రైట్.. రైట్
♦ జోరుగా కాల్షియం కార్బైడ్ రవాణా
♦ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
♦ స్పందించని అధికారులు
ప్రొద్దుటూరు టౌన్: పండ్లను మాగబెట్టేందుకు వినియోగిస్తున్న కాల్షియం కార్బైడ్ జిల్లాలో జోరుగా రవాణా అవుతోంది. అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ నెల 6న ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, తదితర ప్రాంతాల్లో ఉన్న కొందరు వ్యాపారులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ద్వారా పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌ను బీరువాల తయారీకి వినియోగిస్తున్నారు. దీనిని సాకుగా చూపుతూ తెప్పించుకుంటున్నారు. తర్వాత కొందరు వ్యాపారులు పండ్లను మాగబెట్టే వారికి కిలోల ప్రకారం విక్రయిస్తున్నారు.
గృహాలే గోడన్లుగా...
పండ్లను మాగబెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పండ్ల మార్కెట్లపై అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు గృహాలను గోడౌన్లగా చేసుకుని మామిడి, సపోట పండ్లను మాగబెడుతున్నారు. వీటిని మార్కెట్‌లోకి తెచ్చి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించడం లేదు. ప్రొద్దుటూరులో కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ డబ్బాలను హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు.
పట్టణంలోని కోనేటి కాలువ వీధి, మైదుకూరు రోడ్డులో ఉన్న కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ను తెప్పించి విక్రయిస్తున్న విషయం అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాల్షియం కార్బైడ్ అమ్మకాలు, పండ్లను నిల్వ చేసేందుకు తీసుకోవాల్సిన అనుమతుల గురించి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ప్రొద్దుటూరు, కోడూరు, కడప తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టి, మున్సిపల్ అధికారులు కాల్షియం కార్బైడ్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అయినా వ్యాపారులు తర్వాత నిల్వ ఉంచుతున్నారు.
లెసైన్స్‌లు తప్పనిసరి
కాల్షియం కార్బైడ్ పేలుడు పదార్థం కాబట్టి లెసైన్స్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరికి విక్రయిస్తున్నారు, ఎంత మోతాదులో విక్రయిస్తున్నారు, ఏ అవసరానికి దాన్ని వాడుతున్నారు అనే వివరాలు కూడా దుకాణదారులు నమోదు చేయాల్సి ఉంది. అలాగే ఎక్కువ నిల్వ ఉంచకూడదు. కాల్షియం కార్బైడ్ విక్రయిస్తున్న వ్యాపారుల ట్రేడ్ లెసైన్స్‌లను మున్సిపల్ అధికారులు రద్దు చేసి, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులపై కూడా అధికారులు తూతూమంత్రంగా నిఘా ఉంచుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులోని పోలీస్‌స్టేషన్ల సమీపంలో ఉన్న ట్రాన్స్‌పోర్టుల ద్వారానే రవాణా చేస్తున్నారు. దీంతో అధికారులు ప్రధానంగా రవాణాపై దృష్టి సారించాల్సి ఉంది. ఇప్పటికైనా పోలీసు, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు, ఫుడ్ సేఫ్టి అధికారులు సమన్వయంగా వ్యవహరించి అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.