సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 1 నుంచి బిందు, తుంపరసేద్య పరికరాలను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,190.11 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 24.76 లక్షల హెక్టార్లలో సూక్ష్మసేద్యానికి అనువుగా ఉన్నా ఇప్పటివరకు 13.42 లక్షల హెక్టార్లలో మాత్రమే అమలవుతోందని చెప్పారు. మరో 11.34 లక్షల హెక్టార్లలో విస్తరించేందుకు అవకాశాలున్నాయన్నారు. ఈ ఏడాది లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు అర్హులైన రైతులకు బిందు, తుంపరసేద్య పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. ఆయన గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్ల కింద వరి సాగుచేయని, గతంలో ఈ పథకం కింద లబ్ధిపొందని రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నర్సరీల నియంత్రణ కోసం ఉద్యాన నర్సరీ క్రమబద్ధీకరణ చట్టం–2010కి సవరణలు తీసుకొచ్చి అన్ని నర్సరీలను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. జిల్లాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఉద్యాన, వ్యవసాయ సహాయకులకు పూర్తిస్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు. వైఎస్సార్ పొలంబడి, తోటబడిని క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఉద్యాన పంటలను పండించే రైతులకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కొబ్బరి తెగుళ్ల నివారణకు చర్యలు
గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలకు సోకుతున్న మొవ్వ తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని కన్నబాబు అధికారులకు సూచించారు. ఉద్యానశాఖ కమిషనర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ ఈ ప్రాంతాల్లో పర్యటించి మొవ్వతోపాటు కొబ్బరికి సోకుతున్న ఇతర తెగుళ్ల తీవ్రతపై అధ్యయనం చేయాలని కోరారు. అధికారులు, శాస్త్రవేత్తలతో రెండు బృందాలను ఆ ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు. తెగులు సోకిన వాటి స్థానంలో కొత్త కొబ్బరి మొక్కలు నాటేందుకు కొబ్బరి అభివృద్ధి బోర్డు పథకాల ద్వారా ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు. వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలతో పాటు ఖరీఫ్ సీజన్‌లో ఆర్బీకేల ద్వారా జరుగుతున్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పంపి ణీపై సమీక్షించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, ఉద్యానశాఖల కమిషనర్లు హెచ్.అరుణ్‌కుమార్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు
1 నుంచి సూక్ష్మసేద్య పరికరాల పంపిణీ
Published Fri, Sep 3 2021 5:31 AM | Last Updated on Fri, Sep 3 2021 5:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment