ఎన్‌రిప్‌.. 'పండంటి' ఆరోగ్యానికి టిప్‌! | Horticulture Department Experiment to Reduce Chemical Factors | Sakshi
Sakshi News home page

ఎన్‌రిప్‌.. 'పండంటి' ఆరోగ్యానికి టిప్‌!

Published Sun, Nov 24 2019 2:44 AM | Last Updated on Sun, Nov 24 2019 2:44 AM

Horticulture Department Experiment to Reduce Chemical Factors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పండ్లను మగ్గబెట్టే క్రమంలో అటు పర్యావరణానికి, ఇటు మానవ ఆరోగ్యానికి హానికలిగించే రసాయన కారకాలను పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇథిలిన్‌ వినియోగంతో పాటు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ‘ఎన్‌రిప్‌’అనే ఉత్పత్తులను వినియోగించనుంది. మన రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించే మామిడి, నారింజ, అరటి పండ్లను మగ్గబెట్టే క్రమంలో భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించనుంది. బెంగళూరులోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మామిడి, అరటి పండ్లపై ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపిన అనంతరం ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’కూడా ఈ ఉత్పత్తులను అనుమతించింది. దీంతో మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సహకారంతో ఉద్యాన శాఖ ముందుగా రాష్ట్రంలోని పెద్ద పండ్ల మార్కెట్‌లలో త్వరలోనే ‘ఎన్‌రిప్‌’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టడంపై పరిశీలన జరపనుంది.  

వెంటనే ప్రారంభించండి
త్వరలోనే మామిడి పండ్ల సీజన్‌ రానున్నందున ‘ఎన్‌రిప్‌’పరిజ్ఞానం వినియోగంపై ప్రయోగం చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పేరుగాంచిన గడ్డిఅన్నారం, జగిత్యాల, వరంగల్‌ మార్కెట్లలో ప్రయోగాలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వీటిలో త్వరలోనే ‘ఎన్‌రిప్‌’ఉత్పత్తులను వినియోగించి పండ్లను మగ్గబెట్టాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆ ప్రకారం పండ్లను మగ్గబెట్టే వ్యాపారులు లేదా ఏజెంట్లు ఎప్పటికప్పుడు నమూనాలను పరిశీలించి తాము అనుసరిస్తున్న పద్ధతుల్లో ‘ఎసిటిలిన్‌’లేదా ‘కార్బైడ్‌’లను వినియోగించడం లేదని ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కూడా ఆ విధానాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు గతంలో మాదిరిగా వ్యవసాయ క్షేత్రాల్లోనే ‘ఇథిలిన్‌’పౌడర్‌ ద్వారా మగ్గబెట్టే విధానాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

క్యాల్షియం కార్బైడ్‌తో అనర్థాలివే
- కాల్షియం కార్బైడ్‌ వినియోగం ద్వారా వెలువడే కార్బైడ్, ‘ఎసిటిలిన్‌’వాయువు ద్వారా పండ్లను మగ్గబెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరమంటూ 2011 నుంచి ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ఈ పద్ధతిని అనుమతించడం లేదు.  
ఈ పద్ధతిలో పండ్లను పక్వానికి తెచ్చే పనిని చేపట్టే కార్మికులు, ఆ వ్యాపారులు, పండ్లు అమ్మే చిరు వ్యాపారులు, వారితో కలిసి జీవించే వారి కుటుంబీకులతో పాటు పండ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా కార్బైడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 
ఈ పండ్లు తినే చిన్నారులు, వృద్ధులతో పాటు గర్భిణుల ఆరోగ్యానికి ముప్పు.  
మగ్గబెట్టిన పండ్లను రవాణా చేసే సమయంలో అవి పాడుకాకుండా ఉండేందుకు క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించడం వల్ల హానికర వాయువులు వెలువడి పర్యావరణంతో పాటు పంటలు, ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. దీంతో ‘ఇథిలిన్‌’తో పాటు ‘ఎన్‌రిప్‌’ఉత్పత్తులను వినియోగించాలని నిర్ణయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement