సాక్షి, అమరావతి: అన్నదాతలకు వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీకే కార్యకలాపాల్లో వలంటీర్ల సేవలను వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వలంటీర్‌ను ఎంపిక చేసి వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణనివ్వబోతుంది. సాగు ఉత్పాదకాలను గ్రామస్థాయిలో రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. గతేడాది మే– 30వ తేదీన ప్రారంభించిన వీటి ద్వారా విత్తు నుంచి విపణి వరకు రైతులకు అవసరమైనవి గ్రామస్థాయిలోనే అందిస్తోంది.
ఇందుకోసం ప్రతి ఆర్బీకేకు ఒక వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన సహాయకులను నియమించింది. ఆర్బీకేల్లో ప్రస్తుతం 14,287 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలందించే లక్ష్యంతో ప్రతి ఆర్బీకేకు ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానించారు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3నుంచి 6గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన సమయాల్లో పంటల నమోదు (ఈ క్రాప్)తో పాటు రైతులకు అందించే వివిధ రకాల సేవల కోసం క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్తుంటారు. ఆ సమయంలో ఆర్బీకేలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఆర్బీకేలకు వచ్చే రైతులు కొంత ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీకేలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నాణ్యమైన సేవలందించడమే లక్ష్యం
అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఆర్బీకేలు తెరిచే ఉండాలి. ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలి. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్న లక్ష్యం మేరకు ప్రతి ఆర్బీకేకు ఓ గ్రామ వలంటీర్‌ను అనుసంధానం చేస్తున్నాం.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment