రెండేళ్ల కిందట ... ప్రియా ఛత్రి ఒక నిస్సహాయ మహిళ. ఢిల్లీ, గుర్‌గావ్‌లో ఓ క్లినిక్ ముందు నిలబడి అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఊహించుకుంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భర్త తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పరీక్ష చేసిన డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ ఆమె చేతిలో ఉంది. చీటీ అనడం అలవాటైన మాట, కానీ ఆమె చేతిలో ఉన్నది మందుల జాబితా. ఆ మందులు వాడాలంటే తను, భర్త సంపాదిస్తున్న డబ్బు చాలదు.
మందులకు ఖర్చు చేస్తే ఇల్లు గడవదు. ఇల్లు గడిస్తే వైద్యం అందదు. తనేమో నాలుగు ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త సంజీత్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి నుంచి బతుకుదెరువు కోసం దేశ రాజధాని బాట పట్టిన అనేక కుటుంబాల్లో ప్రియ కుటుంబం ఒకటి. ఇరవై నాలుగేళ్ల వయసులో జీవితం ఆమెకి పెట్టిన పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గిన ప్రియ ఇప్పుడు సిలిగురిలో తోటి మహిళలకు రోల్ మోడల్ అయింది.
ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే... మనదేశంలో పండని పండ్లను, గింజలను ఇంటింటికీ చేర్చడమే. తాజాగా, నాణ్యంగా ఉన్న పండ్లను ఇస్తుందన్న విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వారి వారి పనులు చేసుకుంటూనే పండ్ల వ్యాపారం చేస్తూ నెలకు ముఫ్పైవేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు ఆమె పెట్టుబడి తన శ్రమ మాత్రమే. ఆమెకు అండగా నిలిచింది ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని రాశి సోమన్ గొప్ప మనసు.
జీవితం పండింది
ప్రియ తన పండ్లు, గింజల వ్యాపారానికి తాను పని చేసే ఇళ్ల నుంచే కస్టమర్లను వెతుక్కుంది. తొలి ప్రయత్నంగా ఢిల్లీ మండి నుంచి పది అవకాడోలు తెచ్చింది. మూడు వందల ఆదాయం వచ్చింది. ‘‘రాశి అక్క నాకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకి తీసుకెళ్లి చూపించింది. మన దేశంలో అరుదుగా లభించే పరదేశీ పండ్ల గురించి వివరించింది. సాధారణంగా ఒక పండు హోల్‌సేట్ మార్కెట్ నుంచి తినేవారి చేతికి వచ్చే మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది.
అనేక దఫాలు రవాణా అవుతుంది. పండ్ల దుకాణానికి చేరి పండ్లు కొనేవారికి అందేలోపు వాడిపోయేవి, కుళ్లిపోయేవి ఎన్నో. దుకాణదారులు ఆ నష్టాలను కూడా బాగున్న పండ్ల మీదనే రాబట్టుకోవాలి. నేను మండీ నుంచి కొనే గింజలు, పండ్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి కూడా నా కస్టమర్లకు అవసరమైన పండ్లనే తెస్తాను. కాబట్టి నా దగ్గర నిల్వ ఉండవు. తెచ్చిన రోజే కస్టమర్లకు చేరుస్తాను. అలాగే నాణ్యమైన పండ్లను మాత్రమే తెస్తాను.
ఏరోజుకారోజు తాజా పండ్లను తినే వెసులుబాటును కల్పిస్తున్నాను. కాబట్టి నా దగ్గర క్రమం తప్పకుండా పండ్లు తెప్పించుకునే వాళ్లు 250 మంది ఉన్నారు. అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాను. వారానికి ఒకసారి తెప్పించుకునే వాళ్లు ఆదివారం రోజు గూగుల్ ఫార్మ్‌లో వాళ్లకు అవసరమైనవి తెలియచేస్తారు. గురువారం వాళ్లకు అందచేస్తాను. ఇవి కాకుండా తాజా పండ్లు రోజూ తెప్పించుకునే వాళ్లకు అలాగే అందిస్తున్నాను.
పండ్ల దుకాణంలో దరకంటే చాలా తక్కువగా లభిస్తుండడంతో నా ప్రయత్నం విజయవంతమైంది. రెడ్ గ్లోబ్ గ్రేప్స్, బ్లూ బెర్రీ, మాండేరియన్స్, గోల్డెన్ కివీ, గ్రీన్ కివీ వంటి పండ్లతోపాటు వాల్‌నట్స్, ఫిగ్, విదేశీ ఖర్జూరాలు, హాజిల్‌నట్, క్రాన్‌బెర్రీ, మంచి జీడిపప్పు, బాదం వంటివి 30 రకాలు అందిస్తున్నాను. నేను, సంజీత్ మా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నాం. దీనిని వ్యాపారం, లాభాలు అనాలా లేక నేను అందిస్తున్న సర్వీస్‌కి లభిస్తున్న చార్జ్ అనాలో తెలియదు.
కానీ నా పిల్లలు కూడా ప్యాకింగ్, డెలివరీ వంటి పనుల్లో సాయం చేస్తున్నారు. నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. దాంతో పదకొండవ తరగతితోనే చదువు ఆగిపోయింది. నాకున్న కొద్దిపాటి చదువుతో, నా శ్రమను పెట్టుబడి పెట్టాను. పెద్ద చదువులు చదివిన వాళ్లకంటే తక్కువేమీ కాదని ఈ ఏడాది మహిళాదినోత్సవం రోజు నా గురించి పేపర్‌లో రాశారు. అంతా మా యజమాని రాశి అక్క సహాయమే’’ అన్నది ప్రియా ఛత్రి.
జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెట్టి విజేతలుగా నిలబెట్టాలని చూస్తుంది. ఆ పరీక్షలో విజయవంతమైన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. పరీక్ష నుంచి పారిపోయిన వాళ్లు పరీక్షతోపాటు జీవితేచ్ఛను కూడా పోగొట్టుకున్న పరాజితులుగా మిగులుతారు. ప్రియా ఛత్రి తన జీవితానికి తానే రక్షణ గొడుగు పట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment