
ఉద్యాన పంచాంగం 2021–22ను ఆవిష్కరిస్తున్న మంత్రి కన్నబాబు, చిత్రంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు
సాక్షి, అమరావతి: ఉద్యాన పంటల హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యాన పంచాంగం 2021–22ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించాలని రైతులకు సూచించారు. ఉద్యాన పంటల సాగు వైపు యువ రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిని ప్రతి రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉద్యాన వర్సిటీ, ఉద్యాన శాఖ సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తరణకు పాటుపడాలన్నారు.
పురుగుల మందుల వాడకాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సేంద్రియ సాగును ప్రోత్సహించాలన్నారు. పరిశోధనా ఫలాలు, నూతన యాజమాన్య పద్ధతులు, నూతన వంగడాలు, సస్యరక్షణ, ఏ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై తీర్చిదిద్దిన ఉద్యాన పంచాంగాన్ని రూపొందించిన వర్సిటీ వైస్ చాన్సలర్, శాస్త్రవేత్తలను మంత్రి కన్నబాబు అభినందించారు. వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్‌కుమార్, విస్తరణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment