
గత కొన్ని రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ పరిస్థితులను గమనించిన అధికారులు మనాలి-లేహ్ జాతీయ రహదారితో పాటు 87 ఇతర రహదారులను మూసివేశారు.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రకటించిన వాతావరణ శాఖ ఆగస్టు 7, 8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా చంద్రభాగ్ నది నీటిమట్టం పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. లాహౌల్, స్పితి జిల్లాలో రెండు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. జింగ్ జింగ్‌బర్ సమీపంలో మనాలి-లేహ్ జాతీయ రహదారి మట్టిపెళ్లలు పేరుకుపోయాయి. దర్చా, సర్చు పోలీసు చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బ్రో) హైవేపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తోంది. కాగా కేదార్‌నాథ్ నడక మార్గంలో భారీ వర్షం కారణంగా వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన యాత్రికులు, స్థానికులను రక్షించే కార్యక్రమం ఐదవ రోజు కూడా కొనసాగింది. సోమవారం 1,401 మందిని రక్షించారు. గుజరాత్‌లోని నవ్‌సారి, వల్సాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment