ప్యాసింజర్‌ వెహికిల్స్‌ దూసుకెళ్తున్నాయ్‌ | Passenger vehicles witness record sales in August | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ వెహికిల్స్‌ దూసుకెళ్తున్నాయ్‌

Sep 7 2022 4:00 AM | Updated on Sep 7 2022 4:00 AM

Passenger vehicles witness record sales in August - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, సెమికండక్టర్ల సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం భారత వాహన పరిశ్రమకు కలిసి వచ్చింది. ప్యాసింజర్‌ వెహికిల్స్‌ తయారీ, విక్రయాలు వేగం పుంజుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఆగస్ట్‌లో కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఎస్‌యూవీల జోరుతో టాప్‌–7 కంపెనీల మొత్తం ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు ఏకంగా 30.2 శాతం వృద్ధితో 3,05,744 యూనిట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక వృద్ధి. ఆగస్ట్‌ నుంచి పండుగల సీజన్‌ ప్రారంభం అవుతుంది. జోరు మొదలైందని.. రాబోయే నెలల్లో ఇది కొనసాగుతుందని వాహన పరిశ్రమ ధీమాగా ఉంది. ఏడాది పొడవునా జరిగే మొత్తం విక్రయాల్లో పండుగల సీజన్‌ వాటా ఏకంగా 40 శాతం దాకా ఉంటోంది.

2018–19ని మించిన విక్రయాలు..
దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 30,69,499 ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018–19లో అత్యధికంగా 33,77,389 యూనిట్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018–19ని మించిన విక్రయాలు నమోదు కానున్నాయని భారత్‌లో ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ చెబుతోంది. 37 లక్షల యూనిట్లతో పరిశ్రమ నూతన  రికార్డు సాధిస్తుందన్న అంచనా ఉందని మారుతీ సుజుకీ సేల్స్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని అన్నారు. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో మారుతీ సుజుకీ 30 శాతం, హ్యుండై 5.6, టాటా మోటార్స్‌ 68.3, మహీంద్రా అండ్‌ మహీంద్రా 87, కియా ఇండియా 33.3, టయోటా కిర్లోస్కర్‌ 17.12 శాతం వృద్ధి సాధించాయి. హోండా కార్స్‌ 30.5 శాతం తిరోగమన వృద్ధి చవిచూసింది.  

ద్విచక్ర వాహనాలు ఇలా.. : అంత క్రితం ఏడాది ఇదే కాలం, అలాగే ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగవడం డిమాండ్‌కు తగ్గట్టుగా కస్టమర్లకు వాహనాలను అందించేందుకు వీలైందని కంపెనీలు అంటున్నాయి. జీడీపీ వృద్ధి, రెండేళ్ల తర్వాత సాధారణ పండుగల సీజన్, మెరుగైన రుతుపవనాలతో అధిక దిగుబడి, కస్టమర్ల సెంటిమెంట్‌ సానుకూలంగా ఉండడం.. వెరిశి రాబోయే నెలల్లో టూ వీలర్ల అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయని హీరో మోటోకార్ప్‌ తెలిపింది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో హీరో మోటోకార్ప్‌ 4.6 శాతం, హోండా 5.1, టీవీఎస్‌ 56.2, బజాజ్‌ 42.2, సుజుకీ 6.2, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 33.8 శాతం అధికంగా విక్రయాలను సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement