ఈ క్రాప్‌లో సాంకేతిక సమస్యలకు చెక్‌ | Stop for technical issues in E cropping | Sakshi
Sakshi News home page

ఈ క్రాప్‌లో సాంకేతిక సమస్యలకు చెక్‌

Published Thu, Feb 10 2022 5:22 AM | Last Updated on Thu, Feb 10 2022 5:22 AM

Stop for technical issues in E cropping - Sakshi

విజయనగరం జిల్లా కురపం గ్రామంలో ఈ క్రాప్‌ నమోదు చేస్తున్న సిబ్బంది

సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇకపై ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్‌ సమస్యలకు చెక్‌ పెట్టింది. పంటల నమోదు కోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌)యాప్‌ను అప్డేట్‌ చేసింది. ఇందుకోసం గడిచిన 45 రోజులుగా నిలిపి వేసిన పంటల నమోదును మంగళవారం తిరిగి ప్రారంభించింది. పంటల నమోదును ఈనెలాఖరుకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు యాప్‌లో గ్రామం పేరు కొట్టగానే కొన్ని సందర్భాల్లో ఇతర జిల్లాల్లో అదే పేరుతో ఉన్న గ్రామాల జాబితా ప్రత్యక్షమవుతుండటంతో రైతు ఏ గ్రామానికి చెందిన వారో తెలుసుకోవడం కష్టంగా ఉండేది.  ఈ క్రాప్‌ డేటా–సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ డేటాతో పూర్తి స్థాయిలో అనుసంధానంకాకపోవడం వల్ల కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇలా గడిచిన ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు, సిబ్బందికి ఎదురైన వివిధ రకాల సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తూ ఆర్బీ యూడీపీ యాప్‌ను అప్డేట్‌ చేశారు. 

ఇలా చేశారు.. 
► ఆర్బీకేల పరిధిలోని రెవెన్యూ గ్రామాలను గుర్తించేందుకు రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌ మాస్టర్‌ డేటాతో ఆర్బీకేలను మ్యాపింగ్‌ చేశారు.  
► యాప్‌లో జిల్లా, మండలం, గ్రామం పేర్లు సెలక్ట్‌ చేయగానే భూమి ఖాతా, సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ భూముల వివరాలు వచ్చేలా మార్పుచేశారు.  
► ఆయా వివరాలను ఎంపిక చేసుకున్న తర్వాత రైతు పేరు నమోదు చేసి ఏ రకం పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో కూడా నమోదు చేయొచ్చు.  
► మనుగడలో ఉన్న వంగడాల వివరాలతో సహా ఉద్యాన, వ్యవసాయ పంటల వివరాలు నమోదుచేసేలా డేటా బేస్‌లో వాటి వివరాలను పొందుపర్చారు.  
► సంప్రదాయ, సేంద్రియ, ప్రకృతి, సహజ ఇలా ఏ తరహా వ్యవసాయ పద్ధతులైనా నమోదు చేసేలా ఈక్రాప్‌లో మార్పు చేశారు. 
► భూ వివాదాల నేపథ్యంలో వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని వ్యవసాయ భూములను యాడ్‌ల్యాండ్‌ ఆప్షన్‌లో నాన్‌వెబ్‌ల్యాండ్‌ కేటగిరి కింద నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.  
► వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించిన ఈక్రాప్‌ డేటాను సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ రూపొందించిన కొనుగోలు యాప్‌తో అనుసంధానిస్తున్నారు. 
► రబీలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పంటలు తొలుత కోతకొచ్చే అవకాశం ఉన్నందున ఆ జిల్లాల్లో పంటల నమోదుకు తొలుత ప్రాధాన్యతనిస్తారు. మిగిలిన జిల్లాల్లో కూడా నెలాఖరులోగా పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పగడ్బందీగా పంటల నమోదు
సాంకేతికలోపాలతో కొనుగోలు సందర్భంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న 
ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి లోపాలకు ఆస్కారంలేని రీతిలో ఆధునీకరించిన యాప్‌ ద్వారా పంటల నమోదును పగడ్బందీగా చేపడుతున్నారు. 
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

క్షేత్రస్థాయిలో పంట నమోదు రసీదు 
గడిచిన ఖరీఫ్‌ సీజన్‌లో మాదిరిగా కాకుండా ప్రతి వాస్తవ సాగుదారుడి వివరాలు నమోదు చేసేలా యాప్‌ను అప్డేట్‌ చేసాం. ఈకేవైసీ నమోదు చేసుకున్న రైతులు ఆర్బీకేలకు వెళ్లనవసరం లేదు. క్షేత్ర స్థాయి పరిశీలనలోనే ప్రతీ రైతుకు పంట నమోదు రసీదు ఇస్తారు. పంటల నమోదును వేగవంతం చేసేందుకు వీలుగా ప్రతీ ఆర్బీకేకు ఓ కంప్యూటర్, ప్రింటర్, స్కానర్‌ అందజేస్తున్నాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement