సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్దఎత్తున పండించే మిర్చిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేలా ఐటీసీ, రాష్ట్ర ఉద్యాన శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య నమూనా కింద ఈ ఏడాది పది వేల ఎకరాల్లో మిర్చి సాగును లక్ష్యంగా నిర్ణయించగా వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండించాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన భౌతిక, సాంకేతిక సహకారాన్ని ఐటీసీ, ఉద్యాన శాఖ అందిస్తాయి. ఈ మేరకు శనివారం గుంటూరులో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో ఉద్యాన శాఖ, ఐటీసీ అధికారులు చిరంజీవి చౌధరి, సంజీవ్ రంగరాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
కాల్ సెంటర్, మొబైల్ యాప్..
ఐటీసీ ఇప్పటికే ఎంపిక చేసిన రైతులతో మిర్చి సాగు చేయించి ఎగుమతులు చేస్తుండగా దీన్ని తాజాగా మరింత విస్తరించారు. మొదటి ఏడాది కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని 41 గ్రామాల్లో నాలుగు వేల మంది రైతులతో 10 వేల ఎకరాల్లో మిర్చిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగు చేయిస్తారు. రైతు సేవల కోసం ఐటీసీ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, పురుగు మందుల నిర్వహణ, పంట నాణ్యత, దిగుబడి పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కాల్‌సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ సేవలు అందుతాయి. మిర్చి మార్కెట్ అవసరాలను తెలుసుకునేందుకు ఉద్యాన శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐటీసీ సంయుక్తంగా హ్యాండ్ బుక్‌ను రైతులకు పంపిణీ చేస్తాయి. ఇ–చౌపల్ 4.0 పేరుతో మొబైల్ యాప్ కూడా రైతులకు అందుబాటులోకి రానుంది.
రూ.200 కోట్లతో సుగంధ ద్రవ్యాల బోర్డు
ప్రయోగాత్మకంగా కనీసం వెయ్యి ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చేపట్టాలన్న విజ్ఞప్తిపై ఐటీసీ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (అగ్రి బిజినెస్) సంజీవ్ సానుకూలంగా స్పందించారు. రూ.200 కోట్లతో గుంటూరు సమీపంలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రత్యేకించి మిర్చి కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఐటీసీ సన్నాహాలు చేస్తోందని, ఇందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. పర్యావరణానికి నష్టం లేకుండా మిర్చి సాగు చేస్తున్న వివిధ జిల్లాల రైతులకు ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ముస్తఫా, వైఎస్సార్ సీపీ నేత ఏసురత్నం, ఉద్యానశాఖ అధికారులు ఎం.వెంకటేశ్వర్లు, పి.హనుమంతరావు పాల్గొన్నారు.
కల్తీలను సహించం
గుంటూరు కేంద్రంగా కొందరు మిర్చి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల్ని దోపిడీ చేస్తున్నారని, వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు హెచ్చరించారు. కల్తీ ఏ రూపంలో ఉన్నా సహించవద్దని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. కిలో మిర్చి విత్తనాలు రూ.వేలు, లక్షల్లో ఉండటమేమిటని ప్రశ్నించారు. పరిశోధనల ద్వారా నాణ్యమైన మిర్చి విత్తనాలు రైతులకు సరసమైన ధరలకు సరఫరా చేసేలా చూస్తామన్నారు. ఈనెల 15వతేదీ నుంచి ప్రతిష్టాత్మక వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాయలసీమలో మిల్లెట్స్ (చిరుధాన్యాల) బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment