కాకినాడ సిటీ : కాల్షియం కార్బైడ్‌ను పండ్లకు వాడడం ద్వారా ప్రజలు అనేక ప్రాణాంతక వ్యాధులకు గురవుతారని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. పండ్లను పక్వానికి తెచ్చేలా దీని వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు కలెక్టరేట్‌లో శనివారం జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించారు. జిల్లాలో ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వాడుతున్నట్టు తెలిస్తే, దాడులు జరిపి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం, అంబాజీపేటలో 11 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపారు. రాజమండ్రిలో యాపిల్, అరటి, బత్తాయి తదితర పండ్లకు సంబంధించి 5 శాంపిళ్లలో కాల్షియం కార్బైడ్ వాడినట్టు నివేదిక వచ్చిందని, ఆ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
కాకినాడలో బత్తాయి, నిమ్మ, ఫైనాపిల్‌కు సంబంధించి మూడు శాంపిళ్లలో కూడా దానిని వాడినట్టు నివేదిక వచ్చిందని, వారిపై కూడా కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఏ వ్యాపారైనా పండ్లలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నట్టు తెలిస్తే ప్రజలు 90320 50351కు, 94402 75889 సెల్‌నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. హోల్‌సేల్ పండ్ల వర్తకులు తప్పనిసరిగా లెసైన్సు తీసుకోవాలని, రిటైల్, చిన్నవ్యాపారులు విధిగా ఆహార భద్రత, ప్రమాణాల శాఖ కింద రిజిస్టర్ కావాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బీవీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌తో పాటు మార్కెటింగ్ ఏడీ, వివిధ మున్సిపల్ అధికారులు, పంచాయతీ, రవాణా, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.
పండ్లకు కాల్షియం కార్బైడ్ వద్దు : జేసీ
Published Sun, Sep 27 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement
Advertisement