ఆ రసాయనం.. హానికరం | calcium carbide is very dangerous chemical | Sakshi
Sakshi News home page

ఆ రసాయనం.. హానికరం

Published Fri, Mar 17 2017 9:44 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

ఆ రసాయనం.. హానికరం

ఆ రసాయనం.. హానికరం

► కాల్సియం కార్బైడ్‌తో పండ్లు మాగపెట్టొద్దు
►  నిపుణుల సూచన

కడప: మామిడి కాయలు మాగబెట్టే (పక్వానికి తెచ్చే) సీజను వచ్చిందంటే కాల్సియం కార్బైడ్‌ రసాయన అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆసక్తికర విషయాలను ఉమ్మడి రాష్ట్ర ఉద్యాన శాఖ రిటైర్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వేంపల్లె లక్ష్మీరెడ్డి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే....
 
కార్భైడ్‌ ఎందుకు వాడతారంటే..
 
కాల్సియం కార్బైడ్‌ను 1988 నుంచి నేటివరకు పారిశ్రామికంగా సున్నం, కోక్‌ మిశ్రమాన్ని ఎలక్ట్రిక్‌ ఫర్నెస్‌లో సుమారు 2000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద తయారుచేస్తున్నారు. ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజనితో కలిసినప్పుడు కాల్సియం సైనమైడ్‌ ఏర్పడుతుంది. దీనిని రసాయనిక ఎరువుగా వాడతారు. ఉక్కు పరిశ్రమలో కూడా దీనిని వినియోగిస్తారు.
 
కాయలను మాగించేందుకు..
 
కాల్సియం కార్బైడ్‌ తేమతో కలిసిప్పుడు ఎసిటిలీన్‌ అనే వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు మాగే (పక్వానికి తెచ్చే) ప్రక్రియను ప్రారంభింపజేస్తుంది. రానురాను మామిడి, చీనీ (బత్తాయి), నిమ్మలాంటి వాటిని మాగించేందుకు ఈ రసాయనాన్ని వాడుతున్నారు. మామిడి కాయలను మార్కెట్‌లోకి ముందుగా ప్రవేశపెడితే మంచి ధరలు పలుకుతాయని సరైన పక్వానికి రాకముందే వీటిని కోసి కార్బైడ్‌ సహాయంతో మాగబెట్టి విక్రయిస్తుంటారు. దీని వల్ల పండ్లు మాగినట్లు కనిపించినా తియ్యగా ఉండవు.
► కాయలను మాగబెట్టేందుకు వాడే కాల్సియం కార్బైడ్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఆర్సెనిక్, ఫాస్ఫరస్‌              కాంపౌండ్‌లు ఉంటాయి. ఇవి వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
► ఇది కాన్సర్‌ను కలుగజేసే ఎసిటాల్డిహైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు కాన్సరుకు గురయ్యే ప్రమాదం ఉంది
► కాల్సియం కార్బైడ్‌ తేమతో కలిసినపుడు విడుదలయ్యే ఎసిటిలిన్‌ వాయువు వినియోగదారుల మెదడుకు ప్రాణవాయువు సరఫరాను      తగ్గించి నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది.
 
కాల్సియం కార్బైడ్‌ వాడకాన్ని నిరోధించేందుకు సూచనలు...
 
► ఇప్పటికే చాలా దేశాల్లో కాల్సియంకార్బైడ్‌తో కాయలను మాగించడాన్ని నిషేధించారు. మన దేశంలో కూడా దీని వాడకాన్ని                  నిషేధించారు. ఆహార కల్తీ నిరోధక చట్టం (ప్రివెన్స్‌ ఆఫ్‌ పుడ్‌ అడల్టరేషన్‌ యాక్ట్‌) 44 ఏఏ ప్రకారం ఎసిటిలీన్‌ వాయువుతో కృత్రిమంగా        మాగబెట్టిన పండ్లను అమ్మడాన్ని నిషేధించారు.
►   అయితే ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు దీనిపై దృష్టి సారించడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని                 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
► మార్కెటింగ్‌ శాఖ వారు వారి మార్కెట్‌ యార్డుల పరిధిలో కాల్సియం కార్బైడ్‌ వాడకాన్ని నిషేధించాలి నిషేదాజ్ఞలను ఉల్లంఘించే              వ్యాపారస్తుల లైసెన్స్‌లను రద్దు చేయాలి.
► ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ సమన్వయంతో కార్బైడ్‌ వాడకంవల్ల కలిగే నష్టాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలి.                     ఇందుకోసం సీజనులో సదస్సులు, మేళాలు నిర్వహించాలి. ఎలక్ట్రానిక్‌ మీడియా, పత్రికలను ఉపయోగించుకుని ఆరోగ్యానికి కలిగే           హానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలి. పండ్లను అమ్మే మార్కెట్‌లో మైకుల ద్వారా ప్రచారం చేయాలి.
► రైతులు, వ్యాపారులు బాగా పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోస్తే సహజ సిద్ధంగా మాగి మంచి రంగు, రుచి, వాసనను                సంతరించుకుంటాయి.కాల్సియం కార్బైడ్‌ వాడాల్సిన అవసరం ఉండదు.
►  వ్యాపారులు కూడా నైతిక,సామాజిక బాధ్యతలు గుర్తించి కాయలను మాగించేందుకు కార్బైడ్‌ను వాడకూడదు.
► వినియోగదారులు కార్బైడ్‌తో మాగించిన పండ్లను వాడటం చాలిస్తే సమస్య దానంతట అదే నివారించబడుతుంది. వినియోదారులు         అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. అలా కాకపోతే అనారోగ్యాలను కొనితెచ్చుకున్నవారవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement