సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ గోదాములు, డ్రైయింగ్ యార్డుల నిర్మాణానికి ఉద్దేశించిన టెండర్లకు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మొదటి దశ పనులకు టెండర్లు ఆహ్వానించగా, తాజాగా రెండో దశ పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమైంది. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా రూ.420.30 కోట్ల అంచనా వ్యయంతో 500 టన్నులు, 1,000 టన్నుల సామర్థ్యం కలిగిన 1,255 గోదాములు, డ్రైయింగ్ యార్డులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రానున్న ఖరీఫ్ సీజన్‌లో పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే సమయానికి వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకనుగుణంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలో ప్యాకేజీ–1 కింద రూ.28.5 కోట్ల అంచనా వ్యయంతో 92 పనులకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో ప్యాకేజీ–3 కింద రూ.69.3 కోట్ల అంచనా వ్యయంతో 219 పనులకు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల స్వీకరణకు ఈ నెల 29ని గడువుగా నిర్ధారించారు. ఈ గడువులోగా వచ్చిన వాటిని టెక్నికల్ కమిటీకి పంపి.. జూన్ మొదటి వారంలోగా అనుమతులిచ్చి పరిపాలనామోదంతో వర్క్ ఆర్డర్లు జారీ చేస్తారు.
ప్యాకేజీ–2, 4లకు ఈ నెల 25న టెండర్లు..
ఇక ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ప్యాకేజీ–2 కింద రూ.139.5 కోట్ల అంచనా వ్యయంతో 430 పనులకు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ప్యాకేజీ–4 కింద రూ.183 కోట్ల అంచనా వ్యయంతో 514 పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.100 కోట్లు దాటడంతో ప్రభుత్వాదేశాల మేరకు టెండర్ ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీకి పంపారు. మే 17 వరకు వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ కొన్ని సూచనలు, సలహాలతో టెండర్లు పిలిచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గోదాముల చుట్టూ సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 25న టెండర్లు పిలిచేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశ టెండర్ ప్రక్రియను జూన్ 20కల్లా పూర్తి చేసి..ఆ వెంటనే వారం రోజుల్లో పరిపాలనామోదంతో వర్క్ ఆర్డర్లు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏదేమైనా వచ్చే ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి గోదాములను సిద్ధం చేసే దిశగా ముందుకెళ్తున్నట్టు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు.
గోదాముల టెండర్లకు గ్రీన్‌సిగ్నల్
Published Sun, May 23 2021 3:43 AM | Last Updated on Sun, May 23 2021 3:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment