కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థితో మాట్లాడుతున్న కలెక్టర్ కృతికా శుక్లా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్: ఊపిరి ఆడక 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన మంగళవారం కాకినాడలోని కేంద్రీయ విద్యాలయలో చోటు చేసుకుంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 473 మంది చదువుకుంటున్నారు. మంగళవారం మొదటి పీరియడ్ 9.30 గంటలకు ప్రారంభం కాగా, 6వ తరగతి విద్యార్థి ఒకరు తనకు ఊపిరి ఆడడం లేదని.. కళ్లు మండుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వరుసగా మరో 17 మంది ఇదే సమస్యతో తరగతి గదుల నుంచి బయటకు వచ్చేశారు.
వీరిలో 11 మంది అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరందరినీ సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వారందరినీ పరిశీలనలో ఉంచామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీ బుద్ధా తెలిపారు. విద్యార్థులను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా పరామర్శించారు.
పాఠశాలను పరిశీలించిన అధికారుల బృందం
డీఎంఅండ్‌హెచ్‌వో రమేష్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ అధికారి వెంకటాచలం, డీఎస్పీ భీమారావు, ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ నాగూర్ మీరా, తహశీల్దార్ మురార్జీ తదితరులు స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం తరగతి గదుల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటమేనని భావిస్తున్నారు.
సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు నురుగు వచ్చే పోమ్‌తో కూడిన స్ప్రే టిన్‌లను వినియోగించినట్టు తెలిసింది. రాత్రి కిటికీలు మూసి ఉండటంతో స్ప్రేలో ఉండే ఐసోసైనెట్, పాలియాల్ రసాయనాలు గదుల్లో వ్యాపించి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కలెక్టర్ చైర్మన్‌గా విచారణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment