓ ఎద్దు వీటిని ఎక్కువగా తిని అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలో పరిశీలించగా పండ్ల దుకాణాల వద్ద క్యాల్షియం కార్బైడ్ డబ్బాలు కనిపించాయి. ఓ దుకాణంలో కూలీలు కార్బైడ్‌ను పగులగొట్టి పొడి చేసి పేపరు ప్యాకెట్లల్లో నింపుతూ కనిపించారు.
వారు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కనిపించింది. క్యాల్షియం కార్బైడ్ ఎక్కువ కావడం వల్ల కుళ్లిపోయిన మామిడి పండ్లు సైతం కనిపించాయి. ఈ విషయాన్ని కమిషనర్ ప్రమోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా అది ఫుడ్ ఇన్‌స్పెక్టర్ చూసుకోవాలని తాను కూడా ఇది వరకే ఫోన్ చేసి చెప్పానని అన్నారు.
క్యాల్షియం కార్బైడ్‌ను వ్యాపారులు పెద్ద ఎత్తున వాడుతున్న విషయంపై ఫుడ్ కంట్రోలర్ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా తాను హైదరాబాదులో మీటింగ్‌లో ఉన్నానని, వచ్చాక వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇదిలా ఉండగా మృతి చెందిన ఎద్దును శానిటరీ సిబ్బంది పెన్నా నదిలో పడేశారు. బయటకు కనిపించకుండా పైన చెత్త వేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ శానిటరీ సూపర్‌వైజర్ గోవిందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన పెన్నా నది వద్దకు వచ్చారు. ఎద్దు కళేబరాన్ని ట్రాక్టర్‌లో కంపోస్టు యార్డుకు తరలించి పూడ్చి వేయించారు.
తియ్యటి విషం!
Published Fri, May 15 2015 4:29 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement