
సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడిన తరుణంలో నష్టపోతున్న రైతులు, అవస్థలు పడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఉభయతారక ప్రయోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేసే బాధ్యతను ఉద్యాన శాఖ భుజాన వేసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలను రైతుల నుంచి నేరుగా సేకరించి.. గ్రామాలు, పట్టణ కాలనీలలో విక్రయించే నమూనాను రూపొందించి అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ప్రస్తుత విపత్తు సమయంలోనే కాకుండా భవిష్యత్‌లో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ నమూనాను అమలు చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ సర్కులర్ జారీ చేసింది.
మార్గదర్శకాలివీ..
► ఉభయ తారక ప్రయోజన విధానంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీలు) కీలక బాధ్యత పోషిస్తాయి. సేకరణ, పంపిణీని కూడా ఇవే చేపడతాయి.
► గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పండ్లు, కూరగాయలు ఏ మేరకు అవసరం అవుతాయనేది (ఇండెంట్) మదింపు చేయడంతో పాటు సరఫరా బాధ్యతను కూడా ఏఎంసీ కార్యదర్శి చూస్తారు.
► అతడికి గ్రామీణ ప్రాంతంలోని సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), పట్టణ ప్రాంతంలోని సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం) సహకరిస్తారు. వాస్తవ డిమాండ్‌ను ఏపీఎం, సీఎంఎం మదింపు చేసి ఏఎంసీ కార్యదర్శికి పంపితే ఆయన ఆర్డరు పెడతారు.
► ఏఎంసీ పరిధిలో గుర్తించిన గ్రామాల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పండ్లు, కూరగాయలు సేకరించి సంబంధిత ప్రాంతానికి ట్రక్కుల్లో పంపిస్తారు.
► పట్టణాలు, నగరాలైతే సిటీ మిషన్ మేనేజర్‌కు రైతు బజార్లను అనుసంధానం చేస్తారు. ఏఎంసీ ఏ పాత్ర పోషిస్తుందో.. పట్టణాల్లో రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్ ఆ పాత్ర పోషించాలి. సెర్ప్ ఏపీఎం పాత్రను సిటీ మిషన్ మేనేజర్ నిర్వహిస్తారు.
► రైతు బజార్లు లేని పట్టణ ప్రాంతాల్లో ఏపీఎం, సీఎంఎం నుంచి ఏఎంసీ ఆర్డర్ సేకరించి సరఫరా చేస్తుంది. రైతుల నుంచి సరుకును సేకరించిన తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తారు.
► ఈ మొత్తం ప్రక్రియను గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పీడీ, అర్బన్ ఏరియాలో మెప్మా పీడీ పర్యవేక్షిస్తారు.
తొలిరోజే 22,195 టన్నులు
► ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన, మార్కెటింగ్, సెర్ప్ అధికారులు శనివారం 22,195 టన్నుల పండ్లు, కూరగాయలను సేకరించి వివిధ ప్రాంతాలకు రవాణా చేశారు.
► 7,539 టన్నుల అరటి, 2,087 టన్నుల టమాటాలు, 12,569 టన్నుల ఇతర పండ్లు, కూరగాయలు సేకరించి పంపిణీ చేశారు.
చిత్తూరు నుండి మామిడి కాయల లోడ్‌తో బయలుదేరిన లారీ