మూడో స్థానానికి టీవీఎస్ మోటార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 88,156 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 31 శాతం వృద్ధితో 7,99,103 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది ఒక మిలియన్ యూనిట్ల మైలురాయిని పరిశ్రమ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఒక ఏడాదిలో ఈ స్థాయి విక్రయాలు నమోదుకావడం ఇదే తొలిసారి అవుతుంది. 2023లో దేశవ్యాప్తంగా 8,48,003 యూనిట్ల ఈ–టూవీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 మార్చిలో అత్యధికంగా 1,37,741 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ఆగస్ట్‌లో 87,256 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,48,539 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఇందులో ఈ–టూ వీలర్ల వాటా ఏకంగా 59 శాతం ఉంది.
ఏడాదిలో 166 శాతం వృద్ధి..
ఇప్పటి వరకు ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ 11 నెలల కనిష్టానికి 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెపె్టంబర్‌లో ఇది 27 శాతానికి పడిపోవడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో గత నెలలో 17,865 యూనిట్ల అమ్మకాలను సాధించి 20.26 శాతం వాటాతో మూడో స్థానానికి పరిమితం అయింది. ఏథర్, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి.
19 నెలల కనిష్టానికి..
ఎలక్ట్రిక్ కార్లు, ఎస్‌యూవీల అమ్మకాలు సెప్టెంబర్‌లో 19 నెలల కనిష్టానికి పడిపోయాయి. గత నెలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5,733 యూనిట్లు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 9 శాతం తగ్గుదల. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 9,661 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2024 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధితో 68,642 యూనిట్లు రోడ్డెక్కాయి. తొలి స్థానంలో ఉన్న టాటా మోటార్స్ గత నెలలో 3,530 ఈవీలను విక్రయించింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికి వచ్చి చేరింది. 2023 సెప్టెంబర్‌లో ఇది 68 శాతం నమోదైంది. ఎంజీ మోటార్ ఇండియా 955 యూనిట్ల అమ్మకాలతో 16.65 శాతం వాటాతో రెండవ స్థానంలో పోటీపడుతోంది. 443 యూనిట్లతో మూడవ స్థానంలో నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా 7.72 శాతం వాటా కైవసం చేసుకుంది. బీవైడీ ఇండియా, సిట్రన్, బీఎండబ్లు్య ఇండియా, మెర్సిడెస్ బెంజ్, హ్యుండై మోటార్ ఇండియా, వోల్వో ఆటో ఇండియా, కియా ఇండియా, ఆడి, పోర్ష, రోల్స్ రాయిస్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment