హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్‌లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి.
అత్యధిక స్థాయిలో..
ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది.
వృద్ధి సింగిల్ డిజిట్‌లో..
ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు.
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
Published Thu, Apr 6 2023 6:16 AM | Last Updated on Thu, Apr 6 2023 6:16 AM
Comments
Please login to add a commentAdd a comment