కార్బైడ్ పండ్లను ఇలా గుర్తించొచ్చు | Calcium carbide Use For Mango Fruits In Telugu States | Sakshi
Sakshi News home page

మధుర ఫలం..అంతా గరళం

Published Tue, May 29 2018 10:59 AM | Last Updated on Tue, May 29 2018 10:59 AM

Calcium carbide Use For Mango Fruits In Telugu States - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : కొందరు వ్యాపారుల కాసుల కక్కుర్తి సామాన్య ప్రజలను అనారోగ్యం పాలు జేస్తోంది. మార్కెట్‌లో ఆకర్షణీయంగా కనిపించే మామిడి పండ్లు మగ్గబెట్టేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్, ఇథలిన్‌ను వినియోగిస్తున్నారు. ఇటీవల వీచిన పెనుగాలులకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. కృష్ణా జిల్లాలో నూజివీడు, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో అధికంగా మామిడి తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82 వేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. జిల్లాలో పండిన మామిడి కాయలే గాక తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున విజయవాడలోని నున్న మామిడి మార్కెట్‌కు తరలి వస్తుంటాయి. ఇక్కడి నుంచి రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ప్రకృతి పరంగా కాయలు మగ్గబెట్టకుండా కార్బైడ్, ఇథిలిన్‌తో మాగబెట్టడం వల్ల కాయలు తొందరగా పాడవుతున్నాయి.

ఇథలిన్‌ అమ్మకాలపై కేంద్రం ఆరా
రాష్ట్రంలో ఇథలిన్‌ అమ్మకాలపై ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగం అధికారులు ఆరా తీశారు. రాష్ట్రంలో మామిడి పండ్లను మగ్గబెట్టడంతో ఇబ్బడిముబ్బడిగా రసాయనాలు వాడుతున్న సమాచారం రావడంతో దీనిపై ఇక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చైనా నుంచి ఇథలిన్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. మామిడి పండ్లు మగ్గబెట్టడంతో పాటు రంగు రావడంలో కీలకపాత్ర పోషించేందుకు కలిపే రసాయనాలలో క్యాన్సర్‌ కారకాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.  విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇథలిన్‌ ఏ ప్యాక్‌లో వస్తోంది.. ఎన్ని గ్రాములు ఉంటోంది, దీన్ని ఎలా వాడుతున్నారో పూర్తి వివరాలు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

తనిఖీలు నామమాత్రం
ప్రజలకు సురక్షిత పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది.ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ఉన్న సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కార్బైడ్, ఇథలిన్‌ వాడకాన్ని హైకోర్టు నిషేధించినా లెక్కచేయడం లేదు. వక్రమార్గాల ద్వారా రసాయనాలను తెప్పించుకుని వినియోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలకు వెళ్లినప్పుడు పండ్ల ను తీసుకెళ్లి నిషేధిత రసాయనాలు వాడినట్లు నిర్థారణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పి.. తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు.

స్వచ్ఛమైన పండ్లను ఇలా గుర్తించొచ్చు
పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది.
పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది.
తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన గుబాళిస్తుంది. కొద్ది దూరం వరకు పరిమిళమైన వాసన వస్తుంది.
కార్బైడ్, ఇథలిన్‌తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి
పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపురంగు కలిగి ఉంటుంది.
పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది.
పండును ముక్కు దగ్గర ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది.
పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి.
తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి.

కార్బైడ్, ఇథలిన్‌తో పెను ప్రమాదం
సహజసిద్ధంగా పండిన పండ్లను కాకుండా కార్బైడ్, ఇథిలిన్‌తో మగ్గబెట్టిన పండ్లు తినడం వల్ల అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కార్బైడ్‌ ద్వారా వెలువడే ఎసిటిలీస్‌ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రమాదం చూపడంతో పాటు జీర్ణవ్యవస్థ మందగించడం, తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, విరోచనాలు అవుతాయి. గర్భిణులకు అబార్షన్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువగా తింటే క్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది.    – రత్నగిరి, వైద్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement