పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు మోదీ క్షమాపణలు
‘ఆయుష్మాన్ భారత్’లో రెండు రాష్ట్రాలు చేరకపోవడంపై ఆగ్రహం
‘ఆయుష్మాన్ భారత్– ప్రదానమంత్రి జన ఆరోగ్య యోజన’కు శ్రీకారం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని, అక్కడి ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుండడమే ఇందుకు కారణమని మండిపడ్డారు. ఆ రెండు రాష్ట్రాల్లో వృద్ధులకు ఉచితంగా వైద్యం లభించకపోవడం చూసి చాలా బాధపడుతున్నానని చెప్పారు. వారికి సేవ చేసే అదృష్టం రాకపోవడం పట్ల చింతిస్తున్నానని తెలిపారు. ఆ వృద్ధులను క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్‌ను మరింత విస్తరింపజేస్తూ 70 ఏళ్లు దాటిన వారందరికీ ఈ పథకం వర్తించేలా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(ఏబీ–పీఎంజేఏవై)ను మోదీ మంగళవారం శ్రీకారం చుట్టారు. తొమ్మిదో ఆయు ర్వేద దినోత్సవం, ధన్వంతరి జన్మదినోత్సవం సందర్భంగా వైద్య రంగానికి సంబంధించి రూ.12,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. 70 ఏళ్లు దాటిన వారిని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకొస్తానని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఈరోజు నెరవేరుస్తున్నానని తెలిపారు.ఏబీ–పీఏంజేఏవైతో 4 కోట్ల మంది లబ్ధి పొందుతారని వెల్లడించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..
ఐదేళ్లలో మరో 75,000 ఎంబీబీఎస్, ఎండీ సీట్లు
‘‘70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డులు అందజేస్తాం. వీటితో ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,000కుపైగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలు లభిస్తున్నాయి. ఈ కేంద్రాలతో పేదలు, మధ్యతరగతికి రూ.30,000 కోట్ల మేర లబ్ధి కలిగింది. స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్ల వంటి పరికరాల ధరలు తగ్గించడంతో సామాన్య ప్రజలకు రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి. దేశంలో గత పదేళ్లలో దాదాపు లక్ష ఎంబీబీఎస్, ఎండీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో మరో 75,000 సీట్లు రాబోతున్నాయి. వైద్య విద్య నిరుపేదలకు సైతం సులభంగా అందుబాటులోకి రావాలన్నదే మా లక్ష్యం’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
రోజ్‌గార్ మేళాలో 51 వేల మందికి నియామక పత్రాలు
దేశంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించేలా, వారి ఆకాంక్షలు నెరవేరేలా ఒక పటిష్టమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. గరిష్ట సంఖ్యలో యువతకు ఉపాధి కలి్పంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మంగళవారం ‘రోజ్‌గార్ మేళా’లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 51,000 మందికి వర్చువల్‌గా నియామక పత్రాలు అందజేశారు. అంతరిక్షం, సెమీకండక్టర్ల వంటి ఆధునిక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దాంతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్‌తేరాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలోని భవ్యమందిరంలో బాలరాముడిని ప్రతిష్టించుకున్న తర్వాత వచ్చిన ఈ తొలి దీపావళి పండుగ మనకు చాలా ప్రత్యేకమని చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment