ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, డ్రైవర్ దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఘటన
సిమ్లా: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైజోన్ చో వాగు ఉప్పొంగడంతో ఎస్‌యూవీ వాహనం కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్‌బీఎస్ నగర్ జిల్లా మెహ్రోవాల్ గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఎస్‌యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది, డ్రైవర్ ప్రయాణిస్తున్నారు.
భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది. స్థానికులు దీపక్ భాటియా అనే వ్యక్తిని రక్షించి జైజోన్ లోని ప్రభుత్వ డిస్పెన్సరీకి తరలించారు. వాహనం వరద నీటిలో ఇరుక్కుపోయింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. వాగు నుంచి ఐదుగురు మహిళలతో సహా తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీసింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాటొద్దని స్థానికులు హెచ్చరించినా డ్రైవర్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. మృతులను సూర్జిత్ భాటియా, అతని భార్య పరమజీత్ కౌర్, సోదరుడు స్వరూప్ చంద్, మరదలు బిందర్, మెహత్‌పూర్‌లోని భటోలీకి చెందిన షినో, ఆమె కుమార్తెలు భావన, అను, కుమారుడు హర్షిత్, డ్రైవర్ బిందుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment