ఎస్‌యూవీ.. కూపే అవతార్‌! | SUV Coupes are on a rise in automobile companies | Sakshi
Sakshi News home page

ఎస్‌యూవీ.. కూపే అవతార్‌!

Published Sat, Sep 28 2024 6:16 AM | Last Updated on Sat, Sep 28 2024 6:16 AM

SUV Coupes are on a rise in automobile companies

కారు ప్రియుల కోసం కంపెనీల కొత్త మంత్రం 

మార్కెట్లోకి ఎస్‌యూవీ కూపే మోడల్స్‌.. 

టాటా కర్వ్, సిట్రాన్‌ బసాల్ట్‌ ఎంట్రీ... 

అదే బాటలో మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్, రెనో...

కుర్ర’కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ).. ఆటోమొబైల్‌ కంపెనీలకు కూడా గత కొన్నేళ్లుగా కాసులు కురిపిస్తున్నాయ్‌. అయితే, కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీల షేపు, స్టయిల్, డిజైన్‌లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎస్‌యూవీ కూపే’ పేరుతో కొత్త సెగ్మెంట్‌నుక్రియేట్‌ చేయడం ద్వారా అమ్మకాల గేరు మార్చేందుకు పోటీ పడుతున్నాయి వాహన దిగ్గజాలు. 

దేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 55 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం వాటి క్రేజ్‌కు నిదర్శనం. అయితే, కొద్ది నెలలుగా డిమాండ్‌ కాస్త మందగించడంతో సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు వాటికి కొత్తదనాన్ని జోడిస్తున్నాయి. మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో ఎస్‌యూవీ కూపేలు ఇప్పుడు నయా ట్రెండ్‌. టాటా మోటార్స్‌ ‘కర్వ్‌’ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కూపేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే తాజాగా పెట్రోల్, డీజిల్‌ మోడల్‌ను కూడా తెచి్చంది. ఇక ఫ్రెంచ్‌ ఆటో దిగ్గజం సిట్రాన్‌ ఎస్‌యూవీ కూపే ‘బసాల్ట్‌’ను బరిలోకి దించింది. 

దీని రేటు, డిజైన్‌ కూడా ఊరించేలా ఉంది. త్వరలోనే మహీంద్రా తన పాపులర్‌ మోడల్‌ ఎక్స్‌యూవీ 700లో కూపే మోడల్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్‌. మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కూపే కూడా క్యూలో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచి్చన టాటా, సిట్రాన్‌ కూపే ఎస్‌యూవీలకు కస్టమర్ల రెస్పాన్స్‌ అదిరిపోవడంతో ఇతర కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్‌ పెంచాయి. ఫోక్స్‌వ్యాగన్, రెనో సైతం భారత్‌ మార్కెట్‌ కోసం కూపే ఎస్‌వీయూలను రెడీ చేస్తున్నాయట! ప్రీమియం లుక్, లగ్జరీ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో కూపే మోడల్‌ను కోరుకునే వారిని ఈ ఎస్‌యూవీ కూపేలతో టార్గెట్‌ చేయాలనేది కార్ల కంపెనీల ప్లాన్‌. 

అమ్మకాల్లో వాటిదే హవా... 
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవాయే నడుస్తోంది. హైఎండ్‌ లగ్జరీ ఎస్‌వీయూల రేటు భారీగా ఉండటంతో కస్టమర్లకు అదే లుక్కు, ఫీచర్లతో రూ. 10–20 లక్షల ధరలో దొరుకుతున్న కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు ఫుల్‌ గిరాకీ ఉంటోంది. ఈ మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ గ్రాండ్‌ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్‌ టైగున్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్, సిట్రాన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ వంటివి హాట్‌ కేకుల్లా సేల్‌ అవుతున్నాయి. 

మరోపక్క, చిన్నకారు కొనే యోచనలో ఉన్నవారిని సైతం ఊరించే విధంగా రూ. 10 లక్షల స్థాయిలో సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీలను తీసుకొచ్చి మార్కెట్‌ను విస్తరించాయి కార్ల కంపెనీలు. మారుతీ బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, కియా సోనెట్, హ్యుందాయ్‌ వెన్యూ, నిస్సాన్‌ మాగ్నెట్, రెనో కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్‌ ఎక్స్‌టర్, టయోటా ట్రైసర్‌ వంటివి సబ్‌కాంపాక్ట్‌ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్న మోడల్స్‌. గత రెండు మూడేళ్లుగా ఈ రెండు విభాగాల్లో పోటీ పెరిగిపోవడంతో.. ఇప్పుడు ఎస్‌యూవీ కూపేతో జెన్‌ జెడ్‌తో పాటు యువ కస్టమర్లను ఆకట్టుకోవాలనేది కార్ల కంపెనీల కొత్త వ్యూహం. 

ఇప్పటికే లగ్జరీ కూపే కార్లున్నాయ్‌..
మెర్సిడెస్‌ బెంజ్, జాగ్వార్, ల్యాండ్‌రోవర్, పోర్షే, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల దిగ్గజాలు ఇప్పటికే కూపే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే, వీటి లుక్కు, డిజైన్‌లాగే ధర కూడా ‘టాప్‌’లేపేలా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎస్‌యూవీ కూపేల్లో బీఎండబ్ల్యూ ఎక్స్‌4 రేటే చాలా తక్కువ. ఎంతంటే జస్ట్‌ రూ. 96 లక్షలే! (ఎక్స్‌ షోరూమ్‌) అ‘ధర’పోయింది కదూ! అందుకే అచ్చం అలాంటి డిజైన్‌లోనే హాట్‌ సెల్లింగ్‌ మిడ్‌–ఎస్‌యూవీ రేంజ్‌లోనే ఈ స్టయిలిష్‌ కూపేలను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మరింత వైవిధ్యాన్ని అందించేందుకు వాహన కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో 16 శాతం వాటా మిడ్‌–ఎస్‌యూవీలదే కావడం విశేషం!

ఎస్‌యూవీ కూపే అంటే... 
ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎస్‌యూవీలన్నీ దాదాపు బాక్స్‌ ఆకారంలో రగ్గ్‌డ్‌ లుక్‌తోనే ఉంటున్నాయి. బలిష్టమైన బాడీ, అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్‌ సామర్థ్యం, ఎత్తుగా, స్పోర్ట్స్‌ లుక్‌ కూడా ఉండటంతో ఎస్‌యూవీలు మార్కెట్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. కస్టమర్లకు హాట్‌ ఫేవరెట్‌గా మారాయి. అయితే, లగ్జరీ స్పోర్ట్స్‌ కూపే కార్లలోని స్లీక్‌ డిజైన్‌ను, ఎస్‌యూవీల్లోని రగ్గ్‌డ్‌ లుక్‌ను కలగలిపినవే ఈ కూపే ఎస్‌యూవీలు. 

దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, ముందువైపు చూస్తే చాలా భారీగా ఎస్‌యూవీ స్టయిల్లోనే కనిపిస్తుంది. వెనక్కి వెళ్లే కొద్దీ రూఫ్‌లైన్‌ బాగా ఏటవాలుగా వంగి కూపే లుక్‌తో ఉంటుంది. ఇతర ఫీచర్లన్నీ ఎస్‌యూవీ మాదిరే ఉంటాయి. చాలావరకు లగ్జరీ కార్లలో ఇలాంటి డిజైన్‌ను మనం చూడొచ్చు. కస్టమర్లు సాధారణ బాక్స్‌ డిజైన్‌ కంటే స్పోర్ట్‌ లుక్‌తో ఉండే లైఫ్‌స్టయిల్‌ ఎస్‌యూవీలకే మొగ్గు చూపుతుండటంతో ఎస్‌యూవీ కూపే క్రాసోవర్‌లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లగ్జరీ, కాంపాక్ట్, సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు తోడుగా బడ్జెట్‌ ధరల్లో కూపే ఎస్‌యూవీ సెగ్మెంట్‌తో దుమ్మురేపేందుకు కంపెనీలు సై అంటున్నాయి.  

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement