పండ్లు తినాలంటే భయమేస్తోంది
♦ కార్బైడ్ వాడకంపై హైకోర్టు
♦ ప్రజలకు అవగాహన కల్పించండి
♦ ‘అమికస్’ సూచనల అమలుకు సిద్ధమని హైకోర్టుకు నివేదించిన ఉభయ రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: కార్బైడ్‌తో పండ్లను మగ్గబెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని తినడానికి భయపడాల్సి వస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము కూడా పండ్లను ఒకటికి నాలుగు సార్లు పరిశీలించిన తర్వాతే తిం టున్నామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండ్లను వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పండ్లను మగ్గబెడుతున్న విధానంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు దానిపై విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమా ర్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా ఇరు ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో కార్బైడ్ నిరోధానికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని, ఈ విషయంలో కోర్టు సహాయకారి (అమికస్‌క్యూరీ) చేసిన సూచనలు, సల హాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి హైకోర్టుకు నివేదించాయి. అలా అయితే హానికర రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా పండ్లను మాగబెట్టే ప్రక్రియకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ముం దు సామాన్య ప్రజలకు ఏవి సహజంగా మగ్గిన పండ్లు, ఏవి కృత్రిమంగా మగ్గబెట్టినవి అన్న విషయంపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాలని సూచించింది.
రసాయన ప్రక్రి య ద్వారా పండ్లను మగ్గబెట్టినట్లు వినియోగదారులకు అనుమానం వస్తే, ఆ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఓ ఫోన్ నంబర్‌ను కేటాయించాలని, దాని గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచిం చింది. తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యాపారుల్లో భయం కలిగించాలి...
విచారణ సందర్భంగా అమికస్ క్యూరీ ఎస్.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ రసాయన ప్రక్రియ ద్వారా పండ్లను మగ్గబెడుతున్న వ్యాపారులపై కఠినంగా వ్యహరించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు చర్యలకు పాల్పడే వ్యాపారుల్లో ఒకింత భయాన్ని కలిగించాలని, ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. కల్తీ పండ్లకే పరిమితం కాలేద ని పాలు, కూరగాయలు వినియోగించలేని పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. ఆహారభద్రత చట్ట నిబంధనల ప్రకారమే కాక ఐపీసీ కింద కూడా కేసులు నమోదు చేయవచ్చని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.