SUV vehicle
-
ఎస్యూవీ.. కూపే అవతార్!
కుర్ర’కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ).. ఆటోమొబైల్ కంపెనీలకు కూడా గత కొన్నేళ్లుగా కాసులు కురిపిస్తున్నాయ్. అయితే, కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీల షేపు, స్టయిల్, డిజైన్‌లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎస్యూవీ కూపే’ పేరుతో కొత్త సెగ్మెంట్నుక్రియేట్ చేయడం ద్వారా అమ్మకాల గేరు మార్చేందుకు పోటీ పడుతున్నాయి వాహన దిగ్గజాలు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 55 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం వాటి క్రేజ్‌కు నిదర్శనం. అయితే, కొద్ది నెలలుగా డిమాండ్ కాస్త మందగించడంతో సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు వాటికి కొత్తదనాన్ని జోడిస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో ఎస్యూవీ కూపేలు ఇప్పుడు నయా ట్రెండ్. టాటా మోటార్స్ ‘కర్వ్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే తాజాగా పెట్రోల్, డీజిల్ మోడల్‌ను కూడా తెచి్చంది. ఇక ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రాన్ ఎస్యూవీ కూపే ‘బసాల్ట్’ను బరిలోకి దించింది. దీని రేటు, డిజైన్ కూడా ఊరించేలా ఉంది. త్వరలోనే మహీంద్రా తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ 700లో కూపే మోడల్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపే కూడా క్యూలో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచి్చన టాటా, సిట్రాన్ కూపే ఎస్‌యూవీలకు కస్టమర్ల రెస్పాన్స్ అదిరిపోవడంతో ఇతర కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. ఫోక్స్‌వ్యాగన్, రెనో సైతం భారత్ మార్కెట్ కోసం కూపే ఎస్వీయూలను రెడీ చేస్తున్నాయట! ప్రీమియం లుక్, లగ్జరీ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో కూపే మోడల్‌ను కోరుకునే వారిని ఈ ఎస్యూవీ కూపేలతో టార్గెట్ చేయాలనేది కార్ల కంపెనీల ప్లాన్. అమ్మకాల్లో వాటిదే హవా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవాయే నడుస్తోంది. హైఎండ్ లగ్జరీ ఎస్వీయూల రేటు భారీగా ఉండటంతో కస్టమర్లకు అదే లుక్కు, ఫీచర్లతో రూ. 10–20 లక్షల ధరలో దొరుకుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్, సిట్రాన్ సీ3 ఎయిర్‌క్రాస్ వంటివి హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. మరోపక్క, చిన్నకారు కొనే యోచనలో ఉన్నవారిని సైతం ఊరించే విధంగా రూ. 10 లక్షల స్థాయిలో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలను తీసుకొచ్చి మార్కెట్‌ను విస్తరించాయి కార్ల కంపెనీలు. మారుతీ బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా ట్రైసర్ వంటివి సబ్‌కాంపాక్ట్ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. గత రెండు మూడేళ్లుగా ఈ రెండు విభాగాల్లో పోటీ పెరిగిపోవడంతో.. ఇప్పుడు ఎస్యూవీ కూపేతో జెన్ జెడ్‌తో పాటు యువ కస్టమర్లను ఆకట్టుకోవాలనేది కార్ల కంపెనీల కొత్త వ్యూహం. ఇప్పటికే లగ్జరీ కూపే కార్లున్నాయ్..మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ల్యాండ్‌రోవర్, పోర్షే, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల దిగ్గజాలు ఇప్పటికే కూపే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే, వీటి లుక్కు, డిజైన్లాగే ధర కూడా ‘టాప్’లేపేలా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎస్యూవీ కూపేల్లో బీఎండబ్ల్యూ ఎక్స్4 రేటే చాలా తక్కువ. ఎంతంటే జస్ట్ రూ. 96 లక్షలే! (ఎక్స్ షోరూమ్) అ‘ధర’పోయింది కదూ! అందుకే అచ్చం అలాంటి డిజైన్లోనే హాట్ సెల్లింగ్ మిడ్–ఎస్యూవీ రేంజ్‌లోనే ఈ స్టయిలిష్ కూపేలను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మరింత వైవిధ్యాన్ని అందించేందుకు వాహన కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో 16 శాతం వాటా మిడ్–ఎస్‌యూవీలదే కావడం విశేషం!ఎస్యూవీ కూపే అంటే... ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎస్‌యూవీలన్నీ దాదాపు బాక్స్ ఆకారంలో రగ్గ్డ్ లుక్‌తోనే ఉంటున్నాయి. బలిష్టమైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ఎత్తుగా, స్పోర్ట్స్ లుక్ కూడా ఉండటంతో ఎస్‌యూవీలు మార్కెట్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. కస్టమర్లకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అయితే, లగ్జరీ స్పోర్ట్స్ కూపే కార్లలోని స్లీక్ డిజైన్‌ను, ఎస్‌యూవీల్లోని రగ్గ్డ్ లుక్‌ను కలగలిపినవే ఈ కూపే ఎస్‌యూవీలు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, ముందువైపు చూస్తే చాలా భారీగా ఎస్యూవీ స్టయిల్లోనే కనిపిస్తుంది. వెనక్కి వెళ్లే కొద్దీ రూఫ్‌లైన్ బాగా ఏటవాలుగా వంగి కూపే లుక్‌తో ఉంటుంది. ఇతర ఫీచర్లన్నీ ఎస్యూవీ మాదిరే ఉంటాయి. చాలావరకు లగ్జరీ కార్లలో ఇలాంటి డిజైన్‌ను మనం చూడొచ్చు. కస్టమర్లు సాధారణ బాక్స్ డిజైన్ కంటే స్పోర్ట్ లుక్‌తో ఉండే లైఫ్‌స్టయిల్ ఎస్‌యూవీలకే మొగ్గు చూపుతుండటంతో ఎస్యూవీ కూపే క్రాసోవర్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లగ్జరీ, కాంపాక్ట్, సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలకు తోడుగా బడ్జెట్ ధరల్లో కూపే ఎస్యూవీ సెగ్మెంట్‌తో దుమ్మురేపేందుకు కంపెనీలు సై అంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వాగులో కొట్టుకుపోయిన కారు
సిమ్లా: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైజోన్ చో వాగు ఉప్పొంగడంతో ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్ జిల్లా మెహ్రోవాల్ గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఎస్యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది, డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది. స్థానికులు దీపక్ భాటియా అనే వ్యక్తిని రక్షించి జైజోన్ లోని ప్రభుత్వ డిస్పెన్సరీకి తరలించారు. వాహనం వరద నీటిలో ఇరుక్కుపోయింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. వాగు నుంచి ఐదుగురు మహిళలతో సహా తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీసింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాటొద్దని స్థానికులు హెచ్చరించినా డ్రైవర్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. మృతులను సూర్జిత్ భాటియా, అతని భార్య పరమజీత్ కౌర్, సోదరుడు స్వరూప్ చంద్, మరదలు బిందర్, మెహత్‌పూర్‌లోని భటోలీకి చెందిన షినో, ఆమె కుమార్తెలు భావన, అను, కుమారుడు హర్షిత్, డ్రైవర్ బిందుగా గుర్తించారు. -
మెర్సిడెస్ ఈవీ @ 66 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్‌లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. -
హోండా నుంచి ఏటా కొత్త కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్ లేదా వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో కంపెనీ వాటాను పెంచుకోవడం లక్ష్యంగా వచ్చే 3–5 ఏళ్లపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. హోండా వాటా ప్రస్తుతం 2.5 శాతం మాత్రమే. 2023 సెప్టెంబర్‌లోగా ఒక ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఒకటి రానుందని చెప్పారు. అలాగే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని వెల్లడించారు. 2022–23లో 8 శాతం వృద్ధితో దేశీయంగా 92,000 యూనిట్ల అమ్మకాలను కంపెనీ ఆశిస్తోంది. అలాగే 25 శాతం వృద్ధితో ఎగుమతులు 23,000 యూనిట్లు నమోదు కానున్నాయి. రాజస్థాన్‌లోని ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 1.8 లక్షల యూనిట్లు. -
ప్యాసింజర్ వెహికిల్స్ దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, సెమికండక్టర్ల సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం భారత వాహన పరిశ్రమకు కలిసి వచ్చింది. ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ, విక్రయాలు వేగం పుంజుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఆగస్ట్‌లో కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఎస్‌యూవీల జోరుతో టాప్–7 కంపెనీల మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఏకంగా 30.2 శాతం వృద్ధితో 3,05,744 యూనిట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక వృద్ధి. ఆగస్ట్ నుంచి పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. జోరు మొదలైందని.. రాబోయే నెలల్లో ఇది కొనసాగుతుందని వాహన పరిశ్రమ ధీమాగా ఉంది. ఏడాది పొడవునా జరిగే మొత్తం విక్రయాల్లో పండుగల సీజన్ వాటా ఏకంగా 40 శాతం దాకా ఉంటోంది. 2018–19ని మించిన విక్రయాలు.. దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 30,69,499 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018–19లో అత్యధికంగా 33,77,389 యూనిట్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018–19ని మించిన విక్రయాలు నమోదు కానున్నాయని భారత్‌లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చెబుతోంది. 37 లక్షల యూనిట్లతో పరిశ్రమ నూతన రికార్డు సాధిస్తుందన్న అంచనా ఉందని మారుతీ సుజుకీ సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని అన్నారు. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో మారుతీ సుజుకీ 30 శాతం, హ్యుండై 5.6, టాటా మోటార్స్ 68.3, మహీంద్రా అండ్ మహీంద్రా 87, కియా ఇండియా 33.3, టయోటా కిర్లోస్కర్ 17.12 శాతం వృద్ధి సాధించాయి. హోండా కార్స్ 30.5 శాతం తిరోగమన వృద్ధి చవిచూసింది. ద్విచక్ర వాహనాలు ఇలా.. : అంత క్రితం ఏడాది ఇదే కాలం, అలాగే ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగవడం డిమాండ్‌కు తగ్గట్టుగా కస్టమర్లకు వాహనాలను అందించేందుకు వీలైందని కంపెనీలు అంటున్నాయి. జీడీపీ వృద్ధి, రెండేళ్ల తర్వాత సాధారణ పండుగల సీజన్, మెరుగైన రుతుపవనాలతో అధిక దిగుబడి, కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడం.. వెరిశి రాబోయే నెలల్లో టూ వీలర్ల అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో హీరో మోటోకార్ప్ 4.6 శాతం, హోండా 5.1, టీవీఎస్ 56.2, బజాజ్ 42.2, సుజుకీ 6.2, రాయల్ ఎన్ఫీల్డ్ 33.8 శాతం అధికంగా విక్రయాలను సాధించాయి. -
అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. మిగతా కంపెనీలకు దెబ్బే!
ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ అందుకు నిదర్శనం. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ( SUV) మోడల్ని విడుదల చేసింది. అయితే ఈ కారు విడుదలకు ముందే, మహీంద్రా వీలు దొరికినప్పుడల్లా టీజర్లతో ఈ కారుపై హైప్‌ను పెంచుతోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, భారతీయ వాహన తయారీ సంస్థ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (SUV) విడుదల చేయాలని యోచిస్తోంది. వీటిని ప్రతాప్ బోస్ నేతృత్వంలోని మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) రూపొందించిందని గమనించాలి. కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్‌ల ప్రకారం, SUVలకు XUV-e1, SUV-e2, SUV-e3, SUV-e5, SUV-e6, SUV-e7, SUV-e8. SUV-e9 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ట్రేడ్‌మార్క్ చేసిన పేర్లలో 4వ సంఖ్యతో ఉన్న పేరు సిరీస్‌లో లేకుండా పోయింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUVల ఫీచర్లు, ఇంటీరియర్ల గురించి ఈ టీజర్ ద్వారా కస్టమర్లకు క్లూ ఇచ్చింది. ఇందులో కస్టమర్ ప్రాధాన్యతలకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ కోసం వ్యక్తిగత వినియోగదారు సెట్టింగ్‌లు ప్రతి ప్రయాణీకుడు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి. స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్ల కారణంగా కస్టమర్లు.. కాల్స్, టెక్స్ట్‌లు, మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో లెదర్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. And the curtain rises… pic.twitter.com/wRFQrejABu — anand mahindra (@anandmahindra) August 15, 2022 చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్‌కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై
సాక్షి, ముంబై: మహీంద్ర గ్రూప్ చైర్పర్సన్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తమ కస్టమర్ ట్విట్‌కు స్పందించి మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు. తనకంటూ ఒక కారును సొంతం చేసుకోవడం సగటు మానవుడి కల. ఆ కల సాకారమైన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏకంగా తన కారు కంపెనీ ఓనరుతోనే ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. కష్టపడి కారుకొనుక్కున్నాను. ఆశీర్వదించండి అన్న వినియోగదారుడికి అభినందనలు తెలుపుతూ ఆనంద్ మహీంద్ర స్పందించిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెడితే.. అశోక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ తాజాగా మహీంద్రా XUV700ని కొనుగోలు చేశారు. ఈ ఆనందాన్ని మహీంద్ర చీఫ్‌తో పంచుకోవాలనుకున్నారు. మహీంద్ర ఎస్‌యూవీతో ఫోటోను పోస్ట్ చేస్తూ.."10 సంవత్సరాలు కష్టపడి కొత్త మహీంద్రా XUV 700ని కొనుగోలు చేశా.. సార్ మీ ఆశీర్వాదం కావాలి."అంటూ ఆ పోస్ట్‌ను ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ "ధన్యవాదాలు, కానీ వాస్తవానికి మా కంపెనీ కారుఎంచుకుని మమ్మల్ని ఆశీర్వదించినది మీరే! కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్" అంటూ ట్వీట్ చేశారు. దీంతో స్పందనగా అశోక్‌కుమార్ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు చాలామంది నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందంటూ అశోక్‌కుమార్‌కి అభినందనలు తెలిపారు. అలాగే ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యను కూడా ప్రశంసించారు. ‘మీ ట్వీట్ చదివిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. Thank you, but it is YOU who have blessed us with your choice…Congratulatioms on your success that has come from hard work. Happy motoring. https://t.co/aZyuqOFIa8 — anand mahindra (@anandmahindra) August 2, 2022 Great gesture Sir. Gratitude truly goes a long way. Makes you feel special aa well. Many congratulations C Ashokkumar.. Hard work pays off — Manjarita De (@DeManjarita) August 2, 2022 Have tears in my eyes after reading this tweet — Rakesh Kr Shah🇮🇳 (@rakesh_kr_shah) August 2, 2022 -
ఈ దొంగలు మహాముదుర్లు.. 'ఎమ్మెల్యే' కారునే ఎత్తుకెళ్లారు!
జైపూర్: ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆయన చుట్టూ పటిష్ఠ భద్రత ఉంటుంది. ఆయన ఇంటి ముందు పోలీసులు పహారా కాస్తుంటారు. 24 గంటలు సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. అయితే.. అవేమీ తమను అడ్డుకోవన్నట్లు అలాంటి ఇంటికే కన్నం వేశారు దొంగలు. ఎమ్మెల్యే కారునే మాయం చేశారు. రాజస్థాన్‌లోని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) ఎమ్మెల్యే నారయన్ బెనివాల్‌కు చెందిన ఎస్యూవీ కారు చోరీకి గురైంది. జైపూర్‌లోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆయన అపార్ట్మెంట్ ముందు నిలిపి ఉంచిన కారును శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌తో పాటు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఎస్హెచ్ఓ శ్రీమోహన్ మీనా. చోరీకి పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పోలీసులపై ఎమ్మెల్యే ఆరోపణలు.. 'ఎప్పటిలాగే వివేక్ విహార్ ప్రాంతంలోని మా అపార్ట్మెంట్ ముందు వాహనాన్ని నిలిపాము. తెల్లవారి వచ్చి చూసే సరికి అక్కడ లేదు. దొంగలకు పోలీసులంటే భయం లేదు. ఒక ఎమ్మెల్యే వాహనం ఈవిధంగా చోరీకి గురవుతుందా? ఒక సాధారణ పౌరుడి పరిస్థితేంటి? సాధారణ ప్రజలను పోలీసులు తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ దొంగలు దర్జాగా తిరుగుతున్నారు. ' అని ఎమ్మెల్యే బెనివాల్ ఆరోపించారు. ఇదీ చూడండి: Hyderabad: కొండాపూర్ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్‌పై పిడిగుద్దులు -
వారెవ్వా ఆడి..గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఆడి ‘క్యూ7 ఎస్యూవీ’ కొత్త వెర్షన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర క్యూ7 ప్రీమియం ప్లస్ రూ.79.99 లక్షలు, క్యూ7 టెక్నాలజీ రూ.88.33 లక్షలు ఉంది. 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 8 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది. రూ.5లక్షలు చెల్లించి కార్ బుక్ చేసుకోవచ్చు లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్ ప్రీమియం ఎస్యూవీ ‘క్యూ7’కు బుకింగ్‌లు తీసుకుంటున్నట్టు గతంలో ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో 2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్‌లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని ఆడి ప్రతినిధులు వెల్లడించారు. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, క్వాట్టో ఆల్‌వీల్ డ్రైవ్, పార్క్ అసిస్ట్ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. -
ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు
లఖీంపూర్ ఖేరి: లఖీంపూర్ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్– ఎస్యూవీ) నడిపారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లో నిందితులపై ఇదివరకు నమోదు చేసిన సెక్షన్లను మార్చి మరింత తీవ్రమైన సెక్షన్లను చేర్చడానికి అనుమతించాలని ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం) చింతా రామ్‌కు దరఖాస్తు చేసింది. హత్యాయత్నం సెక్షన్లను జతచేస్తామని విన్నవించింది. ఈ ఏడాది అక్టోబరు 3న లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు... మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా రైతులు నిరసన తెలిపారు. టికూనియా వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఎస్యూవీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారని... ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదైంది. ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన రైతులు దాడికి దిగడంతో ఎస్యూవీ డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతో సహా 13 మంది నిందుతులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. తీవ్ర దుమారం రేగింది. బీజేపీపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్‌ను నియమించిన విషయం తెలసిందే. ముందస్తు ప్రణాళికతోనే... దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన ఆధారాలను బట్టి... ఈ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని (వీరు ఆయుధాలు కూడా కలిగి ఉన్నారని)... ప్రాణనష్టానికి దారితీసిందని సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల రైతు జగ్మీత్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశిష్ మిశ్రా, తదితరులపై నమోదు చేసిన 220/221 ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్ 304ఏ (దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం కావడం), సెక్షన్ 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులను తీవ్రంగా గాయపర్చడం), సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్)లను తొలగించడానికి అనుమతించాలని కోరారు. వాటి స్థానంలో ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధంతో గాయపర్చడం, ఆయుధాల చట్టంలో సెక్షన్ 3/25ని ఎఫ్ఐఆర్లో చేర్చడానికి అనుమతించాలని కోర్టును కోరారు. ఎఫ్ఐఆర్లో ఇదివరకే నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 147 (అల్లర్లు సృష్టించడం), 148 (ప్రమాదకరమైన ఆయుధాలతో అల్లర్లకు దిగడం), 120బి (కుట్రపూరిత నేరం) తదితర సెక్షన్లను సిట్ కొనసాగించింది. 13 మంది నిందితులకు జారీచేసిన వారెంట్లను సవరించాలని అభ్యర్థించింది. సీజేఎం ఆదేశం మేరకు మంగళవారం నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వారెంట్లలో సెక్షన్లను మార్చడానికి సీజేఎం అనుమతించారని ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ ఎస్పీ యాదవ్ వెల్లడించారు. ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ మోదీ జీ.. మీరు మరోసారి క్షమాపణ చెప్పాల్సిన సమయమిది. అయితే దానికి ముందు తొలుత నిందితుడు (అశిష్ మిశ్రా) తండ్రి (అజయ్ మిశ్రా)కి కేంద్రమంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకండి. మత రాజకీయాలు చేసుకోండి. కానీ ఈ రోజు రాజకీయ ధర్మాన్ని పాటించండి. మీరిప్పుడు యూపీలోనే ఉన్నారు కాబట్టి మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించండి. మీ మంత్రిని తొలగించకపోవడం అన్యాయం. సరైనది కాదు!. ఒక మంత్రి రైతులను చంపేందుకు ప్రయత్నించారు. ప్రధానికి ఇది తెలుసు. పార్లమెంటులో ఆనాడు ఈ అంశాన్ని లేవనెత్తాం. కానీ చర్చిండానికి అనుమతించలేదు. గొంతునొక్కారు. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయండి: ఎస్కేఎం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను రక్షించే ప్రయత్నాలను ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మానుకోవాలి. ఆయనను మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేయాలి. మేము ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఊచకోత అనేది సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ప్రధాన సూత్రధారి అజయ్ మిశ్రా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారు. – సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) -
అమెరికాలో దారుణం.. జనంపైకి దూసుకెళ్లిన కారు
వాకేషా(అమెరికా): బ్యాండ్ వాయిస్తూ స్థానికుల ర్యాలీ, శాంటాక్లాజ్ టోపీలతో చిన్నారుల కేరింతలతో సందడిగా ఉన్న క్రిస్మస్ పరేడ్ ఒక్క క్షణంలో భీతావహంగా మారింది. పరేడ్‌లో పాల్గొన్న స్థానికులను తొక్కేస్తూ వారిపై నుంచి ఎస్యూవీ వాహనం ఒకటి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ పట్టణం సమీపంలోని వాకేషా అనే ప్రాంతంలో ఆదివారం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎస్యూవీ నడిపిన వ్యక్తిగా భావిస్తున్న ఒకతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందా? లేదా? అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. త్వరలో జరగబోయే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరిచుకుని ఇక్కడి స్థానికులు 59వ క్రిస్మస్ వార్షిక పరేడ్‌ను చేసుకుంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఎస్యూవీ వాహనంలో వచ్చి అడ్డుగా ఉన్న బారీకేడ్లను అత్యంత వేగంతో కారుతో ధ్వంసం చేసి ర్యాలీగా వెళ్తున్న జనం మీదుగా పోనిచ్చాడు. దీంతో జనం హాహాకారాలతో పరుగులు తీశారు. ఐదుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. వెంటనే తేరుకున్న అక్కడి పోలీసులు ఆ వాహనంపైకి పలుమార్లు కాల్పులు జరిపారు. ఆగంతకుడు ఆ కారులో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. క్రిస్మస్ పరేడ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో, స్థానికుల సెల్ఫోన్లలో ఈ దారుణ ఘటన అంతా రికార్డయింది. చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..) -
అదిగో మహీంద్రా..! ప్రీ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది..!
ఎస్యూవీ మార్కెట్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన ఎక్స్‌యూవీ700 ప్రీబుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించిన 14రోజుల్లో 65,000 వెహికల్స్ బుకింగ్స్ జరిగినట్లు దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థ తెలిపింది. రోజుకు 25వేల వెహికల్స్ బుకింగ్ అక్టోబర్ 7నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీ బుకింగ్స్‌లో 14 రోజుల స్వల్ప వ్యవధిలో 65,000 వెహికల్స్ అమ్మకాలు జరిగాయి. బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజు అక్టోబర్ 7, అక్టోబర్ 8 ఈ రెండు రోజుల్లో ఒక్కో రోజు సుమారు 25వేల వెహికల్స్ పై బుకింగ్ జరిగినట్లు మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన 50వేల వెహికల్స్ బుకింగ్ కేవలం 3 గంటల్లోనే జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇక వెహికల్స్ డెలివరీ విషయానికి వస్తే గతవారం ఎక్సయూవీ 700 డీజిల్ వేరియంట్ వెహికల్స్ డెలివరీ ప్రారంభం కాగా,పెట్రోల్ ఎక్స్‌యూవీ700 వేరియంట్స్ డెలివరీ వెహికల్స్ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌యూవీ సరికొత్త రికార్డులు ఇటీవల చెన్నైలో ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్‌ఎస్‌పీటీ) లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 సరికొత్త రికార్డ్లని క్రియేట్ నమోదు చేసింది. ప్రూవింగ్ ట్రాక్‌లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది. చదవండి: Mahindra XUV 700: మేఘాలలో తేలిపొమ్మన్నది -
ఇండియన్ మార్కెట్లో ఫోక్స్ వ్యాగన్ టైగున్ ఎస్యూవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా తాజాగా సరికొత్త టైగున్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆఫర్లో ధర ఎక్స్‌షోరూంలో రూ.10.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంది. పెట్రోల్ ఇంజన్‌తో 1 లీటర్, 1.5 లీటర్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. ఇప్పటికే 12,200 పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు ఇది పోటీ ఇవ్వనుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో టైగున్ తొలి ఉత్పాదన. మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో దేశంలో అన్ని బ్రాండ్లవి కలిపి ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ‘వినియోగదార్లకు ఎంపిక పరిమితమైంది. రెండు సంస్థలదే ఈ విభాగంలో ఆధిపత్యం. అందుకే టైగున్‌ను ప్రవేశపెట్టాం. మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో వచ్చే ఏడాది నుంచి 10% వాటా చేజిక్కించుకోవాలన్నది మా లక్ష్యం. కొత్త విభాగాలు, కొత్త అవకాశాలపై దృష్టిసారించాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ -
కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు
దేశంలో కార్ల వినియోగం రోజోరోజుకు పెరిగిపోతుంది. ఆకట్టుకునే ఫీచర్లు, టెక్నాలజీతో పాటు రకరకాల మోడళ్లతో వాహన దారుల్ని కనువిందు చేస్తున్నాయి. దీంతో వాహన దారులు సరసమైన ధరల్లో తమకు కావాల్సిన కార్లను సొంతం చేసుకునేందుకు వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా సన్ రూఫ్ ఆప్షన్ ఉన్న ఎస్యూవీ వాహనాలు కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతుండగా..ఆయా ఆటోమొబైల్ సంస్థలు ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ తప్పనిసరిగా మారుతోంది. లగ్జరీ టూ బడ్జెట్ కార్లు సన్ రూఫ్..! లాంగ్ డ్రైవ్‌లో వెదర్‌ను ఎంజాయ్ చేసేందుకు వెస్ట్రన్ కంట్రీస్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థలు లగ్జరీ కార్లలో ఈ ఫీచర్‌ను యాడ్ చేసేవి. ఆ తర్వాత భారత మార్కెట్లో హై ఎండ్ కార్లలో ఈ ఫీచర్ ఉండేది. అయితే గత మూడేళ్లుగా మిడ్ రేంజ్ ఎస్‌యూవీలలో సన్‌రూఫ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఆ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రానురాను సన్‌రూఫ్ అనేది కార్లకు తప్పనిసరి ఫీచర్‌గా మారింది. వాహన తయారీ సంస్థలు సైతం వివిధ బడ్జెట్లలో గ్లాస్ రూఫ్, సన్ రూఫ్, పనోరమిక్ సన్‌రూఫ్, స్కై రూఫ్ ఆప్షన్లను ప్రవేశపెడుతున్నాయి. అందుకు తగ్గట్టే అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ సన్ రూఫ్ ఆప్షన్ ఒక భాగమైంది. ఎస్ యూవీ వాహనాల్లో ఈ సన్ రూఫ్ ఫీచర్ ఉండడంతో సేల్స్ పెరిగిపోతున్నాయని ఆటో మొబైల్ రీసెర్చ్ సంస్థ 'జాటో' తెలిపింది. సర్వేలు ఏం చెబుతున్నాయి సన్‌రూఫ్ ఫీచర్‌కి సంబంధించి 2019తో ఇప్పటి పరిస్థితులను పోల్చితే .. సన్‌రూఫ్ ఆప్షన్ ఉన్న కార్ల అమ్మకాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్టు జాటో తెలిపింది. ఈ ఫీచర్ ఉండటం వల్ల కారు ప్రయాణంలో కొత్త రకం అనుభూతిని పొందడంతో పాటు ... కారు శుభ్రంగా ఉండడమే కాకుండా, శబ్ధ కాలుష్యం నుంచి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వినియోగదారుల్లో పెరిగింది. -
సింధుకు గిఫ్ట్ ఇవ్వమంటే ఆనంద్ మహేంద్ర ఏమన్నాడంటే..?
వరుసగా రెండోసారి ఒలింపిక్ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర పీవీ సింధును ప్రశంసించారు. ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. నువ్వింకా బంగారు తల్లివి అని కీర్తించారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్.. ఆ ట్వీట్‌కు ఆనంద్ మహేంద్ర రిప్లయ్ ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఫాలోవర్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. సింధును అభినందిస్తూ ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్‌పై శుభ్ వదేవాల కామెంట్ చేశారు. ‘సింధు అత్యుత్తమ ప్రదర్శనకు థార్ (మహేంద్ర కంపెనీకి చెందిన వాహనం) కానుక’ అని రిప్లయ్ ఇచ్చారు. సింధుకు థార్ కావాలి అనే హ్యాష్‌ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు. ఈ కామెంట్‌ను చూసిన ఆనంద్ మహేంద్ర రిప్లయ్ ఇచ్చాడు. ‘సింధుకు ఇంతకుముందే థార్ వాహనం ఉంది’ అని మహేంద్ర తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో విజయం సాధించినప్పుడు సింధుకు థార్ వాహనం అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు. సాక్షి మాలిక్‌తో కలిసి సింధు థార్ ఎస్యూవీ వాహనంపై తిరుగుతున్న ఫొటోతో ఆ నెటిజన్‌కు బదులిచ్చారు. She already has one in her garage… https://t.co/Be6g9gIcYh pic.twitter.com/XUtIPBRrmi — anand mahindra (@anandmahindra) August 1, 2021 -
థ్యాంక్యూ మహీంద్రా జీ: శార్దూల్
ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఆనంద్ మహీంద్రా తనకు గిఫ్ట్‌గా పంపిన థార్ ఎస్యూవీ ముందు నిలబడి ఫోటోకు ఫోజిచ్చాడు. అనంతరం ట్విటర్ వేదికగా ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ''మహీంద్రా జీ.. మీరు పంపిన థార్ ఎస్యూవీ ఇప్పుడే వచ్చింది. మీరిచ్చిన గిఫ్ట్ కంటే మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. నాకు ఇష్టమైన ఎస్యూవీ కారును గిఫ్ట్‌గా పంపారు.. దీనిని నడపుతుంటే తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆసీస్ టూర్ తర్వాత లభిస్తున్న ప్రశంసల్లో మీది ప్రత్యేకంగా కనిపించింది. దేశానికి మేం చేస్తున్న సేవలకు గుర్తుగా మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.''అంటూ కామెంట్ చేశాడు. కాగా, నటరాజన్, శార్దూల్‌తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీలు కూడా అందుకున్నారు. చదవండి: ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్.. కాగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్, సుందర్ ద్వయం ఏడో వికెట్‌కు 123 పరుగులు జోడించడంతో టీమిండియా 336 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. శార్దూల్ 67, సుందర్ 62 పరుగులు చేశారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా ముందు 329 పరుగుల లక్ష్యం ఏర్పడింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ 91 పరుగులు.. రిషబ్ పంత్ 89 పరుగులు నాటౌట్‌తో విజృంభించడంతో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేయడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1 తేడాతో సగర్వంగా ఎగురేసుకుపోయింది. చదవండి: ఆ వేలు ఎవరికి చూపించావు.. శార్దూల్ IPL 2021: కెప్టెన్‌గా ధోని.. రైనాకు దక్కని చోటు New Mahindra Thar has arrived!! @MahindraRise has built an absolute beast & I’m so happy to drive this SUV. A gesture that youth of our nation will look upto. Thank you once again Shri @anandmahindra ji, @pakwakankar ji for recognising our contribution on the tour of Australia. pic.twitter.com/eb69iLrjYb — Shardul Thakur (@imShard) April 1, 2021 -
ఒక కారును ఇలా కూడా వాడొచ్చా!
సరదాగా రోడ్ట్రిప్ను ఇష్టపడేవారు అన్ని వనరులను అందుబాటులో ఉంచుకొని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. తినడానికి కావాల్సిన సరుకులు, పడుకోవడానికి కావాల్సిన వస్తువులను తమ వెంట తీసుకెళ్తూ ఎక్కడ పడితే అక్కడ బస చేస్తుంటారు. కానీ తమ ఆలోచనలతో రోడ్‌ట్రిప్ జర్నీని కూడా ఒక మధురానుభూతిగా మలుచుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి కోవకే చెందిన వ్యక్తే నాథనిల్ వైస్. (చదవండి : వైరల్: కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయా) స్వతహాగా నాథనిల్ రోడ్ ట్రిప్పులను బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. 2018 నుంచి నాథనిల్ వైస్ తన ఎస్యూవీ కారులోనే రోడ్ ట్రిప్‌ను ప్రారంభించాడు. అయితే అతను తన కారును మలిచిన విధానం, డిజైనింగ్ చూస్తే మతి పోవాల్సిందే. ఎస్యూవీ కారును ఒక లగ్జరీ హోటల్ గదిలాగా మార్చేశాడు. నాథనిల్ వైస్ కారులో ఉన్న సకల సౌకర్యాలను ఒక వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కారు వెనుక భాగంలో ఉన్న డోరు ఓపెన్ చేయగానే బెడ్ కనబడడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కారులో ఉన్న ఒక్కో వస్తువును రివీల్ చేస్తుంటాడు. దానిలో భాగంగానే స్టవ్, కిచెన్ ఐటమ్స్, చిన్న ఫ్రిడ్జ్, బట్టలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఒక్కటి చూపిస్తుంటే మీ మతి పోవడం ఖాయం. ఒక కారును ఇలా కూడా వాడొచ్చా అన్న రీతిలో నాథనిల్ డిజైన్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. (చదవండి : నీ ఆఫర్ తగలెయ్య, మీరు మారరా!) అక్టోబర్ 23న పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ వీడియోకు 30వేల వ్యూస్, 4300 లైక్స్ సంపాధించింది. ' మీరు నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్.. ఇది కదరా ఎంజాయ్మెంట్ అంటే.. మీ అడ్వెంచర్ ట్రిప్ బాగుంది.. మీ ఐడియా ఇంకా బాగుంది ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram Made a house tour on TikTok, figured I may as well share it here too. I have received a lot of questions about my roadlife setup on IG, so here you go 🙂 The fridge is from @dometic - thanks y’all 🙏 Seriously a game changer A post shared by nathaniel wise (@nathanielwise) on Oct 23, 2020 at 9:19am PDT -
కియా సోనెట్ ఆగయా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ‘సోనెట్’ కాంపాక్ట్ ఎస్‌యూవీని శుక్రవారం భారత్‌లో ప్రవేశపెట్టింది. పెట్రోల్ 1.0 టి–జీడీఐ, స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ డబ్ల్యూజీటీ, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ వీజీటీ ఇంజన్ ఆప్షన్స్‌తో మొత్తం 17 వేరియంట్లలో ఈ కారును రూపొందించింది. అయిదు ట్రాన్స్మిషన్ రకాలు ఉన్నాయి. ధర వేరియంట్‌నుబట్టి ఎక్స్‌షోరూంలో రూ.6.71 లక్షలు మొదలుకుని రూ.11.99 లక్షల వరకు ఉంది. నాలుగు మీటర్ల లోపు ఉండే సోనెట్.. హ్యూందాయ్ వెన్యూ, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, టాటా మోటార్స్, నెక్సన్, హోండా డబ్ల్యూఆర్–వి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లకు పోటీ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉన్న కియా అత్యాధునిక ప్లాంటులో సోనెట్ తయారు కావడం విశేషం. 70 దేశాలకు ఈ కారును ఎగుమతి చేయనున్నారు. ఇవీ సోనెట్ విశిష్టతలు.. ఫైవ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్స్, సెవెన్ స్పీడ్ డీసీటీ, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, సిక్స్ స్పీడ్ స్మార్ట్‌స్ట్రీమ్ ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకాల్లో ఇది లభిస్తుంది. తొలిసారిగా సెగ్మెంట్లో 30కి పైగా కొత్త ఫీచర్లను జోడించినట్టు కంపెనీ ప్రకటించింది. నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్తో 10.25 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్, వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణకు స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్, సబ్ వూఫర్స్‌తో బోస్ ప్రీమియం సెవెన్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, యువో కనెక్ట్, స్మార్ట్ కీతో రిమోట్ ఇంజన్ స్టార్ట్, ఆటోమేటిక్ మోడళ్లకు మల్టీ డ్రైవ్, ట్రాక్షన్ మోడ్స్, కూలింగ్ ఫంక్షన్‌తో వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జర్ ఏర్పాటు ఉంది. ఎనమిది మోనోటోన్, మూడు డ్యూయల్ టోన్ రంగుల్లో సోనెట్ లభిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్స్ వంటివి పొందుపరిచారు. సెగ్మెంట్లో తొలిసారిగా డీజిల్ సిక్స్–స్పీడ్ ఆటోమేటిక్, ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రవేశపెట్టారు. మైలేజీ వేరియంట్‌నుబట్టి 18.4 నుంచి 24.1 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. తొలి ఏడాది 1,50,000 యూనిట్లు.. కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ విభాగంలో సోనెట్ సంచలనం సృష్టిస్తుందని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్ షిమ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ మార్కెట్ కోసం తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా కారు సోనెట్‌కు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని, 25,000 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయని అన్నారు. తొలి రోజే 6,500 బుకింగ్స్ నమోదయ్యాయని, ప్రస్తుతం రోజుకు 1,000 వస్తున్నాయని గుర్తు చేశారు. సరఫరా సమస్యలేవీ ఉత్పన్నం కాలేదని, ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో రెండవ షిప్ట్ ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. కరోనా ఉన్నప్పటికీ ఈ కారు ప్రవేశపెట్టడం వెనుక ఉద్యోగుల కఠోర శ్రమ ఉందన్నారు. ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 3 లక్షల యూనిట్లు అని గుర్తుచేశారు. భారత్‌ను తయారీ హబ్‌గా చేసుకున్నామన్నారు. దేశీయం గా తొలి ఏడాది ఒక లక్ష యూనిట్ల సోనెట్ కార్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ ఈడీ టే జిన్ పార్క్ పేర్కొన్నారు. అలాగే 50,000 యూనిట్లు ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో కనెక్టెడ్ కార్స్ విభాగంలో 60,000 పైచిలుకు యూనిట్ల మైలురాయిని అధిగమించిన తొలి కంపెనీగా నిలిచినట్టు కియా తెలిపింది. -
హ్యుందాయ్ క్రెటా @ రూ. 9.9 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘క్రెటా’ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన కారు ధరల శ్రేణి రూ. 9.9 లక్షలు – 17.2 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్ ఎస్ కిమ్ మాట్లాడుతూ.. ‘ఈ విభాగంలోని లోపాలను అధిగమించి, అత్యాధునిక వాహనాన్ని మార్కెట్లోకి తీసుకుని రావడం కోసం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాం. సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొత్త మోడల్ అందుబాటులో ఉంచాం. ఇక మల్టీ–సీటర్ హై ఆక్యుపెన్సీ వెహికల్ తయారీలో పట్టు సాధించడంలో భాగంగా త్వరలోనే మల్టీ–పర్పస్ వెహికల్ (ఎంపీవీ)ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ అని వెల్లడించారు. -
రూ.19 లక్షల కారు రూ. 2 లక్షలకే..?!
సాక్షి, బెంగళూరు : చోర కళలో నేరగాళ్లు రోజు రోజుకు ఆరి తేరి పోతున్నారు. బెంగళూరు లోని నిస్సాన్ షోరూంకి కుచ్చు టోపీ పెట్టి ఖరీదైన కారుతో చల్లగా జారుకున్నాడు. డౌన్ పేమెంట్ చెల్లించి మరీ యజమానిని నమ్మించి ఉడాయించాడు. సుమారు 19లక్షల విలువ చేసేకారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఎగరేసుకుపోయాడో ప్రబుద్దుడు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. విలాసవంతమైన ఎస్యూవీ నిస్సాన్ కిక్స్‌ను కొనుగోలు చేస్తానంటూ షోరూంకి వచ్చాడు జోస్ థామస్ అకా జోసెఫ్. షోరూం మేనేజర్ని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. ధర రూ 18.6 లక్షలని చెప్పగానే వెంటనే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టి.. పూజా కార్యక్రమాలను చేయించుకుంటానని చెప్పి బురిడీ కొట్టించి కారును తీసుకెళ్లాడు. అంతే ఇక అక్కడనుంచి పత్తా లేకుండాపోయాడు. ఎన్ని ఫోన్లు చేసినా సమాధానం లేదు. అతని ఆఫీసుకు వెళ్లినా.. ఫలితం శూన్యం. చివరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే...ఈ సంఘటన జరిగి నాలుగు నెలలైంది. జనవరి 23న బెంగళూరులోని దొడ్డనకుంది సూర్య నిస్సాన్ షోంరూంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు నాలుగు నెలల తరువాత అంటే మే 21వ తేదీన షోరూం యజమాని గణేశ్ కుమార్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారన్నదానిపై స్పందించేందుకు గణేష్ తిరస్కరించారు. గణేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని సంబంధిత డీసీపీ అబ్దుల్ అహద్ తెలిపారు. నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆఫీస్ అడ్రస్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేశారు కాబట్టి కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ఛత్తీస్‌లో ఎస్‌యూవీని పేల్చిన నక్సల్స్
చర్ల/బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఓ పౌరుడి కారును పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పెద్దకోడెపాల్ గ్రామ సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో జరుగుతున్న ఓ తిరునాలకు ఎస్‌యూవీలో వెళ్తుండగా నక్సల్స్ దానిని పేల్చేశారు. బీజాపూర్ సూపరింటెండెంట్ గోవర్ధన్ రామ్ ఈ వివరాలను వెల్లడించారు. -
నిస్సాన్ ‘కిక్స్’ బుకింగ్‌పై బంపర్ ఆఫర్
నిస్సాన్ మోటార్ ఇండియా కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 'కిక్స్' పేరుతో ఒక కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. ఎక్స్ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం, ఎక్స్‌వీ ప్రీమియం ప్లస్ అనే నాలుగు వెర్షన్స్‌ను తీసుకొచ్చింది. ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, మారుతి ఎస్-క్రాస్‌కి ధీటుగా, పోటీగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్ఎల్ పెట్రోల్ బేసిక్ వేరియంట్ కోసం రూ .9.55 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరగా నిర్ణయించింది. నిస్సాన్ కిక్స్ బేసిక్ వేరియంట్లో కూడా ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఎసీ,వెంట్స్ నాలుగు స్పీకర్లతో ఒక బ్లూటూత్, యూఎస్బీ, ఆక్స్- ఎనేబుల్ ఆడియో సిస్టమ్ లాంటి కీలక ఫీచర్స్‌ను పొందుపర్చింది. ఇక టాప్ ప్రీమియం ప్లస్‌లో ఎరౌండ్ వ్యూ డిస్ప్లే కలిగిన 360 డిగ్రీ కెమెరాతోపాటు ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కంపాటిబిలిటీ ఇచ్చింది. ఇంకా టెలీమాటిక్స్-ఎనేబుల్ స్మార్ట్ వాచ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రెల్స్ , 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ లాంప్స్ క్రూయిస్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వైపర్స్‌ను జోడించింది. ఎక్స్టీరియర్గా స్టయిలుష్ లుక్‌ను జత చేసింది. 17ఇంచ్ అల్లాయ్ వీల్స్ , హిల్ స్టార్ట్ అసిస్ట్, నిస్సాన్ ఇంటెలిజెంట్ మొబిలిటీ లాంటి ఫీచర్స నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ సొంతం. ఈ వాహనాల్లో 1.5 లీటర్ల పెట్రోల్, డిజీల్ ఇంజీన్లను అమర్చింది. పెట్రోల్ ఇంజీన్ 105బీహెచ్పీ పవర్ వద్ద 142 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ ఇంజీన్ 108 బీహెచ్పీ వద్ద 240 గరిష్ట్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ (ఎక్స్-షోరూం) ధరలు కిక్స్ ఎక్స్ఎల్ ధర - రూ. 9.55 లక్షలు కిక్స్ ఎక్స్‌వీ ధర - రూ. 10.95 లక్షలు డీజిల్ వేరియంట్ (ఎక్స్-షోరూం) ధరలు కిక్స్ ఎక్స్ఎల్ ధర - రూ. 10.85 లక్షలు కిక్స్ ఎక్స్‌వీ- రూ.12.49లక్షలు కిక్స్ ఎక్స్‌వీ ప్రీమియం - రూ.13.65లక్షలు కిక్స్ ఎక్స్‌వీ ప్రీమియం ప్లస్ - రూ.14.65లక్షలు గత డిసెంబర్లోనే ప్రీ బుక్సింగ్స్ మొదలుపెట్టింది. అయితే 2019 జనవరిలో కిక్స్ వాహనాన్ని ప్రీ బుకింగ్ చేసుకున్న తొలి 500మంది వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ను వీక్షించే సువర్ణావకాశాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉందని నిస్సాన్ ఇండియా ప్రకటించింది. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ అథ్లెట్ మృతి
నైరోబి : కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్ నికోలస్ బెట్(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్ షిప్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెట్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బెట్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారని కౌంటీ అధికారులు తెలిపారు. ప్రపంచ చాంపియన్.. బెట్ 2015లో జరిగిన 400 మీటర్ల హర్డల్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డల్స్ రేస్ పోటీల్లో విజేతగా నిలిచి చైనాలో ఆ ఘనత సాధించిన మొదటి కెన్యా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నారు. బెట్ సోదరుడు హరోన్ కోయిచ్ కూడా 400 మీటర్ల హర్డ్లర్ కావడం విశేషం. కాగా, 2016 లో బ్రెజిల్లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు బెట్ అర్హత సాధించలేదు. BREAKING: 28 year old Beijing World Championship gold medalist Nicholas Bett dies in car crash in Nandi. He had just returned from the Continental Championships 😢 pic.twitter.com/ypndezlslh — Mr waddis The Brand (@kipronoenock) August 8, 2018 -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మద్యం తాగి వాహనం నడుపుతున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ నడుపుతున్న ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని నుంగంబాక్కం పోలీసులు తెలిపారు. కాగా, భారతీరాజా దర్శకత్వంలో మనోజ్ పలు సినిమాల్లో హీరోగా చేశారు. 1999లో వచ్చిన తాజ్‌మహల్‌తో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. సముతిరం, కాదల్ పోక్కల్, అల్లి అర్జున సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. -
అతి ఖరీదైన కారు ఇదే..!
సాక్షి, న్యూఢిల్లీ: ఐకానిక్ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మరో ఖరీదైన కారును లాంచ్ చేసింది. బెంటేగా సిరీస్‌లో ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ రేంజ్లో దీన్ని విడుదల చేసింది. ‘వి8’ పేరుతో అత్యంత శక్తివంతమైన వెర్షన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. వెయ్యి కిలోమీటర్ల రేంజ్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో వీ8, త్వరలోనే రానున్న వీ8 హైబ్రీడ్ కార్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అతి ఖరీదైన ఎస్యూవీ అని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.3.78 కోట్లు(ఎక్స్ షోరూం, ముంబై). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ భాగస్వామ్యంతో బెంట్లే ఈకారును అందుబాటులోకి తెచ్చింది. బెంటేగా రేంజ్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే వి8 ఎక్స్టీరియర్కు అదనపు ఫీచర్లను జోడించినట్లు ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. ఈ లగ్జరీ ఎస్యూవి కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు గరిష్ఠంగా 290 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. లీటరుకు సుమారు 9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఫైవ్ సీటీర్ ఎస్‌యూవీలో 4 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ సిస్టం 542 బిహెచ్పిపవర్, 60జీబీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 10 స్పీకర్లు ప్రధానఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే త్వరలో విడుదల కానున్న ఖరీదైన కార్లు రేంజ్ రోవర్ ఎస్యూవీ ఆటోబయోగ్రఫీ ఫేస్‌లిఫ్ట్, రోల్స్‌రాయిస్ కులినాస్కి పెద్దపోటీ ఇవ్వనుందని అంచనా. కాగా భారత మార్కెట్లో సంస్థ ఇప్పటికే బెంట్లీ బెంటేగా కాంటినెంటల్ జిటి, ఫ్లయింగ్ స్పర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఇండియాలో ఫెరారీ, మాసెరాటీ అతివిలాసవంతమైనకార్ల విక్రయాలు క్రయంగా పుంజుకుంటున్నాయి. 2014లో 14, 900 యూనిట్లు అమ్ముడు బోయాయట. బెంటేగా, మాసెరాటీ లెవాంటే ఎంట్రీ తరువాత ఈ అమ్మకాలు మరింత పుంజుకుని 2016లో 26,750యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ్య 2020 నాటికి 40వేలకు చేరవచ్చని అంచనా.