Andhra Pradesh: ఆర్బీకేల్లో పాఠాలు | Rythu Bharosa centers for teaching schools for university students | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఆర్బీకేల్లో పాఠాలు

Published Thu, Sep 30 2021 2:52 AM | Last Updated on Thu, Sep 30 2021 11:17 AM

Rythu Bharosa centers for teaching schools for university students - Sakshi

పొలంలో రైతుల కష్టాలేంటి? ఏయే తెగుళ్లను ఎలా గుర్తించాలి? వాటిని ఏ విధంగా అరికట్టాలి? ఏ పంటలకు ఎక్కువగా తెగుళ్లు ఆశిస్తాయి? పురుగు మందుల పిచికారి ఏ విధంగా జరగాలి? అసలు తెగుళ్లు సోకకుండా ముందస్తు చర్యలు ఏమైనా ఉన్నాయా? ఇందుకు విత్తు దశ నుంచే ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? పంట చేతికొచ్చే దశలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? మార్కెటింగ్‌లో ఎలాంటి ఇక్కట్లు ఉన్నాయి? కొత్త పంటల సాగుతో ఎక్కువ లాభాలు ఎలా పొందాలి? అధునాతన యంత్ర సామగ్రిని ఏ విధంగా సమకూర్చుకోవాలి.. ఎలా ఉపయోగించాలి? ఆక్వా, మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో తీసుకోవా ల్సిన జాగ్రత్త లేంటి? వ్యాధుల బారిన పడకుండా పశు సంపదను ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలన్నింటినీ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివితే సరిపోదు. వీటన్నింటినీ ప్రత్యక్షంగా గమ నించి తెలుసుకున్నప్పుడే ఆయా కోర్సుల్లో పరిపూర్ణ విజ్ఞానం విద్యార్థుల సొంతం అవుతుంది. అప్పుడే వారు జాతీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ దిశగా మన రాష్ట్ర విద్యార్థులను ఆర్బీకే వేదికగా సమా యత్తం చేయాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా (ఆర్బీకేలు) కేంద్రాలు యూనివర్సిటీ విద్యార్థులకు పాఠాలు నేర్పే విద్యాలయాలుగా మారబోతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, వెటర్నరీ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా క్రమం తప్పకుండా 3 నెలల పాటు ఆర్బీకేల్లో ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు వర్సిటీలు సన్నాహాలు చేస్తున్నాయి. విత్తు నుంచి విపణి వరకు గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఆర్‌బీకే వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసింది.

వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఆర్‌బీకేలు కేంద్రంగా ఏడాదిన్నరగా అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాలు ఇక్కడ అమలవుతున్న ఆర్‌బీకే వ్యవస్థను అధ్యయనం చేస్తున్నాయి. ఆర్‌బీకేల ద్వారా బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే సబ్సిడీ, నాన్‌ సబ్సిడీ విత్తనాలు, పురుగుల మందులతో పాటు ఎరువులను డోర్‌ డెలివరీ చేస్తున్నారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ) ద్వారా అద్దెకు సాగు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్, స్మార్ట్‌ గ్రంథాలయాలు, కియోస్క్‌ల ద్వారా అంతర్జాతీయంగా వస్తోన్న ఆధునిక పోకడలు, మెళకువలను మారు మూల ప్రాంతాల రైతులకు అందిస్తూ నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దారు. ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పంటల ఉత్పత్తులను కళ్లాల వద్దే అమ్ముకునే ఏర్పాటు చేశారు. యూనివర్సిటీల వీసీల నుంచి శాస్త్రవేత్తల వరకు, క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి కలెక్టర్‌ స్థాయి అధికారుల వరకు క్రమం తప్పకుండా ఆర్‌బీకేలను సందర్శిస్తూ.. పలు సేవలను రైతు లోగిళ్ల వద్దకు తీసుకెళ్తున్నారు.
 
విద్యాలయాలుగా ఆర్‌బీకేలు
రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు వెన్ను దన్నుగా నిలుస్తోన్న ఆర్‌బీకేలను యూనివర్సిటీలకు అనుబంధంగా విద్యాలయాలుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్‌ చివరి ఏడాదిలో బోధనాస్పత్రుల్లో తర్ఫీదునిస్తారు. సాంకేతిక విద్యనభ్యసించే వారికి అప్రంటీస్‌ ద్వారా ప్రాక్టికల్‌ మార్కుల్లో ప్రాధాన్యత ఇస్తారు. అదే రీతిలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో వివిధ కోర్సులు అభ్యసించే వారు ఆయా వర్సిటీల పరిధిలో జరిగే ప్రాక్టికల్స్‌కు మాత్రమే హాజరయ్యే వారు. ఇక నుంచి వీరు చివరి ఏడాది విధిగా మూడు నెలల పాటు ఆర్‌బీకేలు కేంద్రంగా ప్రాక్టికల్స్‌ నిర్వహించేలా విద్యా బోధనలో మార్పులు తీసుకొస్తున్నారు.
 
క్షేత్ర స్థాయి అవగాహనే లక్ష్యం

సాగు విధానాల్లో సంతరించుకున్న మార్పులు, ఆర్‌బీకే వ్యవస్థ ఏర్పాటు లక్ష్యాలు, వాటి ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. కార్యక్రమాల అమలు తీరుతో పాటు రైతులు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? వంటి అంశాలపై క్షేత్ర స్థాయి పరిశీలన లక్ష్యంగా విద్యార్థుల ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. పొలంబడులు, పట్టు, తోట బడులు, పశు విజ్ఞాన, మత్స్య సాగుబడుల్లో రైతులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. సాగులో రైతులు పాటిస్తున్న ఉత్తమ యాజమాన్య, సేంద్రియ సాగు పద్ధతులను పరిశీలించడం, ఆక్వా కల్చర్‌ (మెరైన్, మంచి, ఉప్పునీటి)లో రైతులు పాటించే సాగు విధానాలు, పశు పోషణ, పాల సేకరణలో పాటించే పద్ధతులపై అవగాహన పెంచుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన ప్రాక్టికల్స్‌లో విద్యార్థులకు మార్కులు కేటాయించేలా విద్యా బోధనలో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా బోధనకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
విద్యా బోధనలో మార్పులు
విద్యాబోధన తరగతి గదులకే పరిమితం కాకూడదు. వారు నేర్చుకున్న పాఠాలు.. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. యూనివర్సిటీ నుంచి బయటకొచ్చే వేళ పరిశోధనలు చేసే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆర్‌బీకేల్లో వారికి కనీసం మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు విద్యాబోధనలో మార్పులు తీసుకొస్తున్నాం. 
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రికలు వైఎస్సార్‌ ఆర్‌బీకేలు. దేశంలో మరెక్కడా లేని విధంగా వీటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందుతున్నాయి. అలాంటి కేంద్రాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మంచి ఆలోచన. తరగతి గదుల్లో నేర్చుకునే విషయాలకు ఎన్నో రెట్లు ఇక్కడ వారెన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement