ఓలా ఎలక్ట్రిక్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను సస్పెండ్ చేస్తూ గోవా రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. సరైన సర్వీస్ లేకపోవడం, మరమ్మత్తు జాప్యాలపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని కొత్త స్కూటర్ల అమ్మకాలను కూడా నిలిపివేసింది. గోవాలోని మూడు సర్వీస్ సెంటర్లలో దాదాపు 2,000 ఓలా స్కూటర్లకు సరైన మరమ్మత్తులు చేయకపోవడమే కాకుండా.. సిబ్బంది నుంచి సరైన స్పందన రావడం లేదని కస్టమర్లు చెబుతున్నారు.
అస్పష్టమైన ప్రతిస్పందనలు & రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఆలస్యమయ్యాయని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై చర్య తీసుకోవాలని.. రవాణా శాఖకు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులు మెమోరాండం సమర్పించారు. దీంతో రాష్ట్ర వాహన్ పోర్టల్‌లోని అన్ని ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్‌లను బ్లాక్ చేస్తూ సంబంధిత శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ సస్పెన్షన్ తాత్కాలికమని.. సమస్యలను పరిష్కరించిన తరువాత, దీనిని ఎత్తివేయనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ చర్య గోవాలోని ఎలక్ట్రిక్ వాహన యజమానులలో చర్చలకు దారితీసింది. చాలామంది ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు బాధ్యత అలవాడాలని, జవాబుదారీతనం ఉండాలనే కఠినమైన చర్య తీసుకోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్‌కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!


