జోరుగా వాహన విక్రయాలు
ఆటో కంపెనీల అంచనాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌పై ఆటోమొబైల్ కంపెనీలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల అమ్మకాలు మందగించినప్పటికీ వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడి, మిగతా ఏడాదంతా అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నాయి. ఏటా పండుగ సీజన్ సాధారణంగా ఓనంతో ప్రారంభమై దీపావళితో ముగుస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 3–4 నెలలుగా విక్రయాలు నెమ్మదించాయని కియా ఇండియా నేషనల్ హెడ్ (సేల్స్, మార్కెటింగ్) హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
అయితే, గత కొద్ది నెలలుగా కొంత డిమాండ్ పేరుకున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మార్కెట్ మెరుగుపడగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్‌లో బుకింగ్స్ పుంజుకున్నాయని, అక్టోబర్‌లోనూ ఇదే ధోరణి కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘ఈసారి పండుగలన్నీ కూడా అక్టోబర్‌లోనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 5–10 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం‘ అని బ్రార్ వివరించారు. జనవరి–ఏప్రిల్ మధ్య కాలంలో ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ 7 శాతం వృద్ధి చెందగా, మే–సెప్టెంబర్ వ్యవధిలో 2–3 శాతం మేర తగ్గింది. దీంతో నిల్వలు పేరుకుపోయాయి.
కఠిన పరిస్థితులు..
మూడు, నాలుగు నెలలుగా పరిశ్రమ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోందని, పండుగ సీజన్‌లో కొంత ఊరట లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. ‘ఈ త్రైమాసికం ఎలా ఉండబోతోందనేది పండుగ సీజన్‌ను బట్టి తెలుస్తుంది. అలాగే మూడో త్రైమాసికాన్ని బట్టి మిగతా సంవత్సరం ఎలా ఉండబోతోందనేది తెలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. అందుకే అంతా పండుగ సీజన్ విషయంలో ఆతృతగా ఉన్నట్లు వివరించారు.
మరోవైపు, షోరూమ్‌లను సందర్శించే వారు, వాహనాల కోసం ఎంక్వైరీ చేసే వారు క్రమంగా పెరుగుతున్నారని టయోటా కిర్లోస్కర్ మోటర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, సరీ్వస్, యూజ్డ్ కార్ వ్యాపార విభాగం) శబరి మనోహర్ తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కూడా మెరుగుపర్చుకున్నట్లు, మూడో షిఫ్ట్‌ను ప్రవేశపెట్టడం మొదలైనవి చేసినట్లు ఆయన చెప్పారు. బాగా డిమాండ్ ఉన్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లాంటి మోడల్స్ సరఫరాను పెంచడంతో వెయిటింగ్ పీరియడ్ తగ్గుతోందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పర్యావరణ అనుకూల టెక్నాలజీ ఉన్న వాహనాలపై ఆసక్తి పెరుగుతోందని మనోహర్ పేర్కొన్నారు.
లిమిటెడ్ ఎడిషన్లు..
కొత్తగా లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా విక్రయాలు పెంచుకునేందుకు ప్రయతి్నస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. వినాయక చవితి, జన్మాష్టమి సందర్భంగా అమ్మకాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. సెపె్టంబర్ ఆఖరు నాటికి తమ వాహన విక్రయాలు మరింతగా పెరిగాయని, మిగతా సీజన్‌లోను ఇదే సానుకూల ధోరణి కనిపించే అవకాశాలు ఉన్నాయని టాటా మోటర్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment