ఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో ఉన్న ప్రజలను పట్టించుకోకపోవటం అమానుషమని మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళవారం వృద్ధుల కోసం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ పొందుతారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.‘‘ ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. తీవ్రమైన వ్యాధికి చికిత్సకు అయ్యే ఖర్చు విని పేదలు వణికిపోయేవారు. డబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయతలో ఉండేవారు. ఈ నిస్సహాయతలో ఉన్న పేద ప్రజలను నేను చూడలేకపోయా. అందుకే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారు.
.. కానీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయలేక పోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను మీకు సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వాలు ఈ పథకంలో చేరటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రంలోని జబ్బుపడిన ప్రజలను అణచివేసే ధోరణి అమానుషం. నేను దేశ ప్రజలకు సేవ చేయగలను. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment