రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్‌' | AP Agros to support farmers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్‌'

Published Wed, Oct 27 2021 5:27 AM | Last Updated on Wed, Oct 27 2021 10:19 AM

AP Agros to support farmers In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీ ఆగ్రోస్‌) బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగు మందులను సరఫరా చేస్తున్న ఏపీ ఆగ్రోస్‌ను వ్యవసాయ యాంత్రీకరణలో భాగస్వామిగా చేయనున్నారు. ఏపీ ఆగ్రోస్‌ను బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. 

ట్రాక్టర్లు, రోటోవేటర్లకు డిమాండ్‌ 
రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.2,133.75 కోట్లతో 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), నియోజకవర్గ స్థాయిలో అత్యాధునిక యంత్ర పరికరాలతో 175 హైటెక్‌ హబ్‌లు, వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి ఐదు చొప్పున కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌తో 1,035 సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్బీకేల స్థాయిలో ఐదుగురు కంటే ఎక్కువ మందితో ఏర్పాటైన ఎంపిక చేసిన రైతు సంఘాలకు ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ తదితర పరికరాలను రాయితీపై సమకూరుస్తున్నారు.

ఇప్పటికే తొలివిడతలో రూ.98.08 కోట్లతో 2,520 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. రైతులకు ఎక్కువగా అవసరమయ్యేది ట్రాక్టర్లు, రోటోవేటర్లే. దుక్కి నుంచి కోత వరకు ప్రతీ దశలోనూ వీటి అవసరం ఉంటుంది. వాటి సరఫరా విషయంలో కంపెనీల షరతులు సీహెచ్‌సీల ఏర్పాటులో ప్రతిబంధకంగా మారాయి. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిన సబ్సిడీ మొత్తం చెల్లిస్తేనే ట్రాక్టర్లు, రోటోవేటర్లు సరఫరా చేస్తామంటూ మెలిక పెట్టడంతో సీహెచ్‌సీల ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుంది. విడతల వారీగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ట్రాక్టర్లు, రోటోవేటర్లు లేకుండా మిగిలిన యంత్ర పరికరాలతో సీహెచ్‌సీలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చారు.  
లాభాపేక్ష లేకుండా సీహెచ్‌సీలకు.. 
డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ట్రాక్టర్లు, రోటోవేటర్ల డీలర్‌ షిప్‌లను ఏపీ ఆగ్రోస్‌ ద్వారా ఆయా కంపెనీల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇన్‌స్టిట్యూషనల్‌ డీలర్‌షిప్‌ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన 40 శాతం సబ్సిడీతో పాటు తమ వాటా 10 శాతం కలిపి రైతు కమిటీలు జమ చేస్తే మిగిలిన 50 శాతం మొత్తాన్ని మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఏపీ ఆగ్రోస్‌ జమ చేసి క్యాష్‌ అండ్‌ క్యారీ పద్ధతిలో తాము పొందిన డీలర్‌షిప్‌ ద్వారా ట్రాక్టర్లు, రోటోవేటర్లను తీసుకొని రైతు కమిటీలకు అందజేస్తుంది.

ఆ మేరకు ఆర్బీకేల్లో గ్రౌండింగ్‌ అయిన తర్వాత జిల్లా స్థాయిలో ఏర్పాటైన కమిటీ పరిశీలన అనంతరం ప్రభుత్వం నుంచి 40 శాతం సబ్సిడీ మొత్తం రైతు కమిటీలకు జమ అవుతుంది. బ్యాంకులందించే 50 శాతం రుణ మొత్తాన్ని రైతు కమిటీలు నేరుగా ఏపీ ఆగ్రోస్‌కు జమ చేస్తాయి. ప్రస్తుతం సీహెచ్‌సీల నుంచి అందిన డిమాండ్‌ మేరకు 6,800 ట్రాక్టర్లు, మరో 8 వేలకు పైగా రోటోవేటర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. లాభాపేక్ష లేకుండా ఏపీ ఆగ్రోస్‌ ద్వారా డీలర్‌ ధరకే వాటిని సీహెచ్‌సీలకు సమకూర్చడంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌ లాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. 

ఏపీ ఆగ్రోస్‌ బలోపేతం 
ఏపీ ఆగ్రోస్‌ను మూసివేస్తున్నారంటూ కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఏ ఒక్క కార్పొరేషన్‌ను మూసివేసే ప్రసక్తే లేదు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగస్వామిగా చేయడం ద్వారా ఏపీ ఆగ్రోస్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీహెచ్‌సీల ద్వారా ట్రాక్టర్లు, రోటోవేటర్లు సరఫరా కోసం ఇనిస్టిట్యూషనల్‌ డీలర్‌షిప్‌ తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖమంత్రి

చాలాకంపెనీలు ముందుకొస్తున్నాయి.. 
సీహెచ్‌సీల్లో రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, రోటోవేటర్ల సరఫరా కోసం డిమాండ్‌ ఉన్న కంపెనీల డీలర్‌షిప్‌ తీసుకునేందుకు ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ చేశాం. డీలర్‌షిప్‌ ఇచ్చేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. వారి నుంచి క్యాష్‌ అండ్‌ క్యారీ పద్ధతిలో కొనుగోలు చేసి సీహెచ్‌సీలకు అందజేసేందుకు త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తాం. 
– సంగంరెడ్డి కృష్ణమూర్తి, మేనేజింగ్‌ డైరెక్టర్, ఏపీ ఆగ్రోస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement