How To Identify Natural Mango Fruits | How to Identify Artificially Ripened Mangoes In Telugu - Sakshi
Sakshi News home page

మామిడి పండు తింటున్నారా?.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Published Wed, May 4 2022 8:03 PM | Last Updated on Thu, May 5 2022 8:54 AM

How To Identify Natural Mango Fruits - Sakshi

కాల్షియం కార్బైడ్‌తో మాగించిన పండ్లు- సహజసిద్ధంగా మాగిన పండ్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): పళ్లలో మామిడి రారాజు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తూ నోరూరిస్తున్నాయి. పసుపు పచ్చ రంగులో ఆకర్షించే అలాంటి మామిడిని చూసి మోసపోవద్దంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు అయితేనే అంతలా ఊరిస్తాయని, వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమంటూ హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా లేదా ఎథ్రిల్‌ లిక్విడ్‌తోనైనా మాగబెట్టిన పండ్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లకు సహజసిద్ధంగా మాగిన పండ్లను ఎలా గుర్తు పట్టాలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

చదవండి: ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే!

కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు.. 
కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండు మొత్తం లేత పసుపు రంగులో ఒకే విధమైన కాంతితో నిగనిగలాడుతూ ఉంటుంది. పైకి మాగినట్లు కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి రుచి పుల్లగా ఉంటుంది. పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం తక్కువగా ఉండి, తీపి, రుచి అంతంత మాత్రమే ఉంటాయి. పండు తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. పండు త్వరగా పాడైపోతుంది.

సహజసిద్ధంగా మాగిన పండు.. 
సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. తీయగా, రుచిగా ఉంటుంది. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

ఆరోగ్య సమస్యలు.. 
కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తింటే కాన్సర్, అల్సర్, కాలేయం(లివర్‌), మూత్ర పిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాల్షియం కార్బైడ్‌ ద్వారా వెలువడే ఎసిటిలీన్‌ వాయువు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రత్యామ్నాయ పద్ధతులు.. 
మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాలలో ఉంచాలి. లేదా పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. లేదా తప్పని పరిస్థితుల్లో మామిడి కాయలు మాగబెట్టాల్సి వస్తే ఇథిలిన్‌ వాయువు(గ్యాస్‌) 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్‌ వాయువు 24 గంటలు తగిలేలా ఉంచితే 5 రోజుల్లో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ఈపద్ధతిని రైపనింగ్‌ చాంబర్లో వినియోగిస్తున్నారు. ఎథ్రిల్‌ లిక్విడ్‌లో 5 నిముషాలు పాటు ముంచి మూడు, నాలుగు రోజులు నిల్వ చేస్తే సహజత్వానికి దగ్గర మాగుతాయి. ముంచడం సాధ్యం కానిపక్షంలో ఎథ్రిల్‌ లిక్విడ్‌ను కాయలకు స్ప్రే చేయవచ్చు.

తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.. 
పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీళ్లతో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. లేదా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది.

కాల్షియం కార్బైడ్‌తో మాగించొద్దు 
ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగించరాదు. కార్బైడ్‌ వాడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎలా మాగించాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
– రఘునాథరెడ్డి, ఏడీ ఉద్యానశాఖ కర్నూలు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement